బ్రూనై ప్రిన్స్: యువరాణులను కాదని యువరాజు పెళ్లాడిన ఈ యువతి ఎవరు

ఫొటో సోర్స్, AFP
- రచయిత, ఫ్రాన్స్ మావో& నాథన్ విలియమ్స్
- హోదా, బీబీసీ న్యూస్, సింగపూర్ & లండన్
ఆసియాలోనే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', 'అందగాడైన యువరాజు' అంటూ సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందిన బ్రూనై యువరాజు అబ్దుల్ మతీన్ వివాహం చేసుకున్నారు.
సోషల్ మీడియాలో ఆయనకు మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు అబ్దుల్ మతీన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఒక సామాన్యురాలిని (రాజవంశానికి చెందిన వారు కాదు) పెళ్లి చేసుకున్నారు.
ఈ రాజ వివాహ వేడుకను పది రోజులపాటు ఘనంగా నిర్వహించారు.
వధువు అనిషా రోస్నాహ్ సుల్తాన్ బొకై సలహాదారుడి మనవరాలు. ఆమెకు ఫ్యాషన్, టూరిజం సంస్థ ఉన్నట్లు మీడియా కథనాలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
వివాహ వేడుకల ఫోటోల్లో 32 ఏళ్ల అబ్దుల్ మతీన్ సంప్రదాయ దుస్తుల్లో, 29 ఏళ్ల వధువు అనిషా పొడవైన వెడ్డింగ్ గౌను, ఆభరణాలు ధరించి కనిపించారు.
ఇస్తానా నురుల్ ఇమాన్ ప్యాలెస్‌లో జరిగిన వేడుకలకు ఐదు వేల మంది అతిథులు హాజరైనట్లుగా తెలుస్తోంది.
ఇండోనేషియా అధ్యక్షులు జోకో విడోడో, ఫిలిప్పీన్స్ నాయకులు ఫెర్డినాండ్ మాక్రోస్ జూనియర్‌తోపాటు సౌదీ అరేబియా, జోర్డాన్‌ల నుంచి రాజవంశస్తులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
వివాహం అనంతరం తొలిసారిగా, ఇద్దరూ కలిసి రాజధాని బందర్ సెరి బెగవన్‌లో నిర్వహించిన అతిపెద్ద ఊరేగింపులో ఓపెన్‌టాప్ రోల్స్ రాయిస్ కారులో వేలమంది ప్రజలకు అభివాదం చేస్తూ కనిపించారు.

ఫొటో సోర్స్, Getty Images
యువరాజు వివాహ వేడుక గురించి ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీతో అక్కడి స్కూల్ టీచర్ నొర్లిహా మొహమ్మద్ మాట్లాడుతూ, “రాజవంశస్తుల వివాహ వేడుకను చూడటానికి రెండు కళ్లూ చాలలేదన్నంత వైభవంగా ఉంది” అని చెప్పారు.
యువరాజు మతీన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. టిక్‌టాక్‌లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు మతీన్.
డిసెంబర్ 31వ తేదీన తనకు కాబోయే భార్యతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మతీన్.
అప్పటి నుంచే సోషల్ మీడియా వేదికగా ఆయన వివాహం చేసుకోబోతున్నారని పలువురు యూజర్లు కామెంట్లు చేశారు.
"2024 సంవత్సరం మొదటిరోజే నా హార్ట్‌బ్రేకయింది" అని ఒక ఫాలోవర్ కామెంట్ రాశారు. అనంతరం వివాహ వేడుకలకు సంబంధించిన పలు ఫోటోలను కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. చాలామంది యూజర్లు కామెంట్స్ చేశారు.
బుధవారం స్థానిక టీవీ చానెళ్లు, మీడియా సంస్థలు వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ప్రసారం చేశాయి.

ఫొటో సోర్స్, INSTAGRAM
బ్రూనై సుల్తాన్‌కు ప్రపంచంలోనే సుదీర్ఘకాలం పాలించిన సుల్తాన్‌గా, అత్యంత ధనవంతుల్లో ఒకరిగా పేరుంది. ఆయన 10వ సంతానమే ప్రిన్స్ మతీన్.
సుల్తాన్ నుంచి వారసత్వం వెంటనే సంక్రమించలేదు. యువరాజు మతీన్ క్రమంగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆన్‌లైన్ వేదికగా ఆయన ఆర్మీ దుస్తులు ధరించిన వీడియోలు, ఫోటోలు, వివిధ వేడుకల్లో పాల్గొన్నవి, పోలో మ్యాచ్‌లు ఆడుతున్నవి వైరల్ అయ్యాయి.
10 రోజుల వివాహ వేడుకల్లో ఆదివారం రోజున అతిపెద్ద వేడుకలు నిర్వహించారు.
ఇస్లాం సంప్రదాయం బుధవారం రోజున వివాహ వేడుక జరిగింది. ఆరోజున వరుడు తరఫు కుటుంబం, బంధువులు మాత్రమే హాజరయ్యారు.
బుధవారం రోజున సుల్తాన్, మతీన్‌లు స్వర్ణ గోపురం ఉన్న మసీదులోకి వెళ్తుండగా, వందలమంది పౌరులు ఆ వేడుకకు హాజరైన దృశ్యాలు బయటకు వచ్చాయి.
యువరాజు మతీన్ వజ్రపు ఆకృతిలో ఉన్న తలపాగా, సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఇమామ్ నుంచి బహుమతిని అందుకున్న మతీన్, తన తండ్రి సుల్తాన్ నుంచి ఆశీర్వాదాలు పొందారు.
ఇవి కూడా చదవండి..
- బెంగళూరు: ఇండియన్ సిలికాన్ సిటీలో ఇంగ్లిష్‌కు వ్యతిరేకంగా ఎందుకీ ఘర్షణలు?
- హ్యూమన్ రైట్స్ వాచ్: మైనారిటీలు, మహిళల పట్ల భారత్ వివక్ష చూపిస్తోందన్న 'వరల్డ్ రిపోర్ట్-2024'
- పశ్చిమ బెంగాల్: వామపక్ష ర్యాలీకి భారీగా తరలివచ్చిన జనం... వీరంతా ఓట్లేస్తారా?
- INDvsAFG: ఇషాన్ కిషన్‌కు ఏమైంది? క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారా
- రాజీవ్ గాంధీ నుంచి మోదీ వరకు: మాల్దీవులను భారత్ నాలుగుసార్లు ఎలా ఆదుకుందో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














