ప్యాకేజ్డ్ ఫుడ్: ‘ఒక్క బిస్కెట్ తగ్గినందుకు రూ.లక్ష పరిహారం’ ఇలాంటివి మీరూ పొందవచ్చు ఎలాగంటే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఉమాంగ్ పొద్దార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
క్యాడ్బరీ కంపెనీ డిసెంబర్‌లో బోర్నవిటా హెల్త్ డ్రింక్‌లో చక్కెర స్థాయులను 15 శాతం తగ్గిస్తూ కొత్త రకాన్ని తీసుకొచ్చింది.
ఇన్‌ఫ్లూయన్సర్ రేవంత్ హిమత్‌సింకా కారణంగా క్యాడ్బరీ కంపెనీ ఈ మార్పు చేసింది. బోర్నవిటాలో 50 శాతం చక్కెర ఉందంటూ ‘ఫుడ్ ఫార్మర్’ అనే ఒక న్యూట్రిషన్ చానెల్‌ను నడుపుతున్న రేవంత్ ఒక వీడియో పోస్ట్ చేశారు.
తర్వాత ఆ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపడంతో పాటు ప్రజల నుంచి కూడా వ్యతిరేకత రావడంతో క్యాడ్బరీకి ఎదురుదెబ్బ తగిలింది.
గతంలో కూడా పలు కంపెనీలు ఆహార పదార్థాల విషయంలో తప్పుదారి పట్టిస్తున్నాయంటూ వినియోగదారులు, ప్రభుత్వ అధికారులు వాటిని కోర్టు మెట్లు ఎక్కించారు. అలాంటి కొన్ని కేసుల్ని చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
ఒక్క బిస్కెట్ తగ్గినందుకు లక్ష రూపాయల పరిహారం
సన్‌ఫీస్ట్ మ్యారీ లైట్ బిస్కెట్ ప్యాకెట్‌లో ఒక్క బిస్కెట్ తగ్గినందుకు 2023 సెప్టెంబర్‌లో ఐటీసీ కంపెనీకి చెన్నైలోని ఒక కన్స్యూమర్ కోర్టు లక్ష రూపాయల జరిమానా విధించింది.
ప్యాకెట్‌లో 16 బిస్కెట్లు ఉంటాయని కంపెనీ అడ్వర్టైజ్ చేసింది. కానీ, నిజానికి సన్‌ఫీస్ట్ మ్యారీ లైట్ ప్యాకెట్‌లో15 బిస్కెట్లు మాత్రమే ఉంచింది. చెన్నైకి చెందిన పి. దిల్లీబాబు అనే ఒక వినియోగదారుడు తాను కొన్న రెండు ప్యాకెట్లలో 15 బిస్కెట్లు మాత్రమే ఉన్నట్లుగా గుర్తించారు.
ప్రతీ ప్యాకెట్‌లో ఒక బిస్కెట్‌ను తగ్గించడం ద్వారా ఆ కంపెనీ రోజుకు 29 లక్షల రూపాయల లాభం పొందినట్లు ఆయన పేర్కొన్నారు. బరువు తూకం వేసి బిస్కెట్లను అమ్ముతామని, ప్యాకెట్ మీద రాసిన ప్రకారమే 15 బిస్కెట్ల బరువు తూగుతుందని కంపెనీ చెప్పింది.
అయితే, కంపెనీ వాదనను కోర్టు అంగీకరించలేదు. కంపెనీ తప్పుడు వాణిజ్య పద్ధతులు అనుసరిస్తూ వినియోగదారులను తప్పుదారిపట్టించిందని కోర్టు పేర్కొంది.
16 బిస్కెట్లు ఉంటాయనే ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని కంపెనీని ఆదేశించింది. లిటిగేషన్ ఖర్చుల కోసం దిల్లీబాబుకు అదనంగా 10 వేలు చెల్లించాలని చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆమ్వే ఉత్పత్తుల కేసు
ఆమ్వే ఉత్పత్తులు చాలాసార్లు కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. మార్కెట్ నుంచి ఆమ్వే మాడ్రిడ్ సఫేద్ ముస్లి (ఆపిల్), కోహినూర్ వెల్లుల్లి మిశ్రమాన్ని తొలగించాలంటూ ఆమ్వే కంపెనీని 2017లో దిల్లీలోని నేషనల్ కన్స్యూమర్ ఫోరమ్ ఆదేశించింది. ఆమ్వే మీద ‘కన్స్యూమర్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా’ అనే వినియోగదారుల హక్కుల స్వచ్ఛంద సంస్థ కేసు వేసింది.
ముస్లిలో క్లాస్-2 ప్రిజర్వేటివ్స్ ఉన్నాయని, ఆ విషయాన్ని కంపెనీ దాని లేబుల్ మీద పేర్కొనలేదని వారు ఆరోపించారు. వెల్లుల్లి మిశ్రమంలో సరైన ప్రిజర్వేటివ్స్ లేవని కల్తీ చేశారంటూ దావాలో పేర్కొన్నారు.
తమ ఉత్పత్తులకు సంబంధించి దిద్దుబాటు అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వాలని కంపెనీని కోరింది.
ఇది కూడా అన్యాయమైన వాణిజ్య పద్ధతి అని పేర్కొంటూ లక్ష రూపాయల జరిమానాను విధించింది. ఈ లక్ష రూపాయల్ని వినియోగదారుల సంక్షేమ నిధిలో జమ చేయాలని చెప్పింది.
2015లో కూడా ఆమ్వే కంపెనీకి 10 లక్షల జరిమానా విధించారు. తమ న్యూట్రిలైట్ డైలీ అనే సప్లిమెంట్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని కంపెనీ చేసిన వాదనలను నిరూపించేలా ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు అందించలేనందుకు ఈ జరిమానా విధించినట్లు కోర్టు చెప్పింది. అయితే, దీనిపై కంపెనీ అప్పీల్ చేసింది.
తప్పుడు ప్రకటనలు
కంపెనీలు తరచుగా తమ ప్రకటనల్లో పెద్ద పెద్ద మాటలు చెబుతుంటాయి. ఇటీవలే దిల్లీ హైకోర్టు అలాంటి ఒక వాదన చేయకుండా డాబర్ కంపెనీని అడ్డుకుంది.
తమ హెల్త్ ఫుడ్ డ్రింక్ ‘డాబర్ వీటా’, భారత్‌లోనే అత్యుత్తమ ఇమ్యూనిటీ బూస్టర్ అని, మీ బిడ్డకు ఇతర హెల్త్ డ్రింక్‌లేవీ ఇంత అత్యుత్తమ ఇమ్యూనిటీని అందించలేవంటూ డాబర్ కంపెనీ ప్రకటనలో పేర్కొంది.
అయితే, డాబర్ చేసిన ఈ వాదనను నిర్ధరించేలా ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవంటూ ప్రకటనల నియంత్రణ సంస్థ ‘ది అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’కు ఫిర్యాదు అందింది.
ఈ వాదన అతిశయోక్తిగా ఉందని, వినియోగదారులకు నిరాశ కలిగించే అవకాశం ఉందని పేర్కొంటూ ఈ ప్రకటనను నిలిపేయాలని డాబర్ కంపెనీని ఆదేశించింది.
ఈ ప్రకటనలో పేర్కొన్నట్లుగానే జరుగుతుందని పేర్కొంటూ డాబర్ కంపెనీ, దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
మానవ ఆరోగ్యం విషయంలో తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఉండకూడదని పేర్కొన్న దిల్లీ హైకోర్టు, కౌన్సిల్ ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.

ఫొటో సోర్స్, Getty Images
మ్యాగీ కేసు
ఇటీవలి కాలంలో చాలా పాపులర్ అయిన ఆహార సంబంధిత కేసుల్లో మ్యాగీ కేసు ఒకటి. తమ ప్రసిద్ధ ఇన్‌స్టంట్ నూడుల్స్ మ్యాగీని మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవాలంటూ నెస్లే కంపెనీని 2015లో ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశించింది.
నెస్లే కంపెనీ చేసిన మ్యాగీ ప్రకటనలో ‘నో యాడెడ్ ఎంఎస్‌జీ’ అని పేర్కొంది. కానీ, దీనికి విరుద్ధంగా నూడుల్స్‌లో సీసం స్థాయిలు అధికంగా ఉన్నాయని, అందులో మోనోసోడియం గ్లుటమేట్ (ఎంఎస్‌జీ) ఉందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చెప్పింది.
తినడానికి నూడుల్స్ సురక్షితమైనవే అని పేర్కొన్న నెస్లే కంపెనీ ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకుంది. తినడానికి నూడుల్స్ ఆమోదయోగ్యమైనవే అని నిరూపించుకునే అవకాశం తమకు ఇవ్వలేదంటూ ఆ కంపెనీ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.
దేశం అంతటా ఉన్న ప్రయోగశాలల్లో మ్యాగీని పరీక్షించాలని, ఒకవేళ వాటిలో మ్యాగీ సురక్షితమైనదే అని తేలితే కంపెనీ మళ్లీ మ్యాగీ ఉత్పత్తి చేయవచ్చంటూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.
ఆ పరీక్షల్లో మ్యాగీలో సీసం స్థాయిలు పరిమితంగానే ఉన్నాయని తేలడంతో కంపెనీ మళ్లీ మ్యాగీ ఉత్పత్తిని పున: ప్రారంభించింది.
అయితే, ప్యాకెట్ల మీద ‘నో యాడెడ్ ఎంఎస్‌జీ’ అనే ప్రకటనను నిలిపేసింది.

ఫొటో సోర్స్, Getty Images
వినియోగదారులకు ఉన్న హక్కులేంటి?
భారత్‌లోని ఒక వినియోగదారునికి, ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తికి సంబంధించి ఫిర్యాదు నమోదు చేయడానికి వివిధ మార్గాలున్నాయి.
మొదటిది, వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం ఒక కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించవచ్చు. ఈ చట్టం వినియోగదారులను ప్రాణాలకు హాని కలిగించే వస్తువులు, ఉత్పత్తుల నుంచి, తప్పుదోవ పట్టించే ఆహార ప్రకటన నుంచి రక్షిస్తుంది.
జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో వినియోగదారుల ఫోరమ్‌లు ఉంటాయి. వినియోగదారులు కోటి రూపాయల్లోపు ఉత్పత్తుల ఫిర్యాదుకు సంబంధించి జిల్లా ఫోరమ్‌లను ఆశ్రయించవచ్చు. కోటి నుంచి 10 కోట్ల వరకు ఉత్పత్తుల కోసం రాష్ట్ర స్థాయిలో, 10 కోట్ల పైచిలుకు వాటికి జాతీయ స్థాయి ఫోరమ్‌ను సంప్రదించవచ్చు.
తప్పుదోవ పట్టించే ప్రకటనలకు ఫోరమ్‌లు రెండేళ్ల జైలు శిక్ష, 10 లక్షల వరకు జరిమానా విధిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
వినియోగదారుల ఫోరమ్‌తో పాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)లో కూడా వినియోగదారులు ఫిర్యాదు చేయొచ్చు. ఇది ఆహార పదార్థాల నాణ్యత, ప్యాకేజింగ్ లేబులింగ్ వంటి విషయాల్లో ప్రమాణాలను నిర్దేశిస్తుంది. దేశంలో ఆహార భద్రతకు సంబంధించిన సంస్థ ఇది.
కల్తీ, అసురక్షిత, నాసిరకం ఆహారాలు, పుడ్ లేబుల్‌లో తప్పులు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు, వాదనలకు సంబంధించి వినియోగదారులు తమ ఫిర్యాదులు, ఫీడ్‌బ్యాక్స్ పంపించవచ్చని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది.
ఈమెయిల్, ఫోన్, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఎవరైనా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐని సంప్రదించవచ్చు.
వివాదాలను పరిష్కరించేందుకు ఎక్కువగా వినియోగదారుల ఫోరమ్‌లను వాడతారు. వేగంగా పరిష్కారం పొందడం కోసం వినియోగదారుల ఫోరమ్‌లను ఆశ్రయిస్తారని డాక్టర్ సుశీలా చెప్పారు. ఆమె దిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీలో సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ కన్స్యూమర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
వినియోగదారుడు ఫిర్యాదు చేస్తూ ఫోరమ్‌ను ఆశ్రయిస్తే సదరు ఉత్పత్తిలో ఉన్న లోపాన్ని, ప్రకటనలకు విరుద్ధంగా ఉత్పత్తి ఉన్నట్లుగా చూపించాలి.
‘‘ఒకవేళ వినియోగదారుడు కేసును గెలిస్తే వారు చేసిన ఖర్చును తిరిగి ఇస్తారు’’ అని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సెంట్రల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు జార్జ్ చెరియాన్ చెప్పారు.
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వద్ద ఫిర్యాదును దర్యాప్తు చేయడానికి అధికారులు ఉంటారు.
ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్‌లో వినియోగదారుల చట్టాల అవగాహన, అమలు అనేవి ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- అయోధ్య: శ్రీరాముడిని గెలిపించిన 'రామ్‌లల్లా' ఎవరో తెలుసా?
- చిప్స్, కూల్ డ్రింక్స్‌తో ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉంటుంది, పూర్తిగా మానేయాలా? ఎంత తినొచ్చు
- శుభ్‌మన్ గిల్, అశ్విన్, షమీ, స్మృతి మంధానకు బీసీసీఐ అవార్డులు.. పురస్కారాలు పొందిన క్రీడాకారుల జాబితా ఇదే
- సుభాష్‌చంద్రబోస్: ‘మై డార్లింగ్, నువ్వు నా హృదయరాణివి’ అంటూ బోస్ ఎవరికి ప్రేమలేఖలు రాశారు?
- బటర్ చికెన్, దాల్ మఖనీ వంటకాలు ఎవరు కనిపెట్టారు? తేల్చనున్న దిల్లీ హైకోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










