అయోధ్య: రోడ్ల విస్తరణలో దుకాణాలు కోల్పోయిన వ్యాపారుల పరిస్థితేంటి?

- రచయిత, అనంత్ ఝణాణె
- హోదా, బీబీసీ ప్రతినిధి
బీబీసీ బృందం 2022లో అయోధ్యలో పర్యటించినప్పుడు రామ్ పథ్, భక్తి పథ్, జన్మభూమి పథ్ అనే మూడు రహదారుల విస్తరణ పనులు జరుగుతున్నాయి.
ఆ పనుల్లో భాగంగా కొన్ని దుకాణాలను పూర్తిగా తొలగించారు. మరికొన్ని దుకాణాలను పాక్షికంగా తొలగించారు. దుకాణదారుల్లో చాలా మంది ఎన్నో ఏళ్లుగా చిన్నచిన్న దుకాణాలను అద్దెకు తీసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. రోడ్ల నిర్మాణంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబ భవిష్యత్తు, వ్యాపారం ఏమవుతుందోనని ఆందోళన చెందారు.
రామ మందిరానికి వెళ్లే ఈ మూడు రోడ్లు ఇప్పుడు తయారయ్యాయి. అయోధ్యకు తరలిరానున్న భక్తుల కోసం మార్కెట్‌ను అలంకరించారు. రోడ్ల వెడల్పు పనులతో కుంచించుకుపోయిన దుకాణాలు మళ్లీ వ్యాపారాలు చేసుకునేందుకు అనువుగా సిద్ధమయ్యాయి.
మేము 2022లో కలిసిన దుకాణదారులను మరోసారి పలకరించాం. ప్రస్తుతం వాళ్ల పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశాం.

చాలా చిన్నవైపోయిన దుకాణాలు
2022లో గ్యాస్ అండ్ హార్డ్‌వేర్ దుకాణ యజమాని అభిషేక్ కుమార్ కసేరాను మేం కలిసినప్పుడు, రామ్ పథ్ విస్తరణ పనుల్లో ఆయన దుకాణంలో కొంతభాగాన్ని కూల్చివేస్తున్నారు.
తాను ఒక్కటే తెలుసుకోవాలనుకుంటున్నానని అభిషేక్ అన్నారు. ''రామ్ పథ్ విస్తరణ కోసం తీసుకున్న భూమిలో, మా జీవనోపాధి కోసం మిగిలి ఉన్న కొంతభూమిని అయినా తిరిగి తీసుకోవచ్చో? లేదో?''అని ఆయన అన్నారు.
ఏడాదిలో 10 అడుగుల వెడల్పు, 15 అడుగుల పొడవు ఉండే అభిషేక్ దుకాణం, 10 అడుగుల వెడల్పు, 5 అడుగుల పొడవుకి తగ్గిపోయింది. రామ మందిరం నిర్మితమైనందుకు ఆయన సంతోషం వ్యక్తం చేసినప్పటికీ, తన దుకాణం చిన్నదైనపోయినందుకు కొంత విచారం వ్యక్తం చేశారు. ఈ దుకాణం మీద వచ్చే ఆదాయంతోనే అభిషేక్ తండ్రి కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు. కోవిడ్ సమయంలో ఆయన చనిపోయారు. ఇప్పుడు ఆ వ్యాపారాన్ని అభిషేక్ కొనసాగిస్తున్నారు.
''ఏదైనా నిర్మించాలంటే, ఏదో ఒకటి చేయక తప్పదు. దేన్నైనా కూల్చేస్తే, అది మళ్లీ నిర్మితమవుతుంది. షాపులు కూల్చేయడంపై కోపం వచ్చింది, కానీ యోగి పాలనతో సంతోషంగా ఉన్నాం'' అని అభిషేక్ అభిప్రాయపడ్డారు.
తన తండ్రిని తలుచుకుంటూ అభిషేక్ ఇలా అన్నారు. ''నాన్న ఉన్నప్పుడు, మనకు అన్నీ ఉన్నట్టే. ఇప్పుడుగానీ ఈ చిన్న దుకాణాన్ని చూసి ఉంటే, మా నాన్న చనిపోయేవారు. ఆయన మొదటి నుంచి చాలా కష్టపడ్డారు. పైరుకు నీళ్లు పెట్టి పండించిన పొలం, కోతలు వచ్చే సరికి ఆయన లేరు.''

ప్రభుత్వంపై కోపంగా ఉన్న కమలా దేవి
కమలా దేవి కుటుంబం నడుపుకుంటున్న దుకాణాన్ని కూడా 2022 నవంబర్‌లో కూల్చేశారు. ఆ సమయంలో ఆమె ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు నష్టపరిహారం వద్దని, అందుకు బదులుగా మరో దుకాణం ఇవ్వాలన్నారు.
ఏడాది కిందట మేం ఆమెను కలిసినప్పుడు కొన్ని ప్రశ్నలు సంధించారు. ''మేం ఎక్కడికెళ్లాలి? లక్ష రూపాయల(ప్రభుత్వ నష్టపరిహారం)కి ఏమొస్తుంది? లక్ష రూపాయలతో మీరు ఒక పిల్లర్‌ను కూడా కట్టలేరు. కూలీకే లక్ష రూపాయలు అవుతుంది. ఈ డబ్బులు ఏం చేసుకుంటాం? మాకు డబ్బులొద్దు, షాప్ కావాలి.'' అన్నారు.
2024 జనవరికి కమలాదేవి దుకాణం కూడా విస్తరణ పనుల్లో కొంతభాగం కోల్పోయి చిన్నదైపోయింది. అయితే దుకాణం యజమానితో వివాదం కారణంగా ఆమె ఇప్పటికీ ఆ దుకాణాన్ని పూర్తి చేయలేకపోయారు. ప్రభుత్వం నుంచి లక్ష రూపాయల సాయం అందుకున్నారు కానీ, అది ఆమె కోపాన్ని తగ్గించలేదు.
''మేం ఇప్పటికీ కోపంగా ఉన్నాం. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. అలాగని చచ్చిపోలేం, బతకడానికి పరిస్థితులు సహకరించడం లేదు'' అని ఆమె అన్నారు.
ఇప్పుడు రామ మందిర నిర్మాణం పూర్తయింది, ఇకపై అయోధ్యంలో ఆనందంగా ఉండొచ్చని కమలాదేవితో అన్నప్పుడు ఆమె ఇలా అన్నారు. ''గుడి కట్టినందుకు చాలా సంతోషం. ఎప్పుడో ఒకప్పుడు టైమొస్తుంది. దేవుడు ఆలయంలో ఆసీనులవుతారని మేము కూడా అనుకున్నాం. అయితే, మనం వస్తే జనం నిరాశ్రయులు అవుతారని రాముడు మోదీకి, యోగీకి చెప్పలేదు. అయితే, ఇది రాముడి మాట కాదా? మనం వస్తే, ప్రజలు సంతోషంగా ఉంటారని రాముడు చెప్పాడు'' అన్నారు.

వివాదాల కారణంగా నిర్మాణాలు జరగని కొన్ని దుకాణాలు
అయోధ్యలోని రామ్ పథ్ వెంబడి ఉండే బాబు బజార్‌లో కొంతమంది తరతరాలుగా షాపులు అద్దెకు తీసుకుని వ్యాపారాలు చేసేవారు. ప్రస్తుతం వారికి దుకాణాల యజమాని, అయోధ్య రాజుతో వివాదం నడుస్తోంది.
దుకాణదారులకు, యజమానులకు మధ్య వివాదం కొనసాగుతున్నప్పటికీ వ్యాపారులను అక్కడి నుంచి పంపించలేదు. దుకాణాలు నడుస్తున్నాయి, వారి జీవనోపాధికి ఎలాంటి ఢోకా లేదని అయోధ్య జిల్లా యంత్రాంగం చెబుతోంది.
''ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు దుకాణదారులతో కలిసి అయోధ్య రాజాతో మాట్లాడేందుకు ప్రయత్నించాం కానీ, ఇంకా పరిష్కారం కాలేదు. వారి దుకాణాలు ఇంకా శిథిలాల కిందే ఉన్నాయి. దుకాణాల బయటివైపు మరమ్మతులు చేయించేందుకు సిద్ధంగానే ఉన్నప్పటికీ యజమానికీ, దుకాణదారులకూ మధ్య వివాదం కారణంగా అది కుదరలేదు'' అని అధికారులు అంటున్నారు.
బాధిత దుకాణదారులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

అయోధ్యలో మూడు రోడ్ల నిర్మాణ ప్రాజెక్ట్
అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో పాటు, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు 2022 నుంచి పనులు జరుగుతున్నాయి.
అందులో భాగంగా 13 కిలోమీటర్ల పొడవైన రామ్ పథ్, 800 మీటర్ల పొడవైన భక్తి పథ్, 800 మీటర్ల పొడవైన జన్మభూమి పథ్ రహదారుల విస్తరణ పనులు జరిగాయి.
రామ మందిరానికి వెళ్లే ఈ మూడు రహదారుల విస్తరణ కోసం ఆయా మార్గాల్లో ఉన్న దుకాణాలు కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరికొన్నింటిని పూర్తిగా తొలగించారు. ఈ మూడు రోడ్ల విస్తరణ పనుల ప్రభావం దాదాపు 4,700 మందిపై పడినట్లు అయోధ్యకు చెందిన వ్యాపార సంఘాల నేతలు చెబుతున్నారు.
బాధిత కుటుంబాలకు మెరుగైన నష్టపరిహారం అందించాలని, పాక్షికంగా దెబ్బతిన్న దుకాణాల పునర్నిర్మాణం, పూర్తిగా దుకాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం కొత్తగా నిర్మించిన దుకాణాలను కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

బాధలో భగవత్ ప్రసాద్ పహాడీ
భగవత్ ప్రసాద్ పహాడీ, ఆయన కుటుంబ సభ్యులు1985 నుంచి రామ్ లల్లా దుస్తులు కుట్టేవారు. అప్పట్లో రామ్ లల్లా విగ్రహం బాబ్రీ మసీదు గుమ్మటం కింద ఉండేది. గతంలో రామ్ లల్లా వస్త్రాలు కుట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆర్డర్లు వచ్చేవి. కానీ, ఇప్పుడు అయోధ్యలో దర్శనానికి వచ్చే భక్తులు మాత్రమే ఆర్డర్లు ఇస్తున్నారు.
భగవత్ ప్రసాద్ కుటుంబం అద్దెకు తీసుకుని నడుపుతున్న మూడు దుకాణాలను రామ్ పథ్ విస్తరణలో భాగంగా పూర్తిగా తొలగించారు. ఇప్పుడు రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ జరగడం వారికి సంతోషంగా కలిగించినప్పటికీ, తమ దుకాణాలాను కోల్పోయామనే బాధ కూడా వారిలో ఉంది.
''నాకు రామ్ పథ్ రోడ్డులో మూడు దుకాణాలు ఉండేవి. నాకు మూడు లక్షల పరిహారం వచ్చింది. ప్రభుత్వం రెండు దుకాణాలు కేటాయించింది. వాటి విలువ దాదాపు రూ.35 లక్షలు. మాకు చాలా నష్టం జరిగింది, కానీ ఇప్పుడు సంతోషం. అందువల్ల మనం రామ్ లల్లాకు ప్రతిష్ఠాపనకు సహకరిస్తాం. ఈ మందిర నిర్మాణం కోసం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, గుడి నిర్మాణం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. మన యోగీ, మోదీ కష్టపడేతత్వం ఉన్న వ్యక్తులు. వారిని అవతార పురుషులుగా చెప్పొచ్చు. వారి హయాంలోనే రాముడి వైభవం పెరిగింది. ఆలయం నిర్మిస్తున్నారు, మేం చాలా సంతోషంగా ఉన్నాం'' అని ఆయన బీబీసీతో చెప్పారు.
చివర్లో ఆయన, "కానీ, దేనివల్ల తినడానికి తిండి దొరికేదో, దాన్ని లాగేసుకున్నారు" అన్నారు.

లీజుకు, బ్యాంకు రుణాలకు కొత్త దుకాణాలు
ప్రభుత్వం కేటాయించిన రెండు కొత్త దుకాణాల ఆర్డర్ కాపీలను భగవత్ ప్రసాద్ చూపించారు. లక్షల విలువ చేసే ఈ షాపులను 30 ఏళ్లపాటు లీజు ప్రాతిపదికన పొందేందుకు బ్యాంకు రుణం కోసం వారు ప్రయత్నిస్తున్నారు.
రోడ్డు విస్తరణ పనుల సందర్భంగా భగవత్ ప్రసాద్ తరహాలో అద్దె దుకాణాలు నడుపుకుంటున్న 212 మంది దుకాణాలు పూర్తిగా తొలగించామని, వారికి కొత్త షాపులు కేటాయించినట్లు అయోధ్య అధికారులు చెబుతున్నారు.
''వాళ్లు దుకాణాల మార్కెట్ ధర చెల్లించాల్సిన పని లేదు. కానీ, కనీస ధర చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, ఆ షాపుల విలువ రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలు. కానీ కొన్ని షాపుల కనీస ధర రూ.13 లక్షల నుంచి రూ.14 లక్షలు మాత్రమే'' అని అధికారులు అంటున్నారు.
ప్రభుత్వ దుకాణాల కేటాయింపు పత్రాలు అందుకున్న వ్యాపారులు బ్యాంకు రుణాలు పొందేందుకు కూడా పూర్తి సహకారం అందిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
దుకాణాల 30 ఏళ్ల లీజు అయిపోయిన తర్వాత మళ్లీ ఫీజు చెల్లించి లీజును కొనసాగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే, దుకాణాలు ఎప్పటికీ తమకే చెందేలా విక్రయాలు జరపాలని దుకాణాలు కోల్పోయిన వ్యాపారులు కోరుతున్నారు.
అయోధ్యలో షాపు యజమాని, ఆ షాపు నిర్మించిన వ్యక్తి, ఆ షాపులో వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి అందరూ ఆ దుకాణంపై తమకు హక్కు ఉందని వాదిస్తారు. అందువల్ల అభివృద్ధి పనుల కోసం అయోధ్యలో భూమిని సేకరించడం సవాల్‌గా మారింది.
అయితే, ఈ దుకాణదారులు ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడే స్థిరపడ్డారు. వారి భవిష్యత్తు, ఆశలు కూడా అయోధ్య అభివృద్ధితోనే ముడిపడి ఉన్నాయి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగినందుకు వారిలోనూ సంతోషం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- యూఏఈలో రిపబ్లిక్ డే కార్యక్రమానికి తాలిబాన్ రాయబారిని భారత్ ఆహ్వానించడంపై వివాదమేంటి?
- పిల్లల స్కూల్ ఫీజులు, ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం ఆదాయం పెంచుకొనే మార్గాలు ఇవీ
- బలూచిస్తాన్: పాకిస్తాన్, ఇరాన్‌లకు టార్గెట్‌గా మారిన ఈ ప్రాంతం ఎక్కడుంది? దీని చరిత్ర ఏమిటి
- గర్భవతులను చేసే జాబ్: ‘మహిళతో ఒకరాత్రి గడిపితే రూ.5 లక్షలు, ఆమె ప్రెగ్నెంట్ అయితే రూ.8 లక్షల గిఫ్ట్...’అంటూ సాగే ఈ స్కామ్ కథ ఏంటి?
- అమరావతి-ఈశ్వరన్: స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగపూర్ మంత్రికి, ఏపీకి సంబంధమేంటి ?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














