అమెరికాలో తొలిసారిగా నైట్రోజన్‌తో మరణ శిక్ష అమలుకు యత్నం.. ఇది అమానవీయమన్న ఐరాస

ఫొటో సోర్స్, ALABAMA DEPARTMENT OF CORRECTIONS
- రచయిత, టామ్ బాట్‌మాన్
- హోదా, బీబీసీ న్యూస్
నోట్: ఈ కథనంలో కలచివేసే అంశాలు ఉన్నాయి.
కెన్నెత్ యూజిన్ స్మిత్ మరి కొద్దిసేపట్లో చనిపోనున్నారు. ఆయనకు మరణ శిక్ష అమలు చేసేందుకు అమెరికాలోని అలబామా రాష్ట్రంలో అధికారులు తీవ్రంగా శ్రమించారు. ఇందుకోసం ఎన్నో గంటలు కష్టపడ్డారు.
మరణ శిక్ష విధించిన ఖైదీలను ఉంచే హోల్మన్ కరెక్షనల్ ఫెసిలిటీ సెంటర్‌లోని డెత్ చాంబర్‌లో స్మిత్‌ను ఓ స్ట్రెచర్‌పై గట్టిగా కట్టేశారు. తరువాత ఆయనకు ప్రాణాలు తీసే లెథాల్ మిశ్రమ రసాయానాలతో కూడిన విషపు ఇంజెక్షన్ ఇచ్చారు.
కానీ వారి ప్రయత్నం విఫలమైంది.
ఇంజెక్షన్ ఎక్కించేందుకు అధికారులు విశ్వప్రయత్నం చేశారు. కానీ ఇంజెక్షన్ చేసేందుకు వారికి స్మిత్ నరం దొరకలేదు. అధికారుల ప్రయత్నాల వల్ల స్మిత్ శరీరంపై అనేకగాట్లు పడ్డాయని ఆయన తరపు లాయర్లు చెప్పారు.
అర్ధరాత్రి వరకు అధికారులు యత్నించి విఫలమయ్యాక, మేజిస్ట్రేట్ ఇచ్చిన సమయం ముగిసిపోయింది. దీంతో వారు ఏమీ చేయలేకపోయారు.
ఈ ఘటన 2022 నవంబర్‌లో జరిగింది.
కానీ.. ఇప్పుడు అలబామా ప్రభుత్వం స్మిత్ మరణ శిక్ష ను అమలు చేయడానికి మరోసారి ప్రయత్నిస్తోంది.
అయితే ఈసారి స్మిత్‌ను ఊపిరాడకుండా చేసి చంపాలనే ప్లాన్‌లో ఉంది.
ఇందుకోసం స్మిత్ మొహానికి గాలిచొరబడని మాస్క్ వేసి, అతను స్వచ్ఛమైన నైట్రోజన్ (నత్రజని) పీల్చేలా చేస్తారు.
ఈ వాయువు స్మిత్‌కు ఆక్సిజన్ అందకుండా నిరోధిస్తుంది.
ఈ ప్రయత్నాన్ని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హై కమిషనర్ ఖండించారు. ఈ పద్ధతి గతంలో ఎన్నడూ వాడలేదన్నారు. ఇది హింసాత్మకమైనది, క్రూరమైనది, అమానవీయమైనది అని చెప్పారు.
ఈ పద్ధతిపై నిషేధం విధించాలంటూ స్మిత్ తరపు న్యాయవాదులు చేసిన అభ్యర్థనను ఫెడరల్ కోర్టు తిరస్కరించింది.
దీనిపై తుది తీర్పు ఇంకా రాలేదు. అయితే జనవరి 25 గురువారం స్మిత్‌కు ఈ కొత్తపద్ధతిలో మరణ దండన విధించనున్నారు.
ఓ మతబోధకుడి భార్య ఎలిజిబెత్ సెన్నెట్‌ను పొడిచి, ఆమె చనిపోయేదాకా హింసించారనే కేసు దోషుల్లో స్మిత్ ఒకరు.
వీరిద్దరూ వెయ్యి అమెరికన్ డాలర్లకు కాంట్రాక్ట్ కుదుర్చుకుని ఈ హత్య చేశారని తేలింది.
ఆధునిక అమెరికాలో ‘‘రెండుసార్లు’’ మరణ దండనకు గురవుతున్న మొదటి వ్యక్తి స్మిత్.
నైట్రోజన్ వాయువు ద్వారా మరణ శిక్షకు గురవుతున్న వ్యక్తి కూడా ఆయనే.

‘నా శరీరం సహకరించడం లేదు’
మరణ శిక్ష పడ్డ కెన్నెత్ యూజిన్ స్మిత్ హోల్మన్ కరెక్షనల్ ఫెసిలిటీ సెంటర్‌లో దశాబ్దాలుగా ఖైదీగా ఉన్నారు.
‘‘నా శరీరం నాకు సహకరించడం లేదు. నేను బరువు కోల్పోతున్నాను’’ అని స్మిత్ బీబీసికి చెప్పారు.
బీబీసీ ఓ మధ్యవర్తి ద్వారా అందించిన లిఖితపూర్వక ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.
అలబామాలో మరణ శిక్ష పడిన ఖైదీలకు, జర్నలిస్టుల మధ్య ముఖాముఖి ఇంటర్వ్యూలను నిషేధించారు.
మేం ఆయన్ను ఇటీవల ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించాం.
తాను చాలా బాధపడుతున్నానని, తనను ఇంటర్వ్యూ చేయవద్దని స్మిత్ కోరారు.
‘‘నాకు చాలా వికారంగా ఉంటోంది. భయంతో నా శరీరం కంపించిపోతోంది. ఇది రోజంతా నేను అనుభవించే చిత్రవధలో ఓ భాగం మాత్రమే. ఇది నిజంగా హింసే’’ అని ఆయన రాశారు.
‘‘ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, మరణ దండన ఆపండి’’ అని ఆయన అలబామా అధికారులకు విజ్ఞప్తి చేశారు.
నైట్రోజన్ వాయువు పీల్చడం వల్ల వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్ళి చావు సంభవిస్తుందని ప్రభుత్వం చెబుతోంది కానీ, ఇందుకు సంబంధించిన నమ్మదగిన రుజువులేవీ చూపడం లేదు.
కానీ ఇదో విపత్తులాంటిదని వైద్యనిపుణులు, హక్కుల కార్యకర్తలు ఆందోళన చెందుతుతున్నారు.
స్మిత్ మానసిక స్థితి కారణంగా ప్రమాదకరమైన మూర్ఛకు గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
అలాగే మాస్క్ నుంచి నైట్రోజన్ గ్యాస్ లీక్ అవడంవల్ల ఆ గదిలో ఉన్నవారి ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు.
‘‘చావు గురించి స్మిత్ భయపడటం లేదని నేను స్పష్టంగా చెప్పగలను. కానీ ఈ ప్రక్రియలో ఆయన మరింత హింసకు గురవుతారు’’ అని స్మిత్ మతగురువు హుడ్ చెప్పారు.
‘‘నేను ఆయనకు కొన్నిమీటర్ల దూరంలో ఉంటాను. ఈ విషయంలో నా జీవితాన్ని పణంగా పెడుతున్నానని వైద్యనిపుణులు పదేపదే చెబుతున్నారు. గొట్టంలోగానీ, మాస్క్ నుంచి కానీ ఏ విధమైన లీకేజీ జరిగినా ఆ వాయువు గదంతా వ్యాపించే ప్రమాదం ఉంది’’ అని హుడ్ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
‘స్మిత్‌కు నరకయాతన’
ఈ రకమైన శిక్షలు ప్రమాదకరమని ఐక్యరాజ్యసమితి విచారణ నిపుణుడు ఒకరు చెప్పారు.
ఎమోరి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో అనస్థీషియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ జోయెల్ జీవోట్ ఈ శిక్షను, ‘‘భయంకరమైనది, క్రూరమైనది’’ అంటూ అలబామా అధికారులను తప్పుపట్టారు.
‘‘కెన్నెత్ స్మిత్ అమెరికాలో అత్యంత దుర్మార్గుడు అనే అంచనాకు రావాలి. ఆయన్ను అలబామా ప్రభుత్వం నరకయాతన పెడుతోంది. ఇతరులను చంపేందుకు వారు ఆయన్ను చంపాలనుకుంటున్నారు’’ అని జివోట్ బీబీసీకి చెప్పారు.
‘‘మీరో ఫైరింగ్ స్క్వాడ్‌ను ఊహించుకోండి. అక్కడో నిందితుడికి మరణ దండన విధించబోతున్నారు. ఆ పక్కనే వరుసగా సాక్షులు నిలుచుని ఉన్నారు. ఇక్కడ కాల్చే వ్యక్తి సరైన వ్యక్తి కాకపోతే వీరు కూడా ఆ కాల్పుల బారినపడే ప్రమాదం ఉంది’’ అని ఆయన వివరించారు.
‘‘నైట్రోజన్ వాయువుతో కూడా ఇలాంటిది జరిగే అవకాశం ఉంది’’ అని చెప్పారు.
‘‘నైట్రోజన్ వాయువు గురించి జరిపిన అధ్యయనంలో ఆరోగ్యవంతమైన వాలంటీర్లు దీనిని పీల్చగానే 15 నుంచి 20 సెకన్లలోపే మూర్ఛపోయారు. స్మిత్ కూడా పూర్తిగా చనిపోకముందే మూర్ఛపోయే అవకాశం ఉంది’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
విఫల యత్నాలు
అమెరికాలో మరణ దండనల సగటు అత్యధికంగా ఉన్న రాష్ట్రం అలబామా.
ప్రస్తుతం అక్కడ మరణ దండన ఎదుర్కొంటున్నవారు 165 మంది ఉన్నారు.
2018 నుంచి లెథాల్ అనే విషపు ఇంజెక్షన్ల ద్వారా దోషులను చంపేందుకు ప్రయత్నించి విఫలమైన సందర్భాలు మూడుదాకా ఉన్నాయి. ఈ విఫలయత్నాల వల్ల దోషులు బతికిపోయారు. దీనిపై జరిపిన అంతర్గత విచారణలన్నీ నిందను ఖైదీలపైనే వేశాయి.
మరణ శిక్షను ఆపాలంటూ చివరి నిమిషంలో లాయర్లు కోర్టులను అభ్యర్థించడం ద్వారా ఖైదీలకు పడిన మరణ దండన సమయాన్ని మించిపోయేలా చేస్తున్నారని ఆ నివేదికలో నిర్ధరించారు.
దీనివల్ల జైలు అధికారులపై తుది గడువులకు సంబంధించి అనవసరమైన ఒత్తిడి వస్తోందని ఓ సమీక్ష తెలిపింది.
ప్రస్తుతానికి అధికారులకు ‘అర్ధరాత్రి గడువులు లాంటి ’ హడావుడి లేకుండా స్మిత్‌ను చంపేందుకు కావాల్సినంత సమయం చిక్కింది.
అలబామా గవర్నర్ కే ఐవీ ఈ విషయంలో నిపుణులు చేస్తున్న కామెంట్లపై స్పందించడానికి నిరాకరించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
జనవరి 25న మరణశిక్ష
ఇక ఐక్యరాజ్యసమితి ఆందోళనలు, స్మిత్ ఆందోళనలు నిరాధారమైనవని అటార్నీ జనరల్ కార్యాలయం పేర్కొంది.
‘‘ట్రైల్ కోర్టు స్మిత్ సవాల్‌ను సమీక్షించింది. అనేక మంది వైద్యనిపుణుల వాదనలూ విన్నది. తరువాత నైట్రోజన్ హైపోక్సియా గురించి స్మిత్ ఆందోళనలు కేవలం ఊహాగానాలు, నిరాధారం’’ అని ప్రాసిక్యూటర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
‘‘జనవరి 25న ఆయనకు మరణ దండన అమలు చేయబోతున్నాం’’ అని ఆ ప్రకటన తెలిపింది.
ఐక్యరాజ్య సమితి విమర్శలను అలబామా రాష్ట్ర పతినిధి, రిపబ్లికన్ అయిన రెడ్ ఇన్‌గ్రామ్ కూడా కొట్టిపారేశారు.
ఈయన నైట్రోజన్ గ్యాస్ ద్వారా శిక్షను అమలు చేయడానికి ఓటు వేశారు.
‘‘అది మానవత్వాన్ని దిగజార్చుతుందో లేదో నాకు తెలియదు. అది అమానవీయమో కాదో కూడా నాకు తెలియదు. కానీ మేము వీలైనంత ఉత్తమమైన పనిచేస్తున్నాం. ఈ ప్రక్రియ బాధితులకు జరిగిన అన్యాయం కంటే బెటర్‌గానే ఉండొచ్చు’’ అని ఆయన బీబీసీకి చెప్పారు.
‘‘మన గవర్నర్ ఓ క్రిస్టియన్. ఈ ప్రక్రియ గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఇది సముచితమైనదనే నమ్ముతున్నారు. ఆమె దానిని కష్టమైనదిగా భావించినా, ఇది చట్టం, తప్పదు’’ అని చెప్పారు.
హత్యకు గురైన ఎలిజిబెత్ సెన్నెట్టా కుటుంబాన్ని కూడా బీబీసీ సంప్రదించింది.
కానీ జనవరి 25 వరకు దీనిపై తామేమీ చెప్పలేమని వారు తెలిపారు.
1996లో పెరోల్‌పై విడుదలయ్యే అవకాశం లేకుండా ఓ జ్యూరీ స్మిత్‌కు యావజ్జీవ ఖైదు విధించింది. కానీ పై జడ్జి దానిని తిరస్కరిస్తూ ఉరిశిక్ష విధించారు.
స్మిత్ కూడా తాను ఎలిజిబెత్ హత్యలో పాలుపంచుకున్నానని అంగీకరించారు. కానీ ఆమెపై జరిగిన దాడిలో తాను పాల్గొనలేదని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- నువ్వుల లడ్డూ: 'తీయని మాటలు పలికేలా చేసే తీపి వంటకం'
- బటర్ చికెన్, దాల్ మఖనీ వంటకాలు ఎవరు కనిపెట్టారు? తేల్చనున్న దిల్లీ హైకోర్టు
- కశ్మీర్లో మంచు కురవని శీతాకాలం ఎప్పుడైనా చూశారా... ఈ ఏడాదే ఎందుకిలా?
- పిల్లల స్కూల్ ఫీజులు, ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం ఆదాయం పెంచుకొనే మార్గాలు ఇవీ
- అయోధ్య రూపురేఖలు ఎలా మారిపోయాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














