హరిద్వార్: క్యాన్సర్ బాధిత చిన్నారిని తల్లి గంగా నదిలో ముంచి చంపేశారంటూ వీడియో వైరల్, అసలేం జరిగింది?

హరిద్వార్

ఫొటో సోర్స్, RAJESH DOBRIYAL

ఫొటో క్యాప్షన్, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
    • రచయిత, రాజేశ్ డోబ్రియాల్
    • హోదా, బీబీసీ హిందీ కోసం

ఒక మహిళ హరిద్వార్‌లో గంగా నదిలో కొడుకును ముంచి చంపేశారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

'హర్ కీ పౌడీ' వీడియోగా పిలిచే ఈ వీడియోలో సదరు మహిళ ఆ పిల్లాడిని నీటిలో ముంచుతున్నట్లుగా ఉంది. ఆమె పక్కన ఇద్దరు పురుషులు కూడా ఉన్నారు.

కొద్ది నిమిషాల తర్వాత ఘాట్‌‌లో ఉన్న కొందరు వ్యక్తులు బలవంతంగా పిల్లాడిని బయటకు తీయగా, అచేతనంగా కనిపించాడు. దీంతో పిల్లాడిని నీటిలో ముంచేసి చంపేశారంటూ అక్కడ ఉన్న జనం ఆ మహిళను, పక్కనున్న వ్యక్తిని తిడుతూ, వారిని కొట్టారు కూడా.

మరో వీడియోలో ఆ మహిళ, పిల్లాడి మృతదేహంతో కూర్చుని విచిత్రంగా నవ్వుతూ, పిల్లాడు మళ్లీ లేస్తాడని అంటున్నట్లుగా ఉంది. దీనిపై వివాదం చెలరేగడంతో పోలీసులు ఆమెను, ఆమె పక్కనున్న వ్యక్తిని అరెస్టు చేయడంతోపాటు పిల్లాడి మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు.

ఈ ఘటనకు సంబంధించిన అసలు విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పిల్లాడు నీటమునగడం వల్ల చనిపోలేదని ప్రాథమిక సమాచారం ఆధారంగా పోలీసులు చెప్పారు.

హరిద్వార్

ఫొటో సోర్స్, RAJESH DOBRIYAL

ఆ వీడియో షేర్ చేయొద్దని వార్నింగ్

వైరల్ అయిన వీడియోలో, పిల్లాడిని చంపేశారని ఆరోపిస్తూ అతని తల్లిదండ్రులను జనం తిట్టడం కనిపిస్తుంది.

ఈ విషయంపై హరిద్వార్ సిటీ ఎస్పీ స్వతంత్ర కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ- పిల్లాడిని నీటముంచి చంపేశారన్నది నిజం కాదని చెప్పారు.

హరిద్వార్ పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో- ''పిల్లాడిని నీటముంచి చంపేశారనే ప్రచారం అబద్ధం. ప్రాథమిక సమాచారం మేరకు, అది విశ్వాసానికి, చివరి ఆశకి సంబంధించిన విషయం. అన్నికోణాల్లో విచారణ జరుపుతున్నాం. పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది'' అని పేర్కొన్నారు.

''పిల్లాడు బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని, ఫైనల్ స్టేజ్‌ కావడంతో వైద్యం కోసం ఆస్పత్రిలో చేర్చుకునేందుకు దిల్లీ ఎయిమ్స్ నిరాకరించింది. ఆ తర్వాత చివరి ఆశగా, పిల్లాడి తల్లిదండ్రులు అతన్ని హరిద్వార్ తీసుకొచ్చారు'' అని పోలీసులు తెలిపారు.

ఆ ఘటన జరిగిన తర్వాత పోలీసులు మాట్లాడుతూ- ''సాయంత్రం 5 గంటల సమయంలో పిల్లాడి మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. పిల్లాడి 'ఊపిరితిత్తుల్లో నీళ్లు లేవు' అని చెప్పారు. పిల్లాడు నీటిలో మునగడం వల్ల చనిపోలేదు. పిల్లాడి శరీరం బిగుసుకుపోయింది. ఏదేమైనా, అధికారిక నివేదిక రావాల్సి ఉంది. అందులో మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది'' అన్నారు.

ఇది ఒక చిన్నారికి సంబంధించిన సున్నితమైన కేసు అని పోలీసులు హెచ్చరించారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వాస్తవాలు లేని వీడియోలను షేర్ చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

హరిద్వార్

ఫొటో సోర్స్, Rajesh Dobriyal

'దారిలోనే చనిపోయాడు'

ఈ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే పిల్లాడి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌‌కు తీసుకొచ్చి విచారణ జరిపినట్లు ఆ కేసు దర్యాప్తు బృందంలో ఉన్న పోలీసు అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

ఆ తర్వాత నీటిలో మునగడం వల్ల చనిపోలేదని పోస్టుమార్టంలో తేలిందని, దీంతో వారిని వదిలేశామని, పిల్లాడికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వారు తీసుకెళ్లినట్లు చెప్పారు.

దిల్లీలోని సోనియా విహార్‌కు చెందిన రంజీత్ కుమార్ ఓ ట్యాక్సీ డ్రైవర్. రంజీత్ కారులోనే వారు దిల్లీ నుంచి హరిద్వార్ వచ్చారు.

ఆ అబ్బాయి పరిస్థితి ఏం బాలేదు, కారులో ఎక్కిన కొద్దిసేపటి తర్వాత అతనిలో ఎలాంటి చలనం లేదని రంజీత్ బీబీసీతో చెప్పారు.

ఘటన జరిగిన రోజు ఉదయం ఏడు గంటల సమయంలో హరిద్వార్ వెళ్లాలని పిల్లాడి మేనమామ పిలిచారని ఆయన చెప్పారు. ఉదయం 9 గంటల 15 నిమిషాలకు దిల్లీ నుంచి బయలుదేరారు. ఆ సమయంలో పిల్లాడితోపాటు అతని తల్లిదండ్రులు, అత్త కూడా ఉన్నారు. పిల్లాడు అతికష్టమ్మీద ఊపిరి తీసుకుంటున్నాడు.

కొద్దిసేపటి తర్వాత పిల్లాడు ఊపిరి తీసుకుంటున్న శబ్దం ఆగిపోయింది. అప్పుడు పిల్లాడు నిద్రపోతున్నాడని వాళ్ల అమ్మ చెప్పింది.

మధ్యాహ్నం 1.15 గంటలకు హరిద్వార్ చేరుకున్న తర్వాత, పిల్లాడిని ఒళ్లోకి తీసుకుని గంగా నదిలో స్నానానికి వెళ్లారు. రెండు నుంచి రెండున్నర గంటల సమయం తర్వాత పోలీసులు రంజీత్‌‌కు ఫోన్ చేసి విచారించారు.

పిల్లాడి కుటుంబం నివాసముండే దిల్లీలోని సోనియా విహార్ కాలనీలో వారింటికి సమీపంలోనే నివాసముంటున్నారు మదన్ రాయ్.

పిల్లాడి తండ్రి రాజ్ కుమార్ పూల వ్యాపారం చేస్తారు. ఆయన భార్య గృహిణి. వారికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. కొడుకు రవి చనిపోయాడు. రవి కంటే కూతురు పెద్దదని మదన్ రాయ్ బీబీసీ హిందీతో చెప్పారు.

పిల్లాడికి బ్లడ్ క్యాన్సర్ ఉందని, బతకడం కష్టమని వైద్యులు చెప్పేశారని ఆయన అన్నారు. దీంతో వారు హరిద్వార్ వెళ్లారని, ఎవరికి తెలుసు గంగా మాత ఆశీర్వాదంతో అద్భుతం జరగొచ్చేమో, పిల్లాడికి నయం కావొచ్చేమో అన్నారాయన.

''దేవుడు ఇంకేదో తలచాడు, గాజియాబాద్ దాటుతుండగానే పిల్లాడు చనిపోయాడు. వైద్యులు కూడా అదే చెప్పారు'' అని మదన్ రాయ్ అన్నారు.

పోస్టుమార్టం తర్వాత ఆ కుటుంబం అర్ధరాత్రి దిల్లీకి చేరుకుంది.

ఈ ఘటనపై మీడియా వ్యవహరించిన తీరుపై మదన్ రాయ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

''విషయం తెలుసుకోకుండా ఇలాంటి వార్తలు ఎలా ప్రసారం చేస్తారు? అప్పటికే ఆ పేద తల్లిదండ్రులు బాధలో ఉన్నారు. దానికితోడు మీడియాలో ఎక్కడ చూసినా వాళ్లే కనిపిస్తున్నారు. ఇలా చేసిన వాళ్లమీద చర్యలు తీసుకోరా'' అని ఆయన ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)