బుస్రా బీబీ: ‘నన్ను పెళ్లి చేసుకుంటే ప్రధాన మంత్రి అవుతావు’

ఇమ్రాన్ ఖాన్, బుస్రా బీబీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2023 మే 15న లాహోర్ హైకోర్టుకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్, బుస్రా బీబీ

ఇమ్రాన్ ఖాన్ మూడో భార్య బుస్రా బీబీకి ‘మార్మిక శక్తులు’ ఉన్నాయా? తనను ఇమ్రాన్ ఖాన్ పెళ్ళి చేసుకుంటే పాకిస్తాన్ ప్రధాని అవుతారని ఆమె చెప్పారా? ఆమె గురించి షికారు చేస్తున్న వదంతుల్లో నిజమెంత?

ప్రభుత్వ బహుమతుల నుంచి అక్రమంగా లాభపడ్డారనే అభియోగాలపై ఇమ్రాన్‌తోపాటు, ఆయన మూడో భార్య బుస్రా బీబీకి జైలుశిక్ష పడింది.

ఇమ్రాన్ ఖాన్ మొదటి ఇద్దరి గ్లామరస్ భార్యల కంటే బుస్రా మనేకా పెద్దగా ప్రాచుర్యం ఉన్నవారు కాదు. ఇమ్రాన్ ఖాన్ మొదటి భార్య , బ్రిటిష్ సోషలైట్ జెమీమా గోల్డ్ స్మిత్, రెండో భార్య రేహమ్ ఖాన్, అనేక మేగజైన్ కవర్లపై మెరిశారు, టీవీ తెరలపై కనిపించారు. కానీ బుస్రా మాత్రం తెరవెనుకే ఉండిపోయారు.

‘‘మా పెళ్ళయ్యేవరకు నేను నా భార్య మొహాన్ని చూడలేదు’’ అని ఇమ్రాన్ ఖాన్ 2018లో ‘మెయిల్ ఆన్ సండే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుస్రా గురించి గొప్పగా చెప్పారు.

బుస్రా తెలివితేటలు, ఆమె వ్యక్తిత్వం తనని ఆకర్షించాయని ఆయన చెప్పారు. కానీ ప్రజలు ఇమ్రాన్ ఖాన్ చెప్పిన ఈ విషయాలు కాకుండా ఆమెకు ఏవో మార్మిక శక్తులు ఉన్నాయనే కోణంలో ఆమెను గుర్తించడం మొదలుపెట్టారు.

ప్రస్తుతం బుస్రా బీబీగా ప్రసిద్ధి పొందిన ఆమె గతంలో ఓ చిన్నపాటి ఆధ్యాత్మిక గురువుగా గుర్తింపు పొందారు. ఆమెకంటూ కొందరు అనుచరులు ఉండేవారు.

పాకిస్తాన్ కోర్టు బుస్రా బీబీ, ఇమ్రాన్ ఖాన్ దంపతులకు జనవరి 31న జైలుశిక్షతోపాటు ఒకొక్కరికి 2 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. దీంతో బుస్రా గురించి ప్రజలు గూగూల్‌లో తెగ వెతకడం ప్రారంభించారు.

బుస్రా బీబీ

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, 1995లో ప్రిన్సెస్ డయానాను కలిసిన జెమీమా గోల్డ్ స్మిత్, ఇమ్రాన్ దంపతులు

బుస్రా తెర వెనుకే ఎందుకున్నారు?

బుస్రా బీబీ సూఫీ సంప్రదాయానికి చెందినవారని కొందరు చెపుతారు. మరి కొందరు దీనిని కొట్టిపడేస్తారు.

తరచూ ఇస్లామిక్ మార్మికతగా పేరొందిన సూఫీయిజం పట్ల మూడు దశాబ్దాలుగా ఆసక్తి పెంచుకున్నట్టు, అది మనిషిలోని దేవుడిని కనిపెట్టేలా, ప్రాపంచిక విషయాలను త్యజించేలా చేస్తుందని ఆమె భర్త చెప్పేవారు.

ఇమ్రాన్ ఖాన్ యువకుడిగా ఉన్న రోజులలో లండన్ నైట్ క్లబ్ సర్క్యూట్‌లో ‘విలాస పురుషుడు’ అనే పేరు సంపాదించుకున్నారు.

ఇమ్రాన్ ఖాన్ 1995లో తన 43వ ఏట 21 ఏళ్ళ బ్రిటిషు యువతి జెమీమా గోల్డ్ స్మిత్‌ను వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె తండ్రి ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. వీరి వివాహ బంధం 9 ఏళ్ళపాటు సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు.

2015లో జర్నలిస్ట్, మాజీ బీబీసీ వెదర్ ప్రజెంటర్ రేహామ్ ఖాన్‌తో ఇమ్రాన్ వివాహం జరిగినా ఈ బంధం ఏడాదిలోపే ముగిసింది. ఇమ్రాన్ మద్దతుదారులు తనపై దాడి చేసినట్టు ఆమె తన జ్ఞాపకాలలో రాసుకున్నారు.

ఈ రెండు పెళ్ళిళ్ళకు విరుద్ధంగా ఇమ్రాన్‌ 2018లో చడీచప్పుడు లేకుండా బుస్రా బీబీని పెళ్ళాడారు. ఇలా పెళ్ళి చేసుకోవడం వల్ల ఇమ్రాన్‌కు ఇస్లాం పట్ల ఉన్న భక్తి ప్రపత్తులపై ప్రజలలో మంచి అభిప్రాయం కలగచేసిందని పరిశీలకులు చెబుతారు.

మొదటిసారి ఇమ్రాన్ ఖాన్ ఓ సూఫీ ప్రార్థన మందిరం వద్ద ఐదుగురు పిల్లలకు తల్లైన బుస్రాను ఓ సలహా కోసం కలుసుకున్నారనే వదంతులు ఉన్నాయి. అప్పటికి ఆమె తన మొదటి భర్తతోనే నివపిస్తున్నారు.

తామిద్దరం పెళ్ళి చేసుకుంటే ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధాని అవుతారని తనకు కలలో కనిపించినట్టు బుస్రా ఇమ్రాన్‌కు రహస్యంగా చెప్పారనే మాటలు వినిపిస్తుంటాయి.

ఈ జంట వివాహం చేసుకున్న ఆరు నెలల తరువాత ఇమ్రాన్ పాకిస్తాన్ ప్రధాని అయ్యారు.

ప్రస్తుతం 40 ఏళ్ళ వయసులో ఉన్న బుస్రా బీబీ ఈ వదంతులను అక్టోబరు 2018లో ఇచ్చిన ఒకే ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలోనే కొట్టిపారేశారు. ఆ ఇంటర్వ్యూలోనే ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పాకిస్తాన్ అభివృద్ధి చెందుతుందని ఆమె చెప్పారు.

బుస్రా బీబీ

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుస్రా బీబీ

బుస్రా చెప్పినట్టు పాకిస్తాన్ అభివృద్ధి చెందిందా?

ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పాకిస్తాన్ అభివృద్ధి చెందుతుందన్న బుస్రా మాట నిజమవ్వలేదు. ఇమ్రాన్ ఖాన్ పాలనా కాలంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. జీవన వ్యయాలు పెరిగిపోయాయి. ఆయన రాజకీయ ప్రత్యర్థులందరూ జైలుపాలయ్యారు. మీడియా స్వేచ్ఛకు సంకెళ్ళు పడ్డాయి. మానవ హక్కుల ఉల్లంఘనలు పెరిగిపోయాయి. జర్నలిస్టులపై దాడులు పెరిగాయి.

ఓ రాజకీయ నాయకుడిగా ఇమ్రాన్ ఖాన్ బహిరంగంగా ఉదారవాదాన్ని సమర్థించడం ద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అదే సమయంలో ఇస్లామ్ విలువలను పాటించాలనడంతోపాటు పాశ్చాత్య సంస్కృతికి వ్యతిరేకంగా ఉండాలని విజ్ఞప్తి చేసేవారు. అలాగే ఆయన పాకిస్తాన్ సైన్యంతో సన్నిహితంగా ఉండేవారని, వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేవారనే పేరుంది.

అయితే ప్రధాని అయిన నాలుగేళ్ళ తరువాత ఇమ్రాన్ రాజకీయ ప్రభ మసకబారడం మొదలైంది. 2022లో పార్లమెంటులో అవిశ్వాసం ద్వారా ఆయన ప్రధాని పదవి పోగొట్టుకున్నారు. తరువాత కోర్టు కేసులలో అరెస్టయి, జైలుపాలయ్యారు.

ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ భార్య బుస్రా బీబీకి కూడా 14 ఏళ్ళ జైలుశిక్ష పడింది. ప్రభుత్వ బహుమతుల నుంచి అక్రమంగా లాభాలు పొందారనే అభియోగంపై ఈ దంపతులిద్దరికి జైలు శిక్షపడింది.

ఇక బుస్రా బీబీకి ఇతర చట్టపరమైన సమస్యలు కూడా ఉన్నాయి.

మాజీ భర్త ఖావర్ మనేకా ఆమెను కోర్టు కేసులతో వెంటాడుతున్నారు. వీరిద్దరూ 28 ఏళ్ళ కిందట పెళ్ళి చేసుకున్నారు. 2017లో విడాకులు తీసుకున్నారు.

ఖావర్ మనేకా, ఓ ప్రభుత్య అధికారి, పేరొందిన రాజకీయ నేత కుమారుడు కూడా.

ఈయన తన భార్య బుస్రా బీబీపై ‘‘మోసపూరిత వివాహం, వ్యభిచారం’’ అభియోగాలతో నవంబరులో ఫిర్యాదు చేశారని పాకిస్తాన్‌కు చెందిన ‘డాన్’ వార్తాపత్రిక తెలిపింది.

కోర్టులు వ్యభిచార అభియోగాన్ని తోసిపుచ్చాయికానీ, మోసపూరిత వివాహ అభియోగంపై విచారణకు సమ్మతించాయి.

భర్త నుంచి విడాకులు పొందిన తరువాత, లేదంటే భర్త చనిపోయాక కానీ, కొన్ని నెలల వరకు భార్య రెండో పెళ్ళి చేసుకోవడాన్ని ముస్లిం ఫ్యామిలీ లా అంగీకరించదు. కానీ బుస్రా బీబీ, ఖావర్ మనేకా నుంచి విడాకులు తీసుకున్న తరువాత ఈ నిర్ణీత గడువు ముగియకముందే ఇమ్రాన్ ఖాన్ ను వివాహం చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా వారం ముందు ప్రభుత్వ బహుమతుల కేసులో ఆమె పాత్ర నేపథ్యంలో జైలు శిక్ష పడింది.

ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ దంపతులిద్దరు ప్రధాని కార్యాలయంలోని అత్తరులు, డిన్నర్ సెట్స్, వజ్రాభరణాలను తమ సన్నిహితుల ద్వారా దుబాయ్‌లో అక్రమంగా విక్రయించారని వీరిపై అభియోగం. ఈ బహుమతుల విలువ సుమారు 14 కోట్ల పాకిస్తానీ రూపాయలు ఉంటుందని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.

బుస్రా బీబీ అరెస్ట్ ఇమ్రాన్ ఖాన్‌పై ఒత్తిడి పెంచడానికి చేసిందేనని పాకిస్తాన్ తెహ్రీక్-ఏ- ఇన్సాఫ్ తాత్కాలిక అధ్యక్షుడు, న్యాయవాది గోహర్ అలీ ఖాన్ చెప్పారు.

‘‘బుస్రా బీబీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధమూ లేదు’’ అని ఆయన ఓ స్థానిక టెలివిజన్ నెట్‌వర్క్‌కు చెప్పినట్టు రాయిటర్స్ తెలిపింది.

అయితే జనవరి 31న పొద్దుపోయిన తరువాత ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేస్తూ- తదుపరి ఉత్తర్వుల వరకు ఆమెను గృహనిర్బంధంలో ఉంచుతామని ప్రకటించింది.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్ ఎన్నికలు: ప్రజలకు చేరువయ్యేందుకు మతతత్వ పార్టీలు ఏం చేస్తున్నాయి?

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)