అయోధ్య రామమందిరం భూమి పూజ.. ఎవరెవరు వస్తున్నారు.. ఎవరు రావడం లేదు

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Pti

    • రచయిత, ఫైజల్ మహమ్మద్ అలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అయోధ్యలో రామ మందిరానికి నేడు (ఆగస్టు 5న) భూమి పూజ చేయనున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సోమవారం మధ్యాహ్నం ఈ విషయం అధికారికంగా ప్రకటించారు.

ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్రణాళికలు రచించినప్పటికీ.. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో అత్యంత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. భారత్ గడ్డపై పుట్టిన 36 ప్రముఖ మత సంప్రదాయాలకు చెందిన 135 మంది సాధువులు ఈ వేడుకకు వస్తున్నారు.

బాబ్రీ మసీదు-రామ మందిరం వివాదంపై కోర్టులో దావావేసిన వారిలో ఒకరైన ఇక్బాల్ అన్సారీ, అయోధ్య నివాసి, పద్మ శ్రీ మహమ్మద్ షరీఫ్‌లకూ భూమి పూజ ఆహ్వానం అందింది.

నేపాల్‌లోని జానకీ దేవాలయ ప్రతినిధులూ ఇక్కడకు వస్తున్నారు. అయోధ్యతో సీత పుట్టినిల్లుగా చెప్పే జనక్‌పుర్‌కు సంబంధమున్నట్లు ఎన్నో కథలు చెబుతున్నాయి.

మరోవైపు రామ మందిర ఉద్యమంలో ఏళ్లపాటు క్రియాశీలంగా వ్యవహరించిన చాలా మందికి ఎలాంటి ఆహ్వానాలు అందలేదు.

నిజమే, కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొద్ది మందినే ఆహ్వానించారు. అయితే అతిథుల జాబితాపై చాలా చర్చ జరుగుతోంది.

భూమి పూజను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తారు. కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధిపతి మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు.

భూమి పూజపై ప్రకటన చేసే సమయంలో వేదికపై చంపత్ రాయ్‌తోపాటు చాలా మంది కనిపించారు. కానీ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఛైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ మాత్రం కనిపించలేదు.

చాక్లెట్‌తో అయోధ్య ఆలయ నమూనా శిల్పాభట్

ఫొటో సోర్స్, SAM PANTHAKY/gettyimages

అయోధ్యలోని అతిపెద్ద అఖాడాల్లో ఒకటైన మణి రామ్‌దాస్ జీ అఖాడా పీఠాధిపతి అయిన గోపాల్ దాస్ ఏళ్లుగా రామ జన్మభూమి న్యాస్ ట్రస్ట్ అధిపతిగా కొనసాగారు. దశాబ్దాల తరబడి రామజన్మభూమి ఉద్యమంలో ఆయన క్రియాశీలంగా వ్యవహరించారు. అయితే ఇటీవల కాలంలో ఆయన గొంతు పెద్దగా వినిపించలేదు. ఆయనకు వీహెచ్‌పీతో సంబంధముంది. అయితే ఆయన ఆర్‌ఎస్‌ఎస్ లేదా వీహెచ్‌పీల్లో కార్యకర్త గానీ, నాయకుడుగా గానీ పనిచేయలేదు.

భూమి పూజకు గోపాల్ దాస్ రాకపోవడంపై రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుల్లో ఒకరైన డాక్టర్ అనిల్ మిశ్రా బీబీసీతో మాట్లాడారు. ''మీడియాలో ఏవో కథనాలు వస్తుంటాయి. కానీ వాస్తవం వేరు. గోపాల్ దాస్ నడవడానికి కష్టమవుతోంది. ఇప్పుడు ఆయన తన సొంత ఆశ్రమంలోనే ఉంటున్నారు''అని ఆయన వివరించారు.

''రామ జన్మభూమి ఉద్యమం పేరుతో చేసిన రాజకీయాలు అయిపోయాయి. ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాలను అడ్డుపెట్టుకొని చంపత్ రాయ్ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్ అన్నింటినీ తమ నియంత్రణలోకి తీసుకొంటోంది''అని హిందుత్య, అయోధ్యపై పుస్తకాలు రాసిన ధీరేంద్ర ఝా వ్యాఖ్యానించారు.

విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కూడా ఆర్‌ఎస్‌ఎస్‌లో భాగమే. రెండింటి భావజాలాలు ఒకేలా ఉంటాయి. వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడైన చంపత్ రాయ్.. ప్రస్తుతం రామజన్మభూమి ట్రస్టుకు ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

రాముడు

ఫొటో సోర్స్, gettyimages/DIBYANGSHU SARKAR

రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి కేంద్ర బిందువైన 2.77 ఎకరాల స్థలాన్ని ఆలయ నిర్మాణానికి కేటాయిస్తూ గతేడాది నవంబరు 9న ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది.

మసీదు నిర్మాణానికి వేరేచోట ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని కోర్టు సూచించింది. మందిరం నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్టు ఏర్పాటుచేయాలని ఆదేశించింది.

ఈ విషయంపై ఫిబ్రవరి 5న లోక్‌సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్ పేరుతో ఓ స్వతంత్ర ట్రస్టును ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన చెప్పారు.

అయోధ్య, రామమందిరం, బాబ్రీ మసీదు, బీజేపీ

ఫొటో సోర్స్, Getty Images

ఆ ముగ్గురి మధ్యే

ట్రస్టు ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయాన్ని క్యాబిటెన్ మీటింగ్‌లో తీసుకున్నామని మోదీ చెప్పారు. ట్రస్టులో ప్రభుత్వ ప్రతినిధులు సహా 15 మంది సభ్యులు ఉంటారని వివరించారు.

సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే రామ మందిర నిర్మాణం, నిర్వహణను ఎవరు చూసుకుంటారనే అంశంపై ప్రశ్నలు వచ్చాయి. దీంతో రామ జన్మభూమి న్యాస్, రామాలయ ట్రస్టు, టెంపుల్ కన్‌స్ట్రక్షన్ ట్రస్టుల పేర్లు ప్రధానంగా వినిపించాయి.

రామ జన్మభూమి న్యాస్‌కు వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌లతో సంబంధాలున్నాయి. మందిర నిర్మాణం ఎలా ఉండాలనే అంశంపై 1990 నుంచీ వీరు కరసేవక్‌పురంలో వర్క్‌షాప్‌ కూడా నిర్వహిస్తున్నారు.

మరోవైపు గతంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చొరవతో రామాలయ ట్రస్టు ఏర్పాటైంది. అందులో ద్వారకాపీఠానికి చెందిన శంకరాచార్య స్వామి స్వరూపానంద సహా పలువురు ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు.

ప్రభుత్వం ఏర్పాటుచేసిన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టులో ఈ రెండు సంస్థలకు ప్రాతినిథ్యం దక్కింది. అయితే మూడో సంస్థ అయిన టెంపుల్ కన్స్‌ట్రక్షన్ ట్రస్టుకు ఎలాంటి ప్రాతినిథ్యం దక్కలేదు. కేవలం ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉన్నవారికే కాకుండా.. రామ మంది నిర్మాణంతో సంబంధమున్న అందరికీ ప్రాతినిథ్యం కల్పించాలని ఈ సంస్థ డిమాండ్ చేసింది.

రామ జన్మభూమి కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్న నిర్మోహీ అఖాడా, హిందూ మహా సభ కూడా.. మంది నిర్మాణం, నియంత్రణపై తమ వాదనలు వినిపిస్తున్నాయి.

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్‌లో నిర్మోహీ అఖాడాకు చెందిన దీనేంద్ర దాస్‌కు చోటు దక్కింది. అయితే తమ ప్రతినిధితో ఎలాంటి చర్చలూ జరపకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని బీబీసీ ప్రతినిధి సల్మాన్ రవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మోహీ అఖాడా అధికార ప్రతినిధి కార్తిక్ చోప్రా వ్యాఖ్యానించారు.

భూమి పూజ కార్యక్రమాన్ని రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలతోపాటు ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, బీజేపీ, పారిశ్రామికవేత్తలు నియంత్రిస్తున్నారని కార్తిక్ ఆరోపించారు.

అడ్వాణీ నిర్వహించిన రథ యాత్రలో సమన్వయకర్తగా నరేంద్ర మోదీ పనిచేశారు

ఫొటో సోర్స్, Kalpit S Bhachech

ఫొటో క్యాప్షన్, అడ్వాణీ నిర్వహించిన రథ యాత్రలో సమన్వయకర్తగా నరేంద్ర మోదీ పనిచేశారు

శివసేన ఏమంటోంది?

భూమి పూజ కార్యక్రమానికి శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హాజరుకాబోరని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. గత కొన్నేళ్లలో అయోధ్యను చాలాసార్లు ఠాక్రే సందర్శించారు. అయితే రామాలయం ఏదో ఒక పార్టీకి మాత్రమే చెందదని, అన్ని కార్యక్రమాల్లోనూ తమనూ భాగస్వామ్యం చేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

రామ జన్మభూమి ట్రస్టులో తమకూ ప్రాతినిధ్యం కల్పించాలని శివసేన నాయకుడు ప్రతాప్ శర్ణిక్.. నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ''బాబ్రీ మసీదు కూల్చివేత బాధ్యతను శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే తన నెత్తిన వేసుకున్నారు.

అయినప్పటికీ అందరూ అడ్వాణీని హీరోగా కొనియాడారు. అది ఠాక్రే జీవితంలో అత్యంత విచారకరమైన రోజు''అని అప్పటి సంగతులను ప్రతాప్ గుర్తుచేశారు.

''బాబ్రీ మసీదు కూల్చివేతకు రక్తం చిందించిన తమ పార్టీ నాయకులు ఏనాడూ రాజకీయ ప్రయోజనాలు ఆశించలేదు''అని శివ సేన పత్రిక సామ్నా కథనం కూడా రాసింది.

''ట్రస్టులో సభ్యులందరూ అయితే మోదీకి సన్నిహితులు. లేదా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీతో సంబంధమున్న నాయకులు. 2024 ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ట్రస్టును ఇలాంటి వారితో ఏర్పాటుచేశారు''అని సామ్నా ఆరోపించింది.

అడ్వాణీతోపాటు బీజీపీ మాజీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి కూడా భూమి పూజకు హాజరు కావడంలేదు. రామ జన్మభూమి ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించిన ఉమా భారతికి మాత్రం ఆహ్వానం అందింది.

అయితే, కార్యక్రమానికి తాను హాజరు కావడంలేదని ఉమా భారతి కూడా ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రితోపాటు అక్కడకు వచ్చే వేల మంది ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నానని ఆమె వివరించారు.

అందరూ వెళ్లిపోయాక ఆ ప్రాంతాన్ని దర్శించుకుంటాని వివరించారు. కరోనావైరస్ వ్యాప్తి నడుమ భోపాల్ నుంచి అయోధ్యకు రైలులో రావడం వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు పేర్కొన్నారు.

అయితే ఆమె కోపంగా ఉండటం వల్లే కార్యక్రమానికి హాజరు కావడంలేదని వార్తలు కూడా వచ్చాయి.

అయోధ్య

ఫొటో సోర్స్, MANSI THAPIYAL

దళితులతో భూమిపూజపై చర్చ

కొన్ని రోజుల క్రితం దేవాలయం భూమి పూజ దళితుడితో చేయించాలని ట్విటర్‌లో చర్చ జరిగింది. 1989లో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం.. బిహార్‌కు చెందిన దళితుడు కామేశ్వర్ చౌపాల్‌తో భూమి పూజ చేయించింది.

ఇప్పుడు కూడా శ్రీ రామ జన్మభూమి ట్రస్టులో ఆయనకు సభ్యత్వం ఉంది. ''రామ జన్మభూమికి సంబంధించిన వాస్తవాలు లభించేలా భూమి నుంచి 200 అడుగుల లోతున టైమ్ క్యాప్సూల్‌ను పంపించబోతున్నాం''అని ఇటీవల ఆయన ఓ కథనం రాసుకొచ్చారు.

అయితే, ఆ మరుసటి రోజే అలాంటిదేమీ లేదని చంపత్ రాయ్ ప్రకటన విడుదల చేశారు. టైమ్ క్యాప్సూల్ ప్రకటన తప్పని ఆయన చెప్పారు.

కేవలం రామ జన్మభూమి ట్రస్టులోని అధికారిక వర్గాల నుంచి వచ్చిన సమాచారం మాత్రమే విశ్వసించాలని ఆయన కోరారు.

సోమవారం దళితుల అంశంపై మాట్లాడుతూ.. ''ఒక సారి సాధువు అయితే.. ఆ మనిషి దేవుడు అవుతాడు. అలాంటప్పుడు ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుతమున్న వార్తల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 12.15కు భూమి పూజ జరగబోతోంది. కేవలం 32 సెకన్లు మాత్రమే ఈ ముహూర్తం ఉంటుంది.

దీని కోసం వారణాసితోపాటు కొన్ని ప్రముఖ స్థలాల నుంచి పండితులు వస్తున్నారు.

ప్రస్తుతమున్న తాత్కాలిక దేవాలయంలో 30 ఏళ్లుగా పూజలు చేస్తున్న పండితుడు సత్యేంద్ర దాస్‌ను ఈ విషయంపై సంప్రదించలేదు. ''మందిరం నిర్మించిన తర్వాత ఇక్కడ పండితుడు ఎవరు ఉంటారు అనేది రాముడికే తెలియాలి''అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)