ఆరు కాళ్లు, రెండు జననేంద్రియాలతో పుట్టిన కుక్కకు ఆపరేషన్.. రూ. 15 లక్షల విరాళాలతో కొత్త జీవితం ఇచ్చారు

ఫొటో సోర్స్, GREENACRES RESCUE
- రచయిత, నాథన్ బీవన్
- హోదా, బీబీసీ న్యూస్
ఏరియల్, ఆరు కాళ్లతో పుట్టిన కుక్క ఇది. ఒక సూపర్ మార్కెట్ కారు పార్కిగ్‌లో దీన్ని చూశారు. ఈ కుక్కకు ఉన్న అదనపు కాళ్లను తొలగించేందుకు శస్త్రచికిత్స చేశారు.
స్పానియల్ జాతికి చెందిన ఈ 11 వారాల కుక్కను సెప్టెంబర్‌లో బీ అండ్ ఎం పెంబ్రోక్‌షైర్ బ్రాంచ్ దగ్గర వదిలిపెట్టారు. అప్పుడు ఇది వార్తల్లోకెక్కింది.
ప్రపంచవ్యాప్తంగా దాని శ్రేయస్సును కోరుకుంటూ, శస్త్రచికిత్స కోసం సుమారు రూ. 15.84 లక్షలు (15 వేల పౌండ్లు) విరాళాలు వచ్చాయి.
శస్త్రచికిత్స చేస్తే ఒక అవయవాన్ని తీసేయాల్సి ఉంటుందనే భయాల మధ్య వైద్యులు దాని నాలుగు కాళ్లకు ఎలాంటి ముప్పు లేకుండా కాపాడగలిగారు.
ఒంటరిగా, బలహీనంగా, నిస్సహాయ స్థితిలో ఉన్న కుక్కపిల్లను యూకేలోని హావర్‌ఫోర్డ్‌వెస్ట్‌కు సమీపంలోని గ్రీన్ ఏకర్స్ రెస్క్యూ సంస్థ కాపాడింది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు, మేనేజర్ మికీ లావ్లర్.
‘‘ఏరియల్‌ను మొదట పరీక్షించిన వైద్యుడు దానికి అదనంగా రెండు వెనుక కాళ్లతో పాటు అదనపు వల్వా (జననేంద్రియం)కూడా ఉందని చెప్పారు’’ అని 42 ఏళ్ల మికీ వెల్లడించారు.
తర్వాత సీటీ స్కాన్ చేయగా దానికి కేవలం ఒకే కిడ్నీ ఉన్నట్లు తేలిందని ఆయన చెప్పారు. ఈ కారణంగా చికిత్స మరింత సంక్లిష్టంగా మారిందని అన్నారు.
‘‘ఒకే వైపుకు రెండు తుంటి కీళ్లు ఉండటం వల్ల దానికి కటి (పెల్విస్) భాగం పూర్తిగా ఏర్పడలేదు. ఫలితంగా వెనుకవైపు కుడికాలుకు ఎలాంటి కండ లేదు. కాబట్టి దాన్ని కూడా తొలిగించాల్సి వస్తుందని అనుకున్నారు. ఇటీవలి కాలంలో ఆ కాలు కాస్త బలంగా మారడంతో దాన్ని తొలిగించాల్సిన అవసరం రాలేదు’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, GREENACRES RESCUE
సోమర్‌సెట్‌లోని లాంగ్‌ఫోర్డ్ వెట్స్ స్మాల్ యానిమల్ రిఫరల్ ఆసుపత్రిలో గురువారం ఏరియల్‌కు ఆపరేషన్ చేశారు.
‘‘రెండు చికిత్సలు చేశాం. రెండూ బాగానే జరిగాయి. రెండు గంటల సమయం పట్టింది. మరుసటి రోజు ఏరియల్ లేచి చుట్టూ నడిచింది. తినడం, తాగడం చేసింది. ఇక దానికి ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు సోకకుండా చూసుకోవాలి’’ అని మికీ అన్నారు.
వారాంతంలో ఏరియల్ డిశ్చార్జి అవుతుందని ఆయన ఆశిస్తున్నారు. వేల్స్‌లోని పెంపుడు జంతువుల కేంద్రానికి చేరుకుంటుందని అన్నారు.

ఫొటో సోర్స్, GREENACRES RESCUE
‘‘కొన్ని వారాల పాటు ఫిజియో థెరపీ అందించి అది పూర్తిగా కోలుకున్న తర్వాత దాన్ని ఎవరు పెంచుకుంటారో వెదుకుతాం. ఏరియల్ పరిస్థితి గురించి తెలుసుకున్న తర్వాత న్యూయార్క్, ఆస్ట్రేలియా నుంచి ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ ద్వారా వచ్చిన స్పందన నిజంగా అద్భుతం. దీన్ని బట్టి చూస్తే దానికి శాశ్వతంగా ఒక ఇల్లు దొరకడం కష్టమేం కాదనిపిస్తుంది. ఏరియల్‌కు సహాయం చేసిన అందరికీ మాటల్లో నా కృతజ్ఞతలు చెప్పలేను’’ అని మికీ అన్నారు.
ఏరియల్‌కు నిపుణుల పర్యవేక్షణలో చికిత్స జరిగిందని లాంగ్‌ఫోర్డ్ వెట్స్ ఆసుపత్రి డైరెక్టర్ విక్కీ బ్లాక్ అన్నారు. ‘‘ అదొక చిన్న కుక్కపిల్ల. దాని శస్త్రచికిత్సలో ఆర్థోపెడిక్స్, సాఫ్ట్ టిష్యూ సర్జరీ, అనస్తీషియా, రేడియాలజీ నిపుణుల బృందం పాల్గొంది. ఏరియల్ వంటి పెంపుడు జంతువులకు చికిత్స చేయడం గర్వంగా ఉంది. సర్జరీ తర్వాత అది కోలుకోవడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది’’ అని విక్కీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్లో మంచు కురవని శీతాకాలం ఎప్పుడైనా చూశారా... ఈ ఏడాదే ఎందుకిలా?
- అయోధ్య: ‘దివ్యాంగ మందిరంలో సకలాంగుడైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ధర్మవిరుద్ధం’ -శంకరాచార్య అవిముక్తేశ్వరానంద
- సచిన్ తెందూల్కర్: డీప్‌ఫేక్ బారిన పడిన భారత క్రికెట్ దిగ్గజం, కూతురుతో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నట్లుగా వీడియో వైరల్...
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
- కుక్క మాంసంపై దక్షిణ కొరియాలో వివాదమెందుకు? బీఫ్, పోర్క్ కంటే ఇది ఆరోగ్యకరమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










