పద్మ విభూషణ్ - చిరంజీవి: ‘ఇది కదా నా ప్రపంచం, ఇది కదా నిజమైన సంతోషం’ అని ఆయన ఎప్పుడన్నారు?

ఫొటో సోర్స్, Chiranjeevi
- రచయిత, పసునూరు శ్రీధర్‌బాబు
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘ఇది కదా నా ప్రపంచం. ఇది కదా నాకు నిజమైన సంతోషం’ అన్నారు చిరంజీవి ఏడేళ్ళ కిందట ఇదే జనవరి మాసం చలిలో ‘ఖైదీ నంబర్ 150’ సినిమా విడుదలకు వారం రోజుల ముందు జూబ్లీ హిల్స్‌లోని అద్దె ఇంట్లో నాతో మాట్లాడుతూ.
అప్పుడు జూబ్లీహిల్స్‌లోని ఆయన సొంత ఇల్లు రినోవేషన్ జరుగుతోంది. రామ్‌చరణ్, ఉపాసనల పెళ్ళయిన తరువాత ఆ ఇంటిని మరింత సౌకర్యవంతంగా, ఆధునికంగా మార్చేందుకు చిరంజీవి కుటుంబం అదే వీధిలోని ఒక ఇంట్లో కొంత కాలం అద్దెకు దిగింది.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, రాజకీయ బాధ్యతల భారాన్ని భుజాల మీంచి పూర్తిగా దించేసిన తరువాత చిరంజీవి తన 150 చిత్రం విడుదలకు ముందు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాట అది.
ఆ ఇంటర్వ్యూలో నేను అడిగిన మొదటి ప్రశ్న, ‘ఇప్పుడెలా ఉంది?’ అని.
ఆ ప్రశ్న వినగానే చిరంజీవి మనసులోంచి దాదాపు ఒక దశాబ్దకాలం డిలిట్ అయిపోయిందేమో అనిపించింది. 2007లో శంకర్ దాదా జిందాబాద్ సినిమా విడుదలైన తరువాత చిరంజీవి 2008 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీని ప్రకటించారు.
అప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా చాలా బలంగా ఉన్నారు.
పెద్దగా యాంటీ-ఇంకంబెన్సీ లేదు. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చినప్పుడున్న కాంగ్రెస్ వ్యతిరేక వాతావరణం లేదు. జలగం వెంగళరావు మొదలుకొని కోట్ల విజయ భాస్కర రెడ్డి దాకా అయిదేళ్ళలో అయిదుగురు ముఖ్యమంత్రులు మారిన అస్థిర పరిస్థితులు లేవు.
బడుగువర్గాల ప్రతినిధిగా ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన అంజయ్యను బేగంపేట విమానాశ్రయంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రాజీవ్ గాంధీ అవమానించడం, అనంతరం తెలుగువాడి ఆత్మగౌరవం ఒక నినాదంగా మారడం వంటి పరిణామాలు అసలే లేవు.
అయినప్పటికీ, పాదయాత్రతో జననేతగా ఎదిగిన వైఎస్ రాజశేఖరరెడ్డి, అప్పటికే దాదాపు దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉండి హైటెక్ సీఎంగా గుర్తింపు పొందిన నారా చంద్రబాబు నాయుడు బరిలో ఉండగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 16.3% ఓట్లతో 18 అసెంబ్లీ స్థానాలు గెల్చుకుంది.
ఆ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి 36 శాతం ఓట్లు వస్తే టీడీపీ మహాకూటమికి వచ్చిన ఓట్లు 28 శాతం. ఇక తెలంగాణలో 10 సీట్లు గెల్చుకున్న టీఆర్ఎస్ పార్టీకి 4 శాతం కంటే తక్కువ శాతం ఓట్లే వచ్చాయి.

ఫొటో సోర్స్, Chiranjeevi
ఎన్టీఆర్ ఘనమైన రాజకీయ రంగప్రవేశాన్ని రిపీట్ చేయాలని కలలుగన్న చిరంజీవి అప్పటి తన పార్టీ పనితీరును విఫలయత్నంగా విశ్లేషించుకున్నారు. ఆయన రాజకీయ రంగప్రవేశం వైఎస్సార్‌కు మరో టర్మ్‌ను ఖరారు చేసిందన్న విశ్లేషణల సంగతి ఎలా ఉన్నా 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేంతవరకు ఆయన పార్టీని నడిపగిలిగి ఉంటే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండేదో చెప్పలేం.
కానీ, చిరంజీవికి రాజకీయ జీవితం పెద్దగా కాదు, అస్సలు కిక్ ఇవ్వలేదు. సినిమాల్లో నటుడిగా కథ వేరు. ఒక పాత్రను ఒప్పుకుంటే ఇక ఇరవై నాలుగ్గంటలూ ఆదే యావ.
‘అందరివాడు’ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నన్ను చాలా సార్లు శ్రీధర్ అని కాకుండా ‘సిద్ధార్థా’ అని పలకరిస్తూ మాట్లాడారు. ఆ సినిమాలో తండ్రీకొడులుగా డ్యూయల్ రోల్ పోషించారు చిరంజీవి. అందులో కొడుకు పేరు సిద్ధార్థ. అలాంటి చిరంజీవి 2014 వరకూ కేంద్ర మంత్రి పదవిలో ఆ తరువాత 2018 వరకూ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.
కానీ, ఖైదీ నెంబర్ 150 సినిమా సెట్లోకి వెళ్ళిన మొదటి రోజునే తనను తాను మళ్ళీ సొంతం చేసుకున్న అనుభూతికి లోనయ్యారు. ఒడ్డున పడ్డ చేపపిల్లను ఒక అల వచ్చి తనలోకి లాక్కున్నప్పుడు ఎలా మురిసిపోతుందో అలా మురిసిపోయారు.
అందుకే, ‘ఇది కదా నా ప్రపంచం... ఇది కదా నా జీవితం’ అని ఎలాంటి భేషజం లేకుండా అనగలిగారు. రాజకీయాల్లో అనుభవించిన ఉత్థానపతనాలతో తనకు నిమిత్తం లేదన్నట్లుగా నిలబడ్డారు.
తెల్ల కుర్తా పైజామాలు వదిలేసి చక్కగా ఊదారంగు అరచేతుల చొక్కాతో మోచేతులు నిమురుకుంటూ చిద్విలాసంగా మాట్లాడారు. అది ‘చిరంజీవి ఈజ్ బ్యాక్’ అనదగిన మూమెంట్.
అభిమానులకన్నా ఎక్కువగా చిరంజీవినే మురిపించిన మూమెంట్.

ఫొటో సోర్స్, Getty Images
సినిమా నటనలాగే పాలిటిక్స్ కూడా ఒక ఆర్ట్ అంటారు. మరీ అంత బ్యాడ్ ఆర్ట్ కాకపోయినా, పాలిటిక్స్ ఆర్ టెరిబిల్ అంటారు పొలిటికల్ సైంటిస్టులు. అంతేకాదు, ఇటీజ్ డిఫికల్ట్ టు మేక్ పొలిటికల్ ఆర్ట్ వర్క్... అని కూడా అంటారు.
‘దట్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ’ అనే ఆత్మఘోష చిరంజీవిలో మొదటి నుంచే ఉంది. పార్టీ పెట్డడానికి దాదాపు మూడేళ్ళ ముందు ‘అందరివాడు’ షూటింగ్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో జరుగుతున్నప్పుడు ఓ ఇంటర్వ్యూ కావాలని చిరంజీవిని కలిశాను.
రెస్టారెంట్ షాట్‌లో దర్శకుడు శ్రీను వైట్ల ఏవో సజెషన్స్ ఇస్తున్నాడు. నేను అది గమనిస్తూ చుట్టూ మూగిన జనంలో ఉన్నాను. షూటింగ్ బ్రేక్ చెబితే చిరంజీవి వైపు సైగ చేద్దామని.
కాసేపటికి షాట్ ఓకే అయింది. చిరంజీవి వెళ్ళి ఓ కార్నర్‌లో రిలాక్స్ అవుతున్నారు. నన్ను చూడలేదు కాబట్టి ఇక కలవడం కష్టమే అనుకున్నాను. కానీ, ఇంతలోనే ఒక అసిస్టెంట్ ఎవరో నా దగ్గరకు వచ్చి ‘మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు’ అని పిలిచారు. ఆయన నన్ను చూడలేదని అనుకున్నాను. కానీ, కెమెరా రోల్ అవుతుంటే షాట్లో ఇన్వాల్వ్ అయిపోతూనే ఓ కంట నన్ను గమనించారు.
షాట్ ఓకే కాగానే నాకు కబురొచ్చింది. దాదాపు పదిహేను నిమిషాలు మాట్లాడాను. చిన్న ఇంటర్వూనే... కానీ, దాదాపు నాలుగు పేజీలు రాసేంత విషయాన్నిచ్చారు. ఆ రోజుల్లో కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకునే స్టార్స్ దేశంలో వేళ్ళ మీద లెక్కించేంత మందే ఉన్నారు. చిరంజీవి నాలుగు కోట్లు దాటిన నైజామ్‌కు సోల్ హక్కుదారుగా మారిన రోజులవి.
మధ్యాహ్నం ఒంటిగంటకు ఇంటర్వ్యూ రికార్డు చేసుకుని రిటర్న్ అయిన కొద్ది నిమిషాలకే చిరంజీవి ఫోన్ చేశారు.
‘‘షూటింగ్ బ్రేక్‌లో తృప్తిగా మాట్లాడినట్లు అనిపించలేదు. ఇవాళ ఆఫ్టర్‌నూన్ షూటింగ్ క్యాన్సిల్ చేశాం. ఇంటికి రావచ్చు కదా, ప్రశాంతంగా మాట్లాడుకుందాం’’ అని ఆఫర్ ఇచ్చారు. అంతకన్నా ఇంకేం కావాలి నాకు? గంటలో ఆయన ఇంట్లో వాలిపోయాను.

ఆరోజు చాలా తేలికగా, ఆత్మీయంగా సాగిన సంభాషణల్లో అడిగేశారిలా, ‘రాజకీయాల్లోకి నేను వెళ్ళడం కరెక్టేనా’ అని. ఇంకా, చెప్పాలంటే, మనకు అవసరమా అదంతా అన్నట్లుగానూ ధ్వనించింది ఆయన స్వరం. ‘రాజకీయాలు మీకు పర్సనల్ స్పేస్ లేకుండా చేయొచ్చు. మీరిక సినిమాలు పూర్తిగా వద్దనుకుంటే వెళ్లొచ్చు’ అని చెప్పాను. అంతేకాదు, ‘ఎన్టీఆర్‌ను రిపీట్ చేస్తానని ఆశపడకూడదు. టైమ్ అండ్ స్పేస్ మారిపోయాయి. పోరాడాల్సి ఉంటుంది’ అని కూడా చెప్పాలనుకున్నాను. కానీ, చెప్పలేదు.
ఆయన చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. తన ఆర్బిట్‌లోకి ఆహ్వానించిన మనుషులతో చాలా ప్రేమగా మాట్లాడుతారు. అంత పెద్ద స్టార్ అయి ఉండీ బయటకు వచ్చి సాగనంపుతారు. ఎలా వెళతారు, మా డ్రైవర్‌కు చెప్పనా అని అడుగుతారు. అందుకే, చిరంజీవికి నచ్చని విషయాలు ఆయనతో చెప్పడం ఆయనకు చాలా దగ్గరగా ఉన్నవారికి కూడా సాధ్యం కాకపోవచ్చు.
ఒక్కోసారి దానివల్ల చిక్కులు కూడా వస్తుంటాయి. అలాంటివాటిని ఆయన ఎదుర్కొన్నారు కూడా.
పాలిటిక్సులోకి వచ్చిన తరువాత పర్సనల్ లైఫ్‌లో సగటు మనిషికి ఎదురయ్యే సినిమా కష్టాలన్నీ చిరంజీవి కూడా ఎదుర్కొన్నారు. స్నేహితులుగా ఉన్నవారు కూడా ప్రత్యర్థులుగా కఠినంగా మాట్లాడడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయేవారు.
‘ఎంత రాజకీయలు అయితే మాత్రం వ్యక్తిగత స్థాయిలో ఇంత కఠినంగా బురద చల్లుకోవాలా’ అని అడిగేవారు. ‘పాలిటిక్స్ ఈజ్ ఎ రూత్‌లెస్ బిజినెస్, ఇట్ మేక్స్ ఆర్టిస్ట్ రిలేటివ్‌లీ హానరబుల్’ అన్నది చిరంజీవిని లోపల్లోపల బాగా కుదిపేసే ఉంటుంది.
ఇవ్వన్నీకాక రాజకీయాల్లో కనిపించని శ్రమ చాలా ఉంటుంది. డెభ్బై ఎనభై యేళ్ల వయసులోనూ ఎండన బడి రోజంతా తిరిగేవారు కనిపిస్తారు. రోజంతా తిరగడం మనుషులతో మాట్లాడడం, వినడం ఇవ్వన్నీ పైకి కనిపించేంత సులభమైనఅంశాలు కావు.
అధికారంలో ఉన్నపుడు కనిపించే ఆడంబరాన్ని మాత్రమే చాలా మంది చూస్తారు. కానీ ప్రయాణం అంత సులభంగా ఏమీ ఉండదు. లిటరల్గా చెమటోడ్చాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
వెండితెరపై తెలుగు సినిమాకు మకుటం లేని మారాజుగా వెలిగిపోయిన చిరంజీవి ఆ సౌఖ్యాలు, పొగడ్తలు మాత్రమే అలవాటైన చిరంజీవి అంతగా ఎండన పడి తిరగడాన్ని తట్టుకోలేకపోయారా, రోజువారీ ప్రశంసల బదులు నానా మాటలు పడాల్సి రావడం అనే కొత్త స్థితిని జీర్ణించుకోలేకపోయారా అనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి.
రాయలసీమ పర్యటనలో ఎండలో వాహనంలో తిరుగుతూ ఒక అనుచరుడి ఇంటిలోకి వెళ్లినపుడు ఆయన చూపిన తీవ్ర అసహనం ఈ ప్రయాణంలో ఒక ఉదాహరణ మాత్రమే.
అందుకే, చిరంజీవి నటుడిగా తన థర్డ్ ఇన్నింగ్స్‌లో ముందుకు వెళ్లారు. ఎప్పట్లాగే కొన్ని విజయాలూ, కొన్ని పరాజయాలూనూ. అవేమీ ఆయనకు కొత్త కాదు. కానీ, ఆయన ఆత్మికంగా తనకు నచ్చిన ప్రపంచంలో ఉన్నారు.
మంత్రిగా ఉన్న సమయంలోనే రామ్‌చరణ్ పెళ్ళి చేశారు. ఎంపీగా బాధ్యతలు ముగిసిన రోజునుంచి తనదైన రంగుల ప్రపంచంలో తనను తాను పునర్దర్శించుకోవడం మొదలుపెట్టారు.
ఇప్పుడు చాలా దూరం ప్రయాణించారు. ‘ప్రాణం ఖరీదు’ సినిమాలో అప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మాధవి ముందు బెరుకు బెరుగ్గా కెమెరా ముందుకు వచ్చిన చిరంజీవికి, తనకు స్టార్ డమ్ తెచ్చిన ఖైదీలో అదే మాధవితో కలిసి నర్తించిన చిరంజీవికి మధ్య చాలా సంఘర్షణ ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
‘ఖైదీ సినిమాలో అడవుల్లోంచి పారిపోయిన వ్యక్తికి ఎలాంటి డ్రెస్ ఉండాలో ఆలోచించి, నల్ల క్లాత్‌కు రంధ్రం చేసి తలమీంచి దింపుకుని నడుముకు చుట్టుకుంటానని’ సూచించిన చిరంజీవి, మోసగాడు సినిమా చేస్తూ రాత్రిళ్ళు కాల్షీట్స్ ఖాళీగానే ఉన్నాయి కదా అన్న నిర్మాత కోసం నెలరోజులపైగా పగలూ రాత్రీ పని చేసి ‘పున్నమినాగు’ను పూర్తి చేసిన చిరంజీవి ఒక పాత్ర కోసం ఎంతలా అలమటిస్తారో చాలా మందికి తెలియకపోవచ్చు.
ఇండియా టుడే పత్రిక విజేత అనే టైటిల్‌తో ‘చిరంజీవి స్పెషల్’ సంచికను 2008లో విడుదల చేసింది. ఆ ప్రత్యేక సంచిక కోసం చిరంజీవి బయోగ్రఫీ రాయడానికి మూడు నాలుగు రోజులు సుదీర్ఘంగా ఆయనతో గడిపినప్పుడు ఆయన మరింత అనుభవంలోకి వచ్చారు.
ఈ మధ్యతరగతి జీవి సినిమాను నమ్ముకుని పరిశ్రమకు వచ్చారు. ఆ ప్రయత్నంలో ఆయన కోరుకున్నది గొప్ప స్టార్‌డమ్. ‘అది నేను కోరుకున్నదానికన్నా ఎన్నో రెట్లు నాకు లభించింది’ అంటారాయన.
కానీ, చిరంజీవి ‘ప్రాణం ఖరీదు’ ఏమిటన్న ప్రశ్న ఆయనను ఇంకా వీడిపోలేదు. దాదాపు 160 సినిమాలు చేసిన తరువాత కూడా ఇంకా చేయాల్సిందేదో ఉందనే వెలితి ఆయన మాటల్లో ధ్వనిస్తూనే ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్టిస్టుగా ఒక రుద్రవీణ, స్వయంకృషి తనకు తృప్తి కలిగించాయని చెబుతారు చిరంజీవి. కాస్తోకూస్తో ఆఫ్‌బీట్ చిత్రాల వల్ల కలిగే గౌరవం మీది మమకారంతో. కానీ, మాస్ ఎంటర్టెయినర్‌గా ఒక ఖైదీ, ఒక గ్యాంగ్ లీడర్, ఒక దొంగమొగుడు, ఒక ఘరానా మొగుడు, ఒక జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రాలను సగర్వంగా తన ఫేవరెట్స్‌గా క్లెయిమ్ చేసుకుంటే తప్పేంటి? మంచుపల్లకి, శుభలేఖ, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, మంత్రిగారి వియ్యంకుడు వంటి చిత్రాలలో ‘గివప్ ద క్యారెక్టర్.. యూజ్ యువర్‌సెల్ఫ్’ అన్నట్లు సహజంగా ఒదిగిపోయిన సందర్భాల్ని చెరిష్ చేసుకుంటే నష్టమేంటి?
విజయమో, విషాదమో... చిరంజీవి ఈజె స్టార్. అభిమానుల భాషలో మెగాస్టార్. స్టార్‌లకూ, ఆర్టిస్టులకూ మధ్య తేడా ఏంటి? స్టార్లు సినిమా కథను తమకు సూట్ అయ్యేలా ఎలా మార్చుకోవాలా అని చూస్తారు. ఆర్టిస్టు... కథకు తాను ఎలా సూటవ్వాలా అని ప్రయత్నిస్తారు.
అందుకే, ఆర్టిస్ట్ కెరీర్ హారిజాంటల్‌గా ఉంటుంది. వైవిధ్యమైన పాత్రలతో మైదానంలా విస్తరిస్తుంది. స్టార్ కెరీర్ అలా కాదు. దాదాపు ఒకే తరహా పాత్రలతో - ఇమేజితో వర్టికల్‌గా పెరుగుతుంది. ఒక శిఖరంలా నిలబడుతుంది.
నసీరుద్దీన్ షా, ఓంపురిల నుంచి ఇప్పటి నవాజుద్దీన్ సిద్దిఖిల వరకూ కొందరు ఆర్టిస్టులుగా రాటుదేలిపోతారు. కమలహాసన్ లాంటి వాళ్ళు రెండు పడవల్లోను కాలుపెట్టి ప్రయాణం చేస్తుంటారు. ఒక్కోసారి మునిగిపోతారు. ఒక్కోసారి వెలిగిపోతారు.
అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు దీవార్ చేసినా, కూలీ చేసినా మాస్ హీరోలుగా చెలరేగిపోతూనే ఒక సిల్‌సిలా, ఒక కభీకభీ వంటి హిస్ట్రియానిక్స్‌తో ఆర్టిస్టిక్ పర్సెప్షన్స్‌లోకి చులాగ్గా దూరిపోతారు. అలాంటి అదృష్టం అందరికీ ఉండకపోవచ్చు.
కానీ, చిరంజీవి నటుడిగా మొదలై శిఖరంలా ఎదిగిన స్టార్. దాదాపు అర్ధశతాబ్దం పాటు తెలుగు సినిమా ప్రేక్షకుల్ని తన డౌన్ టూ ఎర్త్ ప్రెజెన్స్‌తో అలరించిన 'మెగాస్టార్'. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల శకం తరువాత విస్తరించిన మల్టీమీడియా ఎంటర్‌టెయిన్మెంట్ యుగంలో మార్కెట్ స్టామినాను రీడిఫైన్ చేసిన ఒకే ఒక్కడు.
ఇవి కూడా చదవండి:
- బటర్ చికెన్, దాల్ మఖనీ వంటకాలు ఎవరు కనిపెట్టారు? తేల్చనున్న దిల్లీ హైకోర్టు
- అయోధ్య రామాలయం: ఉత్తరాది, దక్షిణాది ఆలయాల ఆర్కిటెక్చర్లో తేడా ఏమిటి?
- అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ బీజేపీకి మరోసారి అధికారం కట్టబెడుతుందా?
- రామనామీ: ఒళ్లంతా రామ నామాలే పచ్చబొట్లుగా వేసుకునే ఈ తెగ కథేంటి? వీళ్లు ఆరాధించేది ఏ రాముడిని?
- నువ్వుల లడ్డూ: 'తీయని మాటలు పలికేలా చేసే తీపి వంటకం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














