ఆంధ్రప్రదేశ్: ఎస్సీ, ఎస్టీ స్థానాల్లోనే వైఎస్సార్సీపీ భారీ మార్పులెందుకు

వైఎస్ జగన్

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGAN

ఫొటో క్యాప్షన్, వైఎస్సార్సీపీ దశలవారీగా విడుదల చేసిన నియోజకవర్ ఇంచార్జుల జాబితాలపై రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

పాలక వైఎస్సార్సీపీ ఇప్పటివరకు ప్రకటించిన నియోజకవర్గ ఇంచార్జిల జాబితాలను పరిశీలిస్తే మెజారిటీ రిజర్వ్‌డ్ సీట్లలో మార్పులు కనిపించాయి.

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వైఎస్సార్సీపీ అనేక నియోజకవర్గాల్లో ఇంచార్జులను మారుస్తోంది.

ఒక నియోజవర్గ అభ్యర్థిని మరొక చోటుకు పంపించడం, కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకపోవడం వంటి మార్పులు చేస్తోంది.

ఇప్పటి వరకు 58 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులను మార్చారు. అందులో 23 ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలున్నాయి.

ఇలా ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో అభ్యర్థులను మార్చడంపై ఆ పార్టీలో విమర్శలు వస్తున్నాయి. ఆయా స్థానాల్లో ‘పెత్తనం’ చెలాయించే పెద్ద రాజకీయ నేతలు, రాజకీయంగా బలం ఉన్న కులాలకు చెందిన నాయకులకు నచ్చకపోవడం వల్లే ఈ మార్పులు జరుగుతున్నాయనే ప్రధాన విమర్శ ఉంది.

‘నియోజకర్గంలోని పెద్ద రెడ్లు చెప్పినట్లుగా నేను చేసినప్పటికీ నన్ను పక్కన ఎందుకు పెట్టారు?’ అని పూతలపట్టు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆరోపించడం ఇలాంటి విమర్శలకు ఊతమిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 29 ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలున్నాయి.

2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అందులో 27 స్థానాలను గెలిచింది. ఆ 27 స్థానాలలో 20 సీట్లకు సంబంధించి ఇప్పటివరకు మార్పులు జరిగాయి.

రాష్ట్రంలోని 7 ఎస్టీ స్థానాలు ఉండగా 2019లో వైఎస్సార్పీపీ అన్ని సీట్లనూ గెలుచుకుంది. వాటిలో ఇప్పటి వరకు 3 స్థానాల్లో మార్పులు చేశారు.

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి

ఫొటో సోర్స్, FB/Byreddy Siddharth Reddy

‘‘ఎమ్మెల్యే ఎవరైనా అధికారం వారి చేతిలోనే’’

‘ఎస్సీ సర్పంచులు ఉన్న చోట పెత్తనం ఇతర కులాల వారి చేతుల్లో ఉండటం నేటికీ గ్రామాల్లో కనిపిస్తుంది. ఉప సర్పంచుగా ఉన్న నాయకులు అధికారాన్ని చెలాయిస్తూ ఉంటారు. ఎమ్మెల్యేల విషయంలోనూ అలాంటి పరిస్థితి ఉంది’ అని ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ జి.ప్రియాంక అన్నారు.

ఎస్సీ, ఎస్టీ నేతల్లో చైతన్యం పెరుగుతుండడంతో అధికారం, నిధుల వినియోగం విషయంలో ఎమ్మెల్యేలకు, స్థానికంగా ఉండే ‘పెత్తందారీ’ కులాల నాయకులకు మధ్య విభేదాలు తలెత్తడంతోనే ఇలాంటి మార్పులు జరుగుతుంటాయని ఆమె అభిప్రాయపడ్డారు.

"ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు సీట్లలో గెలిచిన ఎమ్మెల్యేలు సైతం గతంలో పాలకపార్టీ నేతల కనుసన్నల్లో ఉండేవారు. ఇటీవల విద్యావంతులు ఎక్కువగా ఎన్నికవుతున్నారు. వారు కొంత తమ హక్కుల కోసం ప్రయత్నించడం ఆయా పార్టీల్లో ఉండే కీలక నేతలకు గిట్టడం లేదు.

నందికొట్కూరు మాత్రమే కాదు.. దాదాపుగా అన్ని రిజర్వుడు సీట్లలో షాడో ఎమ్మెల్యేల మాదిరిగా వ్యవహరించే నాయకులు ఉన్నారు. అలా ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యే మధ్య దూరం పెరుగుతున్న కారణంగా ఎమ్మెల్యేగా ఉన్న వారిని పక్కన పెట్టేసి కొత్త నేతకు టికెట్లు ఇస్తున్నారు" అని ప్రియాంక అభిప్రాయపడ్డారు.

‘టీడీపీ ఎస్సీ మంత్రుల సీట్లు కూడా మార్చేసింది’

‘‘ప్రధాన పార్టీలలో ఇలాంటి ధోరణి ఉంది. గత ఎన్నికల్లో అప్పటికి అధికారంలో ఉన్న టీడీపీ తమ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఎస్సీ నేతలను సీట్లు మార్చి పోటీ చేయించింది. సామాజిక స్థితిగతుల్లో మార్పు రాకుండా ఇలాంటివి పూర్తిగా సమసిపోయే అవకాశాలు చాలా తక్కువ’’ అని ఆమె అన్నారు.

2014 ఎన్నికల్లో టీడీపీ కూడా ఎస్సీ రిజర్వుడు సీట్లలో ఇలాంటి మార్పులు చేసింది.

అప్పట్లో మంత్రిగా ఉన్న కేఎస్ జవహర్‌ను కృష్ణా జిల్లా తిరువూరుకి మార్చారు.

విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి ప్రాతినిథ్యం వహించిన వంగలపూడి అనితను కొవ్వూరుకు పంపించారు.

ఆర్ధర్, ఎమ్మెల్యే

ఫొటో సోర్స్, FB/Toguru Arthur MLA

‘పవర్ లేని పదవులు వద్దన్నాను’

పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తొలుత తన అసహనాన్ని ప్రదర్శించారు. తాను పూర్తిగా నియోజకవర్గంలోని పెద్ద రెడ్లు చెప్పినట్టుగానే చేసినా, తనను పక్కన పెట్టడం ఏమిటంటూ ఆయన ప్రశ్నించారు. ఆ తర్వాత పార్టీ నేతలు బుజ్జగించడంతో తన మాటలు వక్రీకరించారని చెప్పుకొచ్చారు.

చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కూడా అధినేత నిర్ణయాన్ని తప్పుబట్టారు. తాను కరోనా సమయంలో కూడా నియోజకవర్గంలో కష్టపడి పనిచేసినప్పటికీ తనను బలిపశువు చేశారంటూ విమర్శించారు.

నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ తీవ్రంగా స్పందించారు.

శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి, ఆయన వర్గీయుల కారణంగానే తనకు సీటు దక్కలేదని ఆయన ఆరోపించారు.

"మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా నాకు కూడా పవర్ ఉండాలని కోరుకున్నాను. పవర్ లేని పదవులతో ప్రయోజనం ఏముంది. నమ్ముకున్న వారికి ఏమీ చేయలేని స్థితి నాకెందుకు. అందుకే అలాంటి పదవి నాకు వద్దని చెప్పాను. ఎస్సీ రిజర్వుడు సీటు కావడంతో ఇన్‌చార్జి పేరుతో వాళ్లకు ఇష్టమైనట్లుగా చేస్తుంటారు.

ఓటర్లు గెలిపించినప్పటికీ ఎమ్మెల్యేగా పవర్ ఉపయోగించుకునే అవకాశం మాత్రం దక్కడం లేదు. అలాంటప్పుడు మేమెందుకు? నియోజకవర్గంలో నేను పేరుకే ఎమ్మెల్యేగానే మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు" అని బీబీసీతో ఎలీజా అన్నారు.

ఇలా ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో వైఎస్సార్సీపీ చేస్తున్న మార్పులతో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. కొందరు ఇతర పార్టీలతో టచ్‌లోకి వెళ్తున్నారు.

రిజర్వ్‌డ్ సీట్లు దాదాపుగా వైఎస్సార్సీపీవే

2019 ఎన్నికల్లో రిజర్వుడు సీట్లలో ఓటర్లు వైఎస్సార్సీపీకి పట్టంగట్టారు.

కేవలం రెండు స్థానాలు మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ సీట్లు ఆ పార్టీ ఖాతాలో పడ్డాయి. రాష్ట్రంలో 29 ఎస్సీ రిజర్వుడు సీట్లున్నాయి.

వాటిలో 27 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు.

ప్రకాశం జిల్లా కొండెపిలో టీడీపీ, కోనసీమ జిల్లాలోని రాజోలులో జనసేన గెలిచాయి.

ఆ తర్వాత రాజోలు ఎమ్మెల్యే రాపాక జగన్‌కు జై కొట్టారు. దాంతో ప్రస్తుతం ఒక్క కొండెపి స్థానం తప్ప మిగిలిన ఎస్సీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలంతా వైఎస్సార్సీపీలోనే ఉన్నారు. ఎస్టీ స్థానాల్లో ఏడుకు ఏడు వైఎస్సార్సీపీ ఖాతాలోనే పడ్డాయి.

కొండేటి చిట్టిబాబు, ఎమ్మెల్యే

ఫొటో సోర్స్, KONDETI CHITTIBABU/FB

ఉత్తరాంధ్ర నుంచి గోదావరి జిల్లాల వరకు

ఎస్సీ రిజర్వ్‌డ్ సీట్లలో ఇప్పటివరకు ప్రకటించిన జాబితాలో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులుకి స్థానభ్రంశం కలిగింది.

ఆయన విజయనగరం జిల్లా నుంచి రెండు జిల్లాల ఆవల అనకాపల్లి జిల్లాలో ఉన్న పాయకరావుపేటకు మారాల్సి వచ్చింది.

ఆయన స్థానంలో తలే రాజేష్ అనే కొత్త నేతకు బాధ్యతలు అప్పగించారు. పాలకొండ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తలే భద్రయ్య కుమారుడు తలే రాజేశ్.

పాయకరావుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గొల్ల బాబూరావుని ప్రస్తుతానికి పక్కన పెట్టారు. త్వరలో జరగబోతున్న రాజ్యసభ ఎన్నికల్లో ఆయనకు అవకాశం ఇస్తారనే ప్రచారం సాగుతోంది.

బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు స్థానంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్‌కి అవకాశం ఇచ్చారు.

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హోం మంత్రి తానేటి వనితకు కూడా మార్పు తప్పలేదు.

ఆమె కొవ్వూరు నుంచి సమీపంలోనే ఉన్న గోపాలపురానికి మారాల్సి వచ్చింది. గతంలో ఆమె అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు.

గోపాలపురం సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి వెంకటేశ్వర రావుని కొవ్వూరుకి మార్చారు.

ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఉనమట్ల ఎలీజా స్థానంలో కుంభా విజయరాజుకి అవకాశం ఇచ్చారు. ఎలీజాకు ఎక్కడా అవకాశం దక్కలేదు.

మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే

ఫొటో సోర్స్, FB/Mekathoti Sucharitha

మధ్య కోస్తాలో..

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రక్షణనిధి స్థానంలో ఇటీవల పార్టీలో చేరిన మాజీ టీడీపీ నేత నల్లగట్ల స్వామిదాస్‌కి అవకాశం ఇచ్చారు.

గుంటూరు జిల్లాలోని రాజధాని నియోజకవర్గం తాడికొండలో మాజీ హోం మంత్రి మేకతోటి సుచరితకు అవకాశమిచ్చారు.

అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మొన్నటి శాసన మండలి ఎన్నికల నాటి నుంచి వైఎస్సార్సీపీకి దూరంగా ఉన్నారు.

అదే జిల్లాకు చెందిన ప్రత్తిపాడు నుంచి మూడు మార్లు గెలిచిన సుచరిత స్థానంలో విజయవాడకు చెందిన ఆర్కిటెక్ట్ బాలసాని కిరణ్ కుమార్‌కి బాధ్యతలు అప్పగించారు.

బాపట్ల జిల్లా వేమూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి మేరుగ నాగార్జునను సంతనూతలపాడుకి పంపించారు. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న టీజేఆర్ సుధాకర్ బాబుని ప్రస్తుతం పక్కనబెట్టారు.

వేమూరుకి ప్రకాశం జిల్లా కొండెపి నుంచి వరికూటి అశోక్ బాబుని కేటాయించారు. కొండెపి నియోజకవర్గానికి మంత్రి ఆదిమూలపు సురేష్‌ని ఇన్‌చార్జి చేశారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో తటవర్తి చంద్రశేఖర్ అనే కొత్త నేతకు అవకాశమిచ్చారు.

జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్యే

ఫొటో సోర్స్, FB/Jonnalagadda Padmavathy

రాయలసీమ జిల్లాల్లో..

తిరుపతి జిల్లాలోని గూడూరు స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్‌కి అవకాశం ఇవ్వలేదు. గతంలో ఆయన తిరుపతి ఎంపీగానూ పనిచేశారు. ఆయన స్థానంలో మేరిగ మురళికి ఇన్‌చార్జి హోదా ఇచ్చారు.

కర్నూలు జిల్లా నందికొట్కూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్‌ స్థానంలో కడప జిల్లాకు చెందిన డాక్టర్ సుధీర్ దారా అనే కొత్త నేతను తెరమీదకు తెచ్చారు.

కోడుమూరు స్థానంలో మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు ఆదిమూలపు సతీష్‌కి అవకాశం దక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌కి చోటు దక్కలేదు.

అనంతపురం జిల్లా శింగనమల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి స్థానంలో ఎం.వీరాంజనేయులుకి అవకాశం దక్కింది. ఆయన గతంలో స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహించారు.

హిందూపురం జిల్లా మడకశిరలో సీనియర్ నేత తిప్పేస్వామికి అవకాశం దక్కలేదు. కొత్తగా ఈర లక్కప్ప అనే మాజీ సర్పంచ్‌కి అవకాశం దక్కింది.

చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి చిత్తూరు ఎంపీ సీటు కేటాయించడంతో సొంత సీటు ఖాళీ చేయాల్సి వచ్చింది.

ఆయన స్థానంలో చిత్తూరు ఎంపీగా ఉన్న ఎన్ రెడ్డప్పకు అవకాశమిచ్చారు. అదే జిల్లాలోని సత్యవేడు స్థానంలో తిరుపతి ఎంపీ ఎం.గురుమూర్తికి అవకాశం ఇచ్చారు.

సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలం తిరుపతి ఎంపీ స్థానానికి ఇన్‌చార్జిగా నియమితులయ్యారు.

పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకి చోటు దక్కలేదు. ఆయన స్థానంలో మూతిరేవలు సునీల్ కుమార్‌కి అవకాశం వచ్చింది.

చెట్టి పాల్గుణ, ఎమ్మెల్యే

ఫొటో సోర్స్, FB/Mla Chetti Palguna

ఎస్టీ సీట్లలో సైతం..

వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన 27 మంది, జగన్‌కు జైకొట్టిన జనసేన ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 28 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ తరఫున ఉన్నారు.

వారిలో ఇప్పటివరకు 20 స్థానాలకు ఇన్‌చార్జులను ప్రకటించగా, వారిలో ఆరుగురు సిట్టింగులకు పక్కన పెట్టేశారు. మిగిలిన 14 మందికి నియోజకవర్గాలను మార్చారు.

ఇక ఇప్పటి వరకూ మార్పులు, చేర్పులు ప్రకటించని ఎస్సీ స్థానాలు 8 ఉన్నాయి.

ఎస్సీ మంత్రుల్లో పినిపే విశ్వరూప్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురం సీటు విషయంపై ఇంకా ప్రకటన రాలేదు. ఆయన స్థానంలో కుమారుడికి గానీ, అమలాపురం ఎంపీగా ఉన్న చింతా అనురాధకు గానీ చాన్స్ ఉంటుందనే ప్రచారం సాగుతోంది.

ఇక మిగిలిన సీట్లలో పార్వతీపురం, రాజోలు, నందిగామ, పామర్రు, సూళ్ళూరుపేట, బద్వేల్, రైల్వే కోడూరు స్థానాలపై కూడా స్పష్టత రాలేదు.

ఎస్టీ రిజర్వుడు సీట్లలో ఇప్పటికే అరకు ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిని అరకు అసెంబ్లీ ఇన్‌చార్జిగా ప్రకటించారు.

అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చెట్టి పాల్గుణకు అవకాశం ఇవ్వలేదు.

పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని అరకు ఎంపీ సీటుకి ఇన్‌చార్జిని చేశారు. ఆమె స్థానంలో మత్సరాస విశ్వేశ్వర రాజుకి చోటు దక్కింది.

పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో సీనియర్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానంలో ఆయన భార్య రాజ్యలక్ష్మికి ఇన్‌చార్జి హోదా ఇచ్చారు.

మొత్తం ఏడు ఎస్టీ కేటగిరీ సీట్లకు గానూ ముగ్గురు ఇన్‌చార్జులు మారిపోయారు. మరో నలుగురి విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

బొత్స సత్యనారాయణ, మంత్రి

ఫొటో సోర్స్, ANI

సిట్టింగులను మార్చడం ఇదే తొలిసారి కాదు: మంత్రి బొత్స

"అన్ని సీట్లు గెలవాలని పట్టుదలగా ఉన్నాం. దానికోసం కొన్ని మార్పులు తప్పవు. కొన్ని నెలల పాటు అందరినీ హెచ్చరిస్తూ వచ్చాం. సానుకూలంగా లేని చోట సర్దుబాట్లు చేస్తాం. దానిని విమర్శిస్తే పట్టించుకోం'' అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

''2019ఎన్నికల్లో పోటి చేసిన వాళ్లందరినీ ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా పోటీలో పెట్టడం లేదు కదా. సీటు రాని వాళ్ళు చేసే విమర్శలు పట్టించుకోం. అధినేత అభిప్రాయాన్ని గౌరవించిన నేతలకు తగిన రీతిలో అవకాశం ఉంటుంది " అన్నారాయన.

సిట్టింగ్ సీట్లు మార్చడం ఇదే తొలిసారి కాదని మంత్రి వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)