జగన్ ఎంపీలను కలవరా? సంజీవ్ కుమార్ అలా ఎందుకన్నారు? గతంలో ఎలా ఉండేది?

ఫొటో సోర్స్, Facebook
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘నాలుగున్నరేళ్లలో నేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రెండంటే రెండేసార్లు కలిశాను’’ – కర్నూలు వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఇటీవల మీడియాతో అన్న మాటలు ఇవి. ఇవి చర్చకు దారితీశాయి.
అయితే ముఖ్యమంత్రిగా జగన్ మీద ఇలాంటి ఆరోపణ రావడం ఇదే మొదలు కాదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేల విమర్శలు చూస్తుంటే, ముఖ్యమంత్రిని స్వయంగా పాలక పార్టీ ప్రజాప్రతినిధులే తేలిగ్గా కలవలేని పరిస్థితి ఉందా అనే ప్రశ్న వస్తోంది.
సాధారణంగా ఎంపీలు, ముఖ్యమంత్రి మధ్య తరచూ సమావేశాలు జరగవు కానీ, కావాలనుకున్నప్పుడు కలిసే వెసులుబాటు ఉంటుంది.
ఏడాదికోసారి కానీ లేదా పార్లమెంటు సమావేశాలు మొదలయ్యేటప్పుడో సాధారణంగా ఎంపీలందరినీ సమావేశపరిచి పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహం గురించి, రాష్ట్రానికి రావాల్సిన, రాబట్టాల్సిన నిధులు, ప్రాజెక్టులు, రైల్వేల గురించి సభలో ప్రశ్నించాలని సీఎం దిశా నిర్దేశం చేస్తుంటారు.
ఇలా పార్లమెంటు సమావేశాల ముందు ఏర్పాటు చేసే భేటీలు కాకుండా అనేక సందర్భాల్లో ఎంపీలు, సీఎంను కలుస్తారు.
అయితే సంజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో జగన్, ఎంపీలకు అంతగా అందుబాటులో ఉండరనే విమర్శలు మరోసారి వచ్చాయి. దీనిపై భిన్న వాదనలూ లేకపోలేదు.

ఫొటో సోర్స్, Raghu Rama Krishna Raju/FB
రఘురామ కృష్ణంరాజు ఏమన్నారు?
సీఎం జగన్‌ను కలవడానికి ప్రయత్నిస్తే వీలు కాలేదని వైసీపీ తరపున నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు కూడా గతంలో విమర్శలు చేశారు.
తమ ఇద్దరి మధ్య విభేదాలు రావడానికి సీఎం అపాయింట్‌మెంట్ విషయమే కారణమని ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు.
‘‘జగన్ గెలిచిన తరువాత ఆయన్ను కలవడానికి అపాయింట్‌మెంట్ అడిగి మరీ ప్రత్యేక విమానంలో వెళ్లాను. ఆయన్ను అభినందించడానికి మనిషి అంత ఎత్తు బొకే చేయించి తీసుకెళ్లాను. తీరా చూస్తే ఆయన పీఏ వచ్చి, సర్‌ను ఇప్పుడు కలవడం కుదరదన్నారు. కేవలం శుభాకాంక్షలు చెప్పడానికే కదా అన్నాను. శుభాకాంక్షలు తనకే చెప్పమన్నారు (అంటే పీఏకే శుభాకాంక్షలు చెప్పమని) అని పీఏ నాతో అన్నారు. ఆ తరువాత వెంటనే గవర్నర్‌ను కలసి ఆ బొకే గవర్నర్ గారికి ఇచ్చాను’’ అని రఘురామ ఆ ఇంటర్వ్యూలలో చెప్పారు.
ఆ తరువాత వరుసగా జరిగిన పరిణామాలు రఘురామ, జగన్ మధ్య దూరాన్ని పెంచాయి.
వైసీపీలో ఉంటూనే పార్టీ అధ్యక్షుడు జగన్‌పై ఈ ఎంపీ తీవ్ర విమర్శలు చేస్తుంటారు.

గతంలో ఎలా ఉండేది?
ఎంపీలు ముఖ్యమంత్రిని కలవలేకపోవడం అనేది పూర్వం ఎప్పుడూ లేదనీ, ఇది 2014 తరువాత తెలంగాణలో, 2019 తరువాత ఆంధ్రప్రదేశ్‌లో మొదలైందని సీనియర్ జర్నలిస్టు జింకా నాగరాజు బీబీసీతో చెప్పారు. ‘‘నాకు సీఎం అపాయింట్‌మెంట్ దొరకలేదు అని ఏ ఎంపీ అనడం గతంలో నేను వినలేదు’’ అని ఆయన చెప్పారు.
‘‘కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబునాయుడు, రాజశేఖర రెడ్డి అందరూ ఎంపీలను కలిసేవారు. రాజశేఖర రెడ్డి స్వయంగా ఎంపీలకు ఫోన్ చేసి మాట్లాడేవారు. బాబును ఏపీ భవన్‌లో ఎంపీలంతా కలిసేవాళ్లు. సీఎంలు దిల్లీ వెళ్లినప్పుడు ఎంపీలంతా అక్కడకు వస్తారు. ఏపీ భవన్‌లో సమావేశాలు అయ్యాక విడిగా కలిసేవారు'' అని నాగరాజు చెప్పారు.
''ఎన్టీ రామారావు, రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు – ఈ ముగ్గురూ రోజూ కొంత సమయం సామాన్యులను కలిసేవారు. ఎవరైనా వాళ్లను కలవగలిగేవారు’’ అని వడ్డే శోభనాద్రీశ్వర రావు అభిప్రాయపడ్డారు.
ఎంపీలు ముఖ్యమంత్రిని కలవలేని పరిస్థితులు గతంలో లేవని ఒక తెలుగు మీడియా సంస్థ తరపున దిల్లీలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న ఒక జర్నలిస్టు బీబీసీతో అన్నారు.
‘‘నిజానికి రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ఎంపీలు చాలా బలహీనం అయ్యారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు దిల్లీలో ఎంతో సందడి చేసేవారు. పార్లమెంటు సమావేశాల్లో అందర్నీ కలుస్తూ, సభలో చురుగ్గా మాట్లాడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. వైసీపీలో అయితే ఎవరు పార్లమెంటులో మాట్లాడాలన్నా పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్ రెడ్డి లేదా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అనుమతి కావాలి. అందుకే చాలా మందికి ఆంధ్రప్రదేశ్ ఎంపీల పేర్లు కూడా సరిగ్గా తెలియవు. మిథున్, విజయసాయి, తాజాగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తప్ప మిగిలినవారి పేర్లు ఎవరికీ సరిగా తెలియవు’’ అని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రిని కలవడం తమకు అంత సులభం కాదని పేరు రాయడానికి ఇష్టపడని వైసీపీ ఎంపీ ఒకరు బీబీసీతో చెప్పారు.
‘‘సంజీవ్ కుమార్ చెప్పింది అక్షర సత్యం. మేం నేరుగా ముఖ్యమంత్రిని కలవడం అనేది అంత తేలిక కాదు. చాలా సందర్భాల్లో సీనియర్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డినో, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డినో కలిసి సరిపెట్టుకోవాలి. ఇక దిల్లీలో అయితే మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి లీడ్ చేస్తారు’’ అని సదరు ఎంపీ చెప్పారు.
‘‘నేను డాక్టర్‌ను. రాజకీయాల్లోకి వచ్చాను. నా హయాంలో ఇక్కడ ఏదో చేద్దాం అనుకున్నాను. కానీ చాలా విషయాల్లో ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు. ఇదే విషయంపై జగన్ అపాయింట్‌మెంట్ అడిగితే మీరెందుకు కష్టపడతారు.. వాళ్లు(ఎమ్మెల్యేలు) చూసుకుంటారు కదా అన్నారు. నాకు మాత్రం జగన్ అపాయింట్‌మెంట్ దొరకలేదు’’ అని సంజీవ్ కుమార్ చెప్పారు.
వైసీపీ ఎంపీలు తమ నియోజకవర్గ పనుల కోసం కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లాలన్నా పార్టీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని అధినాయకత్వం నిర్దేశించినట్లు చెబుతారు.

ఫొటో సోర్స్, fb/Nandigam Suresh Babu
సంజీవ్ కుమార్ ఆరోపణల వ్యవహారంపై మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు బీబీసీతో మాట్లాడుతూ- ‘‘అభివృద్ధికి కృషి చేయడం ఎంపీల విద్యుక్త ధర్మం. ఆ క్రమంలో వినతిపత్రాలు ఇవ్వడానికి, తమ నియోజకవర్గ పరిధిలో రాష్ట్రం నుంచి కావల్సిన సహకారం పొందడానికీ, సమస్యలు ముఖ్యమంత్రికి తెలియజేయడానికి సాధారణంగా ముఖ్యమంత్రిని ఎంపీలు కలుస్తుంటారు. ఇది గతంలో జరిగింది. భవిష్యత్తులో కూడా జరగాలి. కానీ ఏపీలో, మొన్నటివరకూ తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏంటంటే, ఎంపీలకే కాదు ఎవరికీ ముఖ్యమంత్రులు అందుబాటులో లేకుండా పోయారు'' అని చెప్పారు.
‘‘గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు హయాంలో అలా లేదు. ఉండవల్లి అరుణ్ కుమార్, కింజరాపు ఎర్రన్నాయుడు వంటి వారు అన్ని వ్యవహారాల్లో చురుగ్గా ఉండేవారు. 2009లో మొట్టమొదటిసారి ఎంపీలు అయిన వాళ్లు కూడా దిల్లీలో చాలా సందడి చేసే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ విషయంలో కోట్ల రూపాయల డబ్బుతో ఎంపీలు అయిన వాళ్లకీ, డబ్బు లేకుండా ఎంపీలు అయిన వాళ్లకీ కూడా తేడాలు ఉంటాయి’’ అని చెప్పారు దిల్లీలోని తెలుగు రిపోర్టర్.
సంజీవ్ కుమార్ ఆరోపణలను వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ తోసిపుచ్చారు.
సురేశ్ బీబీసీతో మాట్లాడుతూ- ''నేను జగన్‌ను ఎన్నిసార్లు కలుస్తున్నానో చూస్తున్నారు కదా. మిగతా నాయకులు నా కంటే ఆస్తిపరులు. సీఎం నన్నే రానిచ్చినప్పుడు, వాళ్లను ఎందుకు రానివ్వరు? నేనేమీ ఫండింగ్ ఇచ్చేవాణ్ణి కాదు, పెద్ద పెద్ద సీట్లు తారుమారు చేసే వాడినీ కాదు. అయినా నేను జగన్‌ను కలవగలిగినప్పుడు వారెందుకు కలవలేరు'' అని ప్రశ్నించారు.
సంజీవ్ కుమార్ ఆరోపణల్లో కులం కోణం
సంజీవ్ తన ఆరోపణల్లో కులం కోణాన్ని కూడా తీసుకొచ్చారు. ఆయనది పద్మశాలి కులం. కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో నలుగురు రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు.
‘‘ఇక్కడ బీసీలకు స్వేచ్ఛ, స్వతంత్రం, మనుగడ లేవు’’ అన్న సంజీవ్ వ్యాఖ్యలు పరోక్షంగా ఆయా నియోజకవర్గాల్లో పెద్దకులాలుగా చెప్పుకొనే నాయకులు, బీసీ నాయకుల మధ్య ఆధిపత్య సమస్యను సూచిస్తున్నాయి. తాను ఎంపీ అయినప్పటికీ ఎమ్మెల్యేలు చెప్పిందే వినాల్సి వస్తోందని సంజీవ్ సన్నిహితుల దగ్గర వాపోయారు.
వ్యక్తి కన్నా వ్యవస్థ ముఖ్యం: నందిగం సురేశ్
‘‘నన్ను సీఎం జగన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలుస్తారు, మాట్లాడతారు. సంజీవ్ వంటి వారు ప్రజల్లో ఉంటే బావుండేది. ప్రజల్లో ఉంటే పిలుపులు ఉండేవి'' అని నందిగం సురేశ్ వ్యాఖ్యానించారు.
''సమీకరణాలు మారినప్పుడు సీట్లు మారతాయి. మేం కార్యకర్తలా పనిచేస్తాం. అధినేత ఆగమంటే ఆగుతాం. గెలిచే వారిని జగన్ మార్చాలి అనుకోరు కదా. ఇక్కడ వ్యక్తి కంటే వ్యవస్థ ముఖ్యం కదా? వ్యక్తి వల్ల వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు వ్యక్తులను మార్చాలి. ఇక్కడ అదే జరిగింది’’ అని నందిగం సురేశ్ బీబీసీతో అన్నారు. సంజీవ్ కుమార్‌కు రానున్న ఎన్నికల్లో వైసీపీ అధినాయకత్వం టికెట్ నిరాకరించడాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














