సరిలేరు నీకెవ్వరు: పాత రోజులను గుర్తు చేసుకున్న చిరంజీవి, విజయశాంతి -ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, facebook/maheshbabu
మహేశ్ బాబు 'సరిలేరునీకెవ్వరు' సినిమా మెగా సూపర్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ నటి విజయశాంతి సందడి చేశారంటూ 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.
చిరంజీవి, విజయశాంతిలు పాత జ్ఞాపకాలు, రాజకీయ పరిణామాలను గుర్తు తెచ్చుకుని నవ్వులు పూయించారంటూ వారి మధ్య జరిగిన సంభాషణను అందించారు.
చిరంజీవి మాట్లాడుతూ ''సండే అననురా.. మండే అననురా...ఎన్నడు నీదాన్నిరా... అని మాట ఇచ్చి నా మనిషిగా, నా సినిమాలో నా హీరోయిన్‌గా ఉండకుండా నన్ను వదిలేసి పదిహేను సంవత్సరాలు దూరంగా వెళ్లిపోయి మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కనిపించింది విజయశాంతి. చెన్నై టీ నగర్‌లో మా ఇంటి ఎదురుగా విజయశాంతి ఇల్లు ఉండేది. దాదాపు 20 సినిమాలు చేశాం. హీరో, హీరోయిన్‌లా కాకుండా కుటుంబసభ్యుల్లా ఉండేవాళ్లం. ఎంత చక్కగా హుషారుగా, ఫ్రెండ్లీగా సినిమాలు చేసేవాళ్లం. రాజకీయాల్లోకి నాకంటే ముందు వెళ్లినందుకు విజయశాంతిపై నాకు చిన్న కోపం ఉంది.'' అని అన్నారు.
అన్ని సినిమాలు చేశాం.. చాలా కాలం జర్నీ చేశాం. అలాంటి నన్ను విమర్శించాలని నీకు ఎలా అనిపించింది అని విజయశాంతి చెవిలో చిరంజీవి అడగడంతో స్టేజ్ మొత్తం నవ్వులతో హోరెత్తింది.
విజయశాంతి: మైక్ తీసుకొని చిరంజీవి పంచ్ డైలాగ్ వేశాడు. చేయి చూశావా ఎంత రఫ్‌గా ఉంది. రఫ్పాడిచ్చేస్తా జాగ్రత్త. రాజకీయం వేరు. సినిమా వేరు. అయినా మనిద్దరం మిత్రులం. మా హీరో మీరు. నేను మీ హీరోయిన్ను. ఇద్దరం కలిసి 20 సినిమాలు చేశాం. ఎక్కువ సినిమాలు మీతో చేశా. మళ్లీ కలిసి నటిద్దాం.
చిరంజీవి: ఎన్ని సినిమాలు. ఎన్ని పాటలు. అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. వానా వానా వెళ్లువాయే సాంగ్స్ అవన్నీ గుర్తుకొస్తున్నాయి. విజయశాంతిని చూస్తుంటే నాకొకటి అనిపిస్తుంది.
''రాజకీయాల్లోకి వెళ్లిపోయాను. గ్లామర్ పోయింది. వర్చస్సు తగ్గింది. పొగరు తగ్గిపోయింది. వగరు, ఫిగరు, అనుకుంటున్నారా?. పదిహేను సంవత్సరాల తర్వాత వచ్చినా సరిలేరు నీకు ఈ సినిమాతో అదే గ్లామరు, అదే పొగరు, అదే ఫిగరు, అదే అందం, అదే సొగసు’’ అనే డైలాగ్ చెప్పి చిరంజీవి.. విజయశాంతిని పొగడ్తల వర్షంతో నింపేశారు.
విజయశాంతిని చూస్తుంటే గుండె కొంచెం కిందకి జారుతోందని నవ్వుకున్నారు. రాజకీయాలు శత్రువులను పెంచుతుంది. మా సినిమా పరిశ్రమ స్నేహితుల్ని, స్నేహాన్ని పెంచుతుంది. కొన్ని పరిస్థితుల్లో విజయశాంతి నన్ను విమర్శించినా నాకు తిరిగి విమర్శించాలని అనిపించలేదు. ఒక్క మాట కూడా అనలేదు. నాకు మనసు రాదు.
విజయశాంతి: నా వెనకాల అనలేదు కాదా?
చిరంజీవి: నీ ముందు ఉన్నప్పుడే అనలేకపోతున్నా.. నీ వెనకాల అంటానా?.
విజయశాంతి: ఎప్పుడూ నీపై గౌరవం ఉంది. అభిమానం, గౌరవం ఉండబట్టి 20 సినిమాలు కలిసి చేశాం. రాజకీయాలు వేరు.. సినిమాలు వేరు. ప్రజల కోసం పోరాటం చేశా. కానీ కొన్ని సందర్భాల్లో తప్పదు. రాజకీయాల్లోకి వెళితే ఉద్యమన్నది డ్యూటీ. స్నేహం అన్నది వేరు. దానికి నేను న్యాయం చేశా. ఏది ఏమైనా మా హీరో చిరంజీవినే.
చిరంజీవి: మహేశ్ బాబు పుణ్యమా అంటూ విజయశాంతి, నేనూ కలిశాం. నా స్నేహితురాలని కలిసేలా చేసిన మహేశ్‌కు థ్యాంక్స్ అంటూ అంటూ సంభాషణ ముగించారని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, facebook/ktr
వరంగల్‌లో టెక్ కంపెనీలు ప్రారంభం
తెలంగాణ ఐటీ పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు.. ప్రముఖ కంపెనీలు టెక్ మహేంద్రా, సైయెంట్ క్యాంపస్‌లను వరంగల్‌లో మంగళవారం ప్రారంభించనున్నారని 'నమస్తే తెలంగాణ' కథనం ప్రచురించింది.
''వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలోని ఐటీ పార్కులో సైయెంట్, టెక్ మహేంద్రా క్యాంపస్‌లను ఏర్పాటుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలనే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యాలు వీటితో నెరవేరుతున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మార్గనిర్దేశాలకు అనుగుణంగా ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ కృషి ఫలితాలనిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలంటే హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమయ్యేవి. ఇతర ప్రాంతాలకు పరిశ్రమల విస్తరణకు కానీ, ఐటీ కంపెనీల పెట్టుబడులకు కానీ అప్పటి ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నంచేయలేదు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వితీయశ్రేణి నగరాలైన వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో ఐటీ పార్కులను ఏర్పాటుచేస్తున్నది'' అని అందులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, facebook/Kishan Reddy Gangapuram
‘కేంద్ర మంత్రిగా హామీ ఇస్తున్నా.. సీఏఏతో భారతీయ ముస్లింలకు ఎలాంటి నష్టం లేదు’
మోది ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి విమర్శించేందుకు ఆస్కారం లేకపోవడంతో.. భాజపాను రాజకీయంగా ఎదుర్కొలేక, పౌరసత్వ సవరణ చట్ట(సి ఏ ఏ)న్ని రాజకీయం చేస్తూ వదంతులు సృష్టిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విపక్షాలపై మండిపడ్డారని 'ఈనాడు' కథనం తెలిపింది.
''దేశంతోపాటు ప్రపంచంలో ఉన్న మన దేశానికి చెందిన ముస్లింలకు ఈ చట్టం ద్వారా ఎలాంటి నష్టం ఉండబోదని కేంద్రమంత్రిగా హామీ ఇస్తున్నానున్నారు. భాజపా ఆధ్వర్యంలో గృహసంపర్క్ అభియాన్‌లో భాగంగా సీఏఏ పై ప్రజల వద్దకు వెళ్లి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఆదివారం ఆయన సనత్ నగర్ నియోజకవర్గంలోని పద్మారావు నగర్‌లో ప్రారంభించారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అయినా నిరసనలు వ్యక్తంచేస్తూ, ఆస్తులకు నష్టం కలిగిస్తున్నారని.. దీనిపై సోనియా రాహుల్, కేసీఆర్, ఒవైసీలు సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశార''ని ఆ కథనంలో తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు వచ్చేశాయి. బీసీలకు 33 శాతం వరకు రిజర్వేషన్లు అమలు చేయవచ్చని రాష్ట్ర మున్సిపాలిటీల చట్టంలో విధించిన గరిష్ట పరిమితి మేరకు మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 32.5 నుంచి 33 శాతం వరకు రిజర్వేషన్లు దక్కనున్నాయి. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల చైర్‌పర్సన్, 13 మున్సి పల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి ఆదివారం హైదరాబాద్‌లో ప్రకటించారని 'సాక్షి' కథనం తెలిపింది.
''123 మున్సిపాలిటీల చైర్‌పర్సన్ స్థానాల్లో బీసీలకు 40, ఎస్సీలకు 17, ఎస్టీలకు 4 రిజర్వ్‌కాగా ఓపెన్ కేటగిరీకి 62 స్థానాలు రిజర్వు అయ్యాయి.
13 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాలకుగాను ఎస్సీ, ఎస్టీలకు చెరో స్థానం, బీసీలకు 4, ఓపెన్ కేటగిరీలో 7 స్థానాలు రిజర్వు అయ్యాయి. రాష్ట్రంలో కొత్త మున్సిపల్ చట్టం అమల్లోకి రావడంతో మళ్లీ కొత్తగా రిజర్వేషన్లను ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలతోపాటు మరో రెండు పర్యాయాలు కలిపి మొత్తం మూడు వరుస సాధారణ ఎన్నికల్లో ఇవే రిజర్వేషన్లు అమలు కానున్నాయి. రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు కలిపి మొత్తం 141 పురపాలికలు ఉన్నాయి. ఇందులో షెడ్యూల్డ్ ఏరియా పరిధిలో ఉన్న 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగ సవరణ జరపాల్సి ఉంది.
గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా ఏర్పడిన 2 కొత్త మున్సిపాలిటీల పరిధిలోని కొన్ని గ్రామ పంచాయతీల పదవీకాలం ఇంకా ముగియలేదు. దీంతో ఈ ఐదు మున్సిపాలిటీలను మినహాయించి రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లకు సంబంధించిన చైర్‌పర్సన్, మేయర్ స్థానాలకు రిజర్వేషన్లను ప్రకటించారు. మరోవైపు ఆదివారం జిల్లా కలెక్టర్లు స్థానికంగా ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలోని వార్డులు/డివిజన్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రకటించారు. దీంతో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన ప్రధాన ఘట్టం ముగిసింది. ఈ నెల 7న రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ రానుండగా, 22న పోలింగ్ నిర్వహించి 25న ఫలితాలు ప్రకటించనున్నారు.
మున్సిపాలిటీ చైర్మన్ రిజర్వేషన్లు...
బీసీ (జనరల్): నారాయణ్‌ఖేడ్, ఆందోల్-జోగిపేట్, గద్వాల, నిర్మల్, రాయికల్, ఎల్లారెడ్డి, మహబూబ్‌నగర్, పరిగి, వనపర్తి, అమరచింత, రామాయంపేట, చౌటుప్పల్, కొడంగల్, ఖానాపూర్, తూప్రాన్, మంచిర్యాల, బాన్సువాడ, ఆలేరు, భువనగిరి, నర్సాపూర్
బీసీ (మహిళ): సిరిసిల్ల, నారాయణపేట, కోరుట్ల, సదాశివపేట, చండూరు, భీంగల్, ఆర్మూర్, కోస్గి, మెట్‌పల్లి, జగిత్యాల, సంగారెడ్డి, భైంసా, మక్తల్, పోచంపల్లి, సుల్తానాబాద్, ధర్మపురి, నర్సంపేట, కొల్లాపూర్, యాదగిరిగుట్ట, బోధన్
ఎస్సీ (జనరల్): క్యాతన్‌పల్లి, బెల్లంపల్లి, ఇబ్రహీంపట్నం, వైరా, ఐజా, నస్పూర్, నేరెడ్‌చర్ల, తొర్రూరు, నర్సింగి
ఎస్సీ (మహిళ): మధిర, పరకాల, పెబ్బైర్, అలంపూర్, వర్ధన్నపల్లి, భూపాలపల్లి, పెద్ద అంబర్‌పేట, తిరుమలగిరి
ఎస్టీ (జనరల్): ఆమనగల్, డోర్నకల్
ఎస్టీ (మహిళ): వర్ధన్నపేట, మరిపెడ
ఓసీ (జనరల్): మెదక్, దేవరకొండ, గజ్వేల్, జహీరాబాద్, కొత్తపల్లి, ఎల్లందు, అచ్చంపేట, భూత్పూర్, లక్సెట్టిపేట, జమ్మికుంట, కాగజ్‌నగర్, కల్వకుర్తి, షాద్‌నగర్, తుక్కుగూడ, పోచారం, దమ్మాయిగూడ, ఆదిబట్ల, చిట్యాల, ఆదిలాబాద్, అమీన్‌పూర్, మహబూబాబాద్, మిర్యాలగూడ, సత్తుపల్లి, కొంపల్లి, నాగారం, తుంకుంట, బొల్లారం, మణికొండ, జల్పల్లి, హాలియా, నల్లగొండ.
ఓసీ (మహిళ): చొప్పదండి, పెద్లపల్లి, వేములవాడ, కొత్తకోట, చేర్యాల, దుబ్బాక, మోత్కూరు, ఆత్మకూరు, కామారెడ్డి, తాండూరు, చెన్నూరు, దుండిగల్, జనగామ, నాగర్ కర్నూల్, శంషాబాద్, హుస్నాబాద్, మంథని, హుజూర్‌నగర్, హుజూరాబాద్, శంకర్‌పల్లి, వికారాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, కొత్తగూడెం, ఘట్‌కేసర్, మేడ్చల్, నందికొండ, తెల్లాపూర్, కోదాడ, తుర్కయాంజల్, గుండ్ల పోచంపల్లి
మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ రిజర్వేషన్లు
ఎస్సీ (జనరల్): రామగుండం
ఎస్టీ (జనరల్): మీర్‌పేట
బీసీ (జనరల్): బండ్లగూడ జాగీర్, వరంగల్
బీసీ (మహిళ): జవహర్‌నగర్, నిజామాబాద్
ఓసీ (జనరల్): కరీంనగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ
ఓసీ (మహిళ): ఖమ్మం, నిజాంపేట్, బడంగ్‌పేట్, జీహెచ్‌ఎంసీ
మహిళలకు..50%
123 మున్సిపాలిటీల చైర్‌పర్సన్ స్థానాలకుగాను 61 స్థానాలు, 13 మున్సిపల్ కార్పొరేషన్ల చైర్మన్ స్థానాలకుగాను 6 స్థానాలు మహిళలకు లభించాయి. కొత్త మున్సిపల్ చట్ట నిబంధనల ప్రకారం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను వర్తింపజేశారు. పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఆదివారం తన కార్యాలయంలో రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా 50 శాతం స్థానాలను ఎంపిక చేసి మహిళలకు రిజర్వు చేశారు. రిజర్వేషన్ కేటగిరీలవారీగా మహిళా రిజర్వేషన్లను పరిశీలిస్తే 123 చైర్‌పర్సన్ స్థానాల్లో బీసీ (జనరల్)కు 20, బీసీ (మహిళ)కు 20, ఎస్టీ (జనరల్)కు 2, ఎస్టీ (మహిళ)కు 2, ఎస్సీ (జనరల్)కు 9, ఎస్సీ (మహిళ)కు 8, ఓపెన్ కేటగిరీ (జనరల్)కి 31, ఓపెన్ కేటగిరీ (మహిళ)కి 31 స్థానాలు రిజర్వు అయ్యాయి. 13 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాలకుగాను మహిళలకు 6 స్థానాలు దక్కాయి. 13 మేయర్ స్థానాలకుగాను బీసీ (జనరల్)కు 2, బీసీ (మహిళ)కు 2, ఎస్సీ (జనరల్)కు 1, ఎస్టీ (జనరల్)కు 1, ఓపెన్ కేటగిరీ (జనరల్)కి 3, ఓపెన్ కేటగిరీ (మహిళ)కు 4 స్థానాలు రిజర్వు అయ్యాయి. కీలకమైన జీహెచ్‌ఎంసీ మేయర్ స్థానం ఓపెన్ కేటగిరీ(మహిళ)కి రిజర్వు కావడం గమనార్హం'' అని ఆ కథనంలో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- పిల్లలకు తల్లిపాలు ఎలా పట్టించాలి
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
- నా పేరు రాహుల్ సావర్కర్ కాదు, నేను క్షమాపణ కోరను: రాహుల్ గాంధీ
- భారత్‌లో అత్యాచారాలను రాజకీయ అంశంగా మార్చిన రాహుల్, మోదీ
- కమలం జాతీయ పుష్పమా? పాస్‌పోర్టులపై కమలం ఎందుకు ముద్రిస్తున్నారు?
- ఐస్ బకెట్ చాలెంజ్ ద్వారా రూ. వందల కోట్లు సమీకరించిన పీట్ ఫ్రేటస్ మృతి
- జస్టిస్ సుదర్శన రెడ్డి: ఎంపీలు, ఎమ్మెల్యేలపైనా రేప్ కేసులున్నాయి, వారిని ఎన్కౌంటర్ చేయడం సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








