ఎర్ర సముద్రంలో హూతీ డ్రోన్‌లను వేటాడుతున్న యూఎస్ఎస్ బటాన్ పైలట్లు

హ్యారియర్ జెట్ల ముందు కెప్టెన్ ఎర్ల్ ఎర్హార్ట్
ఫొటో క్యాప్షన్, హ్యారియర్ జెట్ల ముందు కెప్టెన్ ఎర్ల్ ఎర్హార్ట్

యెమెన్‌లోని హుతీల మీద అమెరికా, బ్రిటన్ దేశాలు దాడులు చేస్తున్నాయి. మధ్యధరా సముద్రంలోని అమెరికన్ యుద్ధ నౌకల్ని సందర్శించేందుకు జర్నలిస్టులకు అరుదుగా లభించే అవకాశం బీబీసీ పర్షియన్ ప్రతినిధి నఫిసే కొహనార్డ్‌కు లభించింది. ఈ ప్రాంతంలో సరకు రవాణా నౌకలకు తాము రక్షణ కల్పిస్తున్నామని అక్కడున్న సిబ్బంది ఆమెతో చెప్పారు.

చిమ్మ చీకటిలో అమెరికన్ నేవీకి చెందిన యుద్ధ నౌక మీద నుంచి ఓ యుద్ధ విమానం మరో మిషన్ కోసం రాత్రి పూట నిశ్శబ్ధాన్ని ఛేధిస్తూ గర్జిస్తూ వెళ్లింది.

అమెరికన్ నౌకాదళంలోని 26వ యూనిట్లో 2,400 మంది ఈ నౌకలో పని చేస్తున్నారు. ఈ నౌక నుంచి నేల మీద, నీటి మీద దాడులు చేయవచ్చు. ఇందులో ఆయుధాలున్న వాహనాలు, ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు ఉన్నాయి. ఈ హెలికాప్టర్లలో సైనికుల్ని తీరానికి తీసుకెళుతుంటారు.

యెమెన్ నుంచి హూతీలు చేస్తున్న దాడుల్ని తిప్పి కొట్టేందుకు ఎర్ర సముద్రంలో అమెరికా మోహరించిన మొదటి యుద్ధ నౌక ఇది.

హూతీలు ప్రయోగిస్తున్న డ్రోన్లను యూఎస్ఎస్ బటాన్ పైలట్లు టార్గెట్ చేస్తూ కూల్చేస్తున్నారు.

“మేము ఇక్కడ మోహరించిన తర్వాత ఇలా చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అని పైలట్లలో ఒకరైన కెప్టెన్ ఎర్ల్ ఎర్హార్ట్ చెప్పారు.

యూఎస్ఎస్ బటాన్ యుద్ధ నౌకమీద నుంచి టేకాఫ్‌కు సిద్ధమైన హ్యారియర్ జెట్ ఫైటర్
ఫొటో క్యాప్షన్, యూఎస్ఎస్ బటాన్ యుద్ధ నౌకమీద నుంచి టేకాఫ్‌కు సిద్ధమైన హ్యారియర్ జెట్ ఫైటర్

ఈ హ్యారియర్ జెట్లు ముఖ్యంగా నేల మీద దాడుల కోసం తయారు చేసినవి. అయితే, వీటిని డ్రోన్లను వేటాడేందుకు కూడా ఉపయోగించవచ్చు.

“హ్యారియర్లను మేము గగనతల రక్షణ కోసం కూడా ఉపయోగిస్తున్నాం” అని ఆయన చెప్పారు. “ఇందులో క్షిపణుల్ని లోడ్ చేసి డ్రోన్ల మీద దాడులు చేస్తున్నాం”.

హూతీలు ప్రయోగించిన డ్రోన్లలో చాలా వాటిని తాము కూల్చివేసినట్లు కెప్టెన్ ఎర్హార్ట్ చెప్పారు “యెమెన్ నుంచి ఎర్ర సముద్రంలోని నౌకల మీద దాడులు చేసేలా హూతీలు అనేక డ్రోన్లను ప్రయోగిస్తున్నారు. మా వైపు చాలా డ్రోన్లు దూసుకొస్తున్నాయి” అని ఆయన చెప్పారు.

ఇజ్రాయెల్ గాజా మీద యుద్ధం ప్రారంభించిన తరువాత హూతీలు రంగంలోకి దిగారు. వారు ఇజ్రాయెల్ సేనల మీద దాడులు మొదలు పెట్టారు. నిరుడు అక్టోబర్ ఏడున హమాస్ సాయుధులు సరిహద్దులు దాటి ఇజ్రాయెల్ భూభాగంలో ప్రజలపై దాడి చెయ్యడంతో ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది.

సముద్రంలో విస్తృత ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్న యూఎస్ఎస్ బటాన్ కమాండ్ సెంటర్
ఫొటో క్యాప్షన్, సముద్రంలో విస్తృత ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్న యూఎస్ఎస్ బటాన్ కమాండ్ సెంటర్

ఎర్ర సముద్రంలో చాలా ప్రాంతాన్ని అమెరికన్ యుద్ధ నౌక యూఎస్ఎస్ బటాన్ టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షిస్తోంది. అమెకితా నాయకత్వంలోని సంకీర్ణ కూటమిలో పది దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ హుతీల దాడుల నుంచి వాణిజ్య నౌకలకు భద్రత కల్పిస్తున్నాయి. ఇదంతా చూస్తే అంతర్జాతీయ వాణిజ్యంలో ఎర్ర సముద్రం ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు.

సూయజ్ కెనాల్, ఎర్ర సముద్రం గుండా ఏటా 17వేల వాణిజ్య నౌకలు ప్రయాణిస్తుంటాయి. ప్రపంచ వాణిజ్యంలో పది శాతం సరకు రవాణా ఈ మార్గం నుంచే జరుగుతోంది. దీని విలువ ట్రిలియన్ డాలర్లకు పైనే. హూతీల దాడులకు భయపడి వాణిజ్య నౌకలు ఎర్ర సముద్రం కాకుండా ఆఫ్రికా అంతా చుట్టి రావాలంటే ప్రయాణ సమయంతో పాటు ఖర్చు కూడా పెరుగుతుంది.

అమెరికన్ నేవీ నుంచి ఈ ప్రాంతంలో డి విగ్ట్, డి ఐసెన్ హోవర్ సహా అనేక యుద్ధ నౌకల్ని మోహరించారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై యూఎస్ఎస్ బటాన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ డెన్నిస్ శాంప్సన్ వివరణ ఇచ్చారు.

“ఇలా చెయ్యడం వల్ల సముద్రాల మీద భద్రత కల్పించడంలో మా స్థిరత్వం, మాకున్న నిబద్ధతను మా మిత్రులు, భాగస్వాములు గుర్తిస్తారు. అంతేకాకుండా, ఈ బలగంతో మేం ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదిరించగలం” అని చెప్పారు.

యూఎస్ఎస్ బటాన్ డిసెంబర్‌ చివరలో ఎర్ర సముద్రం నుంచి తూర్పు మధ్యధరా సముద్రం చేరుకుంది. తర్వాత అమెరికా, బ్రిటన్ యెమెన్‌లోని హూతీ స్థావరాల మీద దాడులు చేశాయి. అయితే దీని ప్రభావం అంతగా కనిపించలేదు.

అమెరికా, బ్రిటన్‌కు చెందినవని ఆరోపిస్తూ, వాణిజ్య, యుద్ధ నౌకలపై హూతీలు డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తూనే ఉన్నారు. గాజాలో యుద్ధం కొనసాగినంత కాలం తమ దాడులు కూడా కొనసాగుతాయని వారు హెచ్చరిస్తున్నారు.

హూతీల దాడులతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. మిలిటెంట్ గ్రూపులన్నీ ఇరాన్‌తో కలిసి ఇరాక్, సిరియాలో అమెరికన్ బలగాలు, ఇజ్రాయెల్ మీద దాడులు చేశాయి.

“ప్రస్తుతం మనం సంక్లిష్టమైన, అనిశ్చిత పరిస్థితుల్లో జీవిస్తున్నాం” అని కల్నల్ శాంప్సన్ చెప్పారు. ఇటీవల కొన్ని నెలలుగా యూఎస్ఎస్ బటాన్ యుద్ధ నౌకను ఇక్కడే వేర్వేరు ప్రాంతాల్లో మోహరించారు.

గత వేసవిలో హర్మూజ్ జల సంధి చుట్టు పక్కల పెట్రోలింగ్‌ వారి మిషన్ మొదలైంది.

అక్టోబర్‌లో ఇజ్రాయెల్ మీద గాజా దాడి తర్వాత వారి మిషన్ ఎర్ర సముద్రం వైపు మళ్లింది. ఎర్ర సముద్రం నుంచి ప్రస్తుతం మధ్యధరా సముద్రం చేరుకున్న అమెరికన్ యుద్ధ నౌక ఇప్పుడు గాజా, ఇజ్రాయెల్, లెబనాన్ తీర ప్రాంతానికి దగ్గరగా ఉంది.

ఈ సంక్షోభం స్థానికంగా యుద్ధానికి దారి తీస్తుందనే ఆందోళన పెరుగుతోంది.“ సరిగ్గా అంచనా వెయ్యలేకపోవడం అనే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది” అని ఆయన అన్నారు. “అయితే మేము ఇక్కడ ఉండటం అవసరం. జాతీయ భద్రత లేక మా మిత్రులు, భాగస్వాముల ప్రయోజనాల కోసం ఎలాంటి దాడులనైనా తిప్పి కొట్టేందుకు మేము సిద్ధంగా ఉంటాం.” అని చెప్పారు.

యుద్ధం మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తే, ఆ ప్రాంతం నుంచి అమెరికన్ ప్రజలను సురక్షితంగా తరలించడం యూఎస్ఎస్ బటాన్ ప్రథమ కర్తవ్యం.

అమెరికా నిఘా జాబితాలో లెబనాన్ అగ్రస్థానంలో ఉంది. అక్కడ హెజ్బొల్లా ఇజ్రాయెల్ బలగాల మధ్య పరస్పరం దాడులు జరుగుతున్నాయి.

యూఎస్ఎస్ బటాన్ యుద్ధ నౌకలో డజన్ల కొద్దీ విమానాలు, హెలికాప్టర్లు
ఫొటో క్యాప్షన్, యూఎస్ఎస్ బటాన్ యుద్ధ నౌకలో డజన్ల కొద్దీ విమానాలు, హెలికాప్టర్లు

యూఎస్ఎస్ బటాన్‌తో పాటు క్షిపణుల్ని ధ్వంసం చేసే అర్లే బుర్కే కూడా ఇక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తోంది. దీనిలో అనేక మిసైల్ లాంచర్లు, అత్యాధునిక రాడార్ వ్యవస్థ ఉన్నాయి. ఈ రాడార్ వ్యవస్థ ద్వార నౌకలోని కమాండ్ సెంటర్‌కు సందేశాలు వెళుతుంటాయి. ఈ కమాండ్ సెంటర్ షిప్‌కు కళ్లు, చెవులు. దీని నుంచి వచ్చిన సందేశాల ద్వారానే ప్రత్యర్థుల్ని గుర్తించి ఎదురు దాడులు చేస్తారు.

కంప్యూటర్ మానిటర్ల వెలుతురులో కాస్త చీకటిగా ఉన్న కమాండ్ సెంటర్ ఉన్న గదిలోకి ఆఫీసర్ ఇన్ చార్జ్ లెఫ్టినెంట్ కమాండర్ టిర్చెరా బౌమన్ నన్ను తీసుకెళ్లారు. అక్కడున్న రేడియోలో ఓ మహిళా అధికారిణి గొంతు వినిపిస్తోంది. ఆమె క్షిపణిని ప్రయోగించడానికి ముందు వన్, టూ, త్రీ అని చెబుతోంది.

“మేము దీన్ని హార్ట్ ఆఫ్ ద షిప్ అని పిలుస్తాం. ఇక్కడ నుంచే మేము యుద్ధం చేస్తుంటాం” అని ఆయన చెప్పారు.

“ నీటిలో నుంచి మేము పని చేసేటప్పుడు, మా నావికులు చాలా అప్రమత్తంగా ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందో, అది జరుగుతుందనే ఆలోచనను మరింత నిజం చేసింది” అని ఆయన చెప్పారు.

యూఎస్ఎస్ బటాన్ సిబ్బంది రేయింబవళ్లు పని చేస్తూనే ఉన్నారు. పనిలో బాగంగా వారు అలసిపోయినట్లు కనిపించారు. డెక్ కింద బాగంలో మెరైన్లు వ్యాయామం చెయ్యడం, వారి వాహనాలను శుభ్రపరచుకోవడం లాంటివి చేస్తున్నారు.

డెక్ మీద పని చేస్తున్నవారు సముద్రం మీదుగా వచ్చే గాలులను ఆస్వాదిస్తున్నారు. కెప్టెన్ ఏర్హార్ట్ తన ఫైటర్ జెట్ విమానాన్ని చెక్ చేస్తున్నారు. ఆయనది జార్జియా రాష్ట్రంలోని డాసన్ విల్లే.

ఆయనకు నలుగురు పిల్లలు. ఆయన తన కుటుంబాన్ని మళ్లీ ఎప్పుడు కలుస్తారో తెలియదు. ఆయన భవిష్యత్ మీద ఏర్పడిన అనిశ్చితి ఈ ప్రాంతంలోని లక్షల మంది జీవితాలను ప్రతిబింబిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు