క్యాన్సర్: కీమోథెరపీ బాధలకు బ్లీనా చికిత్స చెక్ పెడుతుందా?

క్యాన్సర్ రోగులకు చికిత్స

ఫొటో సోర్స్, SANDRINE HEUTZ

ఫొటో క్యాప్షన్, 11 ఏళ్ల ఆర్థర్ క్యాన్సర్ నుంచి కోలుకుని సాధారణ జీవితం గడుపుతున్నారు.
    • రచయిత, మిషెల్లీ రాబర్ట్స్
    • హోదా, డిజిటల్ హెల్త్ ఎడిటర్

క్యాన్సర్‌తో బాధపడుతున్న కొంతమంది చిన్నారులకు కీమోథెరపీకి బదులుగా కొత్త ఔషధ చికిత్సను అందిస్తున్నారు.

బ్లడ్ క్యాన్సర్‌ బారిన పడి లండన్‌లోని గ్రేట్ ఓర్మండ్ స్ట్రీట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పదకొండేళ్ల ఆర్థర్‌ ఈ ఔషధ చికిత్స తీసుకున్న తొలి చిన్నారి.

ఈ థెరపీ ఆశాకిరణంగా కనిపిస్తోందని, ఈ సున్నితమైన చికిత్స వల్ల కీమో బాధ నుంచి ఆర్థర్ ఉపశమనం పొందాడని ఆర్థర్ కుటుంబ సభ్యులు తెలిపారు.

అంతేకాకుండా, ఈ ఔషధ చికిత్స వల్ల ఆసుపత్రికే పరిమితం కాకుండా, ఇంటి వద్దే ఉండి, కుటుంబంతో గడిపేందుకు, నచ్చినట్లుగా జీవించేందుకు వీలు కలిగిందని ఆర్థర్ కుటుంబ సభ్యులు చెప్పారు.

చికిత్సకు సంబంధించిన ఆ కిట్‌ను వీపునకు తగలించుకునే బ్యాగులో పెట్టుకుని, ఆర్థర్ తనకు నచ్చిన పని చేశాడు. దానిని “బ్లీనా బ్యాక్‌ప్యాక్”గా పిలుస్తోంది ఆర్థర్ కుటుంబం.

బ్లీనా ఔషధ చికిత్స ఇప్పటికే పెద్దవారికి క్యాన్సర్ చికిత్స అందించేందుకు లైసెన్స్ పొందింది. ఇప్పుడు చిన్నారులకు కూడా వినియోగించేందుకు ఈ ప్రయోగాలు చేస్తున్నారు. నిపుణులు ఆ ఫలితాలపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

లండన్‌లోని ఇరవైకి పైగా కేంద్రాల్లో బీ-సెల్ అక్యుట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా (బీ-ఆల్) బారిన పడిన చిన్నారులకు దీని ద్వారా చికిత్స అందిస్తున్నారు.

ఈ ఔషధం ఇమ్యునోథెరపీగా పనిచేస్తుంది. అందువల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ, ఆ క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటిని నాశనం చేయడంలో సాయపడుతుంది. ముఖ్యంగా, ఈ ఔషధ చికిత్సలో ఆరోగ్యకరమైన కణాలపై ఎలాంటి ప్రభావమూ ఉండదు. క్యాన్సర్ కణాలే లక్ష్యంగా పనిచేస్తుంది.

ఆర్థర్

ఫొటో సోర్స్, SANDRINE HEUTZ

ఏంటి ఈ బ్లీనా కిట్?

బ్లీనా కిట్ రూపంలో ఉంటుంది.లిక్విడ్ బ్యాగ్‌కు సన్నటి ప్లాస్లిక్ ట్యూబ్‌‌ను అటాచ్ చేసి ఉంటుంది. ఆ ప్లాస్లిక్ ట్యూబ్ రోగి చేతిలోని సిరలోకి ఆ ఔషధాన్ని పంపు చేస్తుంది. లిక్విడ్ బ్యాగ్‌లోని ద్రవాన్ని నిరంతరం రోగి శరీరంలోకి పంపేలా పరికరం పనిచేస్తుంది.

బ్యాటరీ సాయంతో పనిచేసే కిట్‌లో రోగి సిరల్లోకి పంపే ఆ ద్రవం ఎంత వేగం, మొత్తంలో పంపాలో నియంత్రించేందుకు వీలుంది. ఆ ద్రవం బ్యాగ్ చాలా రోజులు వస్తుంది.

ఆ కిట్ అంతా కూడా ఏ4 సైజ్ పాఠ్యపుస్తకం కన్నా కూడా చిన్న పరిమాణంలోనే ఉంటుంది. కిట్‌ను మనం బ్యాక్‌ప్యాక్‌లో ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.

బ్లీనా బ్యాక్‌ప్యాక్‌ను వీపునకు తగిలించుకునే, ఆర్థర్ అన్ని పనులు చేశాడు

ఓవైపు ఆ కిట్ క్యాన్సర్‌కు చికిత్స అందిస్తుంటే, మరోవైపు ఆర్థర్ తనకు నచ్చినట్లుగా పార్క్‌లో సంతోషంగా ఆడుకున్నాడు.

కీమోథెరపీ వల్ల ఆసుపత్రికే పరిమితమై, నీరసించి, ఇబ్బందులు పడే బాధ నుంచి ఆర్థర్ ఉపశమనం పొందాడు. అందుకు భిన్నంగా తన జీవితాన్ని సరదాగా గడిపాడు.

క్యాన్సర్ రోగులకు చికిత్స

ఫొటో సోర్స్, SANDRINE HEUTZ

కీమోతో నిరంతర సవాళ్లు...

బ్లీనా చికిత్స అందించే ఇతర రోగుల మాదిరిగానే ఆర్థర్‌కు కూడా చికిత్సను ప్రారంభించే ముందు చికిత్సలో తలెత్తే దుష్ఫ్రభావాలు లేదా ప్రమాదకరమైన రియాక్షన్ల తీవ్రతను తగ్గించేలా మందులు ఇచ్చారు.

చికిత్స ప్రారంభించిన తొలి దశలో ఆర్థర్‌కు జ్వరం వచ్చింది. ఆ సమయంలో చెకప్‌ల కోసం ఆసుపత్రిలోనే చికిత్స అందించారు. అనంతరం ఇంటికి పంపారు వైద్యులు.

ఆర్థర్‌ చికిత్స పొందినంత కాలమూ ఆ బ్యాక్‌ప్యాక్‌ను ధరించే ఉన్నాడు. బ్యాటరీ సాయంతో నడిచే పరికరంలోని పంప్ చేసే శబ్దానికి క్రమంగా ఆర్థర్ అలవాటుపడ్డాడని,ప్రశాంతంగా నిద్రపోయాడని తల్లి సాండ్రిన్ తెలిపారు.

కీమో థెరపీతో ఇబ్బంది పడిన ఆర్థర్‌కు బ్లీనా చికిత్సకు మారాక ఉపశమం పొందాడని సాండ్రిన్ అన్నారు.

“కీమో సమయంలో ఆర్థర్ పడిన బాధ మమ్మల్ని కూడా ఇబ్బందిపెట్టింది. నిరంతరం సవాళ్లతోనే గడపాల్సి వచ్చింది. ఆర్థర్‌కు మందులు ఎక్కువగా ఇవ్వాల్సి వచ్చింది” అని చెప్పారు.

“ఆర్థర్‌ వ్యాధిని తగ్గించడానికి అతడిని తీవ్రంగా బాధపెట్టాల్సి వచ్చింది. ఆ థెరపీ మమ్మల్ని కలచివేసింది” అని బాధపడ్డారు.

కీమో థెరపీకి చికిత్స

ఫొటో సోర్స్, SANDRINE HEUTZ

ఫొటో క్యాప్షన్, 2023 ఏప్రిల్‌లో చివరి సర్జరీ ద్వారా ఆర్థర్ చేతికి అమర్చిన పైపును తొలగించారు.

ఆశా కిరణం..

బ్లీనా కిట్‌ను మళ్లీ రీఫిల్ చేసేందుకు ఆర్థర్ ప్రతి నాలుగురోజులకు ఓసారి ఆసుపత్రిని సందర్శించారు. ఇక మిగిలిన సమయమంతా ఆర్థర్ కుటుంబంతో గడిపారు.

“ఆర్థర్ బాధ్యతగా ఆ బ్యాగ్‌ను తగిలించుకున్నాడు. వాస్తవాన్ని అంగీకరించి ఆ చికిత్సకు అలవాటు పడ్డాడు” అని చెప్పారు సాండ్రిన్.

ఏప్రిల్ 2023లో ఆర్థర్‌కు చివరి సర్జరీ చేసి, చేతికి అమర్చిన ఆ పైప్‌ను తొలగించారు.

“సర్జరీ తరువాత ఆర్థర్‌కు విముక్తి లభించింది. అదే మాకు పెద్ద అడుగు” అన్నారు సాండ్రిన్.

కీమోథెరపీకి ప్రత్యామ్నాయంగా బ్లీనా పనిచేస్తుందని, బహుశా 80 శాతానికి పైగా కీమో స్థానాన్ని భర్తీ చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఏటా యూకెలో 450 మందికి పైగా పిల్లలు ఆర్థర్‌ మాదిరిగానే బీ-ఆల్ టైప్ క్యాన్సర్ బారిన పడుతున్నారు.

చీఫ్ ఇన్వెస్టిగేటర్, కన్సల్టెంట్ పిడీయాట్రిక్ హెమటాలజిస్ట్ ప్రొఫెసర్ అజయ్ వొరా మాట్లాడుతూ, “కీమోథెరపీ లుకేమియా కణాలను నాశనం చేయడంతోపాటు ఆరోగ్యమైన కణాలను కూడా గాయపరుస్తుంది. అందువల్ల దుష్ఫ్రభావాలు కలుగుతుతాయి” అన్నారు.

“బ్లీనాట్యూమోమబ్ సున్నితమైన, ప్రేమపూర్వక చికిత్స” అని అజయ్ చెప్పారు.

బ్లీనాతోపాటు మరో ఔషధం టీ-సెల్ థెరపీ (సీఏఆర్-టీ) కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.

అయితే, బ్లీనా థెరపీతో పోలిస్తే అది ఖర్చుతో కూడుకున్నది. అంతేకాకుండా టీ-సెల్ థెరపీ కోసం రోగి శరీరం నుంచి కణాలను సేకరించి, ప్రయోగశాలలో పరిశోధన జరిపి, ఔషధాన్ని తయారు చేసి మళ్లీ ఆ రోగికి చికిత్స అందించాలి. ఇందుకోసం కాస్త సమయం పడుతుంది.

బ్లీనా థెరపీతో ఆర్థర్ క్యాన్సర్ నయమైంది.

“ ఆర్థర్‌ శరీరంలో ఎలాంటి క్యాన్సర్ కణాలు లేవని, అతడు కోలుకున్నాడని వైద్యులు కొత్త ఏడాదిలో నిర్ధారించారు. అది మాకు ఎంత సంతోషకరమైన వార్త అంటే, మేం ఈసారి న్యూ ఇయర్ వేడులకను రెట్టింపు సంతోషంతో జరుపుకున్నాం” అని చెప్పారు సాండ్రిన్.

(నిక్కి స్టియాస్ట్నీ, నీల్ పాటన్‌ల అదనపు రిపోర్టింగ్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)