దళితులు ప్రవేశించారని ఓ గుడిని వదిలేసి కొత్తది కడుతున్న ఇతర కులస్తులు

తిరువణ్ణామలై
ఫొటో క్యాప్షన్, పోలీసుల ఆధ్వర్యంలో ఆలయంలోకి వెళ్లిన భక్తులు
    • రచయిత, కె. మయకృష్ణన్
    • హోదా, బీబీసీ తమిళ్ కోసం

తిరువణ్ణామలై సమీపంలోని అమ్మన్ గుడిలో షెడ్యూల్డ్ కులాల(ఎస్సీకు చెందినవారు పూజలు చేశారన్న కారణంతో ఇతర కులాలవారు తమ కోసం ప్రత్యేకంగా కొత్త గుడి నిర్మిస్తున్నారు.

ముత్తు మరియమ్మన్ ఆలయంలోకి 80 ఏళ్లుగా ఎస్సీలను అనుమతించడం లేదు.

తాండరంపట్టు పక్కనే ఉన్న తెన్ముదియానూర్ గ్రామంలోని హిందూ మత ధర్మదాయ శాఖ ఆధీనంలో ఈ గుడి ఉంటుంది.

80 ఏళ్ల పోరాటం తర్వాత, నిరుడు అధికారులు షెడ్యూల్డ్ కులాల ప్రజలు కూడా గుళ్లోకి వెళ్లి పూజలు చేసుకునేందుకు అనుమతించారు.

అయితే, ఎస్సీలు గుడిలోకి ప్రవేశించారన్న కారణంతో ఇతర కులాల ప్రజలు తమ కోసం మరో గుడి నిర్మాణం ప్రారంభించడం వివాదానికి కారణమైంది.

తిరువణ్ణామలై

నిరుడు పొంగల్ (సంక్రాంతి) సందర్భంగా ముత్తు మరియమ్మన్ ఆలయంలో 12 రోజుల పాటు వేడుకలు జరిగాయి. పండుగ సందర్భంగా గుడిలో పూజలు చేసుకునేందుకు, దేవుడిని దర్శించుకునేందుకు ఒకరోజు తమను కూడా అనుమతించాలని షెడ్యూల్డ్ కులాల ప్రజలు విజ్ఞప్తి చేశారు.

కానీ, ఇతర కులాల వారు అందుకు అనుమతించలేదు.

దాంతో తమను కూడా గుళ్లోకి అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరువణ్ణా మలై హిందూ మత ధర్మదాయ శాఖకు ఎస్సీలు పిటిషన్‌ అందించారు.

ఈ పిటిషన్ ఆధారంగా హిందూ ధార్మిక సంక్షేమ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో విచారణ చేపట్టారు.

ఎస్సీలను గత 80 ఏళ్లుగా గుళ్లోకి అనుమతించడం లేదని విచారణలో తేలింది.

దేవాలయాలు కుల, మతాలకు అతీతమైనవని పేర్కొంటూ షెడ్యూల్డ్ కులాలకు చెందినవారూ గుడిలోకి వెళ్లి పూజలు చేసుకోవచ్చని హిందూ ధార్మిక సంక్షేమ శాఖ చెప్పింది.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ కార్తికేయన్ గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

షెడ్యూల్డ్ కులాల ప్రజల్ని దేవాలయంలోకి అనుమతించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుసుకున్న గ్రామస్థులు నిరసన చేపట్టారు. వారిని గుళ్లోకి అనుమతించరాదంటూ నిరసనకు దిగారు.

అయితే, 80 ఏళ్ల తర్వాత షెడ్యూల్డ్ కులాలకు చెందిన 100 మందికిపైగా అధికారుల సమక్షంలో ముత్తు మరియమ్మన్ ఆలయ ద్వారాలు తెరిచి స్వామి దర్శనం కోసం ఆలయంలోకి వెళ్లారు.

ముత్తు మరియమ్మన్
ఫొటో క్యాప్షన్, ఎస్సీలు గుళ్లోకి వెళ్లి పూజలు చేసిన తర్వాత అక్కడ ఇతరులు పూజలు చేయడం ఆపేశారు

‘‘ఎస్సీలు ప్రవేశించిన ఆలయం మాకొద్దు’’

తర్వాత, కొన్ని నెలల వరకు ఇతర కులాల వారు ముత్తు మరియమ్మన్ ఆలయంలో పూజలు చేయడం మానేశారు.

వారంతా ఏకమై తమకు ఆ గుడి వద్దని, మరో ఆలయాన్ని నిర్మించుకొని పూజలు చేసుకుంటామని నిర్ణయించుకున్నారు.

పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక వ్యక్తి ఈ వివాదంపై ఫోన్‌లో బీబీసీతో మాట్లాడారు.

‘‘గ్రామంలో అన్ని కులాల వారు జీవిస్తున్నారు. మా మధ్య ఎలాంటి సమస్యలు లేవు. మేం కూడా ఏదో సమస్యను సృష్టించబోవడం లేదు. గుడి వల్ల సమస్య వచ్చిందని వేరేగా చెప్పాల్సిన పని లేదు. షెడ్యూల్డ్ కులాల వారికోసం ఒక ప్రత్యేక స్థలాన్ని కేటాయించాం. వారు అక్కడ గుడి కట్టుకోవడంలో సహాయం చేశాం.

ఇప్పుడు వారు మా ఏరియాలో ఉన్న గుడిలో పూజలు చేస్తామంటూ రావడం మాకు ఇష్టం లేదు. అందుకే ఆ గుడిని వదిలేయాలని మేం నిర్ణయించుకున్నాం. ఆ గుడి హిందూ ధార్మిక శాఖ ఆదీనంలో ఉన్నందున అది అందరిదని భావిస్తున్నారు’’ అని ఆయన అన్నారు.

దీంతో ఇతర కులాల వారంతా కలిసి సొంత డబ్బులతో రెండు సెంట్ల భూమిని కొనుగోలు చేసి అక్కడ కొత్త గుడిని నిర్మించే పనుల్లో ఉన్నారు.

ఎస్సీలు

షెడ్యూల్డ్ కులానికి చెందిన ఒక వ్యక్తి ఈ విషయం గురించి మాట్లాడుతూ, గుళ్లోకి షెడ్యూల్డ్ కులాలకు చెందిన ప్రజలు వెళ్లి పూజలు చేసినందున గ్రామస్థులెవరూ తమతో మాట్లాడటం లేదని అన్నారు.

‘‘దేవుడు అందరికీ సమానమే కదా? అందుకే మేం దేవున్ని పూజించాం. కానీ, వారు మరో గుడి కట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. అది వారి ఇష్టం. మేమేం చేయగలం?’’ అని అన్నారు.

రామ మందిరానికి అన్ని కులాల వారు వెళ్తున్నప్పుడు ముత్తు మరియమ్మన్ గుడిలోకి అందరు ఎందుకు వెళ్లకూడదని న్యాయవాది, తిరువణ్ణామలై జిల్లా సీపీఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు ముత్తయ్యన్ ప్రశ్నించారు.

‘‘ స్థలం కొని కొత్త గుడి కట్టడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ, పూజలు జరుగుతున్న ఆలయాన్ని బహిష్కరించి మరో ఆలయాన్ని నిర్మించడం ఎంతమాత్రం సరికాదు.

అయోధ్యలో రామమందిరానికి అన్ని కులాల వారు వెళ్లారు. అందరికీ ఈ విషయం తెలుసు. ఇక్కడివారంతా సామరస్యంగా జీవించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన అన్నారు.

ముత్తయ్యన్
ఫొటో క్యాప్షన్, లాయర్ ముత్తయ్యన్

న్యాయవాది శంకర్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ ఎవరైనా వ్యక్తిగతంగా గుడి కట్టుకునేందుకు చట్టం అనుమతిస్తుందని అన్నారు. కానీ కుల వివక్ష చూపిస్తే చట్టప్రకారం నేరమని చెప్పారు.

‘‘హిందూ రెలిజియస్ ఎండోమెంట్ చట్టం ప్రకారం రెండు రకాల ఆలయాలు నిర్మించవచ్చు. ఒకటి పబ్లిక్, రెండోది వ్యక్తిగత ఆలయం.

భారత రాజ్యాంగం ప్రకారం, ప్రత్యేకంగా గుడి కట్టుకొని పూజలు చేసుకునే వ్యక్తులను ఎవరూ నిరోధించలేరు. అలా నిర్మించిన ఆలయాలు కూడా ఉన్నాయి.

దేవదాయ శాఖ పరిధిలోని గుళ్లకు అందరూ వచ్చి పూజలు చేయవచ్చు. వ్యక్తిగతంగా కూడా గుడి కట్టుకోవడానికి చట్టంలో అవకాశం ఉంది. కానీ, కులం, భాష ప్రాతిపదికన ఎవరినైనా ఆలయానికి రాకుండా చేయడం తప్పు’’ అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)