కొలోసస్: రెండో ప్రపంచ యుద్ధంలో నాజీల రహస్య సందేశాలను డీకోడ్ చేసిన తొలితరం కంప్యూటర్ వేల ప్రాణాలను ఎలా కాపాడింది.. 80 ఏళ్ల పాటు దాన్ని సీక్రెట్‌గా ఎందుకు ఉంచారు

రెండో ప్రపంచ యుద్ధం

ఫొటో సోర్స్, CROWN COPYRIGHT

ఫొటో క్యాప్షన్, కొలోసస్ కంప్యూటర్ గురించి దశాబ్దాలపాటు ప్రపంచానికి తెలియకుండా ఉంచారు.
    • రచయిత, షియోనా మెక్‌కాలమ్
    • హోదా, టెక్నాలజీ రిపోర్టర్

బ్రిటన్‌లోని ‘ది గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ హెడ్‌క్వార్టర్స్’ (జీసీహెచ్‌క్యూ) రహస్య కోడ్ బ్రేకింగ్ కంప్యూటర్‌-కోలోసస్‌కు సంబంధించిన ఇంతకు ముందెన్నడూ చూడని ఫొటోలను విడుదల చేస్తూ, రెండో ప్రపంచ యుద్ధంలోమిత్ర రాజ్యాలకు ఇది ఎంతో మేలు చేసిందని పేర్కొంది.

కొలోసస్ రూపకల్పన, పనితీరుతో 'కొత్త వెలుగులు' నింపిందని పేర్కొంది. దశాబ్దాల కాలం పాటు రహస్యంగా ఉంచిన కొలోసస్ కంప్యూటర్‌ను 'తొలితరం డిజిటల్ కంప్యూటర్‌'గా కూడా చాలామంది చెప్తారు.

ఈ కంప్యూటర్ ఉనికిని 2000 సంవత్సరం వరకు రహస్యంగానే ఉంచారు.

కంప్యూటర్ ఆవిష్కరణ జరిగి 80 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా కొలోసస్ కంప్యూటర్ గురించి వివరాలు ప్రపంచానికి తెలియజేసింది జీసీహెచ్‌క్యూ.

జీసీహెచ్‌క్యూ డైరెక్టర్ ఆనే కీస్ట్ బట్లర్ మాట్లాడుతూ, దేశభద్రతలో భాగమైన కొలోసస్ కంప్యూటర్ ఫొటోలు, ఆ సమయంలోని సృజనను గుర్తుచేస్తున్నాయని అన్నారు.

రెండో ప్రపంచ యుద్ధం

ఫొటో సోర్స్, CROWN COPYRIGHT

చరిత్రకు తెలియకుండా

"జీసీహె‌చ్‌క్యూ కేంద్రంలో సాంకేతిక ఆవిష్కరణల ప్రధానంగానే పనులన్ని జరిగేవి. మా సిబ్బంది పనితీరు, సమర్థతకు నిదర్శనం కొలోసస్ కంప్యూటర్ ఆవిష్కరణ. నూతన సాంకేతికను అందిపుచ్చుకోవడంలో మేం ముందున్నామని చూపేందుకు ఇదే నిదర్శనం" అన్నారు అనే కీస్ట్ బట్లర్.

1944ల్లో తొలిసారిగా కొలోసస్ వినియోగం మొదలైంది. బ్లెట్‌చ్లీ పార్క్ కేంద్రంగా సేవలు అందుబాటులోకి వచ్చాయి. క్రమంగా వాటి సంఖ్య పదికి చేరింది.

నాజీల సందేశాలను అర్థం చేసుకునేందుకు వీటిని వినియోగించారు.

ఒక్కోటి రెండు మీటర్ల ఎత్తు ఉన్న 2500 వాల్వ్‌లతో రూపొందిన కొలోసస్‌ను ఆపరేట్ చేయడానికి నిపుణులైన ఆపరేటర్లు, టెక్నిషియన్లు పనిచేశారు. ఎక్కువగా వుమెన్స్ రాయల్ నావల్ సర్వీస్ సభ్యులే(డబ్ల్యూఆర్ఈఎన్ఎస్) ఆ బాధ్యతలు నిర్వర్తించేవారు.

జీసీహెచ్‌క్యూ విడుదల చేసిన ఫొటోల్లో ఒక దానిలో వారు పనిచేస్తూ కనిపించారు.

తొలిసారిగా కొలోసస్ కంప్యూటర్ ఎలా పనిచేస్తుందని తెలిపే బ్లూప్రింట్లు, జర్మన్లు పంపే సందేశాలను ఎలా విశదీకరించేదో తెలిపే వివరాలను కూడా తొలిసారిగా ప్రపంచానికి తెలియజేశారు. పనితీరుని వివరించే ఆడియో క్లిప్‌ను కూడా విడుదల చేశారు.

యుద్ధం ముగిసే సమయానికి కొలోసస్ కంప్యూటర్ ద్వారా హై గ్రేడ్ జర్మన్ సందేశాలకు సంబంధించిన 63 లక్షల అక్షరాలను డీక్రిప్ట్ చేశారు. ఇందుకోసం ఆ కంప్యూటర్లపై 550 మంది పనిచేశారు.

కొలోసస్ కంప్యూటర్

ఫొటో సోర్స్, CROWN COPYRIGHT

ఫొటో క్యాప్షన్, కొలోసస్ కంప్యూటర్ చిత్రాలు

కొలోసస్‌తో సాధించిన విజయాల్లో ప్రధానంగా చెప్పేది 1944 జూన్‌లో మిత్రరాజ్యాలు చేపట్టాల్సిన డి-డే ల్యాండింగ్స్ గురించి హిట్లర్‌కు తప్పుడు సమాచారం అందిందని ధ్రువీకరించుకోవడం.

ఫ్రాన్స్‌లోని నోర్మండీకి బదులుగా కలయిస్‌లో మిత్రరాజ్యాలు దాడులు చేస్తున్నాయని హిట్లర్‌కు తప్పుడు సమాచారం అందింది.

అదే యుద్ధంలో కీలకపరిణామం.

కొలోసస్ కంప్యూటర్లు యుద్ధంలో చాలామంది ప్రాణాలు కాపాడాయని చరిత్రకారులు చెప్తున్నారు.

కొలోసస్ కంప్యూటర్

ఫొటో సోర్స్, CROWN COPYRIGHT

ఫొటో క్యాప్షన్, కొలోసస్ కంప్యూటర్ గురించి వివరాలు ప్రపంచానికి దశాబ్దాల పాటు తెలియలేదు.

దశాబ్దాలపాటు చీకట్లోనే..

దాదాపు అరవై ఏళ్లుగా కొలోసస్ ప్రోగ్రామ్ గురించి గానీ, అలాంటి ఒక యంత్రం ఉందని గానీ బయట ప్రపంచానికి తెలీకుండా చరిత్ర కళ్లుగప్పారు.

ఈ యంత్రాన్ని రూపొందించిన ఇంజినీర్లు ప్రమాణం చేసినట్లే ఒక్క రహస్యాన్ని కూడా బయటకు చెప్పలేదు.

అసలు 2000 సంవత్సరం వరకు కూడా కొలోసస్ ఉనికిని యూకే ఇంటెలిజెన్స్ సర్వీస్ గుర్తించలేదు.

రెండో ప్రపంచ యుద్ధం అనంతరం పది కంప్యూటర్లలో ఎనిమిదింటిని ధ్వంసం చేశారు.

కొలోసస్‌ను డిజైన్ చేసిన ఇంజనీర్‌ టామీ ఫ్లవర్స్‌ను యంత్రానికి సంబంధించిన అన్ని పత్రాలను జీసీహెచ్‌క్యూకు అందజేయాలని ఆదేశించారు.

కొలోసస్ కంప్యూటర్

ఫొటో సోర్స్, CROWN COPYRIGHT

ఫొటో క్యాప్షన్, కొలోసస్ కంప్యూటర్ బ్లూప్రింట్‌లు కూడా జీసీహెచ్‌క్యూ విడుదల చేసింది.

కొలోసస్ కంప్యూటర్ ఉనికిని రహస్యంగా ఉంచే ప్రయత్నంలోనూ జీసీహెచ్‌క్యూ సఫలమైంది.

రెండో ప్రపంచ యుద్ధం అనంతరం 1960ల్లో మాజీ జీసీహెచ్‌క్యూ ఇంజినీర్ బిల్ మార్షల్ కొలోసస్ కంప్యూటర్‌ గురించి అడిగిన ప్రశ్నకు యుద్ధం సమయంలో దాని పాత్ర గురించి ఏమీ తెలీదని చెప్పారు.

నిజానికి కొలోసస్ కంప్యూటర్ కోసం పనిచేసిన ఇంజనీర్లలో ఆయన కూడా ఒకరు. అదే మాట చెప్పిన బిల్ మార్షల్ ఇప్పుడు, "కొలోసస్ కోసం పని చేసినందుకు చాలా గర్వంగా ఉంది "అన్నారు .

బ్లెట్‌చ్లీ పార్క్‌లో ఉన్న నేషనల్ మ్యూజియం ఆఫ్ కంప్యూటింగ్‌ ట్రస్టీల ఛైర్మన్ హెర్బర్ట్ మాట్లాడుతూ, “కొలోసస్ ఫొటోలను విడుదల చేయడం దాని ప్రభావాన్ని గుర్తు చేసుకునే సందర్భాన్ని మరోసారి కల్పించింది” అని అన్నారు.

"సాంకేతికత పరంగా చూస్తే కొలోసస్ కంప్యూటర్ ఇప్పటి ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్లకు ముందుతరం" అని చెప్పారు.

"కొలోసస్ కంప్యూటర్‌ను వినియోగించిన వారిలో చాలామంది యుద్ధం తరువాతి కాలంలో బ్రిటీష్ కంప్యూటింగ్‌లో గౌరవ ప్రదమైన, కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు" అని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)