4 లక్షల ఏళ్ల కిందటి ఈ రాతి గుంటలు చెప్పే కథలేంటి ?

ఫొటో సోర్స్, NARAYANAMOORTHY
- రచయిత, తంగదురై కుమార పాండ్యన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తమిళనాడులోని దిండిగల్ జిల్లా పళని సమీపంలో బయటపడ్డ రాతి గుంటలు సుమారు 4 లక్షల సంవత్సరాల నాటివని ఫ్రెంచ్ ఆంథ్రోపాలజిస్ట్ ఒకరు స్పష్టం చేశారు.
ప్రాచీన మానవుల గురించి సరికొత్త కోణంలో చరిత్రను నిర్మించడానికి అవకాశం కల్పిస్తున్న ఈ కొత్త ఆవిష్కరణల ప్రత్యేక ఏంటి? ఈ గుంటలను ప్రాచీన మానవులు ఎందుకు ఉపయోగించారు?
ఈ పురాతన గుంటలను ఎలా గుర్తించారు?
2017 నాటి విషయం. దిండిగల్ జిల్లాలోని పళని పట్టణానికి సమీపంలో కురుంబపట్టి అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో పావలకోడి అమ్మన్ ఆలయం ఉంది.
ఆ ఆలయానికి చెందిన శాసనాలను చదివి ఆలయ చరిత్రను తెలియజేయాలని ఈ ప్రాంత ప్రజలు పురావస్తు శాస్త్రవేత్త నారాయణమూర్తిని ఆహ్వానించారు.
నారాయణ మూర్తి ఆ ప్రాంతానికి వెళ్లి ఆలయ పరిసరాలను పరిశీలించారు. అక్కడే ఆయనకు ఒక పొలంలో ఓ రాయి కనిపించింది. దాని మీద చిన్న చిన్న గుంటలు చెక్కి ఉన్నాయి.
వీటిని ఎందుకు ఉపయోగిస్తున్నారని ఆయన అక్కడి వారిని అడగగా, అందులో నూనె పోసి దీపాలు వెలిగిస్తామని వారు చెప్పారు.
ఆయన వాటిని నిశితంగా పరిశీలించి, ఇవి పురాతన కాలానికి చెందిన రాతి గుంటలని, వీటిని జాగ్రత్త చేయాలని వారికి సూచించారు.

ఫొటో సోర్స్, NARAYANAMOORTHY
ఏడు సంవత్సరాల తర్వాత....
2017లో తనకు కనిపించిన ఈ రాతి గుంటలను పురావస్తు శాస్త్రవేత్త నారాయణ మూర్తి మరిచిపోలేదు. 7 సంవత్సరాల తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ప్రాచీన మానవులు, వారి రాతి నిర్మాణాలపై అధ్యయనం చేస్తున్న ఫ్రాన్స్ దేశపు ఆంథ్రోపాలజిస్ట్ రోమైన్ సైమన్‌ను ఆ గ్రామానికి తీసుకువచ్చారు.
జనవరి 23న ఆయన సైమన్‌ను ఆ రాతి గుంటలు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లారు. ఒక పొలం పక్కన ఉన్న ఆ రాతి గుంటలను సైమన్ పరిశీలించారు.
వాటిని నిశితంగా పరిశీలించిన ఆయన ఈ రాతి గుంటలు హోమో ఎరెక్టస్ మానవులు చెక్కినవని తేల్చారు. ఆనాటి మానవులు ఈ గుంటలను సమాచార వ్యాప్తి కోసం వినియోగించారని సైమన్ వెల్లడించారు.
"ఈ రాతి నిర్మాణాలలో జంతువుల బొమ్మలు ఎక్కడా లేవు. ఇవి కేవలం ఒక రాయి మీద చెక్కిన చిన్న వృత్తాకార నిర్మాణాలు మాత్రమే." అని సైమన్ అన్నారు.
"తమ కథలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు హోమో ఎరెక్టస్ మానవులు సమాధుల మీద ఈ గుంటలను చెక్కినట్లు కనిపిస్తోంది.’’ అని ఆయన వెల్లడించారు.
‘‘దక్షిణ భారతదేశంలోని దేవాలయాల దగ్గర ఇటువంటి రాళ్లు అక్కడక్కడా కనిపిస్తాయి. బాలసముద్రంలోని మారియమ్మన్ గుడి దగ్గర కనిపించాయి. ఇవి 2 లక్షల నుండి 4 లక్షల సంవత్సరాల కిందట చెక్కి ఉండొచ్చు.’’ అని సైమన్ చెప్పారు.

ఫొటో సోర్స్, ROMAIN SIMENEL
ఈ రాతి గుంటల వయసు తెలుసుకోవడం ఎలా?
‘‘రాతి గుంటలు ఎప్పటివో కచ్చితంగా అంచనా వేయలేం’’ అన్నారు సైమన్. ‘‘దక్షిణాఫ్రికాలో ఇలాంటివి దొరికినప్పుడు వీటి సమీపంలో మనుషుల ఎముకలు, కాలిన రొట్టెలు, బూడిదలాంటివి పరిశీలించగా అవి 4 లక్షల సంవత్సరాల కిందటివని తేలింది. కురుంబంపట్టిలో ఈ రాళ్ల మీద చెక్కిన గుర్తులు కూడా దాదాపు అదే ఆకారంలో, సైజులో ఉన్నాయి. దీనినిబట్టి ఇది 2 నుంచి 4 లక్షల సంవత్సరాల మధ్య కాలానికి చెందినదిగా చెప్పవచ్చు’’ అని ఆయన వివరించారు.
పళని సమీపంలో దొరికిన రాతి ఆకారాలు ప్రపంచంలో దొరికిన అలాంటి శిలలలో మూడో అతి ప్రాచీన రాతి చెక్కడాలని ఆర్కియాలజిస్ట్ నారాయణ మూర్తి వెల్లడించారు. "పళనిలో దొరికిన ఈ రాతి గుంటల శిల మీద 191 గుంటలు ఉన్నాయి. వాటిలో చిన్న, మధ్య, పెద్ద తరహా గుంటలు కనిపిస్తాయి. అతిచిన్న గుంటలు 4 సెం.మీ వ్యాసం, 1 సెం.మీ లోతు, పెద్ద గుంటలు 15 సెం.మీ వ్యాసం, 13 సెం.మీ లోతు ఉన్నాయి" అని చెప్పారు నారాయణమూర్తి.

ఫొటో సోర్స్, NARAYANAMOORTHY
గుంటల నిర్మాణంలో ఏం తెలుస్తుంది?
"ఈ గుంటల సైజులు అన్నీ ఒకేలా లేవు. ఒక పెద్ద గుంట చుట్టూ కొన్ని చిన్న గుంటలు ఉన్నాయి. పెద్ద గుంటలు రాతి వాలుపై ఒకే లైనులో కనిపిస్తాయి. ఈ రాయి ప్రాచీన శిలాయుగానికి చెందినది.’’ అని చెప్పారు నారాయణ మూర్తి.
‘‘ఇంతకు ముందు మధ్యప్రదేశ్‌లోని భీమ్ పేట్కాలో 7 లక్షల సంవత్సరాల నాటి రాతి గుంటలను గుర్తించారు. అవి ప్రపంచంలోనే అతి పురాతనమైన రాతి గుంటలు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలోని కలహారి ఎడారిలో లభించిన రాతి గుంటలు 4 లక్షల సంవత్సరాల నాటివి. తమిళనాడులో, తిరుచ్చి, దిండిగల్, తూత్తుకుడి, ధర్మపురి, కృష్ణగిరి మొదలైన ప్రాంతాల్లో ఇలాంటి రాళ్లు చాలా కనిపించాయి. కానీ అవన్నీ పూర్వీకుల జ్ఞాపకార్థం శ్మశానల దగ్గర ఏర్పాటు చేసిన శిలలు. పళనిలో కనిపించిన శిలలు ఆర్కియన్ ప్రొటెరోజోయిక్ కాలానికి చెందినవి. ఇవి కూడా పూర్వీకుల జ్ఞాపకార్థం తయారు చేసినవి కావచ్చు.’’ అని ఆయన చెప్పారు.
నదుల పక్కన నివసించిన నాగరిక మానవుడు సృష్టించిన ఆకారాలే ఈ రాతి గుంటలని తమిళనాడుకు చెందిన భూగర్భ శాస్త్రవేత్త మణికంద భరత్ చెప్పారు.
"పురావస్తు శాస్త్రవేత్తలు పళని సమీపంలో దొరికిన శిలల ఫోటోలను పంపారు. దాని భౌగోళిక నిర్మాణాన్ని (స్టాటిక్ గ్రాఫిక్ మ్యాపింగ్) అధ్యయనం చేస్తే, ఆ ప్రాంతంలో ఉన్న భూగర్భ నిర్మాణ చరిత్ర మనకు తెలుస్తుంది. ఆ గుంటలు అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల ఏర్పడినవి కావు, ఎందుకంటే ఈ ప్రాంతం చుట్టూ పళని, కొడైకెనాల్ కొండలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి, ఈ వృత్తాకార నిర్మాణాలు రాళ్లతో చేసినవి అని మనం నిర్ధరించగలం.’’ అని మణికందన్ భరత్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అమెజాన్ అడవుల్లో బయటపడ్డ పురాతన నగరం.. అత్యాధునిక రహదారి వ్యవస్థ, కాల్వల నిర్మాణంతో వేలమంది నివసించిన ఆనవాళ్లు
- ప్రాచీన కాలం నాటి సామూహిక నిద్ర అలవాటు ఎలా కనుమరుగైంది?
- అలెగ్జాండర్ జయించిన ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు
- సుభాష్‌చంద్రబోస్: ‘మై డార్లింగ్, నువ్వు నా హృదయరాణివి’ అంటూ బోస్ ఎవరికి ప్రేమలేఖలు రాశారు?
- నువ్వుల లడ్డూ: 'తీయని మాటలు పలికేలా చేసే తీపి వంటకం'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















