భూమి పచ్చగా మారాలంటే భూగర్భంలోని మొత్తం బొగ్గును మండించాలన్న అమెరికన్ ఇంజనీర్, చివరకు ఏమైంది

వాతావరణ మార్పు

ఫొటో సోర్స్, Getty Images

దాదాపు ఒక శతాబ్దం కిందట, భూగ్రహం మీద ఉన్న మొత్తం బొగ్గును కాల్చేయడం పర్యావరణానికి మంచిదని కొందరు భావించారు.

అప్పటి ఆలోచనల నుంచి మనం ఎంత ముందుకు వచ్చామనేది ఒకసారి చూస్తే, భవిష్యత్తుపై ఆశ కలుగుతుందని చరిత్రకారుడు థామస్ మొయినిహాన్ అంటున్నారు.

రోజురోజుకీ దిగజారిపోతున్న వాతావరణ పరిస్థితి గురించి నిత్యం వార్తల్లోని హెడ్‌లైన్స్‌లో వస్తుంటుంది.

పర్యావరణానికి జరుగుతున్న హాని, వాతావరణాన్ని పాడుచేసే విధానాలకు ప్రోత్సాహం, రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేకపోవడం, భయాందోళనకు గురిచేసే అంకెలు, వాతావరణ మార్పులకు సిద్ధంగా లేకపోవడం వంటి వాటిపై కథనాలు వస్తుంటాయి. అవన్నీ కలిసి ఇది ఎన్నటికీ ఒక అపరిష్కృత సమస్య అనే భావన కలిగిస్తాయి. వార్తా కథనాలను పరిశీలిస్తే వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించే సామర్థ్యం మనుషులకు ఉందనే నమ్మకం కూడా కలగదు. కానీ, ఇది సమస్యను మరింత లోతుగా విశ్లేషించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఒక చరిత్రకారుడిగా భావిస్తున్నా.

దశాబ్దాల కిందటితో పోలిస్తే ఇప్పుడు దాని గురించి మనకు తెలిసిన విషయాలు ఒక విజయమే. ఏదైనా విషయాన్ని విస్మరించడం సులభం. కానీ, ఒకనాటి చరిత్ర మనం ఇప్పుడు విషయాలను అవగాహన చేసుకోవడంలో ఎంత పురోగతి సాధించామో తెలియజేస్తూ ఉపశమనం కలిగిస్తుంది.

21వ శతాబ్దంలో వాతావరణ మార్పులు దిగ్భ్రాంతికర స్థాయిలో ఉండొచ్చని సుమారు శతాబ్దం కిందటే అప్పటి నిపుణులు అంచనావేశారు. ఎందుకంటే, అమెరికాకు చెందిన ప్రముఖ ఇంజనీర్ విలియం లామోంట్ అబోట్ ఇప్పుడు ఊహించనలవి కాని ఒక ఆలోచనను ప్రతిపాదించారు. అదేంటంటే, భూమిపై ఉన్న ప్రతి గ్రాము బొగ్గును మండించాలని, అదే వాతావరణానికి మంచిదని ఆయన అనుకున్నారు.

భూ వాతావరణం ఒక సంక్లిష్టమైన వ్యవస్థ అని ఈరోజు అందరికీ తెలుసు. ఇందులో కొంత ఊహాజనిత పోకడలు ఉన్నప్పటికీ, వాతావరణ పరిస్థితులు స్థిరంగా ఉండవని, వాటిపై మానవాళి ప్రభావం ఉంటుందనే విషయం ఇవాళ స్కూల్ పిల్లలకు కూడా తెలుసు. కానీ శతాబ్ద కాలం కిందట వాతావరణం గురించి ప్రజలకు తెలిసింది చాలా తక్కువ.

1800లలో భౌతిక శాస్త్రవేత్తలు చాలా వరకూ భూగ్రహం చల్లని గోళంగా భావించేవారు. భూ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతాయని నమ్మేవారు. మానవాళిని చలి కమ్మేస్తుందని, ఆహారం వేడి తగ్గిపోతున్నట్లు ఉష్ణోగ్రతలు కూడా నెమ్మదిగా తగ్గిపోయి జీవితం దుర్భరమవుతుందని అనుకున్నారు.

ఈ అభిప్రాయాలు మారేందుకు చాలా ఏళ్ల పరిశోధన అవసరమైంది. పరిశోధనలు జరిగినప్పటికీ అందులో తేలిన అంశాలను కూడా తొలుత విశ్వసించలేదు. అందుకు సమయం పట్టింది. ఉదాహరణకు, కార్బన్ డై ఆక్సైడ్‌కు వేడిని నిలుపుకొనే గుణం ఉంటుందని, వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ ఉంటే వేడిగా ఉంటుందని 1850 నాటికే యూనిస్ ఫుటె గుర్తించారు. ఫుటె ప్రతిపాదనలు తిరస్కరణకు గురయ్యాయి. బహుశా అది లింగ వివక్ష కారణంగా కూడా కావొచ్చు.

1900ల నుంచి వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్, వాతావరణ పరిస్థితులకు కార్బన్ డై ఆక్సైడ్‌కు మధ్య ఉన్న ప్రభావం వంటి వాటిని గుర్తించడం ప్రారంభమైంది. ఇది మంచు యుగాల వెనక ఉన్న కారణాలను వెతికే ప్రక్రియలో ఇది వెలుగులోకి వచ్చింది.

ఆ కాలంలోనే శిలాజ ఇంధనాల దహనానికి, భూమిపై భవిష్యత్తు వాతావరణానికి మధ్య సంబంధాన్ని కూడా శాస్త్రవేత్తలు తొలిసారి రూపొందించారు. పారిశ్రామిక విప్లవంతో భారీ స్థాయిలో విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ భూగోళాన్ని అనూహ్యంగా వేడిగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అనిపించింది.

అయితే, ఈ ఊహకు ప్రజలు ఎలా స్పందించారు?

భవిష్యత్తు గురించి భయపడుతూ పెరిగిన చాలా మంది సంతోషించారు. బొగ్గు నిల్వలన్నింటినీ కాల్చేయడం వల్ల వాతావరణానికి మంచిదన్న విలియం లామోంట్ అబోట్ నమ్మకాలు తప్పని తేలింది.

వాతావరణ మార్పు

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచంలోని మొత్తం బొగ్గు కాల్చేందుకు ప్లాన్

ఇంజనీర్ అయిన అబోట్ అప్పట్లో ప్రభావవంతమైన వ్యక్తే. ఇలినాయిస్‌కి విద్యుత్ సరఫరా చేసే అతిపెద్ద సంస్థకు చీఫ్ ఆపరేటింగ్ ఇంజనీర్‌గా ఉండేవారు, మరికొన్ని కీలక పోస్టులను కూడా నిర్వహించారు. చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం ఒక పవర్ ప్లాంట్‌కు ఆయన పేరు కూడా పెట్టారు.

1920 దశకం చివర్లో పలు అంశాలపై లెక్చర్స్ ఇచ్చేందుకు ఆయన అమెరికా అంతటా ప్రయాణించారు. 1927లో పెన్సిల్వేనియాలోని స్క్రాన్టన్‌లోని ఒక సమావేశంలో మాట్లాడుతూ పరిశ్రమలు శిలాజ ఇంధనాలను విరివిగా, వేగంగా వినియోగించడాన్ని అబోట్ స్వాగతించారు. ఎందుకంటే, వాతావరణాన్ని మరింత క్లిష్టంగా మార్చడం, ప్రపంచానికి మేలు చేస్తుందంటూ ముగించేశారు.

ఇంధనాలను వేగంగా వినియోగిండచం ఒక్కటే ఆయన ఉద్దేశం కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక ట్రిలియన్ టన్నుల కార్బన్ ఇప్పటికీ భూగర్భంలో ఉందని, దానిని త్వరగా మండించి గాలిలోకి తీసుకొస్తే వాతావరణ స్థాయిలను పది రెట్లు మెరుగుపరుస్తుందని ఆయన వాదించారు.

వాతావరణంలో సీవో2 విపరీతంగా పెరగడం ధ్రువ ప్రాంతాలను సమశీతోష్ణ ప్రాంతాలుగా మారుస్తుందని, అది భూమిపై వ్యవసాయ యోగ్యమైన భూమిని రెట్టింపు చేస్తుందని విశ్వసించిన అబోట్, దానిని బలంగా వాదించారు. శాశ్వతమైన వేసవి కాలంతో అమెరికా ఈశాన్య ప్రాంతంలో అడవులు, అబ్బురపరిచే స్థాయిలో పంట దిగుబడులు, పచ్చని వాతావరణం వెల్లివిరుస్తుందని ఆయన భావించారు. పెరుగుతున్న జనాభాకు అది చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉష్ణ మండలాల్లో జీవించే ఏనుగుల వంటివి కూడా ఇక్కడ సంచరిస్తాయని ఆయన చెప్పారు.

అబోట్ తన కార్యాచరణ ప్రణాళికకు వచ్చేశారు. అందులో ఎలాంటి చిక్కులు ఉంటాయో శాస్త్రవేత్తలు అర్థం చేసుకునేలోపే ఆయన మాత్రం నిర్ణయానికి వచ్చేశారు. భూ గ్రహం మీద ఉన్న మొత్తం కార్బన్ నిల్వలను విడుదల చేసేందుకు అన్ని దేశాలను ఏకం చేయాలని ఆయన చెప్పారు.

''ప్రపంచంలోని గనులను నిరంతరం మండించాలి. వేర్వేరు అవసరాలకు అనుగుణంగా వాటిని దహనం చేయడాన్ని ఆపకూడదు. రాత్రింబవళ్లూ వాటిని కాలనీయండి'' అని ఎక్కడ లేని ధీమాతో చెప్పారాయన.

భవిష్యత్తు కోసం ఇలా చేయాలని ఆయన చెప్పారు. ఇది ఆదర్శ సమాజం వైపు నడవడమేనని, భూతల స్వర్గంలోకి వెళ్లడమేనని ఆయన నమ్మారు.

వాతావరణ మార్పు

ఫొటో సోర్స్, Getty Images

తొందరపాటు పనికిరాదని చెబుతున్న అబోట్ ఉదంతం

అంతేకాకుండా, ఇలాంటి ఆలోచనలు ఉన్నవారిలో అబోట్‌ ప్రత్యేకమేమీ కాదు. గ్లోబల్ వార్మింగ్ మెరుగైన వాతావరణాన్ని, పంటలు పండే అవకాశాలను సృష్టిస్తుందని ఆ కాలంలో ప్రముఖ వాతావరణ నిపుణులు, స్వీడిష్ భౌతిక శాస్త్రవేత్త స్వాంటే అర్హేనియస్ కూడా వ్యాఖ్యానించారు. అప్పుడు చాలా మంది గ్లోబల్ వార్మింగ్ దక్షిణ భూభాగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావించినప్పుడు, అలా ఏమీ జరగదని వారు భుజం తట్టారు.

జియాలజిస్ట్ ధామస్ క్రోడర్ చాంబర్లిన్ వంటి అతి కొద్దిమంది చెప్పిన విషయాలు మాత్రమే వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. భవిష్యత్ తరాలకు మెరుగైన వాతావరణాన్ని కాపాడడం అవసరమని భావించి, బొగ్గు నిల్వలను ఖర్చు చేసే విషయంలో స్వీయ నిగ్రహం పాటించాలని ఆయన తన సమకాలీనులను కోరారు. అయితే, అది పెద్ద సవాల్ అని ఆయన గ్రహించినప్పటికీ అందుకు గల అవకాశాలను కూడా ఎత్తిచూపే ప్రయత్నం చేశారు.

మానవజాతి ఇప్పటివరకూ పర్యావరణ వ్యవస్థలను నాశనం చేయడం లేదా భంగపరచడం మాత్రమే చేస్తోందని, వాటిని గుర్తించిన ఏకైక జంతువు కూడా మనిషేనని చాంబర్లిన్ వాదించారు. మానవజాతి చరిత్రను పరిశీలిస్తే ప్రజలు ఇప్పుడే ఆ విషయాన్ని గ్రహించడం మొదలైందని, దానిని సరిదిద్దే విధంగా ప్రవర్తించాలని ఆయన సూచించారు.

వాతావరణ మార్పులు, దాని పర్యవసానాలకు గతంలో జరిగిన ఘోర తప్పిదాలే కొంతవరకూ కారణమనే విషయంలో నేడు ఏకాభిప్రాయం ఉంది. నిజం బయటపడడానికి ముందు అది అనివార్యంగా తప్పు అయి ఉంటుంది. ఇది భవిష్యత్ తరాలకు సంబంధించిన విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు పనికిరాదని అబోట్ ఉదంతం చెబుతోంది.

ఇక్కడ ప్రధానం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, గత తప్పులను విశ్లేషించుకోవడం ద్వారా మనం ఎంత పురోగతి సాధించామో తెలుసుకునే అవకాశం ఉంటుంది. విషయాలపై ఇంకా ఎంత అవగాహన తెచ్చుకోవాల్సి ఉందో తెలియజేస్తుంది. మానవుల కారణంగా జరిగే వాతావరణ మార్పుల వల్ల ఎలాంటి ప్రమాదాలు కలిగే అవకాశం ఉందనేది గ్రహాల చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు, అనేక రకాల కంప్యూటర్ ఆధారిన నమూనాలపై ఆధారపడి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)