ఈ ఎనిమిది కాళ్ల వింత జీవి ఎలాంటి గడ్డు పరిస్థితులనైనా తట్టుకుని జీవిస్తుంది... ఏమిటి దీని బలం?

ఫొటో సోర్స్, Getty Images
బొద్దుగా, వింతగా, భయానకంగా కనిపించే టార్డిగ్రేడ్స్ ఏళ్ల తరబడి పరిశోధకులలో ఆసక్తి రేపుతున్నాయి.
మిల్లీమీటర్ కంటే తక్కువ సైజులో ఉండే ఈ ఎనిమిది కాళ్ల వింత జీవి ప్రపంచంలో ప్రతీ చోటా కనిపిస్తుంది. వాటర్ బేర్ అంటే ‘నీటి ఎలుగుబంటి’ అని పిలిచే ఈ జీవి తీవ్రమైన వాతావరణ, భౌగోళిక, భౌతిక పరిస్థితులను ఎదుర్కొని జీవించగలదు.
ఆక్సిజన్ లేకున్నా, నీరు లేకున్నా, భయంకరమైన ఎండలు, ఎముకలు కొరికే చలిలోనూ, సూర్యుడి కిరణాలు నేరుగా తాకినా కూడా వీటికి ఏమి కాదు. దీర్ఘ సుప్త చేతనావస్తలోకి జారిపోవడం ద్వారా ఈ జీవి తనను తాను కాపాడుకోగలదు.
వీటికున్న ప్రత్యేకత వల్ల, ఇవి 600 మిలియన్ సంవత్సరాల నుంచి భూమి మీద నివశిస్తున్నాయి. భూమి మీద వచ్చిన ఐదు యుగాంతాలను తేలిగ్గా తప్పించుకున్నాయి.
ఇవి ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని జీవించడం వెనుక వీటిలో కణజాలపు సెన్సర్ కారణమని పరిశోధకుల బృందం గుర్తించింది. గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు నీటి భల్లూకాలు ఈ స్విచ్ ఆన్ చెయ్యడం ద్వారా సుప్త చేతనావస్థలోకి జారిపోతాయి.
వీటి శరీరంలో ఉండే ఈ కణజాలపు సెన్సర్ వాతావరణంలో అపాయకరమైన పరిస్థితులను గుర్తిస్తుంది. ఆ పరిస్థితుల నుంచి బయట పడేందుకు ఎప్పుడు నిద్రాణంగా ఉండాలో, ఎప్పుడు మేల్కోవచ్చనే దాని గురించి టార్టిగ్రేడ్లకు సంకేతాలు పంపుతుంది.
అమెరికాలోని మార్షల్ యూనివర్సిటీ పరిశోధకుడు డెర్రెక్ ఆర్జే కొల్లింగ్, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా పరిశోధకురాలు లెస్లీ ఎం. హిక్స్ అధ్యయనంలో ఈ అంశం వెల్లడైంది. వీరి పరిశోధనను అమెరికాలోన ప్లొస్ వన్ జర్నల్‌లో ప్రచురించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
రహస్యాలను కనుక్కునే ప్రయోగం
టార్డిగ్రేడ్ల శరీరంలో ఉండే మెకానిజం అర్థం చేసుకునేందుకు పరిశోధకులు వాటిని గడ్డకట్టించే చలిలో, ఆక్సిజన్ అధికంగా ఉండే నీటిలో, ఉప్పు, చక్కెర ఉన్న నీటిలో ఉంచారు.
విపరీతమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ జీవిలోని ఫ్రీ రాడికల్స్ అని పిలిచే కణాలు హానికరమైన అణువులను ఉత్పత్తి చేస్తున్నాయి.
ఈ ఫ్రీ రాడికల్స్ తర్వాత ఇతర కణజాలంతో కలుస్తున్నాయని హిక్స్ న్యూ సైంటిస్ట్ మేగజైన్‌తో చెప్పారు. అలా ఇవి ఇతర కణజాలంతో కలిసినప్పుడు ప్రొటీన్లలోని ప్రాథమిక బాగాల్లో ఒకటైన సిస్టీన్ అనే ఎమినో యాసిడ్లను కాల్చేస్తున్నాయి గుర్తించారు.
ఈ ప్రతి చర్య వల్ల ప్రొటీన్లు వాటి రూపు, పని తీరు మార్చుకుంటాయి. నిద్రాణ స్థితిలోకి జారి పోవాలని శరీరానికి సందేశం పంపుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
వీటి శరీరంలో సిస్టైన్ విడుదల కాకుండా పరిశోధకులు కొన్ని రసాయనాలను ప్రయోగించారు. దీని వలన ఈ నీటి భల్లూకాలు ఫ్రీ రాడికల్స్‌ను గుర్తించడంలో విఫలం అయ్యాయి. దీంతో అవి నిద్రాణ స్థితిలోకి జారుకోలేకపోయాయి.
“సిస్టైన్ నియంత్రిత సెన్సర్ మాదిరిగా పని చేస్తుంది” అని హిక్స్ చెప్పారు. “దీని కారణంగా టార్డిగ్రేడ్స్ తమ చుట్టు ఉన్న పరిస్థితులను గ్రహించడానికి, ఒత్తిడికి అనుగుణంగా ప్రతిస్పందించడానికి అనుమతిస్తుంది” అని అయన అన్నారు.
బాహ్య పరిస్థితులు మెరుగుపడినప్పుడు, సిస్టైన్ అక్సీకరణం కాలేదని గుర్తిస్తాయి. దీంతో టార్డిగ్రేడ్లు నిద్రాణ స్థితి నుంచి బయటపడతాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాటర్ బేర్స్ తమ స్థితిని మార్చుకుని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిస్టైన్ అక్సీకరణం చెందడం అనేది కీలక నియంత్రణ వ్యవస్ఝగా ఉందని పరిశోధనలో తేలింది.
వృద్ధాప్యం, అంతరిక్ష ప్రయాణంలో శరీరంలో కలిగే మార్పుల గురించి తెలుసుకునేందుకు తమ పరిశోధన దీర్ఘకాలంలో ఉపయోగపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.
ఈ రెండు సందర్భాల్లోనూ ఫ్రీ రాడికల్స్ కణజాలానికి నష్టం కలిగిస్తున్నాయి. డీఎన్ఏ, ప్రొటీన్ లాంటి వాటిని పాడు చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్లో మంచు కురవని శీతాకాలం ఎప్పుడైనా చూశారా... ఈ ఏడాదే ఎందుకిలా?
- అయోధ్య: ‘దివ్యాంగ మందిరంలో సకలాంగుడైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ధర్మవిరుద్ధం’ -శంకరాచార్య అవిముక్తేశ్వరానంద
- సచిన్ తెందూల్కర్: డీప్‌ఫేక్ బారిన పడిన భారత క్రికెట్ దిగ్గజం, కూతురుతో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నట్లుగా వీడియో వైరల్...
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














