కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తర్వాత గర్భం దాల్చిన మహిళ, వైద్యుల క్షమాపణ

గర్భం

ఫొటో సోర్స్, BETH MCDERMOTT

ఫొటో క్యాప్షన్, ఇద్దరు కుమారులు సోనీ, కూరేలతో బేత్ మెక్‌డెర్మాట్
    • రచయిత, యాంజీ బ్రౌన్
    • హోదా, బీబీసీ స్కాట్లాండ్

వెన్నెముక సమస్య కారణంగా ఎక్కువ మంది పిల్లల్ని కనొద్దని వైద్యులు సూచించడంతో బెత్ మెక్‌డెర్మాట్, కుటుంబ నియంత్రణ చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.

బెత్‌కు నిరుడు వేసవిలో రెండో బిడ్డ కూరే జన్మించారు. అప్పుడే 31 ఏళ్ల బెత్‌కు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు.

కానీ, కొన్ని నెలల తర్వాత తాను మళ్లీ గర్భవతిని అయినట్లు ఆమె గ్రహించారు.

‘‘నాకు ఏదోలా అనిపించింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ వల్ల శరీరంలో ఇలా జరుగుతుందేమో అని అనుకున్నా. కానీ, గర్భం రావడం వల్ల అలా అవుతుందని అని నేను అనుకోలేదు. చివరకు నేను గర్భవతినని తెలిసినప్పుడు చాలా షాక్‌కు గురయ్యా. నాకు ఊపిరాడలేదు. నా భర్తకు ఫోన్ చేస్తే కంగారుపడకు, నేను ఇప్పుడే ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్నా అని చెప్పారు’’ అని ఆమె వివరించారు.

స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో ఉంటారు బెత్.

బెత్ మెక్‌డెర్మాట్

ఫొటో సోర్స్, BETH MCDERMOTT

రెండు కాన్పుల్లో నరకయాతన

అయిదు గర్భ నిర్ధరణ పరీక్షల్లో పాజిటివ్ ఫలితం, ఆసుపత్రిలో తీసిన స్కానింగ్ కూడా ఆమె గర్భిణి అని ధ్రువీకరించాయి.

బెత్ భర్త షాన్ వయస్సు 31 ఏళ్లు.

బెత్, ఆమె కుటుంబీకులకు క్షమాపణ చెప్పిన స్కాట్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్), కుటుంబ నియంత్రణ చికిత్స 99 శాతానికి పైగా కచ్చితత్వంతో పనిచేస్తుందని తెలిపింది.

ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఈ అంశంపై దర్యాప్తు చేయాలని వైద్యులను కోరారు బెత్.

తన రెండు కాన్పుల సమయంలో బెత్ నరకయాతన అనుభవించారు. తరచుగా ఆసుపత్రి పాలయ్యేవారు. వీల్‌చెయిర్‌లో తిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. గర్భం వల్ల వెన్నునొప్పి సమస్య మరింత తీవ్రతరం అయింది.

ఆమె రెండు కాన్పుల్లో ఈ యాతన అనుభవించిన తర్వాత కుటుంబ నియంత్రణ చికిత్స చేయించుకున్నారు.

ఆమెకు ‘కాడ ఈక్వినా సిండ్రోమ్’ ఉన్నట్లు 2014లో నిర్ధరణ అయింది. ఈ సిండ్రోమ్ వల్ల నడుము నుంచి కిందిభాగం పక్షవాతానికి గురవుతుంది.

దీంతో ఆమెకు వెన్నెముక చికిత్స (స్పైనల్‌కార్డ్ సర్జరీ) జరిగింది.

బేత్ మెక్‌డెర్మాట్

ఫొటో సోర్స్, BETH MCDERMOTT

ఫొటో క్యాప్షన్, ఆసుపత్రిలో ఇద్దరు పిల్లలతో బేత్ మెక్‌డెర్మాట్, షాన్

రెండున్నరేళ్ల ఫిజియో థెరపీ తర్వాత నడక

‘‘ఆరు నెలల పాటు నేను నడవలేకపోయాను. మరెండున్నర ఏళ్ల పాటు ఫిజియో థెరపీ తీసుకున్నా. ఇప్పటికీ ఒక్కోసారి నాకు థెరపీ అవసరం. నా బ్లాడర్ (మూత్రాశయం) దానంతట అదే మరమ్మతు కూడా చేసుకోలేదు. ఒక్కరోజులో నా జీవితం మొత్తం మారిపోయింది’’ అని బేత్ చెప్పారు.

ఆరు నెలల పాటు వీల్‌చెయిర్‌కే పరిమితమైన తర్వాత బెత్, క్రచెస్ సహాయంతో, వాకర్‌ను ఉపయోగించి నడవడం మళ్లీ నేర్చుకున్నారు.

‘‘నాకు ఇప్పటికీ ప్రతిరోజూ నొప్పి ఉంటుంది’’ అని ఆమె చెప్పారు.

ఆమె ఎప్పటికీ పిల్లల్ని కనలేకపోవవచ్చని వైద్యులు చెప్పారు. కానీ, ఆరేళ్ల క్రితం బేత్ తొలి బిడ్డకు జన్మనిచ్చారు.

బేత్, షాన్ తమకు 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి ఒకరికొకరు తెలుసు.

‘‘తొలిసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు నేను ఊహించలేదు. నాకు పిల్లలు పుడతారో లేదో అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు ఈ వార్త తెలియడంతో చాలా సంతోషించాను. కానీ, నాకు ప్రెగ్నెన్సీలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయని డాక్టర్లు చెప్పడంతో మేం భయపడ్డాం. అయినప్పటికీ ప్రయత్నించాలనే అనుకున్నాం. సాధారణంగానే గర్భం దాల్చినప్పుడు వెన్నునొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇక నేనున్న స్థితిలో అది మరీ దారుణంగా మారింది. విపరీతమైన నడుము నొప్పితో కదలడం కూడా కష్టమైంది. వారాల తరబడి ఆసుపత్రిలో ఉండటం, మళ్లీ ఇంటికి రావడం ఇదే జరిగింది. తర్వాత వీల్‌చెయిర్ ఉపయోగించాల్సి వచ్చింది’’ అని ఆమె వివరించారు.

బేత్ మెక్ డెర్మాట్

ఫొటో సోర్స్, BETH MCDERMOTT

‘నమ్మి చికిత్స చేయించుకుంటే మళ్లీ అదే పరిస్థితి’

ఈ దంపతులకు ఇప్పుడు ఆరేళ్ల సోనీ, ఏడు నెలల కూరే అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

‘‘కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. కానీ, నా ఆనారోగ్యం రెండు కాన్పులను భయంకరంగా మార్చడంతో మళ్లీ గర్భం దాల్చాలంటే భయమేసింది. అందుకే ఆపరేషన్ చేయించుకున్నా. కానీ, దీన్ని నమ్మి ఈ చికిత్సను చేయించుకున్నందుకు మళ్లీ నాకు అదే భయంకర పరిస్థితి ఎదురైంది. నిరాశతో పాటు కోపం వచ్చింది. కుటుంబ నియంత్రణ ఆపరేషనే కష్టం అనుకుంటే, మళ్లీ గర్భస్రావం చేయించుకోవడం ఇంకా కఠిన నిర్ణయం’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.

చివరకు, ఆ దంపతులు మూడో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు.

‘‘ఏడు నెలల బిడ్డ చేతుల్లోనే ఉండగా మరో బిడ్డను కనాలనే నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం’’ అని ఆమె అన్నారు.

కుటుంబ నియంత్రణ చికిత్సలో ఎక్కడ తప్పు జరిగిందో కనుగొనాలని ఆమె వైద్యులను కోరారు. ఈ చికిత్సలో 1 శాతం వైఫల్య రేటు ఉంటుందని, దాని గురించి వారికి ముందే చెబుతామని ఎన్‌హెచ్‌ఎస్ అంటోంది.

గర్భం

ఫొటో సోర్స్, JONAS GRATZER

మెక్‌డెర్మాట్, ఆమె కుటుంబీకులు ఎదుర్కొన్న బాధకు మేం బహిరంగంగా క్షమాపణ చెబుతున్నామని స్కాట్లాండ్‌లోని ఎన్‌హెచ్‌ఎస్ లోథియాన్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ట్రేసీ గిల్లీస్ అన్నారు.

‘‘మహిళలకు చేసే కుటుంబ నియంత్రణ చికిత్స 99 శాతానికి పైగా ప్రభావవంతంగా ఉంటుంది’’ అని ట్రేసీ చెప్పారు.

అయితే, ఈ చికిత్సలో ఒక చిన్న ప్రమాదం ఉంటుంది. ఈ చికిత్సలో బ్లాక్ చేసిన ట్యూబ్‌లు వెంటనే లేదా కొన్నేళ్ల తర్వాత మళ్లీ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ చికిత్స చేయడానికి ముందు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే జాగ్రత్తలు తీసుకుంటాం. బేత్ మెక్‌డెర్మాట్‌తో మా బృందాలు మాట్లాడుతూనే ఉన్నాయి. ఇంకేమైనా ఇబ్బందులు తలెత్తినా మాకు చెప్పాలని బేత్‌ను కోరుతున్నాం’’ అని చెప్పారు.

బేత్‌కు ఎన్‌హెచ్‌ఎస్ లోథియాన్ ఆసుపత్రి రాతపూర్వక క్షమాపణను పంపింది.

‘‘ఇప్పుడు నేను ఆ షాక్ నుంచి కోలుకున్నా. కానీ, చాలా భయంగా ఉంది. ఎందుకంటే గత రెండు కాన్పుల్లో చాలా బాధను అనుభవించాను. ఇదో అద్భుతం. ఈ బిడ్డ పుట్టుకకు ఏదో కారణం ఉంటుంది. పుట్టబోయేది అమ్మాయి కావాలని నేను కోరుకుంటున్నా. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంది. ఇదొక్కటే సంతోషకర అంశం. క్షమాపణ చెబితే సరిపోదు. నాకు సమాధానాలు కావాలి. కుటుంబ నియంత్రణ చికిత్సలో ఉండే 1 శాతం వైఫల్య రేటు కారణంగా ఇది విఫలమైందా? లేదా ఈ చికిత్స చేసేటప్పుడు ఏదైనా పొరపాటు జరిగిందా? అనే విషయాలు నేను తెలుసుకోవాలి అనుకుంటున్నా’’ అని బేత్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)