‘డిసీజ్ ఎక్స్’ అంటే ఏమిటి? కరోనా లాంటి మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు మనం సిద్ధమేనా?

వైద్య బృందం

ఫొటో సోర్స్, Getty Images

భవిష్యత్తులో మహమ్మారిలా వ్యాపించే అవకాశం ఉన్న వ్యాధినే డిసీజ్ ఎక్స్ అంటున్నారు.

మరి, అలాంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచం ఎలా సిద్ధంగా ఉండాలనే అంశంపై స్విట్జర్లాండ్‌‌లోని దావోస్‌ నగరంలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో వైద్య రంగ నిపుణులు చర్చించారు.

కరోనావైరస్ మహమ్మారి సమయంలో కనిపించిన విధ్వంసాన్ని తగ్గించేందుకు ఇలాంటి ముందస్తు సంసిద్ధత అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కూడా అంతకుముందు చాలా సార్లు హెచ్చరించింది.

కరోనావైరస్ మహమ్మారిని అడ్డుకునేందుకు సరైన వైద్య వ్యవస్థలు అందుబాటులో లేకపోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు లక్షల డాలర్ల నష్టం వాటిల్లింది.

ల్యాబ్‌లో మహిళా శాస్త్రవేత్త పరిశోధనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భవిష్యత్‌లో కొత్త టీకాలు కనుగొనేందుకు ప్రస్తుతం టీకా పద్ధతులను శాస్త్రవేత్తలు కస్టమైజ్ చేసుకోవచ్చు.

డిసీజ్ ఎక్స్ అంటే ఏమిటి?

డిసీజ్ ఎక్స్ అనేది నిజానికి ఒక వ్యాధి కాదు. డబ్ల్యూహె‌వో ఈ పదాన్ని ఊహాజనితంగా వాడింది. దీని అర్ధం ఇంకా రాని ఒక అంటు వ్యాధి. రేపెప్పుడైనా మనకు తెలియని ఒక వ్యాధి ప్రపంచ దేశాలు లేదా ఖండాలు దాటి విస్తరిస్తూ మమహ్మరిగా మారినప్పుడు, దానిపై ఎలా పోరాడాలో చెప్పేందుకు డబ్ల్యూహెచ్ఓ ఈ పదాన్ని వాడుతుంది.

కోవిడ్ 19 మహమ్మారికి ముందు కూడా ఈ పదం(డిసీజ్ ఎక్స్) ఉంది. 2018లో డబ్ల్యూహెచ్ఓ జారీ చేసిన రోగాల జాబితాలో దీన్ని ప్రస్తావించింది.

ప్రపంచ ఆర్థిక సదస్సులో డబ్ల్యూహెచ్ఓ ద్వారా సమావేశమైన వైద్య నిపుణుల బృందం ఒక ఆర్ అండ్ డీ బ్లూప్రింట్‌ను రూపొందించింది.

దీనిలో అంటువ్యాధులు వ్యాపించిన సమయంలో వేగంగా చేపట్టాల్సిన పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల ప్రణాళికలున్నాయి.

సమర్థమైన పరీక్షలు, టీకాలు, ఔషధాలను వేగంగా అందుబాటులోకి తీసుకురావడమే డబ్ల్యూహెచ్ఓ వైద్య నిపుణుల బృందం ఉద్దేశ్యం.

దీని ద్వారా ప్రజల ప్రాణాలను కాపాడటంతో పాటు పెద్ద ఎత్తున నెలకొనే సంక్షోభం నుంచి ప్రపంచాన్ని తప్పించవచ్చు.

ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మహమ్మారులను ప్రజలు ఎదుర్కొన్నారు.

వాటిలో సార్స్(సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్), స్వైన్ ఫ్లూ, మెర్స్(మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్), ఎబోలా, కోవిడ్-19 ఉన్నాయి.

ప్రపంచాన్ని కుదిపేసే మరో మహమ్మారి రాబోతుందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

అది కోవిడ్-19కు కారణమైన కరోనా వైరస్ కంటే ఎక్కువ ప్రాణాంతకం కాగలదని భయపడుతున్నారు.

దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక సదస్సులో మాట్లాడిన డాక్టర్ టెడ్రోస్ అధనమ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక సదస్సులో మాట్లాడిన డాక్టర్ టెడ్రోస్ అధనమ్

డిసీజ్ ఎక్స్ మహమ్మారికి కారణమవుతుందా?

డిసీజ్ ఎక్స్ ప్రస్తుతం లేనప్పటికీ, ఒకవేళ ఇలాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వస్తే మన ఆరోగ్య వ్యవస్థ సిద్ధంగా ఉండేలా, అలాంటి వైరస్‌ను అడ్డుకునేలా ఈ ప్లాన్ ఉపయోగపడుతుందని వైద్య పరిశోధకులు, శాస్త్రవేత్తలు, నిపుణులు భావిస్తున్నారు.

ఇటీవల దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సులో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనమ్ నేతృత్వంలో ‘డిసీజ్ ఎక్స్‌కు సిద్ధమవ్వడం’ అనే పేరుతో ఒక ప్యానల్ సెషన్ జరిగింది.

ఒకవేళ అత్యంత ప్రాణాంతక మహమ్మారులు సంభవిస్తే ఎదురయ్యే సవాళ్లకు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఏ విధంగా సిద్ధమవ్వాలో ఈ ప్యానల్ సెషన్ చర్చించింది.

‘‘అవును, ఇది ఆందోళన కలిగిస్తుందని కొందరు అనవచ్చు’’ అని టెడ్రోస్ అన్నారు.

కానీ, అది వ్యాధులు సంభవిస్తాయని ముందుగా అంచనావేయడం మంచిదని, ఎందుకంటే, ఎన్నోసార్లు ఇలాంటి మహమ్మారులు ప్రపంచాన్ని గడగడలాడించాయని ఆయన గుర్తుకు చేశారు. రాబోయే మహమ్మారికి ముందుగా సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు.

కోవిడ్-19 మహమ్మారి ప్రపంచానికి అకస్మాత్తుగా వచ్చి, ఆందోళనలో పడేసిందని బీబీసీ ఫ్యూచర్ 2021లో తెలిపింది.

‘‘గ్లోబల్ మహమ్మారిని తట్టుకునేలా మనం సిద్ధమవ్వాలని ఎన్నో ఏళ్లుగా అంటు వ్యాధులపై అధ్యయనాలు చేసేవారు, ఇతర శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు’’ అని బీబీసీ ఫ్యూచర్ 2021లో నివేదించింది.

జంతువులలో ఈ మహమ్మారులు ఎలా పుట్టుకొస్తున్నాయని చాలా మంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చెప్పాలంటే, కొత్తగా వచ్చే 75 శాతం వ్యాధులు జూనోటిక్‌గా ఉంటున్నాయని వైద్య నిపుణులంటున్నారు. జూనోటిక్ అంటే జంతువుల నుంచి మనుషుల్లోకి వ్యాప్తి చెందే వ్యాధులు.

కోవిడ్-19 కూడా దానికి భిన్నం కాదు. ఎందుకంటే ఈ వ్యాధి కూడా చైనాలో మార్కెట్లో అమ్ముడుపోయిన పంగోలిన్ నుంచి వచ్చుంటుందని చాలా మంది భావిస్తున్నారు.

కానీ, కోవిడ్-19 లాంటి జూనోటిక్ వ్యాధులు మానవుల చర్యలతో మరింత ప్రమాదకరంగా మారతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

వాతావరణంపై మానవుల ప్రభావం, వన్యప్రాణుల ఆవాసాలను ఆక్రమించుకోవడం, ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరచూ ప్రయాణిస్తూ ఉండటం వల్ల జంతువుల నుంచి పుట్టిన వ్యాధులు విస్తరిస్తున్నాయనే వాదనలున్నాయి.

సిరంజీ నీడిల్

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, కరోనా మహమ్మారి వచ్చిన ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన టీకాలు

తర్వాత మహమ్మారికి ప్రపంచం ఎలా సిద్ధం కావాలి?

ప్రపంచం మరో మహమ్మారిని ఎదుర్కొనేలా అవసరమైన చర్యలను ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓ ప్రారంభించిందని ప్రపంచ ఆర్థిక సదస్సులో డాక్టర్ టెడ్రోస్ చెప్పారు.

దీనిలో మహమ్మారి నిధులు, దక్షిణాఫ్రికాలో ‘‘టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ హబ్’’ ఉన్నాయి. టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ హబ్, ఈ నిధుల ద్వారా స్థానికంగా టీకాల ఉత్పత్తిని చేపట్టి, ధనిక, పేద దేశాలలో టీకా అందుబాటులో ఉన్న సమస్యలను పరిష్కరించనుంది.

మహమ్మారుల కోసం కొత్త వాటిని అభివృద్ధి చేయడానికి కంటే ప్రస్తుతమున్న వ్యవస్థలను బలోపేతం చేయాలని వ్యాధుల నియంత్రణ, నివారణకు చెందిన యూరోపియన్ కేంద్రం తన 2022లో ప్రతిపాదించింది.

కొత్త మహమ్మారికి ముందే కొత్త వ్యవస్థల పరీక్షలు చేపట్టాలని ఇది చెబుతోంది.

నిరంతరం, క్రమబద్ధంగా సేకరించిన, పరిశీలించిన ఆరోగ్య సంబంధిత డేటాను బలోపేతం చేసేందుకు 10 రకాల ప్రతిపాదనలను డబ్ల్యూహెచ్ఓ 2022 జూన్‌లో సూచించింది.

‘‘ఏదైనా మహమ్మారి అది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది, ప్రజల ప్రాణాలను బలితీసుకోవడానికి ముందే దాన్ని వేగంగా గుర్తించేందుకు సరైన వ్యాధుల నిఘా వ్యవస్థ అవసరం’’ అని డబ్ల్యూహెచ్ఓ తన ప్రతిపాదనలలో పేర్కొంది.

ఏ సూక్ష్మ జీవి నుంచి వ్యాధి వ్యాప్తి చెందిందో గుర్తించడం ఎల్లవేళలా సాధ్యం కాకపోవచ్చని డబ్ల్యూహెచ్ఓ కూడా చెబుతోంది. కానీ, మనుషుల్లో తెలియని వ్యాధికి ఒక పాంథోజెన్ కారణం కావచ్చు.

టీకాల టెక్నాలజీలో మరింత అభివృద్ధి సాధించాలని కూడా చాలా మంది కోరుకుంటున్నారు. కరోనా మహమ్మారి వచ్చిన ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోవిడ్-19 టీకాలు అందుబాటులోకి వచ్చాయి. టీకాల తయారీని వేగవంతం చేయడమే ఈ అభివృద్ధిలో కీలకమైన విషయం.

ఈ పురోగతి వల్ల శాస్త్రవేత్తలు భవిష్యత్తులో మరింత మెరుగైన వ్యాక్సీన్‌ను తయారు చేయగలుగుతారు. ప్రజల ప్రాణాలను మరింత సమర్ధంగా కాపాడగలుగుతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)