షియాంగ్ యాంగ్ హాంగ్ 3: ఈ చైనా నౌక మాల్దీవుల తీరానికి వస్తే భారత్‌కు టెన్షన్ ఎందుకు?

చైనా
ఫొటో క్యాప్షన్, చైనా నౌక షియాంగ్ యాంగ్ హాంగ్ 3
    • రచయిత, అంబరసన్ ఎతిరాజన్
    • హోదా, బీబీసీ న్యూస్

చైనా పరిశోధన నౌక ఈ వారంలో మాల్దీవులకు రానుండడంతో చైనా, భారత్, మాల్దీవుల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

నౌకలోని సిబ్బంది షిఫ్టుల మార్పు, ఇంధనం వంటి ఇతర అవసరమైన వస్తువులు నింపుకొనేందుకు షియాంగ్ యాంగ్ హాంగ్ 3 నౌక వస్తున్నట్లు అధికారిక సమాచారం. క్లుప్తంగా చెప్పాలంటే, అది సాధారణ హాల్ట్ మాత్రమే.

కానీ, చైనీస్ నౌక డేటా సేకరించే లక్ష్యంలో భాగం కావొచ్చని, ఈ డేటాను చైనా మిలిటరీ ఆ తర్వాత సబ్‌మెరైన్ ఆపరేషన్స్‌కు (జలాంతర్గాముల కార్యకలాపాలు) ఉపయోగించవచ్చనే కొంత భయం కనిపిస్తోంది.

అయితే, ఈ ఆందోళనలను చైనా నిపుణులు కొట్టిపారేస్తున్నారు.

''చైనీస్ నౌకలు హిందూ మహాసముద్రంలో పరిశోధనలు నిర్వహిస్తాయి. వాటి కార్యకలాపాలు పూర్తిగా చట్టబద్ధమైనవి'' అని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మాజీ సీనియర్ కల్నల్ బీబీసీతో చెప్పారు.

''కొన్నిసార్లు నౌకలకు ఇంధనం, అందులోని సిబ్బందికి అవసరమైన ఆహారం, నీళ్లు వంటివి నింపుకోవాల్సి ఉంటుంది. వాటి కోసం మరో దేశం పోర్టుకి వెళ్తాయి. అది సాధారణ విషయం. అందువల్ల భారత ప్రభుత్వం దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హిందూ మహాసముద్రం కేవలం భారత్‌కు మాత్రమే చెందినది కాదు'' అని బీజింగ్‌లోని సింగ్వా యూనివర్సిటీకి చెందిన జౌ అన్నారు.

హిమాలయాల సరిహద్దులో ఎన్నోఏళ్లుగా భారత్‌తో తలపడుతున్న చైనా, హిందూ మహాసముద్రంలో తన పట్టు పెంచుకునేందుకు భారత జలాలకు దగ్గరగా నౌకను పంపడం ఇదే మొదటిసారి కాదు.

2014లో నావికా దళానికి చెందిన రెండు సబ్‌మెరైన్స్ కొలంబో పోర్టుకి వచ్చాయి. మరో రెండు పరిశోధనా నౌకలు శ్రీలంకకు వచ్చాయి. దక్షిణ భారతదేశానికి సమీపంలో ఉండే శ్రీలంకకు చైనా సబ్‌మెరైన్స్, పరిశోధన నౌకలు రావడం భారత్ అసంతృప్తికి కారణమైంది.

బిలియన్ డాలర్లు రుణాలుగా ఇవ్వడం ద్వారా చైనా నుంచి శ్రీలంకకు రాకపోకలు పెరిగాయి.

నరేంద్ర మోదీ, జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

నిజానికి, ఈ పరిశోధన నౌక షియాంగ్ యాంగ్ హాంగ్ 3 మాల్దీవుల కంటే ముందు కొలంబో రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి ఆ ప్లాన్ మార్చుకున్నట్లు శ్రీలంక విదేశాంగ శాఖ జూనియర్ మంత్రి తారక బాలసూరియా చెప్పారు.

''ఈ ఏడాది కాలంలో మా సాంకేతికత, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాం. అందువల్ల ఈ పరిశోధన కార్యకలాపాల్లో మేము కూడా సమాన భాగస్వామి కావాలనుకున్నాం'' అని ఆయన బీబీసీతో చెప్పారు

అయితే, చైనా నౌకల రాకపోకలపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పరిశోధన నౌకలకు శ్రీలంక అనుమతులు నిరాకరించింది.

కానీ, భారత్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకునే విషయంలో ఇటీవల మాల్దీవుల్లో స్వల్ప మార్పులు వచ్చాయి.

హిందూ మహాసముద్రం మధ్యలో దాదాపు 1200 పగడపు దీవుల సమూహమైన మాల్దీవులపై ఎన్నో ఏళ్లుగా భారత్ ప్రభావం స్పష్టంగా ఉండేది. అయితే, చైనా అనుకూల విధానాలు అవలంబిస్తున్న మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మయిజ్జు దానిని మార్చాలనుకుంటున్నారు.

ఇండియా ఔట్ నినాదంతో వచ్చిన మయిజ్జు, మాల్దీవుల్లో ఉన్న 80 మంది భారత సైన్యాన్ని ఇక్కడి నుంచి ఉపసంహరించుకోవాలని భారత్‌ను కోరారు.

నిఘా, సహాయక చర్యలు చేపట్టేందుకు గతంలో భారత్ విరాళంగా ఇచ్చిన ఎయిర్‌క్రాఫ్ట్‌ల నిర్వహణ కోసమే అక్కడ సైనిక సిబ్బంది ఉన్నట్లు భారత్ తెలిపింది.

అనంతరం, మార్చి 15లోగా భారత్ తమ సైనికులను ఉపసంహరించుకోవాలని మాల్దీవుల ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఈ సమస్య పరిష్కారం కోసం ఇరుదేశాల మధ్య ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.

పోయిన వారం దిల్లీలో జరిగిన చర్చల తర్వాత, సైనికులను ఉపసంహరించుకునేందుకు భారత్ అంగీకారం తెలిపిందని, మొదటి బ్యాచ్ సైనికులు మార్చి 10వ తేదీ లోపు, రెండో బ్యాచ్ సైనికులు మే నెల రెండో వారంలో ఇక్కడి నుంచి వెళ్లిపోతారని మాల్దీవుల మంత్రిత్వ శాఖ తెలిపింది.

మాల్దీవులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాల్దీవులపై గతంలో భారత్ ప్రభావం స్పష్టంగా ఉండేది, దానిని మయిజ్జు మార్చాలనుకుంటున్నారు

మాల్దీవుల జలాల్లో సముద్ర గర్భంలో పరిశోధనలకు సంబంధించి భారత్‌తో చేసుకున్న హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని పునరుద్ధరించబోవడం లేదని కూడా మయిజ్జు ప్రభుత్వం డిసెంబర్‌లో ప్రకటించింది.

భారత హైకమిషన్ మాల్దీవుల రాజధాని మాలెలో ఇటీవల నిర్వహించిన భారత 75వ గణతంత్ర వేడుకలకు మాల్దీవుల ప్రభుత్వం నుంచి సీనియర్ నాయకులు ఎవరూ హాజరుకానంతగా ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.

మరోవైపు, గత నెలలో చైనా పర్యటనకు వెళ్లిన మాల్దీవుల అధ్యక్షుడు మయిజ్జు‌కి ఆ దేశం రెడ్‌కార్పెట్ పరిచింది. ఆ తర్వాత చైనాకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు మాల్దీవుల్లో పర్యటించారు. చైనా సాయంతో చేపట్టనున్న అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా మయిజ్జు ప్రకటించారు.

వ్యూహాత్మకంగా కీలకమైన మాల్దీవులు ఇటీవలి కాలంలో చైనా వైపు మొగ్గుచూపడం భారత్‌ ఆందోళనకు కారణమవుతోంది.

ఇదే అదనుగా చైనా తన నావికా దళాలను వేగంగా మోహరిస్తోంది. వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది.

''మాల్దీవులు చాలా కీలకం. అది భారత్‌కు దక్షిణాన మహాసముద్రంలో ఒక భాగం'' అని భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి శ్యామ్ సరన్ బీబీసీతో చెప్పారు.

''శ్రీలంకలో ఏం జరుగుతోందనే దానిపై ఎంత దృష్టి ఉంటుందో, అలాగే మాల్దీవుల్లో ఏం జరుగుతుందనే దానిపైనా ఉంటుంది'' అన్నారు.

అయితే, మాల్దీవులతో సంబంధాల విషయంలో ఒక్క భారత్‌ మాత్రమే ఆందోళన చెందడం లేదు.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా నౌకలు శ్రీలంకకు రావడంపై గతంలో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్త చేసింది

భారత్ వంటి పొరుగు దేశం, పెద్ద దేశంతో విరోధం దేశ ప్రయోజనాలకు మంచిది కాదని, దిద్దుబాటు చర్యలు చేపట్టాలని మాల్దీవుల ప్రతిపక్ష పార్టీ అయిన మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ(ఎండీపీ) సహా ఇతరులు మయిజ్జు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మయిజ్జుపై అభిశంసన తీర్మానం ప్రవేపెట్టడంపై యోచిస్తున్నట్లు గత వారం ఎండీపీ తెలిపింది.

ఒక చిన్న ద్వీపదేశమైన మాల్దీవులు ఆహారం, మౌలిక సదుపాయాలు, నిర్మాణాలు, టెక్నాలజీ వంటి విషయాల్లో భారత్‌పై ఆధారపడుతోంది. మాల్దీవులకు చెందిన చాలా మంది వైద్యం కోసం భారత్‌ వెళ్తుంటారు.

"భారత్‌తో ప్రభుత్వం విరోధం పెంచుకుంటోందని, అది అనవసరమని ఇక్కడ చాలా మంది భావిస్తున్నారు'' అని మాలెకి చెందిన న్యాయవాది ఐక్ అహ్మద్ ఈసా బీబీసీతో అన్నారు. ఆయన ప్రతిపక్ష పార్టీ ఎండీపీ మద్దతుదారుగా ఉన్నారు.

"మాల్దీవులు ఒక చిన్న దేశం. ప్రస్తుతం దేశం ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్తోంది. ఆసియా ఆధిపత్య పోరాటంలో చిక్కుకుంటోంది'' అని ఆయన అన్నారు.

ఈ విషయాలపై మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం, విదేశాంగ మంత్రిని సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

వ్యూహాత్మక ప్రాంతాలపై పట్టు సాధించే దిశగా చైనా ముందుకెళ్తోంది. సముద్రగర్భంలో పరిశోధనలు, వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకునేందుకు చైనా మరిన్ని నౌకలను హిందూ మహాసముద్రంలోకి పంపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌కు సమీప ప్రాంతంలోని జలాల్లో చైనా పట్టు పెంచుకోవడం భారత్‌కు సవాల్‌గా మారుతోంది.

ఎయిర్‌క్రాఫ్ట్‌లను మోసుకెళ్లగలిగే నౌకలు, వాటి సహాయక నౌకలు హిందూ మహాసముద్రంలోకి ప్రవేశిస్తాయని జౌ అన్నారు. ఈ నౌకలను శ్రీలంక వంటి దేశాలకు రానీయకుండా అడ్డుకుంటే, అది చైనాకు ఆగ్రహం తెప్పిస్తుందని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, ఈ చైనా నౌక మాల్దీవుల తీరానికి వస్తుంటే భారత్‌కు టెన్షన్ ఎందుకు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)