అమరావతి-ఈశ్వరన్: స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగపూర్ మంత్రికి, ఏపీకి సంబంధమేంటి ?

ఫొటో సోర్స్, TDP/FB
- రచయిత, వడిశెట్టి శంకర్
- హోదా, బీబీసీ కోసం
సింగపూర్ ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి ఎస్.ఈశ్వరన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ దేశంలో సంచలనంగా మారిన వ్యవహారంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈశ్వరన్‌పై అవినీతి ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్‌లోనూ చర్చలు మొదలయ్యాయి.
అరవై ఒక్క సంవత్సరాల భారత సంతతి మంత్రి ఈశ్వరన్ పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడినట్టు సింగపూర్ అవినీతి నిరోధక విభాగం కరప్ట్ ప్రాక్టిసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(సీపీఐబీ) నిర్ధారించింది.
తదనంతర పరిణామాలతో, సుదీర్ఘకాలంగా సింగపూర్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఈశ్వరన్ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఆ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారడానికి ప్రధాన కారణం.. రాజధాని అమరావతి వ్యవహారాల్లోనూ ఆయన ప్రత్యక్షంగా కనిపించడమే.
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈశ్వరన్ సన్నిహితంగా మెలిగిన నేపథ్యంలో ఏపీలోనూ చర్చకు అవకాశం ఇచ్చినట్లయింది.

ఫొటో సోర్స్, TDP/FB
అభియోగాలేంటి?
ఎస్.ఈశ్వరన్ అవినీతి వ్యవహారాలపై విచారిస్తున్న కోర్టులో ప్రాసిక్యూటర్లు సమర్పించిన చార్జ్‌షీట్ ప్రకారం ఆయన 160,000 సింగపూర్ డాలర్ల మేర అవినీతికి పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం.
సింగపూర్ స్థిరాస్తి వ్యాపార దిగ్గజం ఓంగ్ బెంగ్ సెంగ్ నుంచి విమానాలు, హోటల్ టికెట్లు, ఫార్ములా వన్ రేస్ గ్రాండ్ పిక్స్ సంబంధించిన ప్రయోజనాలు పొందినట్టు పేర్కొన్నారు.
ఫుట్‌బాల్ మ్యాచ్, మ్యూజిక్ షోకు టికెట్లు పొందడం సహా 27 రకాల నేరాలకు పాల్పడినట్టు చార్జ్‌షీట్‌లో ప్రస్తావించారు.
2008లోనే ఎఫ్ 1 రేస్‌ను సింగపూర్ తీసుకురావడంలో ఓంగ్ ది కీలకపాత్ర. ఆయనకు ఈశ్వరన్ సహకరించారని, బదులుగా పార్టీ ఫండ్ పేరుతో లంచాలు పొందినట్టు ప్రాసిక్యూషన్ వాదిస్తోంది. ఈ కేసులో గతంలోనే ఓంగ్‌తో పాటు ఈశ్వరన్ కూడా అరెస్టయ్యారు.
ఆ ఆరోపణలను ఈశ్వరన్ ఖండించారు. కేసు దర్యాప్తు కోసం రాజీనామా సమర్పిస్తూ, గత జూలై నుంచి తాను ప్రభుత్వం నుంచి పొందిన వేతనం, ఇతర అలవెన్సుల మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని వెల్లడించారు.
ప్రపంచంలో ఎక్కడా లేనంతగా సింగపూర్‌లో ప్రజాప్రతినిధులకు అత్యధిక వేతనాలు అందుతాయి.
ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న వారు ఎటువంటి అవినీతికి పాల్పకూడదంటూ ఇంత పెద్ద మొత్తంలో జీత భత్యాలు చెల్లిస్తున్నామని సింగపూర్ ప్రభుత్వం చెప్పింది.
గతంలో ఈశ్వరన్ అరెస్ట్ అయిన కాలాన్ని సెలవుగా పరిగణిస్తూ ఆయనకు వేతనం అందించారు.
ఎంపీగా నెలకు 8,500 సింగపూర్ డాలర్ల( రూ. 5.26 లక్షలు) చొప్పున ఈశ్వరన్‌కు వేతనం అందుతోంది. దీనితోపాటు మంత్రి హోదాలో లభించే భత్యాలన్నీ కలిపి నెలకు 45,000 సింగపూర్ డాలర్ల( సుమారు రూ. 27 లక్షలు)కు పైగా జీతం పొందుతున్నారు.
ఈశ్వరన్ అక్కడి పాలక పీపుల్స్ యాక్షన్ పార్టీ (PAP) యొక్క సీనియర్ నాయకుడు. అంతేకాకుండా ఆయన వ్యాపారవేత్తగా వివిధ కంపెనీల్లో డైరెక్టర్‌గా వ్యవహరించారు.
సింగపూర్ పీఎంవో వ్యవహారాలు, హోం శాఖ, కమ్యూనికేషన్లతో పాటుగా ఇటీవలే రవాణా శాఖ మంత్రిగానూ పనిచేశారు.
వాణిజ్య పరిశ్రమల మంత్రిగా ఆయనకు మంచి గుర్తింపు దక్కింది. పర్యాటక పరంగా సింగపూర్ అభివృద్ధికి కృషి చేసిన నేతగా ఆయనకు పేరుంది.
క్యాసినోలు, హోటళ్ళు, ఎఫ్ 1 రేస్ వంటి వాటిని ఆయన హయంలోనే ప్రోత్సహించారు. విదేశీ పెట్టుబడులు పెరగడానికి అవి తోడ్పడ్డాయి.

ఫొటో సోర్స్, TDP/FB
అమరావతిలో ఆయన పాత్ర ఏంటి?
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత సింగపూర్ పేరు పదే పదే వినిపించింది.
సింగపూర్ తరహాలో రాజధాని అభివృద్ధి జరుగుతుందని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతూ ఉండేవారు.
అంతేకాకుండా రాజధాని రైతులను ల్యాండ్‌పూలింగ్ విధానంలో భూములు ఇచ్చేందుకు ప్రోత్సహించేలా, సింగపూర్ టూర్లు కూడా ఏర్పాటు చేశారు.
బృందాల వారీగా సింగపూర్ పంపించి, అక్కడి అభివృద్ధిని చూసి రావాలంటూ ఏపీ ప్రభుత్వం ప్రోత్సహించింది.
ఆ క్రమంలోనే సింగపూర్ ప్రభుత్వంతో తాము ఒప్పందం చేసుకున్నామని, రాజధాని అభివృద్ధికి వారి సహకారం కూడా ఉందంటూ సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు కూడా ప్రకటించారు.
అందులో భాగంగానే ఈశ్వరన్ కూడా స్వయంగా అమరావతి శంకుస్థాపనలో పాలుపంచుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా 25 అక్టోబర్ 2015 నాడు జరిగిన అమరావతి శంకుస్థాపనలో ఈశ్వరన్ కూడా భాగస్వామి అయ్యారు.
సింగపూర్ ప్రభుత్వం, ప్రధాన మంత్రి తరఫున తాను అమరావతి నిర్మాణంలో భాగస్వామినవుతున్నట్టు ఆయన ప్రకటించారు.
సీఎం చంద్రబాబు సింగపూర్‌లో పర్యటించి, వరల్డ్ క్లాస్ సిటీగా అమరావతిని మార్చే అభివృద్ధిలో భాగస్వామ్యం కోసం తమను ఆహ్వానించినట్టు ఆయన బహిరంగసభలో ప్రకటించారు.
అంతకుముందు గోదావరి పుష్కరాల సమయంలో ఈశ్వరన్ బృందం రాజమహేంద్రవరం వెళ్లి, అక్కడే సీఎం చంద్రబాబుతో ఒప్పదం చేసుకున్నారు.
అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధిని స్విస్ చాలెంజ్ పద్ధతిలో సింగపూర్ కంపెనీకి అప్పగించినట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
ఆ తర్వాత కూడా పలుమార్లు ఈశ్వరన్ అమరావతిలో పర్యటించారు. ఏపీ అసెంబ్లీ, సచివాలయ భవనాలను కూడా ఆయన సీఎం చంద్రబాబుతో కలిసి పరిశీలించారు.

ఫొటో సోర్స్, AP CRDA
వైసీపీ హయాంలో ఎంఓయూలు రద్దు..
సింగపూర్‌కు చెందిన అసెందాస్-సిన్ బ్రిడ్జ్-సెంబ్ కార్ప్ కన్షార్షియం ఆధ్వర్యంలో ఏపీ క్యాపిటల్ స్టార్టప్ ఏరియా అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు హయాంలోని అప్పటి ప్రభుత్వం వెల్లడించింది.
అందుకోసం 2017 మే 2న చేసుకున్న ఎంవోయూ ప్రకారం ఏపీ ప్రభుత్వం రూ. 5,722 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. అభివృద్ధి చేసిన ప్రాజెక్టులో వాటా దక్కుతుంది.
కేవలం రూ. 306 కోట్ల ఖర్చు చేసే కన్షార్షియం లాభాల కోసం ఈ ఎంవోయూ చేసుకున్నారని విపక్షంలో ఉండగా వైఎస్సార్సీపీ ఆరోపించింది.
2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి రాగానే సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నట్టు ప్రకటించింది.
సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలంటూ ప్రజలను మోసగించారంటూ అప్పట్లో సీఎం జగన్ ఆరోపించారు. ఈ ఎంవోయూల మీద విచారణ జరుగుతుందని కూడా తెలిపారు.
ఆ పర్యవసానాలతో 2015 నుంచి 2019 వరకూ పలుమార్లు వినిపించిన సింగపూర్ కంపెనీలు, ఈశ్వరన్ పేర్లు ఆ తర్వాత ఏపీలో పెద్దగా వినిపించలేదు.
అమరావతి రాజధాని అభివృద్ధి కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోవడంతో ప్రతిపాదిత స్టార్టప్ ఏరియా సహా మిగిలిన వ్యవహారాలన్నీ మరుగునపడ్డాయి.
అప్పట్లో ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమం సహా అన్నింటా ప్రత్యక్షమైన ఈశ్వరన్ ఇప్పుడు అవినీతి కేసుల్లో ఇరుక్కోవడం, జైలు పాలయిన తర్వాత ఏకంగా తన పదవులకు రాజీనామా చేయాల్సి రావడంతో అటు సింగపూర్‌లో రాజకీయ దుమారం రేపుతుండగా, ఏపీలో కూడా చర్చకు దారితీసింది.

ఫొటో సోర్స్, Getty Images
‘ఇక్కడ కూడా విచారణ చేయాలి’
మంత్రి ఈశ్వరన్ ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణల వ్యవహారంలో సింగపూర్ ప్రధాని లీ కూడా స్పందించారు. “రాజీనామా ఆమోదించడంతో పాటుగా ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుంది”అని వెల్లడించారు.
"ప్రభుత్వంతో పాటు, మా పార్టీ నిజాయితీని కూడా నిరూపించుకుంటాం. నిబద్ధతను చాటుకుంటాం. అవినీతికి వ్యతిరేకంగా నిలవాలని నేను నిశ్చయించుకున్నాను. సింగపూర్ వాసుల అంచనాలు, ఆకాంక్షలు నిలుపుతాం" అంటూ ఆయన ప్రకటించారు.
సింగపూర్‌లో 1986లో అప్పటి మంత్రి తెహ్ చియాంగ్ వాన్ లంచాలు తీసుకుంటూ ఆధారాలతో పట్టుబడిన చివరి మంత్రి. అప్పట్లో ఆయన మీద దర్యాప్తు సాగుతుండగానే ఆత్మహత్య చేసుకున్నారు.
దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత ఈశ్వరన్ వ్యవహారం సింగపూర్ పాలకపక్షాన్ని ఇరకాటంలోకి నెట్టింది.
"ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలో ఈశ్వరన్‌కి అనవసర ప్రాధాన్యతనిచ్చారు. అవసరం లేకున్నా ఆయనకు చంద్రబాబు వత్తాసు పలికారు. ప్రస్తుతం ఈశ్వరన్ బాగోతం అక్కడ బయటపడింది. ఇక్కడ కూడా ఆయనతో చేసుకున్న ఒప్పందాల మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి” అన్నారు మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ నారాయణ.
“అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే జగన్ ప్రభుత్వం ఆ ఒప్పందాల మీద విచారణ జరుపుతామని ప్రకటించింది. కానీ అది ముందుకు సాగలేదు. దాని మీద ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించలేదు. ఇప్పుడయినా వాటిని తిరగదోడి, సింగపూర్ ఒప్పందాల మీద విచారణ చేయడం అవసరం" అని ఆయన అన్నారు.
సింగపూర్‌లో చంద్రబాబు వ్యాపార వ్యవహారాల మీద చాలాకాలంగా ఆరోపణలున్నాయి కాబట్టి, ఈశ్వరన్ కి చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం మీద దర్యాప్తు చేయాలని ఆయన పేర్కొన్నారు.
'మాకేం సంబంధం?'
ఈశ్వరన్ వ్యవహారం మీద ఇప్పటికే వైఎస్సార్సీపీ విమర్శలు ఎక్కుపెట్టింది. “ఈశ్వరన్ అవినీతిలో చంద్రబాబు భాగస్వామి” అంటూ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు.
అయితే టీడీపీ నేతలు ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. సింగపూర్‌లో అవినీతి జరిగితే టీడీపీకి ఏం సంబంధమని ప్రశ్నిస్తున్నారు.
"ఏపీ రాజధాని అభివృద్ధి కోసం చంద్రబాబు ప్రపంచమంతా తిరిగారు. అనేకమంది ముందుకొచ్చారు. వారి సహాయంతో రాష్ట్రాభివృద్ధికి అనుగుణంగా కొన్ని అడుగులు వేశాం. జగన్ కారణంగా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. లేదంటే, ఏపీ రాజధాని ఎప్పుడో అభివృద్ధి జరిగేది. ఇన్నేళ్ల తర్వాత సింగపూర్‌లో అవినీతి జరిగితే, పదేళ్ల క్రితం చేసుకున్న ఒప్పందాన్ని ముడిపెట్టడం అవివేకం. ఈ ప్రభుత్వం ఆరోపణలు చేసి చేతులు దులుపుకోవడం తప్ప ఒక్క దానికీ నిరూపణలు ఉండవు" అని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు.
“జగన్ స్నేహితులంతా నేరస్తులు కాబట్టి అందరినీ అదే గాటన కట్టే యత్నం చేస్తున్నారని, ఈశ్వరన్ వ్యవహారాలకు టీడీపీకి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
- పాకిస్తాన్-ఇరాన్: రెండు దేశాలు యుద్ధం వరకు వెళతాయా...పరస్పర దాడుల వెనక ఉద్దేశాలు ఏంటి?
- లెనిన్: ఈ సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడి గురించి తెలుసుకోవాల్సిన 3 విషయాలు
- అయోధ్యలో మసీదుకు కేటాయించిన స్థలంలో నిర్మాణం ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- జపాన్-స్లిమ్: చంద్రునిపై సురక్షితంగా దిగిన ఈ మిషన్ కొన్ని గంటల్లోనే పనికి రాకుండా పోతుందా...ఏం జరిగింది?
- కశ్మీర్లో మంచు కురవని శీతాకాలం ఎప్పుడైనా చూశారా... ఈ ఏడాదే ఎందుకిలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














