CAA బీజేపీ మిస్డ్ కాల్ ప్రచారం: 'నేను ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను, ఈ నంబర్‌కు కాల్ చేయండి'

బీజేపీ మిస్డ్ కాల్ ప్రచారం

ఫొటో సోర్స్, AFP

దేశంలో పౌరసత్వ సవరణ చట్టం-2019ను ఎంతమంది సమర్థిస్తున్నారు అనే సంఖ్యను చూపించాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ రెండు రోజుల క్రితం ఒక మొబైల్ నంబర్ జారీ చేసింది.

ఎవరైనా ఈ ఫోన్ నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి పౌరసత్వ సవరణ చట్టంపై మోదీ ప్రభుత్వ నిర్ణయానికి తమ మద్దతు ఇవ్వవచ్చని పార్టీ తరఫున చెబుతున్నారు.

కానీ, ఈ ఫోన్ నంబర్‌కు వీలైనన్ని ఎక్కువ మిస్డ్ కాల్స్ చేయించేందుకు, చాలా మంది సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపిస్తున్నారు.

ట్విటర్, ఫేస్‌బుక్, వాట్సాప్ సహా సోషల్ మీడియాలోని మిగతా ప్లాట్‌ఫాంలలో ఈ నంబర్ పోస్ట్ చేస్తూ దీనికి కాల్ చేస్తే రకరకాల సౌకర్యాలు లభిస్తాయని చెబుతున్నారు.

అమ్మాయిల పేరుతో సోషల్ మీడియాలో చాలా నకిలీ అకౌంట్లు ఉన్నాయి.

బీజేపీ మిస్డ్ కాల్ ప్రచారం

ఫొటో సోర్స్, SM VIRAL POST

వాటిలో బీజేపీ ఇచ్చిన అదే మొబైల్ నంబర్ పోస్ట్ చేశారు.

ఈ అమ్మాయిలతో మాట్లాడాలంటే, ఈ నంబర్‌కు కాల్ చేయండి అని పోస్టులు పెట్టారు.

బీజేపీ మిస్డ్ కాల్ ప్రచారం

ఫొటో సోర్స్, SM VIRAL POST

2020 జనవరి 2న భారతీయ జనతా పార్టీ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో ఈ నంబరును ప్రకటించింది.

#IndiaSupportsCAAతో పాటూ ఈ ట్వీట్‌లో "పౌరసత్వ సవరణ చట్టం-2019కు మీ మద్దతు ప్రకటించాలంటే 8866288662కు మిస్డ్ కాల్ ఇవ్వండి" అని రాశారు.

ఆ తర్వాత జనవరి 3న భారత హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాజస్థాన్ జోధ్‌పూర్‌లో జరిగిన ఒక సభలో ఈ నంబర్‌ గురించి పార్టీ సందేశం వినిపించారు.

"నేను ఒక నంబర్ చెబుతాను, ఆ నంబరుకు కాల్ చేయండి. మీకు ఎలాంటి చార్జ్ ఉండదు. మీ మద్దతు నరేంద్ర మోదీ దగ్గరకు చేరుతుంది. నేను మీకు చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. ఈ రాహుల్ బాబా, మమతా, కేజ్రీవాల్ లాంటి వారందరికీ సమాధానం ఇవ్వడానికి.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వారా పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి వచ్చిన మైనారిటీలకు న్యాయం, హక్కులు అందించే CAAకు మీ మద్దతు ప్రకటించడానికి 8866288662కు మిస్డ్ కాల్ ఇవ్వండి. మీ మద్దతును మోదీ వరకూ చేర్చండి" అన్నారు.

బీజేపీ మిస్డ్ కాల్ ప్రచారం

ఫొటో సోర్స్, TWITTER

రకరకాల వాదనలతో సందేశాలు

హోంమంత్రి అమిత్ షా ఈ నంబరును ప్రచారం చేస్తూ పార్టీ లక్ష్యాన్ని చెప్పారు. కానీ అదే నంబరుకు తప్పుడు పద్ధతిలో మిస్డ్ కాల్స్ చేయించేందుకు సోషల్ మీడియా యూజర్లు రకరకాల ఎత్తులు వేస్తున్నప్పుడు, ఆ డేటా CAAకు మద్దతుగా వచ్చినదే అని ఎలా గుర్తిస్తారు అని సోషల్ మీడియాలో చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

గత రెండు రోజుల్లో చాలా మంది పార్టీ అగ్ర నేతలు ఈ నంబరును తమ సోషల్ మీడియా అకౌంట్లలో ప్రచారం చేశారు.

కానీ ఈ నంబరుపై ఇప్పుడు సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు. చాలా మంది దీనిని విమర్శిస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్ ఇండియా కూడా ఈ నంబరుతో షేర్ అవుతున్న ఒక మెసేజ్ గురించి తన ట్విటర్ అకౌంట్‌లో ఖండన ఇవ్వాల్సి వచ్చింది.

బీజేపీ మిస్డ్ కాల్ ప్రచారం

ఫొటో సోర్స్, Twitter

"ఆరు నెలల వరకూ ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ చూడ్డానికి 8866288662కు మిస్డ్ కాల్ ఇవ్వండి. ఈ ఆఫర్ కాల్ చేసిన మొదటి వెయ్యి మందికే అని మురళీ కృష్ణ అనే ఒక ట్విటర్ యూజర్ ట్వీట్ చేశాడు.

దీనికి సమాధానం ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్ ఇండియా "ఇది పూర్తిగా తప్పుడు వార్త" అని చెప్పింది.

శనివారం మధ్యప్రదేశ్‌ స్థానిక కాంగ్రెస్ నేత దేవాశిష్ జరరియా కూడా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడానికి ఒక నంబర్ జారీ చేశారు.

బీజేపీ మిస్డ్ కాల్ ప్రచారం

ఫొటో సోర్స్, Twitter

ఈ నంబర్ శనివారం ట్విటర్‌లో టాప్ ట్రెండ్స్ లో ఒకటిగా నిలిచింది.

ఆయన కూడా, బీజేపీలాగే ప్రజలకు అపీల్ చేశారు. #99535_88585_AgainstCAAతో "రండి కలిసి వ్యతిరేకత నమోదు చేయండి. #IndiaAgainstCAA_NPR_NRC ఈ నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వండి. దేశం మూడ్ ఎలా ఉందో మోదీ-షాలకు చెప్పండి" అని ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)