గురక ఎందుకు వస్తుంది? రాత్రిపూట పదేపదే నిద్ర చెడిపోతే మెదడు పనితీరు దెబ్బతింటుందా?

నిద్ర

ఫొటో సోర్స్, GETTYIMAGES/LAXMIPRASAD S

    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మీరు సరిగ్గా నిద్రపోకపోయినా, అబస్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా (ఓఎస్‌ఏ) లక్షణాలు మీ మెదడు ఆలోచనా సామర్థ్యం, ఇంకా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

భారత దేశంలో ప్రతి 10 మందిలో ఒకరు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లు ఒక నివేదిక చెబుతోంది. అలాగే, వయసు పెరిగేకొద్దీ, అది వ్యక్తి మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందని అందులో పేర్కొన్నారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్ ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు.

7,505 మంది వయోజనులపై ఈ పరిశోధన జరిగింది.

భారత్‌లోని వైద్యారోగ్య సంస్థలతోపాటు నెదర్లాండ్స్‌కి చెందిన ఎరామస్ మెడికల్ సెంటర్‌లోని ఎడిడెమియాలజీ విభాగ వైద్యులు, సోషియల్ అండ్ బిహేవియరల్ సైన్సెస్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫ్ హార్వర్డ్, టీహెచ్ చెన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫ్ అమెరికా కలిసి ఈ అంశంపై అధ్యయనం చేశాయి.

''భారత్‌లో ఇది మొదటి దశ పరిశోధన. ఇందులో జన్యుశాస్త్రం, న్యూరోఇమేజింగ్, నిద్రకు సంబంధించిన అనేక పారామీటర్లపై అధ్యయనం చేశారు. పరిశోధనలో పాల్గొన్న స్రీలు, పురుషుల సంఖ్య దాదాపు సమానం'' అని డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్ బీబీసీతో చెప్పారు.

నిద్ర

ఫొటో సోర్స్, GETTYIMAGES/MONTY RAKUSEN

పరిశోధనలో ఏం తేలింది?

ఈ పరిశోధనకు కారణాలను వివరిస్తూ, చాలా దేశాల మాదిరిగానే భారత్‌లోనూ ప్రజల వయోపరిమితితో పాటు వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోందని చెప్పారు. కాలక్రమేణా, వారి సంఖ్య పెరుగుతూ పోతోంది.

"వయస్సు పెరుగుతున్న కొద్దీ కనిపించే ప్రధాన జబ్బులు ఏంటంటే డిమెన్షియా, మతిమరుపు, గుండెపోటు, స్ట్రోక్" అని డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్ అన్నారు.

ఇలాంటి సమస్యలపైనే ప్రధానంగా ఈ పరిశోధన దృష్టి సారించింది.

పరిశోధనలో భాగంగా నిద్ర లేకపోవడం, అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా వంటి నిద్ర సంబంధిత విషయాల గురించి ప్రశ్నించారు.

అలాగే, విషయాలను గుర్తుంచుకోవడం, ప్లాన్ చేయడం, డిజైన్ చేయడం వంటి మెదడు పనితీరుకు సంబంధించిన విషయాలు అడిగారు. పనితీరుకు, సీక్వెన్సింగ్‌కు మధ్య సంబంధం ఏంటనే దిశగా ప్రశ్నలు అడిగారు.

నిద్రలేమి లేదా ఓఎస్ఏ ఉన్నవారిలో మెదడు పనితీరు సరిగ్గా ఉండదని పరిశోధనలో తేలిందని డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్ చెప్పారు.

నిద్ర

ఫొటో సోర్స్, GETTYIMAGES/GAWRAV

అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అంటే ఏమిటి?

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన సమాచారం ప్రకారం, అబస్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా (ఓఎస్‌ఏ) అంటే నిద్రలో ఒక వ్యక్తి శ్వాస నిరంతరం ఆగిపోయే రుగ్మత.

డాక్టర్ జేసీ సూరి దీని గురించి వివరిస్తూ- పగటిపూట మనిషి సాధారణంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్వాస తీసుకుంటారని, అప్పుడు ఎలాంటి అవరోధం ఉండదని చెప్పారు. కానీ, రాత్రి నిద్రపోతున్నప్పుడు కండరాలు రిలాక్స్ అవుతాయి.

ఫోర్టిస్ ఆస్పత్రిలో పల్మనరీ, క్రిటికల్ కేర్ అండ్ స్లీప్ మెడిసిన్ విభాగ డైరెక్టర్, విభాగాధిపతిగా డాక్టర్ జేసీ సూరి ఉన్నారు. ఆయన దిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆస్పత్రిలో 34 ఏళ్లు పనిచేశారు.

"నిద్రలో ఉన్నప్పుడు మన నాలుక గొంతు వెనుక పడిపోతుంది. ఇది శ్వాసమార్గాన్ని అడ్డుకోవడంతో శ్వాస పీల్చుకోవడం ఆగిపోతుంది'' అని ఆయన చెప్పారు.

''రాత్రి వేళ శ్వాస ఆగిపోయినప్పుడు మెళకువ వస్తుంది. ఆ తర్వాత నాలుక కదిలి, నోటి ముందుభాగంలోకి వస్తుంది. అది ముందువైపుకి రాగానే శ్వాస మార్గం తెరుచుకుంటుంది. దీంతో మళ్లీ శ్వాస పీల్చుకోవడం మొదలవుతుంది. మళ్లీ నిద్రపోయాక, మళ్లీ నాలుక వెనుక భాగంలోకి వెళ్లి శ్వాసకు అడ్డుపడుతుంది. దీంతో మళ్లీ నిద్ర చెదిరిపోతుంది. అలా రాత్రంతా జరుగుతూనే ఉంటుంది. దీనినే అబస్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అంటారు'' అని ఆయన వివరించారు.

నిద్రలో గాఢనిద్ర, కలలు లేదా కలలు లేని నిద్ర వంటి అనేక స్థాయులు ఉన్నాయని, ఇవి శరీరంలోని వివిధ భాగాలకు సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు.

వెలుతురులో నిద్రపోవడం, గాఢనిద్ర, కలలు కంటూ నిద్రపోవడం, సాధారణంగా నిద్రపోవడం వంటి అనేక స్థాయులు ఉన్నాయి. అవి వివిధ శరీర భాగాలకు సాయపడతాయని వైద్యులు చెబుతున్నారు.

నిద్ర

ఫొటో సోర్స్, Getty Images

గురక ఎందుకు వస్తుంది?

నిద్రలో శ్వాసనాళాలు కుంచించుకుపోవడాన్ని పార్షియల్ ఎయిర్‌వే అబ్‌స్ట్రక్షన్ అంటారని డాక్టర్ సూరి చెప్పారు.

అలాంటప్పుడు గురక రావడం మొదలవుతుంది. ఈ మార్గం పూర్తిగా మూసుకుపోవడాన్ని స్లీప్ ఆప్నియా అంటారు.

శ్వాస మార్గంలో అవరోధం కారణంగా శ్వాస తీసుకోకపోవడంతో శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోయి కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. నిద్రకు అంతరాయం కలిగినప్పుడే మళ్లీ శ్వాస మార్గం తెరుచుకుంటుంది.

ఈ స్లీప్ ఆప్నియాతో బాధపడే వ్యక్తులకు, గంటకు 15 నుంచి 25, లేదా 50 సార్లు నిద్రకు భంగం కలుగుతుంది. ఎందుకంటే, తమ శ్వాస మార్గం తెరుచుకోవాలంటే వారు నిద్రలేవాల్సి ఉంటుంది. దీని కారణంగా గాఢనిద్ర సాధ్యం కాదు. తద్వారా నిద్రకు పదేపదే భంగం కలుగుతుంది.

గడ్డం దగ్గర కొవ్వు కణజాలం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందువల్ల గురక రాకుండా ఉండేందుకు శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి శ్వాసమార్గాన్ని కుంచించుకుపోయేలా చేసి, శ్వాస అందకుండా అడ్డుపడే అవకాశం ఉంది. అందువల్ల బరువు నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా గురకను దూరం చేసుకోవచ్చు.

ఒకవేళ జలుబు చేసి ముక్కు మూసుకుపోతే గురక వచ్చే అవకాశం ఎక్కువ. అలాంటప్పుడు, నిద్రపోయే ముందు ముక్కును పూర్తిగా శుభ్రం చేసుకోవాలి.

ఆల్కహాల్ కారణంగా నిద్రలో కండరాలు మరింత రిలాక్స్ అవుతాయి. దీనివల్ల శ్వాసమార్గం మరింత ఇరుకుగా మారుతుంది. అందువల్ల నిద్రపోయే ముందు మద్యం తాగకుండా ఉండడం మంచిది.

మీరు మీ వెనుకభాగంలో చదునుగా పడుకున్నప్పుడు, మీ నాలుక, గడ్డం, గడ్డం కింద ఉన్న కొవ్వు కణజాలం మీ వాయుమార్గంలో అడ్డంకులను సృష్టించవచ్చు.

వెల్లకిలా పడుకున్నప్పుడు నాలుక, గడ్డం, గడ్డం కింద భాగంలో ఉండే కొవ్వు కణజాలం కారణంగా శ్వాసమార్గంలో అవరోధం ఏర్పడే అవకాశం ఉంటుంది.గురక వస్తున్నట్లయితే, ఒక పక్కకు తిరిగి పడుకోవడం ఉత్తమం.

నిద్రలేమి వల్ల శరీరంపై ప్రభావం

కంటినిండా కునుకు లేకపోతే అది మొత్తం శరీరంపై ప్రభావం చూపడమే కాకుండా, పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది.

  • ఏకాగ్రత లేకపోవడం
  • జ్ఞాపకశక్తిపై ప్రభావం
  • మెదడు నిర్ణయం తీసుకునే సామర్థ్యంపై ప్రభావం
  • చిరాకు, కోపం వల్ల మానసిక అనారోగ్యం
  • పగటి పూట నిద్ర రావడం
  • డిప్రెషన్, ఆందోళన
  • నీరసంగా ఉండడం
  • రక్తపోటుపై ప్రభావం
  • గుండె జబ్బుల ప్రమాదం
  • డయాబెటిస్ ఉంటే, దానిని తట్టుకునే సామర్థ్యం తగ్గుదల
  • అలసిపోవడం
నిద్ర

ఫొటో సోర్స్, Getty Images

ఎంతసేపు నిద్రపోవాలి?

నవజాత శిశువులు ఎక్కువ గంటలు నిద్రపోవాలని వైద్యులు చెబుతారు, కానీ వయస్సు పెరిగే కొద్దీ నిద్ర తగ్గుతుంది.

స్లీప్ ఫౌండేషన్ ప్రకారం, నవజాత శిశువు 14-17 గంటలు, యుక్త వయస్కులు (14-17 ఏళ్లు) 8 నుంచి 10 గంటల వరకు నిద్రపోవాలని డాక్టర్ జేసీ సూరి తెలిపారు.

18-26 ఏళ్ల మధ్య యువత, 26-64 ఏళ్ల మధ్యవయస్కులు 7 నుంచి 9 గంటలు, 65 ఏళ్లు పైబడిన వారికి 7-8 గంటల నిద్ర అవసరం.

పుట్టుక నుంచి చాలా మందిలో శ్వాస మార్గం కుంచించుకుపోయి ఉంటుందని, బరువు పెరగడంతో ఈ సమస్య మరింత పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. మెరుగైన జీవనశైలిని అనుసరించాలని సూచిస్తున్నారు.

నిద్రకు సంబంధించిన సమస్యలు ఉన్నాయనే విషయం ప్రజలకు తెలియడం లేదని, భవిష్యత్తులో డిమెన్షియా సమస్య తలెత్తకుండా పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలని, తద్వారా ఇతర వ్యాధులకు దూరంగా ఉండొచ్చని డాక్టర్ కామేశ్వరప్రసాద్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)