విరాట్ కోహ్లీ హైదరాబాద్ టెస్టుకు దూరం కావడం ఇంగ్లండ్‌కు టానిక్‌లా పని చేస్తుందా?

ఫొటో సోర్స్, ALEX DAVIDSON-ICC/ICC VIA GETTY IMAGES
- రచయిత, విమల్ కుమార్
- హోదా, సీనియర్ జర్నలిస్ట్
విరాట్ కోహ్లీ జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో మొదలయ్యే అయిదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు టెస్టులు ఆడటం లేదు.
వ్యక్తిగత కారణాల రీత్యా ఈ రెండు టెస్టుల నుంచి కోహ్లీ తప్పుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. టెస్టు క్రికెట్ పట్ల విరాట్ కోహ్లీ అంకితభావం గురించి సందేహించాల్సిన అవసరం లేదు.
ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా ప్రతీ ప్రాక్టీస్ సెషన్‌ను నేను రిపోర్ట్ చేశాను. కానీ, సరిగ్గా తొలి టెస్టు (సెంచూరియన్)కు ముందు కోహ్లీ కనిపించలేదు.
వ్యక్తిగత కారణాల రీత్యా కోహ్లీ ఆఫ్రికాలో లేరనే విషయం వేర్వేరు సోర్సుల ద్వారా నాకు తెలిసింది. ఇక దీనిపై మరింత సమాచారం సేకరించే ప్రయత్నం నేను చేయలేదు.
ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహనే వంటి అనుభవజ్ఞులైన క్రికెటర్లు లేకుండా పర్యటనకు వచ్చిన భారత జట్టులో అకస్మాత్తుగా అనుభవజ్ఞుడైన కోహ్లీ కూడా టెస్టు సిరీస్‌కు దూరమైతే ఈ జట్టు ఎలా సర్దుకుంటుందని నాకు పదే పదే అనిపించింది.
అయితే, కోహ్లీ ఆ టెస్టు సిరీస్‌లో ఆడటమే కాకుండా పరుగులు కూడా చేస్తాడని టీమ్ మేనేజ్‌మెంట్‌కు బాగా తెలుసు.
అలాగే జరిగింది కూడా. సెంచూరియన్ టెస్టుకు ముందు కోహ్లీ కేవలం ఒక్కరోజు మాత్రమే ప్రాక్టీస్ చేశాడు. తర్వాతి రోజు మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌తో కలిసి కోహ్లీ రాణించాడు.

ఫొటో సోర్స్, RYAN PIERSE-ICC/ICC VIA GETTY IMAGES
కెప్టెన్, కోచ్‌లకు అపార నమ్మకం
నిజానికి కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ గత రెండేళ్లలో డ్రెస్సింగ్ రూమ్ లోపల, బయటా విరాట్ కోహ్లికి ఇచ్చిన గౌరవం, స్పేస్ విషయంలో సచిన్ తెందూల్కర్‌ను ఉదాహరణగా చూపవచ్చు.
సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్‌లు కెప్టెన్లుగా ఉన్నప్పుడు సచిన్‌కు ఇలాంటి గౌరవమే దక్కేది.
అయితే, సచిన్‌తో పోలిస్తే విరాట్ కోహ్లీకి కెప్టెన్సీని వదిలిపెట్టి మళ్లీ ఒక సామాన్య ఆటగాడిగా కొత్తగా ఆటను ప్రారంభించడం అంత సులభం కాదు.
సచిన్‌కు ఇదంతా సహజంగా జరిగిపోయింది. బ్యాట్స్‌మన్‌గా పరిపూర్ణత సాధించడం కోసం సచిన్ స్వయంగా కెప్టెన్సీని వదులుకున్నాడు.
క్లిష్టపరిస్థితుల్లో ఒత్తిడి కారణగా కోహ్లీ కెప్టెన్సీని వదులుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ సహజంగా ఆడటం అంత ఈజీ కాదు.
కానీ, కోహ్లీ మళ్లీ జట్టులో కింగ్‌లా భావించేందుకు రోహిత్-ద్రవిడ్ జోడి ఏం చేసిందో భారత జట్టు ప్రతీ పర్యటనలోనూ కనిపించింది. కోహ్లీ ఇప్పుడు తన వైభవాన్ని మళ్లీ అందిపుచ్చుకున్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
విరాట్ స్థానాన్ని భర్తీ చేసేదెవరు?
ప్రస్తుత కాలంలో ఎవరైనా ఆటగాడు టెస్టు క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడంటే అది నిస్సందేహంగా విరాట్ కోహ్లీనే.
భారత క్రికెట్‌లో కొన్ని సందర్భాల్లో మాత్రమే టెస్టు క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ బ్రేక్ తీసుకున్నాడు.
113 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అనుభవం, డాన్ బ్రాడ్‌మన్ చేసినన్ని సెంచరీలు (29), దాదాపు 9 వేల పరుగులు సాధించిన ఆటగాడు జట్టులో లేకపోవడం ప్రత్యర్థి జట్టుకు చాలా ఉపశమనంగా ఉంటుంది.
సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో ఆఖరుసారిగా భారత్‌ను ఓడించిన జట్టు ఇంగ్లండ్.
ఈసారి కూడా భారత్‌ను సొంతగడ్డపై ఓడించాలని ఇంగ్లండ్ కలలు కంటున్నట్లయితే, తొలి రెండు టెస్టులకు భారత డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ ఉండడనే అంశం వారికి టానిక్‌లా పనిచేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్, విశాపట్నం వేదికగా జరిగే రెండు టెస్టుల్లో కోహ్లీ ఆడకపోతే, అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరనేది చాలా ముఖ్యం.
టెస్టుల్లో కోహ్లీ అంతటి అనుభవం, 20 వేల ఫస్ట్ క్లాస్ పరుగులు, 100 టెస్టులు ఆడిన పుజారాను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటారా? లేక రజత్ పాటీదార్, సర్ఫరాజ్ ఖాన్‌ల వైపు సెలెక్టర్లు మొగ్గుతారా అని విశ్లేషకులు భావించారు.
అయితే, కోహ్లీకి ప్రత్యామ్నాయంగా 30 ఏళ్ల రజత్ పాటీదార్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన రజత్ పాటీదార్ ప్రస్తుతం భారత్ ‘ఎ’ జట్టు తరఫున ఇంగ్లండ్ లయన్స్‌తో ఆడుతున్నాడు. టెస్టు జట్టుకు ఎంపిక కావడంతో అతను అహ్మదాబాద్ నుంచి బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకుంటాడు.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌తో భారత వన్డే జట్టులో అరంగేట్రం చేసిన రజత్ పాటీదార్, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌తో భారత్ తరఫున టెస్టుల్లో అడుగుపెట్టనున్నాడు.
రజత్ పాటీదార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 45.97 సగటుతో 4 వేల పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, ALEX DAVIDSON-ICC/ICC VIA GETTY IMAGES
ఇంగ్లండ్‌పై కోహ్లీ తడబాటు
రాజ్‌కోట్ టెస్టుతో కోహ్లీ మళ్లీ జట్టులోకి వస్తాడని నమ్ముతున్నారు.
ఇంగ్లండ్‌పై తొలి 19 ఇన్నింగ్స్‌లలో ఒకే సెంచరీ కొట్టిన కోహ్లీ, 2016లో విశాఖపట్నం టెస్టు నుంచి ఇంగ్లండ్‌పై పరుగుల వరద పారించాడు.
కానీ, యాదృచ్ఛికంగా ఇంగ్లండ్‌పై గత 19 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదు.
ఈ సమయంలో కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌ను కోహ్లీ టెస్టు కెరీర్‌కు చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.
కోచ్ బ్రెండన్ మెకల్లమ్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు స్థిరంగా దూకుడైన క్రికెట్ ఆడుతోంది. దీన్నే బేస్‌బాల్ బ్రాండ్ క్రికెట్‌గా పిలుస్తున్నారు.
కోహ్లీ బేస్‌బాల్ బ్రాండ్ దూకుడుతో ఆడకపోవచ్చు. కానీ, అతని పోరాట వైఖరి, ఆధిపత్యం ఇంగ్లండ్‌ను మాత్రమే కాదు ప్రపంచంలోని ఏ జట్టునైనా మైదానంలోకి దిగడానికన్నా ముందే ఆత్మరక్షణలోకి నెట్టుతుంది.
ఇలా ఈ సిరీస్ తొలి రెండు మ్యాచ్‌ల్లో జరుగబోదు. కానీ, ఈ రెండు టెస్టుల్లో ఎవరికి అవకాశం వచ్చినా, ఎరుపు బంతి క్రికెట్‌లోనూ భారత్ వద్ద ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదువ లేదని నిరూపిస్తారేమో ఎవరికీ తెలుసు.
ఇవి కూడా చదవండి:
- అయోధ్యకు, థాయ్‌లాండ్‌లోని అయుతయ నగరానికి సంబంధం ఏంటి?
- కశ్మీర్లో మంచు కురవని శీతాకాలం ఎప్పుడైనా చూశారా... ఈ ఏడాదే ఎందుకిలా?
- అయోధ్య: ‘దివ్యాంగ మందిరంలో సకలాంగుడైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ధర్మవిరుద్ధం’ -శంకరాచార్య అవిముక్తేశ్వరానంద
- సచిన్ తెందూల్కర్: డీప్‌ఫేక్ బారిన పడిన భారత క్రికెట్ దిగ్గజం, కూతురుతో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నట్లుగా వీడియో వైరల్...
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














