తమిళనాడులో రావణుడిని పూజించే ఆచారం ఎప్పుడు, ఎలా మొదలైంది?

రావణుడు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
    • హోదా, బీబీసీ తమిళం

తమిళనాడు రాష్ట్రంలో రాముడిని పూజించినట్లుగానే చాలా మంది రావణుడిని కూడా పూజిస్తారు. రావణుడిని ఆరాధించే ఈ సంప్రదాయం అసలు ఎప్పుడు మొదలైంది? దాని వెనుక ఉన్న కారణమేంటి?

అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన జనవరి 22న సోషల్ మీడియాలో చాలా మంది యూజర్లు ఈ కార్యక్రమంపై స్పందిస్తూ పోస్టులు పెట్టారు.

అదే సమయంలో తమిళనాడులో #Ravanan అనే హ్యాష్‌ట్యాగ్‌తో కొన్ని పోస్టులు కనిపించాయి. రావణుడి గొప్పతనాన్ని వివరిస్తూ పోస్టులు ఎక్కువగా షేర్ అవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

రామాయణంలో రావణుడు ప్రతినాయకుడు. రాముడి విరోధి అయినా రావణుడు పురాణాల్లో భాగమే. భారతదేశంలో చాలాచోట్ల రావణుడికి కూడా ఆలయాలు ఉన్నాయి.

రావణుడిని పూజించడమనేది కొత్తేమీ కాదు. అయితే, తమిళనాట రావణుడిని పూజించడం వెనుక మరో కథ ఉంది.

తమిళనాడులో రావణుడిని పూజించే సంప్రదాయం

ఫొటో సోర్స్, Getty Images

ఈ సంప్రదాయం ఎలా మొదలైంది?

వాల్మీకి రామాయాణాన్ని ఆధారం చేసుకుని, తమిళ భాషలో రాసిన ‘కంబ రామాయణాన్ని’ తమిళ ప్రజలు ఇతిహాసంగా భావిస్తారు.

తొమ్మిది నుంచి పన్నెండో శతాబ్దాల మధ్య కాలంలో రచించిన కావ్యంగా చెప్పే కంబ రామాయణం ప్రజల విశ్వాసాలపై బలమైన ప్రభావాన్ని చూపింది.

అయితే, విశ్లేషకులు చెప్పినదాని ప్రకారం, కంబ రామాయణం కన్నా ముందే తమిళ భాషలో రామాయణం ఉంది.

ఎస్. వైయపురి పిళ్లై రాసిన తమిళర్ పన్బాడు పుస్తకంలో సిలపటికారం కాలంలో రామాయణ నుంచి ప్రేరణ పొంది రాసిన పాత్రలు ఉన్నాయి.

అంతేకాకుండా, పురణానూరు, అగనానూరు, మధురైకాంజీ, పరిబాడల్‌ల సాహిత్యంలో కూడా రామాయణ ప్రస్తావనలు, పాత్రల గురించి విశ్లేషణలు ఉన్నాయి.

తిరుజ్ఞాన సంబంధర్ రచించిన ‘తిరునీట్రు పదిగం’లో రావణుడి గురించి ‘రావణన్ మేలద్ నీరు’ అంటే, రావణుడు శైవుడని చెప్పారు.

రావణాసురుడు

ఫొటో సోర్స్, Getty Images

ఎప్పటి నుంచి పూజిస్తున్నారు?

19వ శతాబ్దం నుంచి తమిళనాడులో రావణుడికి ప్రాముఖ్యం పెరిగిందని చెప్పారు విశ్లేషకులు స్టాలిన్ రాజంగం.

స్టాలిన్ మాట్లాడుతూ, “19వ శతాబ్దంలో ‘తత్వవివేశిని’లో మసిల్మణి ముదలియార్ రావణుడిని కొన్నిచోట్ల మంచి లక్షణాలున్న పాత్రగా కీర్తించాడు. అదేకాక, అయోధ్య దాస్ రచనల్లోనూ రావణుడి గురించి మంచి విషయాలు, సద్గుణాలను ప్రస్తావించారు. 20వ శతాబ్దంలో ద్రావిడ ఉద్యమ సమయం నుంచి రావణుడి పాత్రను సద్గుణుడిగా చూపడం మొదలైంది” అన్నారు.

ద్రావిడ కవి భారతీదాసన్ రాసిన ‘టెన్రీసైయె పార్కిన్రేన్’ గీతమంతా రావణుడిని శ్లాఘిస్తూ సాగుతుంది.

అనంతరం ద్రావిడ ఉద్యమ ముఖ్య నాయకులు అన్నాదురై కాలంలో రాముడికి బదులు రావణుడి పాత్రను సద్గుణుడిగా ప్రస్తావించడం క్రమంగా పెరిగిందని చెప్పారు స్టాలిన్.

ఆ వివరాల ప్రకారం, “12వ శతాబ్దానికి ముందు వరకు రావణుడి భావజాలం, సిద్ధాంతాలే తప్ప, ప్రధానంగా కనిపించలేదు. కానీ, 20వ శతాబ్దంలో తమిళ ఉద్యమం తరువాత రావణుడి పాత్రను ద్రావిడ తమిళ సంస్కృతికి ప్రతీకగా చెప్పడం మొదలైంది”

ఇదేకాక, వెల్సామీ చెప్పిన ప్రకారం, “తమిళ భాషా సాహిత్యంలో, రావణుడిని ఈ స్థాయిలో పూజించే సంప్రదాయం లేదు. అది 20వ శతాబ్దంలో మొదలైంది.

బ్రాహ్మణేతర ఉద్యమం పూర్తి స్థాయిలో రూపు దిద్దుకుంటున్న సమయంలో తమిళనాడులో కంబ రామాయణం గొప్ప ప్రభావాన్ని చూపింది” అన్నారు వెల్సామీ.

ఆయన మాట్లాడుతూ “రాముడిని ప్రధానంగా బ్రహ్మణులు చూపితే, అందుకు పోటీగా రావణుడిని తెర మీదకు తీసుకువచ్చారు ద్రవిడ ఉద్యమకారులు. అంతేకాక, రాముడి పాత్రను విమర్శించడం మొదలుపెట్టారు” అని చెప్పారు.

1950 తొలినాళ్లలో ద్రావిడనాడులో ప్రచురితమైన ఓ వ్యాసం ప్రశ్నల్ని రేకెత్తించింది. అందులో, “రామలీలకు బదులుగా రావణలీల నిర్వహించి, రాముడి దిష్టిబొమ్మని దహనం చేస్తే ఏం చేయగలరు?” అని అందులో సీఎన్ అన్నాదురై ప్రశ్నించారు.

ఎం. కరుణానిధి కూడా రామలీలపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. దక్షిణాదిలో రామలీలకు త్వరలోనే ముగింపు వస్తుందని ఆయన అన్నారు.

అన్నా రాసిన ‘కంబ రసం’ పుస్తకంలోనూ ద్రావిడ ఉద్యమంలో రామాయణానికి వ్యతిరేకంగా ప్రస్తావనలు ఉన్నాయి.

రావణుడు

ఫొటో సోర్స్, Getty Images

పెరియార్ గురించి కూడా ప్రస్తావించారు స్టాలిన్ రాజంగం. రాముడి ఉనికిని ప్రశ్నించిన పెరియార్, రావణుడి గుర్తింపును కూడా సమర్థించలేదని ఆయన అన్నారు.

పెరియార్ తొలి వర్ధంతి నాడు మణియమ్మైయార్ నేతృత్వంలో ద్రవిడర్ కజగం తరఫున రావణలీల నిర్వహిస్తామని ప్రకటించారు.

అందుకు గట్టి వ్యతిరేకత వచ్చినప్పటికీ, చెన్నైలో రావణలీల నిర్వహించారు. అప్పటి నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నప్పటికీ, చాలాసార్లు రావణలీల నిర్వహించారు.

రామాయణంలో రావణాసురుడి పాత్ర

ఫొటో సోర్స్, RAMAYAN

ఫొటో క్యాప్షన్, సినిమాల్లో రావణుడు

ద్రావిడ నాటక కర్త, ప్రొఫెసర్ బులవర్ కావ్యమ్ 1946లో 'రావణకావ్యం' రచించారు. అందులో రావణుడి పాత్రను మంచిగా, రామ, లక్ష్మణులను చెడు పాత్రలుగా రాశారు. ఆ పుస్తకంపై తమిళనాడులో వివాదం మొదలైంది. చివరకు జూన్ 2, 1948లో తమిళనాడు ప్రభుత్వం ఆ పుస్తకంపై నిషేధం విధించింది. 1972 తరువాత ఆ నిషేధాన్ని ఎత్తివేసింది.

‘రావణ కావ్యం’ పుస్తకమే రావణుడిని మంచికి ప్రతీకగా, సద్గుణుడిగా చిత్రీకరించడంలో ఈ పుస్తకం కీలకపాత్రే పోషించిందని చెప్తుంటారు.

మణిరత్నం దర్శకత్వంలో 2010లో వచ్చిన ‘రావణ్’ చిత్రం కూడా రామాయణం నుంచి ప్రేరణ పొందినదే. ఆ చిత్రంలో రావణుడి పాత్రను మంచి లక్షణాలున్న వ్యక్తిగా చూపారు.

“అయితే, ప్రజలు వీటన్నిటికీ ఎక్కువ ప్రాధాన్యమివ్వరు. రామాయణాన్ని ఎప్పటిలాగానే చూస్తారు” అన్నారు వెల్సామి.

1980ల చివరికి వచ్చేసరికి బీజేపీ ప్రాబల్యం పెరగడం, నూతన ఆర్థిక విధానాలు, దేశవ్యాప్తంగా అట్టడుగు వర్గాల పోరాటాలు, మండల కమిషన్ సిఫార్సుల అమలు వంటి పలు కారణాల వల్ల రావణుడిని రాముడికి ప్రత్యామ్నాయంగా చూడాలన్న పద్ధతి అంతగా ప్రాధాన్యం సంతరించుకోలేదు.

మళ్లీ రామ మందిర ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో రావణుడి పేరుతో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవడం మొదలైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)