జ్ఞానవాపి మసీదు నిర్మాణానికి ముందు అక్కడ ఒక హిందూ ఆలయం ఉండేది - భారత పురావస్తు శాఖ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనంత్ జణాణే, ఉత్పల్ పాఠక్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సర్వే నిర్వహించిన భారతీయ పురావస్తు శాఖ ఆ మసీదును నిర్మించడానికి ముందు అక్కడ ఒక హిందూ దేవాలయం ఉండేదని స్పష్టం చేసింది.
మసీదు ప్రాంగణంలో సర్వే నిర్వహించాలని నిరుడు జూలైలో వారణాసి జిల్లా కోర్టు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా( ఏఎస్ఐ)ను ఆదేశించింది.
భారతీయ పురావస్తు శాఖ రూపొందించిన నివేదికను బహిరంగ పరిచారు. నాలుగు నెలల పాటు శాస్త్రీయంగా అధ్యయనం చేసి పురాతన శిథిలాలు, కళాఖండాలు, శాసనాలు, శిల్పాలు లాంటి వాటిని పరిశీలించి ఏఎస్ఐ ఈ నివేదిక తయారు చేసింది. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత ప్రస్తుతం ఉన్న నిర్మాణానికి ముందు హిందూ ఆలయం ఉండేదని తేలిగ్గానే నిర్ధరించవచ్చని నివేదికలో వెల్లడించింది.
ఈ నివేదిక కాపీ తమకు కూడా అందిందని, అది ప్రస్తుతం తమ న్యాయవాదుల వద్ద ఉందని ముస్లింలు తెలిపారు.
“ఇది నివేదిక మాత్రమే, నిర్ణయం కాదు. 839 పేజీల రిపోర్ట్ అది. దాన్ని చదవడానికి, అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. నిపుణుల అభిప్రాయం తీసుకుంటాం. కోర్టు విచారణ సమయంలో వారి అభిప్రాయాన్ని కూడా ప్రస్తావిస్తాం.” అని జ్ఞానవాపి మసీదు నిర్వహణను పర్యవేక్షించే అంజుమన్ ఇంతెజామియా మసీద్ సంయుక్త కార్యదర్శి ఎస్ఎం యాసిన్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
అక్బర్ పాలనా కాలానికి 150 ఏళ్లు ముందే మసీదులో నమాజ్ చేసేవారని మసీదు తరపు వారు నమ్ముతున్నారు. “అంతా అల్లా దయ. మసీదులో ప్రార్థనలు చేసుకునేలా చూడటమే మా బాధ్యత. నిరాశ పడకూడదు. ఓపిక పట్టాలి. వివాదాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం” అని యాసిన్ చెప్పారు.
800 పేజీల్లో భారతీయ పురావస్తు శాఖ పొందుపరిచిన అంశాలతో కూడిన కాపీని బీబీసీ సంపాదించింది. జ్ఞానవాపి అంశంపై కోర్టులో కేసు వేసిన రాఖీ సింగ్ న్యాయవాది అనుపమ్ ద్వివేది ఈ కాపీని బీబీసీకి అందించారు.
“ఔరంగజేబ్ పరిపాలనలో ( 1676-77) 20వ ఏట మసీదు నిర్మించినట్లు అక్కడున్న ఓ గదిలో లభించిన అరబిక్- పర్షియన్ శాసనం మీద రాసి ఉంది. దీన్ని బట్టి చూస్తే, 17వ శతాబ్ధంలో ఔరంగజేబ్ అక్కడ అంతకు ముందు ఉన్న నిర్మాణాన్ని కొంత మేర కూలగొట్టి, మిగిలి ఉన్న బాగాలపై ప్రస్తుత మసీదు నిర్మించినట్లు కనిపిస్తోంది” అని ఏఎస్ఐ రిపోర్ట్ చెబుతోంది.
ప్రస్తుత సర్వేలో బాగంగా జ్ఞానవాపి మసీదులో ఉన్న సీల్ వేసి ఉన్న వాటర్ ట్యాంక్‌లో సర్వే చెయ్యలేదు.
మసీదులోని వజూఖానాలో శివలింగం ఉందని హిందువులు అంటుంటే అది వాటర్ ఫౌంటెన్ అని మసీదు తరపు వాళ్లు వాదిస్తున్నారు.
కేసులో ప్రధాన పిటిషనర్ రాఖీసింగ్ న్యాయవాది అనుపమ్ ద్వివేది ఈ నివేదిక చాలా ముఖ్యమైనది అంటున్నారు. “ఔరంగ జేబు మసీదు నిర్మించడానికి ముందు అక్కడొక హిందూ ఆలయం ఉండేదన్న పురావస్తు శాఖ ప్రకటన మా వాదనకు బలం చేకూరుస్తోంది. సాక్ష్యాధారాల కోణంలో ఇది చాలా కీలకం కాబోతోంది” అని ఆయన అన్నారు.
ఏఏ ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు?
- గత నిర్మాణపు ప్రధాన ద్వారం, ప్రస్తుత నిర్మాణంలోని సెంట్రల్ చాంబర్
- పశ్చిమాన ఉన్న గదులు, గోడ
- గతంలో ఉన్న స్తంబాలను మళ్లీ ఉపయోగించి దిమ్మెలను నిర్మించడం
- రికవరీ చేసిన రాళ్ల మీద అరబిక్, పర్షియన్ భాషలో రాసి ఉన్న శాసనాలు
- పునాదిలో ఉన్న కళాకృతుల శిథిలాలు.

ఫొటో సోర్స్, Getty Images
హిందూ ఆలయం లాంటి నిర్మాణం
జ్ఞానవాపిలో ప్రస్తుతం ఉన్న నిర్మాణం ఆకారం, వయసు గురించి ఏఎస్ఐ నివేదిక ఇలా చెప్పింది “ గోడలపై వాస్తుశిల్పాల అవశేషాలు, గోడల మీద అలంకరించిన అచ్చులు, కేంద్రీయ స్థానంలో ఉన్న కర్ణ రథం, ప్రతి రథం, పడమర వైపునున్న గోడల మీద తోరణంతో పాటు పెద్ద ప్రవేశ ద్వారం, ముందువైపు చిత్రంతో కూడిన చిన్న ద్వారం, పక్షులు, జంతువుల శిల్పాలు, లోపల, బయట అలంకరణలు పశ్చిమ గోడ హిందూ దేవాలయ అవశేషాలు అని సూచిస్తున్నాయి.”
“కళ, వాస్తు శిల్ప శైలి ఆధారంగా అంతకు ముందు ఉన్న నిర్మాణాన్ని హిందూ ఆలయంగా గుర్తించాం”
శాస్త్రీయ అధ్యయనం, పరిశోధన తర్వాత అక్కడ పెద్ద హిందూ ఆలయం ఉండేది అని నివేదిక స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
శాసనాల్లో మసీదు నిర్మించిన తేదీ నమోదు
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ (1676-77) హయాంలో మసీదును నిర్మించినట్లు రాతిపై ఒక శాసనం ఉందని దాని రికార్డులలో నమోదు చేసినట్లు భారతీయ పురావస్తు శాఖ తెలిపింది.
నివేదిక ప్రకారం, మసీదు ప్రాంగణంలోనూ మరమ్మత్తులు చేసినట్లు ఆ శాసనంలో రాశారు. ఈ శిలా శాసనం చిత్రాన్ని 1965-66లోనే పురావస్తు శాఖ భద్రపరిచింది.
అయితే సర్వే సమయంలో మసీదులోని ఒక గది నుండి ఈ శాసనాన్ని స్వాధీనం చేసుకున్నామని, మసీదు నిర్మాణం, విస్తరణకు సంబంధించిన సమాచారం రాసినట్లు ఏఎస్ఐ చెబుతోంది.
ఔరంగజేబు జీవిత చరిత్ర మాసిర్-ఎ-ఆలమ్‌గిరిలో తమ ఏలుబడిలో ఉన్న అన్ని ప్రాంతాలలో దేవాలయాలు, పాఠశాలలను కూల్చి వేయాలని అన్ని ప్రావిన్సుల గవర్నర్‌లను ఔరంగజేబు ఆదేశించినట్లు ఔరంగజేబు జీవిత చరిత్ర మాసిర్-ఎ-ఆలమ్‌గిరిలో రాసినట్లు ఏఎస్ఐ చెబుతోంది.
ఇది 1947లో జాదునాథ్ సర్కార్ మసీర్-ఎ-ఆలమ్‌గిరి ఆంగ్ల అనువాదంలో కూడా ప్రస్తావించారని భారతీయ పురావస్తు శాఖ అంటోంది.
"సెప్టెంబర్ 2, 1669న, చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాలను అనుసరించి, అతని అధికారులు కాశీలోని విశ్వనాథ ఆలయాన్ని కూల్చివేశారు" అని జాదునాథ్ సర్కార్ రాసిన మాసిర్-ఎ-ఆలమ్‌గిరి ఆంగ్ల అనువాదాన్ని ఏఎస్ఐ తన నివేదికలో రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
శిలా శాసనంలో ఏముంది?
మసీదు లోపల మొత్తం 34 శాసనాలు, 32 గుంజలు కనుక్కున్నామని, వాటిని నమోదు చేశామని ఏఎస్ఐ నివేదిక తెలిపింది.
మసీదు నిర్మాణం, మరమ్మత్తుల్లో ఉపయోగించిన రాళ్లలో హిందూ దేవాలయంలోని రాళ్లు ఉన్నాయని నివేదిక చెబుతోంది.
ఈ శాసనం దేవనాగరి, తెలుగు, కన్నడ భాషలలో ఉంది.
వీటి ఆధారంగానే అంతకు ముందున్న ఆలయాన్ని కూల్చివేసి, మసీదు నిర్మించారనే అభిప్రాయానికి వచ్చినట్లు పురావస్తు శాఖ వెల్లడించింది.
మసీదులో లభించిన శాసనాల మీద జనార్దన్, రుద్ర, ఉమేశ్వర అనే ముగ్గురు దేవుళ్ల పేర్లు కూడా ఉన్నట్లు పురావస్తు శాఖ నివేదికలో పేర్కొంది.
మహా ముక్తి మండపానికి సంబంధించి లభించిన మూడు శాసనాలు చాలా ముఖ్యమైనవని ఏఎస్ఐ వివరించింది.

ఫొటో సోర్స్, UTPHAL PATHAK
పునాదిలో ఏం లభించింది?
మసీదులో ప్రార్థనల కోసం, దాని తూర్పు భాగంలో నేలమాళిగలు, ఫ్లాట్‌ఫామ్‌లు, మసీదులో ఎక్కువ మంది నమాజ్ చేయడానికి వీలుగా మరింత స్థలాన్ని కూడా తయారు చేశారు.
తూర్పు భాగంలో నేలమాళిగను నిర్మించడానికి ఆలయ స్తంభాలను ఉపయోగించారు.
N2 అనే క్రిప్ట్‌లో గంటలు, దీపం స్టాండ్, సంవత్ శాసనాలు ఉన్న ఉపయోగించిన స్తంభం ఉన్నాయి.
S-2 పేరుతో నేలమాళిగలో మట్టి కింద పూడ్చిపెట్టిన హిందూ దేవుళ్లు మరియు దేవతల విగ్రహాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు భారతీయ పురావస్తు శాఖ నివేదిక తెలిపింది.
స్థంబాలు, గోడలు
భారతీయ పురావస్తు శాఖ నివేదిక ప్రకారం, మసీదును విస్తరించడానికి, దాని ప్రాంగణాన్ని పెద్దదిగా చెయ్యడానికి వీలుగా అప్పటికే ఉన్న ఆలయ స్తంభాలను కొద్దిగా మార్చారు.
మసీదు కారిడార్‌లలోని స్తంభాలను క్షుణ్ణంగా పరిశీలించగా, అవి వాస్తవానికి పూర్వం ఉన్న హిందూ దేవాలయంలో భాగమని తేలింది.
మసీదు నిర్మాణానికి ఈ స్తంభాలను ఉపయోగించేందుకు, వాటిలో ఉన్న తామర పతకం పక్కన ఉన్న కళాకృతులను తొలగించి, పూల ఆకృతులను చెక్కారని ఏఎస్ఐ తన నివేదికలో పేర్కొంది.

ఫొటో సోర్స్, ROBERT NICKELSBERG/GETTY IMAGES
పశ్చిమ గది, పశ్చిమ గోడ
మసీదు పశ్చిమ గోడలో మిగిలిన భాగం ఇప్పటికే ఉన్న హిందూ దేవాలయమని ఏఎస్ఐ చెబుతోంది..
ఆలయ ఉత్తర దక్షిణ ద్వారాలను మెట్లుగా మార్చారు. ఉత్తర హాలు ప్రవేశద్వారం వద్ద ఉన్న మెట్లు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి.
సెంట్రల్ హాల్ - ప్రధాన ప్రవేశ ద్వారం
ఆలయానికి నాలుగు వైపులా నాలుగు గదులు, మధ్యలో పెద్ద హాలు మాదిరిగా ఉన్నట్లు నివేదిక తెలిపింది
ఏఎస్ఐ ప్రకారం, ఆలయం మధ్యలో ఉన్న విశాలమైన ప్రదేశం మసీదు నిర్మాణం తర్వాత కూడా కొనసాగింది.
పశ్చిమ వైపు నుంచి ఆలయం లోపలకు ప్రవేశించే ద్వారాన్ని రాతితో మూసివేశారు. ఆ ద్వారానికి రెండో వైపున ఖిబ్లాను నిర్మించినట్లు నివేదిక చెబుతోంది.

జ్ఞానవాపి సర్వే చాలా కష్టంతో కూడుకున్న పని: ఏఎస్ఐ
ఏఎస్ఐ తన సర్వేను గత ఏడాది ఆగస్టు 4న కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభించింది. ఈ బృందంలో అనేకమంది నిపుణులు ఉన్నారు.
సర్వే వివరాలు బయటకు లీకైతే ఏర్పడే సమస్యలను దృష్టిలో పెట్టుకుని సర్వే సమయంలో మీడియా రిపోర్టింగ్‌ను కోర్టు నిషేధించింది.
నిర్మాణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా సర్వే చేయాలని కోర్టు ఆదేశించినా మట్టి, చెత్తాచెదారం ఉన్న దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుని, ఇందులో భాగస్వాములైన అన్ని పక్షాల అంగీకారంతో శిథిలాలను తొలగించారు.
జ్ఞాన్‌వాపి చుట్టుపక్కల కేంద్ర భద్రతా ఏజన్సీల వలయం ఉంది. దీని కారణంగా మసీదులోకి పదే పదే వెళ్లడానికి, రావడానికి వీలుండేది కాదు.
నాలుగు నెలల పాటు ఏఎస్ఐ అధికారులు, నిపుణులు, సిబ్బంది ఈ సర్వేను నిర్వహించారు.
కొన్ని నేలమాళిగల్లో కరెంటు లేకపోవడంతో తొలినాళ్లలో టార్చ్, రిఫ్లెక్టర్ లైట్‌తో సర్వే నిర్వహించారు.
మొదట్లో నేలమాళిగల్లో కరెంటు లేకపోగా, తర్వాత కాలంలో ఫ్యాన్లు, లైట్లు అమర్చారు.
వర్షాకాలంలో తవ్విన స్థలాన్ని టార్పాలిన్‌తో కప్పి జాగ్రత్త చేశారు. ఈ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. తరచూ ఈ టార్పాలిన్‌ను చించి సర్వే చేస్తున్న సిబ్బందిని ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
సర్వే ఆదేశాలలో కోర్టు ఏం చెప్పింది?
‘‘ఇక్కడ శాస్త్రీయంగా సర్వే జరిపిన తర్వాత వాస్తవాలు కోర్టుకు చేరుతాయి. అప్పుడు కేసుపై న్యాయస్థానాలు నిర్ణయాలు తీసుకుంటాయి’’ అని వారణాసి జిల్లా జడ్జి ఈ కేసులో ఏఎస్ఐ సర్వేకు ఆదేశిస్తూ చెప్పారు.
సెటిల్‌మెంట్ ప్లాట్ నెం. 9130 (ప్రస్తుతం ఉన్న జ్ఞాన్‌వాపి కాంప్లెక్స్) భూమిని, భవనాన్ని (మసీదు భవనం) సర్వే చేయాలని సుప్రీంకోర్టు తన ఆదేశంలో ఏఎస్‌ఐకి చెందిన సారనాథ్ సర్కిల్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్‌కు సూచించింది.
భవనాలకు ఏమాత్రం దెబ్బ తగలకుండా ఇక్కడ సర్వే నిర్వహించాలని కోర్టు ఏఎస్ఐకి సూచించింది. కేంద్రం కూడా సర్వే సందర్భంగా నిర్మాణాల సమీపంలో తవ్వకాలు గానీ, కూల్చివేతలుగానీ ఉండవని హామీ ఇచ్చింది.
సర్వే బృందంలో పురావస్తు శాస్త్రవేత్తలు, పురావస్తు రసాయన శాస్త్రవేత్తలు, ఎపిగ్రాఫిస్ట్‌లు, సర్వేయర్‌లు, ఫోటోగ్రాఫర్‌లు, ఇతర సాంకేతిక నిపుణులను నియమించారు. నిపుణుల బృందం జీపీఆర్ (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్) సర్వే కూడా నిర్వహించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఏఎస్ఐ పరిశోధన పరిధి ఏంటి?
అప్పటికే అక్కడ ఒక దేవాలయం ఉంటే దానిపై మసీదును నిర్మించారా అన్నది ఏఎస్ఐ సర్వే తేల్చాల్సిన అంశం. ఇందుకోసం ముందుగా జ్ఞానవాపిలోని పడమరవైపు గోడ వయస్సు ఎంత, దాన్ని స్వభావం ఏంటి అన్నది తెలుసుకోవడానికి ముందుగా తేల్చాల్సి వచ్చింది. దీనికోసం అవసరమైతే గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్‌ను ఉపయోగించాల్సి ఉంది.
జ్ఞానవాపి మూడు గోపురాలు, ఇంకా నేలమాళిగలను పరిశీలించాలి.
తన పరిశోధనలో బయటకు వచ్చిన వస్తువుల జాబితాను తయారు చేయాలి. ఏ వస్తువులను ఎక్కడ సేకరించారో నమోదు చేయాలి. కార్బన్ డేటింగ్ విధానంలో వాటి వయసును, స్వభావాన్ని నిర్ధారించాలి.
అలాగే జ్ఞానవాపి కాంప్లెక్స్‌లో కనిపించే అన్ని స్తంభాలు, ప్లాట్‌ఫారమ్‌లను శాస్త్రీయంగా పరిశోధించి, వాటి వయస్సు, రూపం, నిర్మాణ శైలిని ఏఎస్ఐ గుర్తించాల్సి ఉంది.
డేటింగ్, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్‌తోపాటు మరికొన్ని శాస్త్రీయ పద్ధతుల్లో జ్ఞానవాపి నిర్మాణం వయసు, స్వభావాన్ని ఏఎస్ఐ అంచనా వేసింది.
పరిశీలన సమయంలో బయటకు వచ్చిన వస్తువులు, ఇంకా ఇతర చారిత్రక, మతపరమైన వస్తువులను కూడా పరిశీలించాల్సి వచ్చింది. ఈ క్రమంలో అసలు నిర్మాణానికి ఎలాంటి దెబ్బ తగలకుండా ఏఎస్ఐ జాగ్రత్త పడింది.

ఫొటో సోర్స్, Getty Images
సర్వేను వ్యతిరేకించిన మసీదు వర్గాలు
ప్రస్తుతం కోర్టుకు సమర్పించిన రాతపూర్వక, మౌఖిక ఆధారాలు ద్వారా కోర్టు ఏ నిర్ధారణకు రాలేనప్పుడు మాత్రమే సర్వే చేయాలని మసీదు తరఫు వర్గాలు భావించాయి.
నిర్మాణ శైలిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే, కృత్రిమంగా నిర్మించిన గోడల వెనుక ఏవైనా వస్తువులు ఉన్నట్లు ఆధారాలు లభించవని హిందూ పక్షం కోర్టులో పేర్కొంది.
అయితే హిందూ పక్షం వాదనకు అనుకూలంగా సాక్ష్యాలను సేకరించేందుకు చట్టాలు ఏఎస్ఐకి అనుమతి ఇవ్వవని ముస్లిం పక్షం నమ్మింది.
ఏఎస్ఐ సర్వే అంటూ జరిగితే అది 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడమేనని, స్వాతంత్ర్యానికి ముందు ఉన్న మతపరమైన స్థలాల మతపరమైన స్వభావాన్ని మార్చడానికి ఇది అనుమతించదని మసీదు పక్షం పేర్కొంది.
జ్ఞానవాపి భూమి యాజమాన్యానికి సంబంధించిన వ్యవహారంలో ఏఎస్‌ఐ సర్వేపై అలహాబాద్ హైకోర్టు ఇప్పటికే స్టే విధించిందని కూడా మసీదు పక్షం గుర్తు చేసింది. అలాంటప్పుడు మళ్లీ సర్వేను ఎలా అనుమతిస్తారు? అన్నది ముస్లిం వర్గాల ప్రశ్న. అయితే కోర్టులో ఈ వివాదానికి పరిష్కారాన్ని కనుగొనడంలో ఏఎస్ఐ సర్వే సహాయపడుతుందని హిందూ వైపు వాదించింది.
ఇప్పుడు రెండు పార్టీలు అంటే హిందూ, ముస్లిం వర్గాలు రెండూ ఏఎస్ఐ సర్వే ఫలితాలను కోర్టులో సవాల్ చేసే అవకాశం కూడా ఉంది.
సర్వే జరపడం 1991 నాటి ప్రార్ధనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడం కిందికి రాదని, స్వాతంత్య్రానికి ముందు, తర్వాత కూడా అక్కడ హిందువులు పూజలు చేశారని ఆలయ పక్షం అంటోంది.
చారిత్రక కట్టడాలను పరిరక్షించడమే ఏఎస్ఐ పని అని, అలాంటప్పుడు జ్ఞానవాపి సర్వే వల్ల మసీదుకు ఎలాంటి హాని కలదగదని కూడా హిందూ పక్షం వాదన.
అయోధ్య తరహాలోనే జ్ఞానవాపి సర్వే కూడా సమర్ధమనీయమేనా?
‘‘ప్రార్ధనా స్థలాల చట్టం 1991 ప్రకారం, బాబ్రీ మసీదుకు సంబంధించిన ఆగస్టు 15, 1947 ముందు నుంచి కేసు పెండింగ్‌లో ఉంది. కానీ, జ్ఞానవాపికి సంబంధించి ఎలాంటి కేసులు లేవు. అయోధ్య భూ యాజమాన్య హక్కు కేసులో ప్రార్థనా స్థలాల చట్టం చెల్లుబాటును కోర్టు నిర్ధరించింది.
అయితే, అయోధ్యలో ఏఎస్ఐ సర్వే భిన్నమైన పరిస్థితుల్లో జరిగింది. 1992లో మసీదు కూల్చివేత తర్వాత ఏఎస్ఐ అక్కడ సర్వే నిర్వహించింది. అంతకు ముందు కాదు’’ అని మసీదు తరఫు న్యాయవాది ఎస్‌ఎఫ్‌ఎ నఖ్వీ అన్నారు.
ఈ కథనం ప్రచురించే వరకు ఏఎస్ఐ సర్వే నివేదికపై మసీదు వర్గాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఇవి కూడా చదవండి:
- పద్మవిభూషణ్ చిరంజీవి: ‘ఇది కదా నా ప్రపంచం, ఇది కదా నిజమైన సంతోషం’ అని ఆయన ఎప్పుడన్నారు?
- అయోధ్య రామాలయం: ఉత్తరాది, దక్షిణాది ఆలయాల ఆర్కిటెక్చర్లో తేడా ఏమిటి?
- అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ బీజేపీకి మరోసారి అధికారం కట్టబెడుతుందా?
- రామనామీ: ఒళ్లంతా రామ నామాలే పచ్చబొట్లుగా వేసుకునే ఈ తెగ కథేంటి? వీళ్లు ఆరాధించేది ఏ రాముడిని?
- నువ్వుల లడ్డూ: 'తీయని మాటలు పలికేలా చేసే తీపి వంటకం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















