పిల్లిని రైల్లోంచి విసిరేసిన కండక్టర్, ఆమెను ఉద్యోగంలోంచి తీసేయాలంటూ లక్షల మంది డిమాండ్

ఫొటో సోర్స్, HTTPS://T.ME/S/TWIX_POISK
- రచయిత, డేనీ అబర్హాడ్, జరోస్లావ్ లూకివ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
రష్యాలో ఒక రైలు నుంచి పిల్లిని బయటకు విసిరివేయడంతో బయట వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక అది మృతి చెందింది. ఈ ఘటనపై ప్రముఖ రష్యా రైల్వే కంపెనీ క్షమాపణ చెప్పింది.
ఆర్‌జెడ్‌హెచ్‌డీ కంపెనీకి చెందిన రైలు కండక్టర్ ఒకరు ట్విక్స్ అనే పిల్లిని బయట మంచులోకి విసిరివేశారు. ఈ మంచును తట్టుకోలేకపోయిన పిల్లి ప్రాణాలు విడిచినట్లు కథనాలు వచ్చాయి.
పిల్లి మరణంపై తాము తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు రైల్వే కంపెనీ తెలిపింది. ‘‘ట్విక్స్ మృతిపై మేం తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. ప్రస్తుతం మేం నిబంధనలను మార్చుతున్నాం’’ అని రైల్వే కంపెనీ చెప్పింది.
గోధుమ, తెలుపు రంగులో ఉన్న పిల్లిని కిరోవ్‌లో మంచులోకి విసిరేస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
మాస్కోకు తూర్పు దిశలో ఉన్న కిరోవ్ నగరంలో జనవరి 11న ఈ ఘటన జరిగింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పిల్లి జాడ కోసం వందల మంది గాలింపు
ఆ మహిళా కండక్టర్, ట్విక్స్‌ను వీధుల్లో తిరిగే పిల్లిగా భావించారు.
కానీ, ఈ పిల్లి తనను ఉంచిన ప్రయాణ పెట్టె నుంచి బయటికి వచ్చింది. రైలులో సీట్ల మధ్యనున్న ఖాళీ ప్రాంతాల్లో ఇది తిరగడం కొందరు ప్రయాణికులు చూశారు.
ఈ పిల్లిని రైలు నుంచి బయటికి విసిరేసిన తర్వాత, అది తనని ఉంచిన ప్రయాణ పెట్టె నుంచి బయటికి వచ్చిందన్న విషయం తెలుసుకున్నారు. ఆ తర్వాత ఈ పిల్లిని వెతకటం ప్రారంభించారు.
వందల మంది వాలంటీర్లు ఈ పిల్లిని వెతకడంలో సాయపడ్డారు. శనివారం చనిపోయిన పిల్లి దొరికింది. ఇది తాము పెంచుకున్న పిల్లేనని యజమానులు చెప్పారు.
జంతువులు కరవడం వల్ల, మంచు వల్ల ట్విక్స్ చనిపోయినట్లు కొన్ని కథనాలు చెబుతున్నాయి.
పిల్లిని బయటికి విసిరేసిన సమయంలో, రష్యాలో చాలా ప్రాంతాల్లో తీవ్ర మంచు కురుస్తోంది. వాతావరణ పరిస్థితులు అసలు బాగోలేవు. కిరోవ్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ 30 డిగ్రీలలోకి పడిపోయాయి.
పిల్లి మృతిపై ప్రజలు ఆగ్రహం
పిల్లి మరణించినట్లు తెలుసుకున్న తర్వాత కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. కానీ, అధికారులు ఆమెపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
ఆమెపై క్రిమినల్ విచారణ జరపాలని కోరుతూ 70 వేల మంది ఒక పిటిషన్‌పై సంతకాలు చేశారు.
కండక్టర్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ రెండు లక్షల మందికి పైగా మరో పిటిషన్‌పై సంతకాలు చేశారు.
కండక్టర్ వివరాలను ఇంకా ప్రజలకు వెల్లడించలేదు.
ఈ విషయాన్ని తాము కోర్టుకు తీసుకెళ్తామని ట్విక్స్ యజమానులు చెప్పారు.
నిబంధనలు మార్చిన రైల్వే కంపెనీ
ఈ కేసు కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సోషల్ మీడియా ఛానల్స్‌ను వేల మంది అనుసరిస్తున్నారు.
దేవదూత రెక్కలు, తలపై ప్రకాశవంతమైన కాంతి ఉన్నట్లు కనిపించే పిల్లి చిత్రాన్ని ఒక యూజర్ పోస్ట్ చేశారు.
ఎవరూ రైలులో తిరుగుతున్న ఏ జంతువును బయటికి విసిరివేయడానికి వీలు లేకుండా తన నిబంధనలను మారుస్తున్నట్లు ఆర్‌జెడ్‌హెచ్‌డీ రైలు కంపెనీ తెలిపింది.
ఇప్పటి నుంచి ఆ జంతువులను రైల్వే స్టేషన్లలోని ఉద్యోగులకు అప్పగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని జంతు సంరక్షణ సమూహానికి అప్పగిస్తారు.
ట్విక్స్‌ను రైలు నుంచి బయటికి విసిరివేయడంతో రైల్వే కంపెనీకి తీవ్ర ఒత్తిడి ఎదురైంది.
ఈ ఒత్తిడి తర్వాత తన ఉద్యోగులు జంతువులను ప్రేమగా చూసుకోవాలని ఆశిస్తున్నట్లు కంపెనీ సోషల్ మీడియాలో తెలిపింది. ప్రయాణంలో వాటికి కావాల్సిన సంరక్షణ అంతా అందించాలని చెప్పింది.
ట్విక్స్‌ను కనుగొనేందుకు రైల్వే ఉద్యోగులు సాయపడ్డారని కంపెనీ తెలిపింది. రష్యాలో వీధుల్లో తిరిగే జంతువులకు సాయం చేసే సంస్థలతో కలిసి పనిచేసేందుకు తన అనుబంధ కంపెనీల్లో ఒకటి ప్రయత్నిస్తుందని చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- అయోధ్యకు, థాయ్‌లాండ్‌లోని అయుతయ నగరానికి సంబంధం ఏంటి?
- కశ్మీర్లో మంచు కురవని శీతాకాలం ఎప్పుడైనా చూశారా... ఈ ఏడాదే ఎందుకిలా?
- అయోధ్య: ‘దివ్యాంగ మందిరంలో సకలాంగుడైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ధర్మవిరుద్ధం’ -శంకరాచార్య అవిముక్తేశ్వరానంద
- సచిన్ తెందూల్కర్: డీప్‌ఫేక్ బారిన పడిన భారత క్రికెట్ దిగ్గజం, కూతురుతో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నట్లుగా వీడియో వైరల్...
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














