రోడ్డు ప్రమాదంలో నడుము నుంచి కింది భాగమంతా చచ్చుబడిపోయిన యువ రైతు కోసం కొలంబియా నుంచి ఇండియా వచ్చి సేవలు చేస్తున్న భార్య

- రచయిత, సరబ్జీత్ సింగ్ ధాలివాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పంజాబ్‌లోని రోపర్‌కి చెందిన హర్‌పాల్ సింగ్ కొలంబియాకి చెందిన యెనీని 2019లో పెళ్లి చేసుకున్నారు. 2021 మార్చి వరకూ ఆయన జీవితం సంతోషంగా గడిచిపోయింది.
ఆ సమయంలో ఆయన కొలంబియాలోని భార్య వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. యెనీ పూర్తి పేరు యెనీ టారస్. ఆమెది దక్షిణ అమెరికాలోని కొలంబియా.
హర్‌పాల్ సింగ్ వృత్తిరీత్యా ప్లంబర్, వ్యవసాయం కూడా చేసేవారు.
దిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా మార్చి 5న ప్రమాదం జరిగింది.
ఆ ప్రమాదంతో హర్‌పాల్ జీవితం తల్లకిందులైంది. చండీగఢ్ కురాలి బైపాస్‌లో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో ఆయన మెడ ఎముక, వెన్నెముక విరిగిపోయాయి. నడుము కింది భాగం చచ్చుబడిపోయింది.

ఫొటో సోర్స్, HARPAL SINGH
వేల కిలోమీటర్ల అవతల ఉన్న హర్‌పాల్ సింగ్ భార్య యెనీకి ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కొలంబియా నుంచి బయలుదేరి భారత్‌కు వచ్చేశారు. హర్‌పాల్ చికిత్సతో పాటు ఆయన బాగోగులు చూసుకుంటున్నారు.
దైనందిన కార్యక్రమాలు, వైద్యం, వ్యాయామంలో హర్‌పాల్‌కి తోడుగా ఉంటున్నారు యెనీ.
ప్రమాదం జరిగి దాదాపు మూడేళ్లు అవుతోంది. హర్‌పాల్, ఇంకా యెనీ మనోధైర్యానికి, ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తున్నారు.
యెనీ స్పానిష్‌లో మాత్రమే మాట్లాడగలరు. ఆమెకు ఇంగ్లిష్, హిందీ, పంజాబీ రావు.
హర్‌పాల్ చండీగఢ్‌లోని పీజీఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.మొహాలీకి సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని హర్‌పాల్‌తో పాటు యెనీ నివాసముంటున్నారు.
హర్‌పాల్‌ది రోపర్ సమీపంలోని రావ్లీ గ్రామం.

ఫొటో సోర్స్, HARPAL SINGH
స్పానిష్ మాట్లాడే యెనీని ఎలా కలిశారు?
ఫేస్‌బుక్ ద్వారా తనకు యెనీ పరిచయమైందని హర్‌పాల్ సింగ్ బీబీసీతో చెప్పారు.
''యెనీ స్పానిష్ మాట్లాడుతుంది, మేం చాలా రోజులు మాట్లాడుకున్నాం, మంచి స్నేహితులమయ్యాం'' అన్నారు.
''ఏడాది పాటు అలా ఇద్దరం మాట్లాడుకునేవాళ్లం. ఆ తర్వాత యెనీ భారత్‌కు వచ్చింది. అప్పుడు మేం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. 2019 ఆగస్టు 29న వివాహం చేసుకున్నాం'' అని ఆయన చెప్పారు.
హర్‌పాల్, యెనీ ఇద్దరూ స్పానిష్‌లో మాట్లాడుకునేవారు.
వివాహం అయిన తర్వాత కొద్దినెలలు హర్‌పాల్, యెనీ కలిసివున్నారు. ఆ తర్వాత యెనీ కొలంబియా వెళ్లిపోయారు. యెనీతో కలిసి జీవించేందుకు కొలంబియా వెళ్లాలని హర్‌పాల్ కూడా సిద్ధమయ్యారు.

ఫొటో సోర్స్, HARPAL SINGH
అయితే, అదే సమయంలో కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా హర్‌పాల్ కొలంబియా ప్రయాణం ఆలస్యమైంది.
''నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగాను. వాళ్లు నమ్మలేకపోయారు. ఆ తర్వాత అంగీకరించారు'' అని యెనీ చెప్పారు.
''హర్‌పాల్‌కు తన కుటుంబమంటే చాలా ఇష్టం. అబ్బాయిల్లో అమ్మాయిలు ఇష్టపడే అన్ని లక్షణాలు ఆయనకు ఉన్నాయి'' అన్నారు యెనీ.
ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉందని ఆమె చెప్పారు.
హర్‌పాల్ అన్నయ్య ఆర్మీలో పనిచేస్తారు.

అన్నింటినీ వదిలేసి..
''ఇది చాలా పెద్ద కష్టం, కష్టతరమైన సమయం'' అని యెనీ అన్నారు.
''ప్రమాదం జరిగిందని తెలిసినప్పుడు ఇండియా రావడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు. స్నేహితుల దగ్గర అప్పు తీసుకున్నా. నా భవిష్యత్ ప్రణాళికలు, అన్నింటినీ వదిలేసి ఇక్కడకు వచ్చేశా.''
వివాహ ఖర్చుల కోసం, ఇల్లు కొనుగోలు చేసేందుకు తన డబ్బులు ఖర్చయ్యాయని యెనీ తెలిపారు.

''నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు సాయం చేసేందుకు ఎవరూ లేరు. అన్నింటినీ ఒంటరిగా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది నా జీవితంలో చాలా కష్టమైన, భయంకరమైన సమయం'' అన్నారు యెనీ.
హర్‌పాల్ తల్లిదండ్రులు వృద్ధులు. వారి బాగోగులు, వైద్య అవసరాలకు యెనీ వారికి సాయంగా నిలుస్తున్నారు.
''నా కాళ్లు, చేతులూ పనిచేయకపోయినా ఇలాంటి భార్య దొరికినందుకు ఇప్పటికీ నేను అదృష్టవంతుడినే. ఆమె నా జీవితంలోకి రాకపోయి ఉండి ఉంటే, నేను ఈలోకంలో ఉండేవాడిని కాదు'' అని హర్‌పాల్ చెప్పారు.

ఫొటో సోర్స్, HARPAL SINGH
'శరీరం సహకరించకపోయినా అదృష్టవంతుడినే'
మున్ముందు తన జీవితం ఎలా ఉంటుందో తనకు తెలియదని హర్‌పాల్ చెప్పారు.
తిరిగి కొలంబియా వెళ్లిపోవాలని తాము యెనీకి చెప్పామని, కానీ, జీవితాంతం తమతోనే ఉంటానంటూ అందుకు ఆమె నిరాకరిస్తోందని అన్నారు.
హర్‌పాల్ సింగ్ ఉత్సాహంగా ఉన్నారు. ఆయన కవిత్వం రాస్తారు, తన వీడియోలను యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.
కొలంబియా వెళ్లి వైద్యం చేయించుకోవాలని హర్‌పాల్ అన్నారు.
ఎలాగైనా డబ్బు ఆదా చేసి, వైద్యం చేయించుకుని, తిరిగి తమ జీవితాలను గాడిలో పెట్టుకోవాలని అనుకుంటున్నట్లు వారు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- పెళ్లి చేసుకుంటా కానీ పిల్లలొద్దు అంటూ 20 మంది అబ్బాయిలను తిరస్కరించిన 20 ఏళ్ల అమ్మాయి
- బ్రేకప్ మంచిది కాదు, కానీ అది మీకు మంచే చేస్తుందంటున్న నిపుణులు, ఎలా?
- మేడ్ ఇన్ హెవెన్: అట్టహాసంగా జరిగే వివాహ వేడుకల వెనుక దాగిన చేదు నిజాలు
- విడాకులు తీసుకోవడం ఎలా? ఏయే కారణాలతో అడగొచ్చు?
- పాలియామరీ: ఆయనకు ఇద్దరు లైంగిక భాగస్వాములు, ఆమెకూ ఇద్దరు.. ఈ ముగ్గురూ కలిసే ఉంటారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














