హాజి మలాంగ్: ‘ఈ దర్గాకు విముక్తి కల్పించి హిందువుల పరం చేయాలి’ అన్న వాదన ఎందుకు వినిపించింది, వివాదం ఏంటి?

- రచయిత, చెరిలాన్ మొలన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రముఖ రాజకీయ నాయకుడొకరు చేసిన వ్యాఖ్యలతో భారత్‌లోని అన్నిమతాల వారూ దర్శించుకునే సూఫీ దర్గా వార్తల్లోకెక్కింది.
ఆ దర్గాకు విముక్తి కల్పించి, హిందువుల చేతికి వచ్చేలా చేయాలని కోరుకుంటున్నానంటూ చేసిన వ్యాఖ్యల కారణంగా వివాదం రేగింది. ఈ వివాదం గురించి మరింత తెలుసుకునేందుకు బీబీసీ ప్రతినిధి చెరిలాన్ మొలన్ ఆ ప్రదేశాన్ని సందర్శించారు.
దాదాపు 1500 రాతిమెట్లు ఎక్కి అక్కడకు చేరుకోవడం అంత సులభం కాదు. విశ్వాసానికి, పురాణగాథలకు, వివాదాస్పద చరిత్రకు నిలయంగా కనిపిస్తుంది అక్కడి సూఫీ సమాధి.
మహారాష్ట్రలోని ముంబై శివారులో ఒక కొండపై ఈ హాజి మలాంగ్ దర్గా ఉంటుంది. ఇది దాదాపు 700 ఏళ్ల కిందట భారత్‌కు వచ్చిన అరబ్ మతప్రబోధకుడి సమాధిగా చెబుతారు.
ఈ దర్గా మతపరమైన వివాదానికి కేంద్రంగా ఉన్నప్పటికీ, అన్నివర్గాల ప్రజలకు, సర్వమత సహనానికి చిహ్నంగా నిలుస్తోంది.
నేను ఆ దర్గాను సందర్శించినప్పుడు హిందువులు, ముస్లింలు ఆ దర్గాకు వస్తున్నారు. సమాధి వద్ద పూలు, చాదర్ సమర్పిస్తున్నారు. మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా అది నెరవేరుతుందని అక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం.
దర్గా మేనేజింగ్ బోర్డుని చూస్తే మతసామరస్యం కనిపిస్తుంది. దర్గా ట్రస్టీలలో ఇద్దరు ముస్లింలు కాగా, వంశపారంపర్య సంరక్షకులు హిందూ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు ఉన్నారు.
అయితే, ఈ నెల ప్రారంభంలో ఓ రాజకీయ ర్యాలీలో దశాబ్దాలుగా ఉన్న వాదనలను ప్రస్తావించడం ద్వారా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందె వివాదాన్ని రేకెత్తించారు.
ఇప్పుడు దర్గాగా చెబుతున్నది ఒకప్పుడు హిందూ దేవాలయమని, దానికి విముక్తి కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.
ఈ విషయం గురించి శిందెతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించినప్పటికీ ఆయన స్పందించలేదు.

భారత్‌లోని కొన్ని ప్రముఖ మసీదులు, ముస్లిం కట్టడాలు శతాబ్దాల కిందట హిందూ దేవాలయాలను కూల్చి నిర్మించారనే వాదనలపై వివాదాలు కొనసాగుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
1980లలో హాజీ మలాంగ్ దర్గాను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే ప్రచారానికి సీఎం శిందె రాజకీయ గురువుగా చెప్పే ఆనంద్ డిఘె నాయకత్వం వహించారు. 1996లో దర్గాలో హిందూ సంప్రదాయంలో పూజలు చేసేందుకు శివసేన పార్టీకి చెందిన 20 వేల మందితో దర్గాకు వెళ్లారు.
అప్పటి నుంచి ఆ ప్రదేశాన్ని మలాంగ్‌గఢ్‌గా పిలుస్తూ కొందరు హిందూవాదులు పౌర్ణమి రోజున అక్కడ పూజలు చేస్తూ వస్తున్నారు. దీంతో అక్కడ అప్పుడప్పుడు ముస్లిం భక్తులు, స్థానికులతో గొడవలకు కూడా దారితీసేది.
అయితే, ఏక్‌నాథ్ శిందె వైఖరిలో మత విశ్వాసం కంటే రాజకీయంగానే ఎక్కువ ప్రాధాన్యం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అప్పట్లో డిఘె చేసిన ప్రచారంతో ఆయన హిందూ ఓటర్లకు దగ్గరయ్యారు.
''శిందె ఇప్పుడు తనను తాను హిందూ రక్షకుడిగా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు'' అని మాజీ జర్నలిస్ట్ ప్రశాంత్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు.
లోక్‌సభ ఎన్నికలను పక్కనబెడితే, దేశంలోనే సంపన్న రాష్ట్రమైన మహారాష్ట్రలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా, హిందూ ఓటర్ల మద్దతు కూడగట్టడం శిందెకు చాలా కీలకం అని దీక్షిత్ చెప్పారు.

మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన, బీజేపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), కాంగ్రెస్‌ల మధ్య చతుర్ముఖ పోటీ ఉంటుంది. ప్రతి పార్టీకి వాటి సొంత ఓటుబ్యాంకు ఉంది.
కానీ, 2022లో శిందె ఒక సమస్యను ఎదుర్కొన్నారు. ఆయన, ఆయన మద్దతుదారులు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి చీలిపోయారు.
ఆ తిరుగుబాటు వర్గం అప్పటి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేసి, బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
''చట్టసభల సభ్యులు పార్టీలు మారితే మారొచ్చు, కానీ సంప్రదాయ ఓటర్లను తమవైపు తిప్పుకోవడం అంత సులభం కాదు'' అన్నారు దీక్షిత్. దర్గా విషయాన్ని లేవనెత్తడం ద్వారా శివసేన సంప్రదాయ ఓటర్ల భావోద్వేగాలను రెచ్చగొట్టి, హిందూ ఓటుబ్యాంకును గంపగుత్తగా పొందాలని శిందె భావిస్తున్నారని ఆయన అన్నారు.
శిందె వ్యాఖ్యలపై బీబీసీ అడిగినప్పుడు హిందూ భక్తుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

''ఎంతోకాలంగా తన మనసులో ఉన్న మాటను శిందె బయటకు చెప్పినట్లు అనిపిస్తోంది. ఇది మొదట హిందూ స్వామీజీకి చెందినదని, ఆ తర్వాతి కాలంలో భారత్‌పై దండయాత్రలు జరిగిన తర్వాత ముస్లింలు స్వాధీనం చేసుకున్నారని చెబుతారు'' అని కుశాల్ మిస్ల్ అభిప్రాయపడ్డారు.
రాజేంద్ర గైక్వాడ్ అనే మరొకరు కూడా అదే భావనను వెలిబుచ్చారు. అయితే, ''ఇప్పుడు ఇండియాలో జరుగుతున్నదేదీ అంత మంచిది కాదు. నాకు అందరు దేవుళ్లూ ఒక్కటే'' అన్నారాయన.
''అది ఏ మతానికి చెందిన నిర్మాణమనేది నాకు అనవసరం. అక్కడికెళ్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది'' అని ప్రతినెలా అక్కడికి వెళ్లే అభిజిత్ నగారే చెప్పారు.
వివాదం కారణంగా మందిరాన్ని సందర్శించే భక్తుల సంఖ్య తగ్గిందని ధర్మకర్తలలో ఒకరైన నాసిర్ ఖాన్ బీబీసీతో చెప్పారు. ప్రజలు తమ కుటుంబ సభ్యులతో ఇక్కడకు వస్తుంటారని, దుర్మార్గుల వల్ల వారు ఇబ్బంది పడకూడదని అనుకుంటున్నానని అన్నారు.
ఈ వివాదం ప్రభావం స్థానిక వ్యాపారాలపైనా పడింది.

దాదాపు 3000 అడుగుల(914 మీటర్లు) ఎత్తులో ఉండే ఈ మందిరం చుట్టూ రాళ్లతో నిర్మించిన ఇళ్లు, దుకాణాలు, రెస్టారెంట్లు కనిపిస్తాయి.
ఇక్కడ దాదాపు 4000 మంది హిందువులు, ముస్లింలు నివసిస్తున్నట్లు ఖాన్ చెప్పారు. పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయమే వారికి జీవనాధారం.
కనీస సౌకర్యాలైన తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని, వేసవిలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని అక్కడి స్థానికులు బీబీసీతో చెప్పారు.
''రేషన్ పద్ధతిలో ఒక్కో ఇంటికి రోజుకి పది లీటర్ల నీటిని మాత్రమే ఇస్తారు'' అని గ్రామ కౌన్సిల్ మెంబర్ అయ్యూబ్ ఖాన్ చెప్పారు.
ఈ కొండపై ఆస్పత్రి, స్కూల్, అంబులెన్స్ వంటి సదుపాయాలు లేవు.
''చదువుకున్నోళ్లు ఇక్కడ ఉండేందుకు ఇష్టపడరు. వాళ్లకి ఇక్కడ పని దొరకదు'' అని ట్రక్ డ్రైవర్ షేక్ చెప్పారు. 22 ఏళ్ల షేక్ తన ఇంటిపేరును మాత్రమే వాడమని కోరారు.
''అందరు రాజకీయ నాయకులు ఓట్ల కోసమే డ్రామాలు ఆడతారు. ప్రజలకేం కావాలో అసలు పట్టించుకోరు.''
''ఈ కొండపై శతాబ్దాలుగా హిందువులు, ముస్లింలు సామరస్యంతో కలిసిమెలిసి జీవిస్తున్నారు. పండగలన్నీ కలిసే జరుపుకుంటాం. కష్టసమయాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటాం'' అని షేక్ చెప్పారు.
''మాకెవరూ అండగా నిలబడింది లేదు, అలాంటప్పుడు మాలో మేము ఎందుకు గొడవలు పడతాం?'' అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు పొత్తుధర్మం పాటించలేదన్న పవన్ కల్యాణ్... టీడీపీ, జనసేనల మధ్య ఏం జరుగుతోంది?
- రిపబ్లిక్ డే - ఫోటో ఫీచర్: పరేడ్‌ను తొలిసారిగా ముందుండి నడిపించిన మహిళలు
- హరిద్వార్: క్యాన్సర్ బాధిత చిన్నారిని తల్లి గంగా నదిలో ముంచి చంపేశారంటూ వీడియో వైరల్, అసలేం జరిగింది?
- క్యాష్‌లెస్ ఎవ్రీవేర్: హెల్త్ ఇన్సూరెన్స్‌తో ఇకపై నెట్వర్క్ హాస్పిటల్స్‌లోనే కాదు, దేశంలో ఎక్కడైనా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్... 48 గంటల నిబంధన గుర్తుంచుకోండి
- భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీలో ఎవరెవరు ఉన్నారు? తొలి డ్రాఫ్ట్ రాసింది ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














