పద్మవిభూషణ్ - వెంకయ్య నాయుడు: ఆరెస్సెస్ కార్యకర్త నుంచి ఉపరాష్ట్రపతి వరకు ఎదిగిన నేత

ఫొటో సోర్స్, Getty Images
మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు భారత ప్రభుత్వ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అందుకోబోతున్నారు.
దేశ రాజకీయాలో సుదీర్ఘకాలంపాటు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఉపరాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన తర్వాత వెంకయ్య నాయుడు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటూ వచ్చిన ఆయన, ఉపరాష్ట్రపతి పదవి వరకు ఎదిగారు.
రాజకీయాలలో సైద్ధాంతిక విభేదాలే తప్ప వ్యక్తిగత విభేదాలు ఉండవని నమ్మే వెంకయ్య నాయుడు అన్ని పార్టీల నాయకులకు మిత్రుడిలా కనిపిస్తారు.
పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలియజేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఐదుగురికి పద్మవిభూషణ్ అవార్డులు ప్రకటించగా అందులో ఇద్దరు తెలుగువారు - వెంకయ్య నాయుడు, చిరంజీవి - ఉన్నారు.
‘‘భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నాను’’ అని వెంకయ్యనాయుడు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
తనతోపాటు అవార్డు అందుకోనున్న నటుడు చిరంజీవికి ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు అభినందనలు తెలియజేశారు.
పద్మ అవార్డులకు ఎంపికైన అందరికీ ఆయన అభినందనలు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయాలలో తనదైన ముద్ర
చిన్నతనంలోనే రైట్ వింగ్ పాలిటిక్స్ పట్ల ఆకర్షితుడైన వెంకయ్య నాయుడు, తాను ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టే వరకు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
‘‘ఈ రోజుల్లో కొందరు కండువాలు మార్చినంత సులభంగా పార్టీలు మార్చేస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధి పార్టీ మారాలనుకుంటే ఆ పార్టీ వల్ల తనకు లభించిన పదవి నుంచి కూడా రాజీనామా చేయాలి’’ అని 2023లో హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో జరిగిన సిటిజన్ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి..
1949 జులై 1న నెల్లూరులో వెంకయ్య నాయుడు జన్మించారు. అప్పట్లో నెల్లూరు...మద్రాస్ ప్రెసెడెన్సీ కింద ఉండేది. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడలేదు.
రైతు కుటుంబం నుంచి వచ్చిన వెంకయ్య నాయుడు.. నెల్లూర్‌లోని వీఆర్ హైస్కూల్‌లో చదువుకున్నారు. డిగ్రీ కూడా నెల్లూరులోనే పూర్తి చేశారు. ఆ తర్వాత పొలిటికల్ సైన్స్, లాలో ఉన్నత విద్య అభ్యసించారు. విద్యార్థి దశలోనే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
1971లో వీఆర్ కాలేజీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఆయన గెలిచారు. యూనియన్ ప్రెసిడెంట్‌గా ఆయన పనిచేశారు. 1973-74 మధ్య ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగానూ కొనసాగారు.
ఎమర్జెన్సీ కాలంలో తాను ఎన్నో బాధాకర అనుభవాలను ఎదుర్కొన్నట్లు 2018లో బీబీసీ కోసం రాసిన ఓ వ్యాసంలో వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ విద్యార్థిగా ఉన్నప్పుడు రెండు నెలలపాటు అజ్ఞాతంలో ఉండి సీనియర్ నాయకులకు సహాయ సహకారాలు అందించినట్లు ఆయన చెప్పారు.
అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకొని 17 నెలలకు పైగా జైల్లో పెట్టారు.
‘‘ఈ పరిణామం నా జీవితాన్ని మలుపు తిప్పింది. తోటి ఖైదీలు, సీనియర్ నాయకులతో జరిపిన చర్చలు, సంభాషణలు ప్రజలు, అధికారం, రాజకీయాలు, దేశం- అనే అంశాలపై నేను ఒక స్పష్టమైన దృక్పథాన్ని పెంపొందించుకొనేలా చేశాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా చూడాలనే నా సంకల్పాన్ని జైలు జీవితం మరింత బలోపేతం చేసింది’’ అని తన వ్యాసంలో వెంకయ్య నాయుడు వివరించారు.

ఫొటో సోర్స్, M VENKAIAH NAIDU
1974లో విద్యార్థి సంఘర్షణ సమితి రాష్ట్ర కన్వీనర్‌గా వెంకయ్య నాయుడిని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నియమించారు. 1970లలోనే ‘‘జై ఆంధ్రా’’ ఉద్యమం మొదలైంది. అభివృద్ధి మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే ఎందుకంటూ కొనసాగిన ఈ ఉద్యమంలో వెంకయ్యనాయుడు కూడా పాలుపంచుకొన్నారు.
1975లో ఎమర్జెన్సీ కాలంలో వెంకయ్యనాయుడు జైలుకు కూడా వెళ్లారు. 1977-80లలో జనతా పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా వెంకయ్యనాయుడు నియమితులయ్యారు.
1978లో తొలిసారి ఉదయగిరి నియోజకవర్గం నుంచి వెంకయ్యనాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. 1980-83 మధ్య బీజేపీ యువ మోర్చాకు అధ్యక్షుడిగానూ వెంకయ్య పనిచేశారు.
1985లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభాగం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. 1998లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడిగా మారారు.

ఫొటో సోర్స్, HindustanTimes
జాతీయ రాజకీయాలలోకి....
1970, 80ల కాలంలో వెంకయ్యనాయుడి రాజకీయ ప్రస్థానం విజయవంతంగా నడిచింది. విద్యార్థి దశలో జన్ సంఘ్, ఏబీవీపీలో చేరినప్పుడు, తన స్నేహితుల దగ్గర నుంచి ఆయన హిందీ నేర్చుకోవడం మొదలుపెట్టారు.
అయితే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయనకు పెద్దగా హిందీతో అవసరం పడలేదు. తెలుగుతోపాటు ఇంగ్లిష్‌లోనూ ఆకట్టుకొనే పదబంధాలను వాక్యాలను వెంకయ్య ఉపయోగించేవారు.
జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు, హిందీలోనూ ఆయన ఇలాంటి ప్రయోగాలే చేయడం మొదలుపెట్టారు.
1993లో బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి వెంకయ్యనాయుడు అడుగుపెట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
1996-2000 మధ్య బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా వెంకయ్య నాయుడు పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ పార్లమెంటరీ కమిటీ కార్యదర్శిగా, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగానూ కొనసాగారు.
1998లో కర్ణాటక నుంచి రాజ్యసభలో వెంకయ్య నాయుడు అడుగుపెట్టారు. 2004, 2010లోనూ ఆయన్ను రాజ్యసభకు పంపించింది బీజేపీ. ఎందుకంటే దక్షిణ భారత దేశంలోని అగ్ర నాయకుల్లో ఆయన ఒకరని పార్టీ భావించేది.
2000లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వ హయాంలో గ్రామీణాభివృద్ధి శాఖను వెంకయ్యనాయుడుకు అప్పగించారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనను దేశంలోని ప్రతి గ్రామానికీ తీసుకెళ్లే బాధ్యతను అప్పట్లో వెంకయ్య తీసుకున్నారు.
2002లో పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఆయన తీసుకున్నారు. అయితే, 2004 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత 2004, 2010లో కర్ణాటక నుంచి ఆయన్ను బీజేపీ రాజ్యసభకు పంపించింది.
2014లో మోదీ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్యనాయుడు బాధ్యతలు తీసుకున్నారు. 2016లో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపింది పార్టీ. 2017లో ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు బాధ్యతలు తీసుకున్నారు.
2024లో ఆయనకు భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
ఇవి కూడా చదవండి:
- అయోధ్య: శ్రీరాముడిని గెలిపించిన 'రామ్‌లల్లా' ఎవరో తెలుసా?
- చిప్స్, కూల్ డ్రింక్స్‌తో ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉంటుంది, పూర్తిగా మానేయాలా? ఎంత తినొచ్చు
- శుభ్‌మన్ గిల్, అశ్విన్, షమీ, స్మృతి మంధానకు బీసీసీఐ అవార్డులు.. పురస్కారాలు పొందిన క్రీడాకారుల జాబితా ఇదే
- సుభాష్‌చంద్రబోస్: ‘మై డార్లింగ్, నువ్వు నా హృదయరాణివి’ అంటూ బోస్ ఎవరికి ప్రేమలేఖలు రాశారు?
- బటర్ చికెన్, దాల్ మఖనీ వంటకాలు ఎవరు కనిపెట్టారు? తేల్చనున్న దిల్లీ హైకోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














