బెంట్లీ కారులో సింహం, వీడియో వైరల్ కావడంతో ఇద్దరిపై కేసు నమోదు...

ఫొటో సోర్స్, Ann Isaanrussia
అది థాయ్‌లాండ్‌లోని పట్టాయా పట్టణం. జనసమ్మర్ధంగా ఉన్న ఆ పట్టణంలో ఒక బెంట్లీ కారు వీధిలో వెళుతోంది.
శ్రీలంకకు చెందిన ఓ పురుషుడు ఆ కారును నడుపుతుండగా, వెనక సీట్లో ఒక సింహం పిల్ల ఉంది. అదొక పెంపుడు సింహం పిల్ల.
దానికి సుమారు 4-5 నెలల వయసు ఉంటుందని స్థానిక మీడియా పేర్కొంది.
కొందరు వ్యక్తులు ఈ దృశ్యాన్ని వీడియో తీసి ఆన్‌లైన్‌లో పెట్టడంతో పోలీసులు ఆ సింహం యజమానిపై అభియోగాలు నమోదు చేశారు.
సవాంగ్‌జిత్ కొసూంగ్‌నెర్న్ అనే మహిళ ఆ సింహాన్ని పెంచుకుంటుండగా, ఆమె స్నేహితుడు దాన్ని కారులో బయటకు తీసుకొచ్చారు.
థాయిలాండ్‌లో సింహాలను పెంచుకోవడం నేరం కాదు. కానీ, సదరు వ్యక్తులు తాము సింహాన్ని పెంచుకుంటున్నట్లు ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి.
థాయ్‌లాండ్‌లోని పాథోమ్ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి నుంచి తాను ఈ సింహాన్ని కొనుగోలు చేసినట్లు సవాంగ్‌జిత్ వెల్లడించారని పోలీసులు పేర్కొన్నారు.
పట్టాయాలోని ఆమె నివాసం నుంచి మరో ప్రాంతానికి ఆ సింహాన్ని కారులో తరలిస్తుండగా ఈ వీడియో తీసినట్లు తేలింది.
సింహాన్ని పెంచుకోవచ్చు, కానీ...
థాయ్‌లాండ్‌లో ఒక సింహాన్ని కొనుగోలు చేసినప్పుడు, దానికి అవసరమైన సౌకర్యాలు ఉన్నట్లు సదరు కొనుగోలు చేసిన వ్యక్తి అధికారులకు చూపించాల్సి ఉంటుంది. అయితే, ఈ విషయంలో సవాంగ్‌జిత్ అధికారుల నుంచి అనుమతులు పొందలేని తేలింది. దీంతో రవాణా చేయడంతోపాటు, సింహాన్ని పెంచుకోవాలన్న ఆమె ప్రయత్నం కూడా చట్ట విరుద్ధమంటూ అక్కడి అధికారులు ఆమెపైనా, కారులో సింహాన్ని తీసుకెళ్లిన వ్యక్తిపైనా అభియోగాలు మోపారు.
‘‘ సింహాన్ని కారులో పెట్టుకుని వీధుల్లో తిప్పడం నేరం. ఈ సింహం పిల్ల యజమాని అయిన సవాంగ్‌జిత్ తప్పు చేశారు. దీనికోసం ఆమె ఎలాంటి పర్మిషన్లు తీసుకోలేదు.’’ అని అక్కడి అధికారులు వెల్లడించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది.

ఫొటో సోర్స్, ANN ISAANRUSSIA
సోషల్ మీడియాలో కారులో సింహం వీడియో వైరల్
సింహం పిల్ల బెంట్లీ కారులో ప్రయాణిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఏడాది జనవరి 21 నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లు పోలీసులు గుర్తించారని ‘ది స్టార్’ పత్రిక వెల్లడించింది.
మెడలో ఒక ఫ్లోరోసెంట్ తాడుతో ఉన్న ఈ సింహం పిల్ల ఓపెన్ టాప్ కారులోంచి బైటికి చూస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది.
దీనిని కారులో కూర్చోబెట్టిన వ్యక్తి పట్టణంలో ప్రయాణించినట్లు మరికొన్ని వీడియోలలో కూడా కనిపించింది.
తొలి వీడియోకు 35 వేల లైక్‌లు కూడా వచ్చాయి. పట్టణంలో చక్కర్లు కొడుతున్న ఈ సింహాన్ని చూసి కొందరు వ్యక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం ఇలా ఎలా తిప్పుతారంటూ సందేహాలు వ్యక్తం చేశారు.
ఇది జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించడమేనని మరికొందరు సోషల్ మీడియా యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కారు నడుపుతున్న వ్యక్తికి ఏమాత్రం బాధ్యత లేదంటూ కొందరు యూజర్లు విమర్శించారు.
‘‘మీరు ధనవంతులు అయితే అయ్యుండొచ్చు. కానీ, ప్రజల విషయంలో ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించడం మాత్రం సరికాదు’’ అని ఒక యూజర్ అన్నారు.
ఇలా సింహాన్ని కారులో తిప్పుతున్న వ్యక్తి దగ్గర సరైన అనుమత్రి పత్రాలు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని ధ్రువీకరించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు అక్కడి పోలీసులు.
అనుమతి లేకుండా వన్య ప్రాణులను పెంచుకున్నందుకు అక్కడి చట్టాలలో శిక్షలు ఉంటాయి. ఇలాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తికి ఏడాదిపాటు జైలు శిక్ష, సుమారు రూ.2.3 లక్షల జరిమానా ఉంటుంది.
అనుమతి లేకుండా సింహాన్ని రవాణా చేసిన వ్యక్తిపై అభియోగాలు రుజువైతే ఆరు నెలల జైలుశిక్ష, సుమారు రూ. 1.2 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.
నేరం రుజువైతే సవాంగ్‌జిత్‌తోపాటు, ఈ సింహం కూనను వీధుల్లో తిప్పిన వ్యక్తి కూడా ఇదే చట్టం కింద శిక్షను ఎదుర్కోవాల్సి రావచ్చు.

ఫొటో సోర్స్, PA
థాయ్‌లాండ్‌లో సింహాలంటే మోజు
థాయ్‌లాండ్‌లో ప్రస్తుతం చట్టబద్ధంగా 224 సింహాలను పెంచుకుంటున్నట్లు ఆ దేశపు అధికారులు చెబుతున్నారు. ఒక్క పట్టాయా ప్రాంతంలోనే నలుగురు వ్యక్తులు, కొన్ని జూలతో కలిపి 15 వరకు పెంపుడు సింహాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
థాయ్‌లాండ్‌లో అటవీ జంతువులను పెంచుకోవడం ఒక ఫ్యాషన్. ముఖ్యంగా ధనవంతులు ఇలా సింహాలను పెంచుకోవడం గొప్పగా భావిస్తారు.
ఒక్కో సింహం ఖరీదు సుమారు రూ. 11 లక్షల వరకు ఉంటుందని థాయ్‌లాండ్‌లో ప్రచురితమయ్యే ది నేషన్ పత్రిక వెల్లడించింది.
సింహాన్ని పెంచుకోవాలంటే మాత్రం అక్కడ తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా (CITES) అనే అంతర్జాతీయ చట్టం నిబంధనల ప్రకారం ఈ అనుమతులు తప్పని సరి.
ఇవి కూడా చదవండి:
- ఆర్ఎస్ఎస్, బీజేపీ సంబంధాలు మారుతున్నాయా?
- అయోధ్య రామాలయం: ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది ఆలయాల ఆర్కిటెక్చర్ భిన్నంగా ఎందుకు ఉంటుంది?
- అమెజాన్ అడవుల్లో బయటపడ్డ పురాతన నగరం.. అత్యాధునిక రహదారి వ్యవస్థ, కాల్వల నిర్మాణంతో వేలమంది నివసించిన ఆనవాళ్లు
- ఈ ఎనిమిది కాళ్ల వింత జీవి ఎలాంటి గడ్డు పరిస్థితులనైనా తట్టుకుని జీవిస్తుంది... ఏమిటి దీని బలం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















