ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు పొత్తుధర్మం పాటించలేదన్న పవన్ కల్యాణ్... టీడీపీ, జనసేనల మధ్య ఏం జరుగుతోంది?

చంద్రబాబు, పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, Getty Images / Janasena

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

గణతంత్ర వేడుకల్లో పార్టీ నేతలతో సమావేశమైన సందర్భంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ‘పొత్తు ధర్మం’ పాటించలేదు. అందుకు జనసేన నేతలు చాలా బాధపడ్డారు. అందుకు నేను వారికి క్షమాపణలు చెబుతున్నా” అన్నారు.

ఇటీవల బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో జరిగిన టీడీపీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో మళ్లీ టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర రావు బరిలో ఉంటారని ప్రకటించారు. దీనిపై స్థానిక జనసేన నేతలు అభ్యంతరం చెప్పారు.

ఆ ప్రకటనను ఉద్దేశించి, తమతో చర్చించకుండా టీడీపీ అభ్యర్థులను ప్రకటించడాన్ని తప్పుపట్టారు పవన్ కల్యాణ్.

టీడీపీ, జనసేన పొత్తు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యువగళం-నవశకం పేరిట నిర్వహించిన సభలో ఇరుపార్టీల శ్రేణులు కలిసి పనిచేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు అన్నారు.

ఇంతకీ ఆయన ఏమన్నారు?

‘‘టీడీపీ వంటి పెద్ద పార్టీలను ఒంటరిగా నడిపే చంద్రబాబు నాయుడు వంటి వ్యక్తులకు ఒక్కోసారి పొత్తు అనేది సైజు సరిపోని చొక్కాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితులు, వాస్తవాలు వేరుగా ఉంటాయి. ఆనాడు లోకేశ్ గారు ‘మా నాన్నే ముఖ్యమంత్రి’ అని చెప్పినా నేను పట్టించుకోలేదు. వాళ్లకున్న అనుభవం వల్ల ఒకోసారి వారు అలా అంటూ ఉంటారు. కానీ జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదనే నేను పెద్దగా రియాక్ట్ కాను’’ అన్నారు.

‘‘వాళ్ల మాదిరిగా మీరు మాట్లాడొచ్చు కదా అంటారు. నాకు, వాళ్లకు అదే తేడా’’ అని కూడా పవన్ అన్నారు.

చంద్రబాబు నాయుడికి ‘పోటీ’గా పవన్ కల్యాణ్ కూడా జనసేన పోటీ చేసే రెండు స్థానాలను ప్రకటించారు.

ఆ సందర్భంగా ఆయన చెప్పిన మరొకమాట.. ‘‘చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు మీరు (పవన్ కల్యాణ్) వెళ్లడం వల్ల వాళ్లు (టీడీపీ) బతికేశారని కార్యకర్తలు అంటున్నారు’’.

పోయిన ఏడాది సెప్టెంబరులో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో అరెస్టు అయి చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు బయటే టీడీపీతో పవన్ కల్యాణ్ పొత్తు ప్రకటించారు.

అదే ఏడాది డిసెంబరులో జరిగిన నారా లోకేశ్ ‘యువగళం’ ముగింపు సభలో కూడా పవన్ కల్యాణ్‌ పాల్గొన్నారు.

మొన్న సంక్రాంతి పండగకు కలిసే జరుపుకున్నారు. సంక్రాంతి నాటికే ఉమ్మడి మ్యానిపెస్టో, సీట్ల సర్దుబాటు మీద అవగాహనకు వస్తామని చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెప్పినా ఇంతవరకు జరగలేదు.

మొన్న సభలో చంద్రబాబు రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, ఇప్పుడు జనసేన కూడా రెండు సీట్లను ప్రకటించేసింది.

పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, Jansena

ఫొటో క్యాప్షన్, పవన్ కల్యాణ్ రెండు స్థానాలకు జనసేన అభ్యర్థులను ప్రకటించారు.

మండపేటలో ప్రకటనతోనే మంటలా?

కొన్ని వారాలుగా చంద్రబాబు ‘‘రా.. కదలిరా’’ పేరిట జిల్లాల వారీగా బహిరంగసభలు నిర్వహిస్తున్నారు. అలా బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట బహిరంగసభలో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర రావుని వచ్చే ఎన్నికల్లో మళ్లీ బరిలో ఉంటారంటూ చంద్రబాబు ప్రకటించారు

గత ఎన్నికల్లో వేగుళ్ల జోగేశ్వర రావుపై పోటీ చేసిన వేగుళ్ల లీలాకృష్ణ అక్కడ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. చంద్రబాబు ప్రకటనతో స్థానిక జనసేన నేతలు అభ్యంతరం తెలిపారు.

టీడీపీలోని జోగేశ్వర రావు వ్యతిరేక వర్గం కూడా ఆ ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతకు ముందు అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి దొన్నుదొరను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు.

అరకు, మండపేట సీట్లకు టీడీపీ అభ్యర్థుల ప్రకటనతో, రాజోలు, రాజానగరం సీట్లలో జనసేన పోటీ చేస్తుందంటూ పవన్ కల్యాణ్ ప్రకటించారు.

‘‘ఒత్తిడి వల్ల చంద్రబాబు నాయుడు ఆ సీట్లలో అభ్యర్థులను ప్రకటించారు. నా మీద కూడా ఒత్తిడి ఉంది కాబట్టి నేను కూడా రెండు సీట్లను ప్రకటిస్తున్నా’’ అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

పొత్తు కుదిరినా, స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ వరకూ అన్నింటా మూడోవంతు సీట్లకు జనసేన బరిలో ఉంటుందని పవన్ అన్నారు.

కోనసీమ జిల్లాలోని రాజోలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని 2019 ఎన్నికల్లో జనసేన గెలుచుకుంది. రాష్ట్రంలోనే ఆ పార్టీకి దక్కిన ఏకైక సీటు అది. అంతేకాక, ఆ ఎన్నికల్లో జనసేనకి ఎక్కువ ఓట్లు గోదావరి జిల్లాల్లోనే వచ్చాయి. అత్యధికంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 14 శాతం వరకు వచ్చాయి.

మరో రెండు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆ జిల్లా మీదనే జనసేన ఫోకస్ ఎక్కువ పెట్టింది.

2019తో పోలిస్తే ప్రస్తుతం తమ ఓటు బ్యాంకు అక్కడ పెరిగిందని కూడా పవన్ కల్యాణ్ చెబుతున్నారు. అందుకు తగినట్లుగానే టికెట్లు ఆశించే జనసనే నేతలు అక్కడ సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే, ఊహించని విధంగా మండపే సీటును టీడీపీ ఖారారు చేయడంతో జనసేన జీర్ణించుకోలేక పోయింది. అక్కడ అనేక స్థానాల్లో జనసేనతో పాటుగా టీడీపీ నేతలు కూడా టికెట్లు ఆశిస్తున్నారు.

తాము పోటీ చేస్తామంటూ తాజాగా పవన్ ప్రకటించిన రాజోలు అసెంబ్లీ స్థానంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీ తరఫున రేసులో ఉన్నారు.

రాజానగరం స్థానంలో 2009, 2014 ఎన్నికల్లో వరుసగా టీడీపీ గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేయాలని బొడ్డు వెంకట రమణ చౌదరి సన్నాహాలు చేసుకుంటున్నారు. దాంతో పవన్ కల్యాణ్ ప్రకటన టీడీపీకి తలనొప్పిగా మారనుంది.

ముద్రగడ
ఫొటో క్యాప్షన్, ముద్రగడ పద్మనాభం

మరోవైపు వైసీపీ చేస్తున్న మార్పులతో ఆ పార్టీని వీడుతున్న అసంతృప్తుల్లో కొందరు జనసేన వైపు చూస్తున్నారు.

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరుతున్నట్లుగా ప్రకటించగా, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, గూడురు ఎమ్మెల్యే వర ప్రసాద్, వంటి నేతలు కూడా పవన్ కల్యాణ్‌ను కలిశారు. ముద్రగడ పద్మనాభం కూడా జనసేన వైపు చూస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అనకాపల్లికి చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఇటీవలే జనసేనలో చేరారు.

ఇలా పలు పార్టీల నుంచి జనసేన వైపు చూస్తున్న నాయకులందరికీ సీట్లు సర్థుబాటు చేయాలంటే ఆ పార్టీ ఎక్కువ సంఖ్యలో సీట్లు అడగాల్సి ఉంటుంది. కానీ, టీడీపీ అధిష్టానానికి టికెట్లు ఆశించే తమ నేతలను సర్థుబాటు చేసుకుంటూ, జనసేనకు కూడా సీట్లను కేటాయించడం సవాలే.

ముద్రగడ జనసేనలో చేరితే, ప్రత్తిపాడు లేదా పిఠాపురం ఆయన కుటుంబానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ చురుగ్గా ప్రజల్లో ప్రచారం చేసుకుంటున్నారు.

ప్రత్తిపాడులో ఇటీవల మరణించిన నాయకుడు వరుపుల రాజా భార్య సత్యప్రభ సైతం చురుగ్గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సీట్లలో జనసేనకు సర్థుబాటు చేయడం టీడీపీలో చిక్కు తెస్తుంది.

కొణతాల కోసం అనకాపల్లి ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటు కేటాయించే అవకాశం కూడా టీడీపీకి కనిపించడం లేదు. ఆ రెండు సీట్ల కోసం ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉండడంతో వారిని కాదని ముందుకెళ్లడం కత్తిమీద సాములా మారుతోంది.

ఈ నేపథ్యంలో సీట్ల సర్థుబాటు వ్యవహారం టీడీపీ, జనసేన కూటమికి పెద్ద సమస్య కానుందనే వార్తలు ఇటీవల కాలంలో వినిపిస్తున్నాయి. ఇంతలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనలతో రెండు పార్టీల మధ్య ఏదో జరుగుతోందనే భావన మరింత బలపడింది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు

ఫొటో సోర్స్, TDP

ఫొటో క్యాప్షన్, పవన్ కల్యాణ్

'పార్టీల శ్రేణుల్లో దూరం పెరగొచ్చా?'

క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల మధ్య సఖ్యత కోసం కృషి చేయాలని చెప్పిన అధినేతలే, చెరోవైపు అభ్యర్థులను ప్రకటించడం ఆసక్తికర పరిణామంగా కనిపిస్తోంది.

"చంద్రబాబు, పవన్ కూర్చుని సీట్ల విషయం మాట్లాడుకోవాల్సి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా పోటాపోటీగా ప్రకటనలు చేశారు. పొత్తు ధర్మం పాటించడం లేదన్న విమర్శల ద్వారా టీడీపీ, జనసేన మధ్య సఖ్యత లేదనే అభిప్రాయాన్ని పవన్ కల్యాణ్ కలిగించారు. ఇది రెండు పార్టీల కార్యకర్తల మధ్య దూరం పెంచడానికే దోహదం చేస్తుంది" అన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఎం విజయ్ కుమార్.

అధినేతల వైఖరి ఇలా ఉన్నప్పుడు ఓట్ల బదిలీ కోసం కృషి చేయాల్సిన కిందస్థాయి క్యాడర్ మధ్య బంధం బలపడేందుకు అవరోధం అవుతుందని అన్నారు. పవన్ దూకుడు ఆశ్చర్యంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.

పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, Jansena

‘బీజేపీ ఎత్తుగడలో భాగమేనా?’

బీజేపీతో కలిసి సాగుతూనే టీడీపీతో పొత్తు పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే, ఇంతవరకు దీని మీద బీజేపీ అధికారికంగా ఏమీ చెప్పలేదు. టీడీపీ, జనసేన పొత్తును బీజేపీ అర్థం చేసుకుంటుందని పవన్ కల్యాణ్ అన్నారు.

టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీని కూడా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు పవన్ కల్యాణ్ గతంలో చెప్పారు.

పవన్ కళ్యాణ్ మంతనాలు జరిపినా టీడీపీతో బీజేపీ ఇంకా దూరంగానే ఉంటోంది.

ఆంధ్రప్రదేశ్ బీజేపీలోని ఒక వర్గం మాత్రం టీడీపీ, జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లాలన్న కోరికను పార్టీ సమావేశాల్లో వ్యక్తం చేస్తోంది. టీడీపీతో పొత్తుపై దిల్లీలోని బీజేపీ అధిష్టానం మాత్రం పూర్తిగా సానుకూలత వ్యక్తం చేయడం లేదు.

2014లో మూడు పార్టీలు కలిసినప్పటికీ ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. బీజేపీ కూడా కొన్ని స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఈసారి జనసేన పోటీలో ఉంది. బీజేపీ కోరే సీట్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉండనుంది.

అలాంటి సమయంలో పవన్ కల్యాణ్, బీజేపీని కూడా కలుపుకుని టీడీపీతో వెళ్తారా? లేక టీడీపీని వీడి బీజేపీతో ఉండిపోతారా? అన్నది ఇంకా సందిగ్ధంగానే ఉందని రాజకీయ పరిశీలకుడు ఐనం ప్రసాద్ అన్నారు.

“టీడీపీ-జనసేన పొత్తు విషయంలో ఇప్పటికీ స్పష్టత కనిపించడం లేదు. తాజాగా సీట్ల ప్రకటన మరింత గందరగోళానికి దారితీస్తోంది. దీనివల్ల ఇద్దరికీ మేలు జరిగే అవకాశం లేదు. పవన్ తీరు చూస్తుంటే బీజేపీ ఎత్తుగడలో భాగంగానే అలాంటి ప్రకటన చేస్తున్నారనే అనుమానం కలుగుతోంది” అని ప్రసాద్ అన్నారు.

ఇంకా, “ పొత్తు కుదిరినా, స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ వరకూ అన్నింటా మూడోవంతు సీట్లకు బరిలో ఉంటామని పవన్ చెబుతున్నారు. అన్ని సీట్లు కేటాయించేందుకు టీడీపీ సిద్ధపడుతుందా అన్నది సందేహమే. దాంతో ఈ స్నేహం ఎటు మళ్లుతుందోననే చర్చకు ఆస్కారమిస్తోంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

జనసేన ద్వారా టీడీపీ మీద ఒత్తిడి పెంచి, బీజేపీ మరింత బలపడే లక్ష్యం దీని వెనుక ఉన్నా ఆశ్చర్యం లేదన్నారు. వీలైనంత త్వరగా కూటమి ఉమ్మడి నిర్ణయానికి రాకపోతే చివరి నిమిషంలో వారికి చికాకులు తప్పవని అభిప్రాయం వ్యక్తం చేశారు ఐనం ప్రసాద్.

తాజా పరిణామాలపై జనసేన, తెలుగుదేశం పార్టీ నేతలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)