అలెగ్జాండర్ జయించిన ఆ ప్రాంతంలో తవ్వకాలు ఎందుకు? అక్కడ గుప్త నిధులు ఉన్నాయా?

బాల్ఖ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర అఫ్గానిస్తాన్‌లోని బాల్ఖ్ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయి.
    • రచయిత, కవూన్ ఖమూష్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

అఫ్గానిస్తాన్‌లోని పదుల కొద్దీ చారిత్రక ప్రదేశాల్లో ‘క్రమబద్ధమైన దోపిడీ’ జరిగిందని షికాగో యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు.

గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన దోపిడీ విధానాలు, 2021లో తాలిబాన్ అధికారంలోకి వచ్చాక కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. శాటిలైట్ ఫోటోల ద్వారా ఇది తెలుస్తోందని తెలిపారు.

కాంస్య యుగం, ఇనుప యుగం నాటి అంటే క్రీ.పూ.1000 ముందటి పురాతన ప్రదేశాలు కూడా దెబ్బతిన్నాయని వారు చెప్పారు.

ఉత్తర అఫ్గానిస్తాన్‌లోని బాల్ఖ్ ప్రాంతంలో ఇలాంటి ప్రదేశాలనువారు చాలా గుర్తించారు. రెండు వేల ఏళ్ల క్రితం బాక్ట్రియాకు ఇది ముఖ్యమైన ప్రదేశం.

క్రీ.పూ. ఆరో శతాబ్దంలో అచెమెనిడ్ సామ్రాజ్యం కింద ఉన్న ప్రాచీన అఫ్గానిస్తాన్‌లోని అత్యంత ధనిక, అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో బాక్ట్రియా ఒకటి.

క్రీ.పూ. 327 నాటికి అలెగ్జాండర్ ఈ ప్రాంతాన్ని జయించారు. అచెమెనిడ్ పాలకుడిని ఓడించిన తర్వాత రోక్సానా అనే బాక్ట్రియన్ మహిళను అలెగ్జాండర్ పెళ్లి చేసుకున్నారు.

ఈస్ట్-వెస్ట్ సిల్క్ రూట్‌లో ఉన్నసెంట్రల్ సిటీయేబాక్ట్రా. కాలక్రమేణా దీన్ని బాల్ఖ్ అని వ్యవహరించారు.

జొరాస్ట్రియన్, బౌద్ధం రెండింటికీ ఈ ప్రాంతం కేంద్రంగా ఉండేది. తరువాత ఇది ఇస్లామిక్ నగరంగా మారింది.

అఫ్గానిస్తాన్​
ఫొటో క్యాప్షన్, షికాగో యూనివర్సిటీ పరిశోధకులు అందించిన మ్యాప్​

షికాగో వర్సిటీ పరిశోధకులు ఏం గుర్తించారు?

ఉపగ్రహ చిత్రాలు, ఇతర పరికరాల సాయంతో అఫ్గానిస్తాన్ అంతటా 29,000 కంటే ఎక్కువ పురావస్తు ప్రదేశాలను గుర్తించారు షికాగో యూనివర్శిటీ సెంటర్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ ప్రిజర్వేషన్ పరిశోధకులు.

అయితే, 2018లో బాల్ఖ్ ప్రాంతంలో మార్పులను గుర్తించారు. చిత్రాలలో వచ్చిన మచ్చలు ఒకసారి కనిపిస్తూ, మళ్లీ కనిపించడం లేదని అవి బుల్డోజర్లుగా విశ్వసిస్తున్నట్లు వారు తెలిపారు.

తవ్విన ప్రాంతాలు తదుపరి చిత్రాలలో కనిపిస్తాయని, దోపిడీదారులు ఆ గుంటలను తవ్వేస్తున్నారని సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ గిల్ స్టెయిన్ వివరించారు.

"తవ్వకాలు సులభతరం చేయడానికి ప్రజలను ఆ ప్రాంతాల నుంచి ఖాళీ చేయిస్తున్నారు" అని ఆయన అంటున్నారు.

అఫ్గానిస్తాన్​
ఫొటో క్యాప్షన్, చికాగో యూనివర్సిటీ పరిశోధకులు అందించిన మ్యాప్​

బంగారు ఆభరణాలు, కిరీటాలు, నాణేలు

2018, 2021 మధ్యకాలంలో 162 ప్రాచీన స్థావరాలు వారానికి ఒకటి చొప్పున వినాశనానికి గురయ్యాయని గిల్ స్టెయిన్ బృందం చెబుతోంది. ఆ తర్వాత తాలిబాన్ ప్రభుత్వ కాలంలో 37 ప్రదేశాలలో దీనిని కొనసాగించారని తెలిపారు.

అయితే, దోపిడీదారులకు సమాచారం తెలియకూడదని పరిశోధకులు కచ్చితమైన స్థానాలను అందించడంలేదు. చాలా ప్రాంతాల అధ్యయనం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.

పరిశోధకులకు ఆ ప్రాంతాల్లో ఇంకా ఏం తవ్వారనేది పూర్తిగా తెలియదు, వీటిలో ప్రధానంగా గుట్టలు, కోటలు, సత్రాలు, కాలువ వ్యవస్థలూ ఉన్నాయి.

తేలా టేపే అనే ప్రాంతానికి 97 కి. మీ. దూరంలో 2,000 ఏళ్ల నాటి బాక్ట్రియన్ బంగారం నిల్వలను 1978వ సంవత్సరంలో కనుగొన్నారు.

అక్కడ బంగారు ఆభరణాలు, కిరీటాలు, నాణేలు సహా 20,000 అరుదైన వస్తువులను కనుగొన్నారు. వీటిని లాస్ట్ ట్రెజర్స్ ఆఫ్ అఫ్గానిస్తాన్ అని పిలుస్తారు.

బంగారు కిరీటం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తేలా టేపే అనే ప్రాంతంలో 1978లో బంగారం నిల్వలు కనుగొన్నారు.

"మీరు ప్రతి మట్టిదిబ్బలో నాగరికత ఆనవాళ్లు వెలికితీయవచ్చు" అని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రీసర్చ్ ఫెలో రెజా హుసేని చెప్పారు.

రెజా హుసేని బాల్ఖ్‌లో జన్మించారు. ఆయన తన 20వ దశకంలో ఉత్తర అఫ్గానిస్తాన్‌లోని పురావస్తు ప్రదేశాల సర్వే కోసం వాలంటీర్‌గా పనిచేశారు. వాటిలో కొన్ని ఇప్పటికే దోపిడీదారులు తవ్వేశారు.

షికాగో యూనివర్శిటీ చిత్రాలను చూసి ఆయన షాక్ అయ్యారు.

''నాకది విన్నప్పుడు నా ఆత్మ నా నుంచి దూరమైనట్లు అనిపించింది'' అంటున్నారాయన. ఈ విధ్వంసం వెనుక ఎవరున్నారనే దానిపై స్పష్టమైన సమాధానాలు లేవు.

మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ నేతృత్వంలోని గత ప్రభుత్వ హయాంలో ఈ విధానం మొదలై తాలిబాన్ హయాంలో కొనసాగుతోందని ప్రొఫెసర్ గిల్ స్టెయిన్ చెప్పారు.

ఘనీ ప్రభుత్వం అప్పట్లో బలహీనంగా ఉండేది, దేశంలోని కొన్ని ప్రాంతాలపై వారికి పూర్తి నియంత్రణ లేదు.

2021 ఆగస్ట్‌లో రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకునే ముందు మొదటిగా తాలిబాన్‌ల వశమైన ప్రాంతాలలో ఉత్తర అఫ్గానిస్తాన్ అతిపెద్ద నగరం మజార్-ఇ-షరీఫ్‌, బాల్ఖ్ కూడా ఉన్నాయి.

బాల్ఖ్ ప్రాంతం
ఫొటో క్యాప్షన్, 2021 ఏప్రిల్, 2022 అక్టోబర్ నెలల్లో బాల్ఖ్ ప్రాంతంలో మార్పులపై గ్రాఫిక్

దోపిడీకి పాల్పడింది ఎవరు?

భూమిపై కదిలే భారీ యంత్రాలు కొనుగోలు చేయడమో లేదా అద్దెకు తీసుకునేంత ధనవంతులు లేదా శక్తిమంతమైన వారే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని గిల్ స్టెయిన్ అభిప్రాయపడ్డారు.

ఎవరూ అడ్డుపడకుండా గ్రామీణ ప్రాంతాలకు యంత్రాలను తరలిస్తూ వారీ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.

2009లో దేశం విడిచి వెళ్లే ముందు ఈ ప్రాంతంలోని కొన్ని పురావస్తు ప్రదేశాలను దోచుకున్నారని హుసేనీ చెప్పారు.

"భద్రతా బలగాల అనుమతి లేకుండా ఇక్కడి బలవంతులు తవ్వకాలు చేయలేరు" అని హుసేనీ చెబుతున్నారు.

"వారికి చారిత్రక విలువ ముఖ్యం కాదు, ఏం దొరుకుతుందోనని తవ్వి, నాశనం చేస్తారు. నా కళ్లతో నేను చూశాను. వాళ్లు మట్టి జల్లెడను కూడా ఉపయోగించారు" అని తెలిపారు.

ఒక పురాతన ప్రాంతాన్ని సంరక్షించేవాడినని, అయితే అదే ప్రాంతంలో ఒక మిలిషియా కమాండర్ నల్లమందు పెంచారని హుసేనీ గుర్తుచేసుకున్నారు.

తాలిబాన్‌లు మొదటిసారిగా అధికారంలో వచ్చినపుడు 2001లో పదిహేను వందల ఏళ్ల నాటి బమియన్ బుద్ధ విగ్రహాలను (ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద 'నిలబడి ఉన్న బుద్ధ విగ్రహాలు) పేల్చివేసి, ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించారు.

రెండు దశాబ్దాల తర్వాత తిరిగి వచ్చినప్పుడు దేశ ప్రాచీన వారసత్వాన్ని గౌరవిస్తామని తాలిబాన్‌లు చెప్పారు.

దోపిడీ వాదనలను సమాచార, సంస్కృతి శాఖకు సంబంధించిన, తాత్కాలిక ఉప ముఖ్యమంత్రి అతికుల్లా తిరస్కరించారు.

చారిత్రక ప్రదేశాల భద్రతకు 800 మందితో బలమైన బలగాన్ని నియమించినట్లు ఆయన చెప్పారు.

"బుల్డోజర్ కదలికలు, జనం మట్టిని తరలించడం" గురించి కొన్ని సంస్థలు తమ శాఖకు ఫోటోలను పంపాయని ఆయన బీబీసీకి తెలిపారు.

"మేం ఆ ప్రాంతాలను తనిఖీ చేయడానికి కొన్ని బృందాలను పంపాం, ఏ ఒక్క సంఘటన కూడా జరగలేదని భరోసాతో చెబుతున్నా" అని అన్నారు.

2007లో బాల్ఖ్‌లోని టేపే జర్గారన్ పురావస్తు ప్రదేశంలో రెజా హుసేనీ

ఫొటో సోర్స్, Said Reza Huseini

ఫొటో క్యాప్షన్, రెజా హుసేని ఉత్తర అఫ్గానిస్తాన్‌లోని పురావస్తు ప్రదేశాల సర్వే కోసం వాలంటీర్‌గా పనిచేశారు.

దోచుకున్న కళాఖండాలను ఏం చేస్తారు?

విగ్రహాలు, మమ్మీలు, బంగారు కిరీటం, పుస్తకం, కత్తులు సహా దాదాపు రూ. 220 కోట్ల విలువైన పురాతన వస్తువులను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించిన ముగ్గురిని సెప్టెంబర్‌లో అరెస్టు చేసినట్లు తాలిబాన్ రక్షణ శాఖ ప్రకటించింది.

వస్తువులను జాతీయ మ్యూజియంకు అప్పగించామని, విచారణ కొనసాగుతోందని చెప్పింది.

అజీజీ స్పందనను ప్రొఫెసర్ గిల్ స్టెయిన్‌కు బీబీసీ వివరించింది.

సాక్ష్యాలు ఇబ్బంది పెట్టేవిగా ఉంటే తప్ప, మన వాదనలను వాళ్లు ఎందుకు వ్యతిరేకిస్తారో తెలియదని గిల్ స్టెయిన్ అంటున్నారు.

"రెండు విభిన్న రాజకీయ వ్యవస్థల పాలనలో కూడా దోపిడీ కొనసాగించారని మేం నిరూపించగలం" అని ఆయన చెప్పారు.

దోచుకున్న కళాఖండాలు అఫ్గానిస్తాన్ నుంచి ఇరాన్, పాకిస్తాన్, ఇతర దేశాల గుండా అక్రమంగా రవాణా అవుతాయని, తరువాత ఐరోపా, ఉత్తర అమెరికాలకు చేరుకుంటాయని అభిప్రాయపడ్డారు. వీటిని ప్రపంచవ్యాప్తంగా వేలంలో లేదా మ్యూజియాలలో ప్రదర్శించే అవకాశం ఉందన్నారు.

మనం వస్తువులను గుర్తించకపోతే వాటిని పట్టుకోవడం కష్టమని ఆయన అంటున్నారు. అయితే, ప్రయత్నించడమైతే ముఖ్యమని, పురాతన ప్రదేశాలను సంరక్షించాలని ఆయన కోరుతున్నారు.

"అఫ్గానిస్తాన్ వారసత్వం నిజంగా ప్రపంచ వారసత్వంలో భాగం, నిజాయతీగా మనందరికీ చెందినది" అని గిల్ స్టెయిన్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)