‘పుతిన్! మా భర్తలను ఇళ్లకు ఏ స్థితిలో పంపిస్తారు? ప్రాణాలతోనా, శవాలుగానా?’ - ప్రశ్నిస్తున్న మహిళలు

- రచయిత, స్టీవ్ రోసెన్‌బర్గ్
- హోదా, రష్యా ఎడిటర్, బీబీసీ
రష్యా రాజధాని మాస్కో శివార్లలోని ఓ అసెంబ్లీ హాల్‌లో అసాధారణమైన సంఘటన అది.
కొంత మంది మహిళలు బహిరంగంగా రష్యా అధికారులను విమర్శిస్తున్నారు. యుక్రెయిన్‌తో యుద్ధం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మూడు లక్షల మంది రిజర్వ్ బలగాలను 2022లో సమీకరించారు.
ఈ బలగాలలోని తమ భర్తలను తిరిగి ఇళ్లకు పంపాలని ఈ మహిళలంతా డిమాండ్ చేస్తున్నారు.
తమ భర్తలంతా ఇళ్ళలోనే ఉండాలని వారు కోరుకుంటున్నారు.
‘‘మా భర్తల ఆర్మీ డ్యూటీ ఎప్పుడు ముగిసినట్టు భావించాలి’’ అని మరియా ఆంటోనినా అనే మహిళ ప్రశ్నించారు.
‘‘వారు కాళ్ళు చేతులు లేకుండా వెనక్కి తిరిగొచ్చినప్పుడా? వారే పని చేయలేని స్థితికి చేరినప్పుడా? లేదంటే వారిని శవపేటికలో పంపేవరకు మేం ఎదురుచూస్తుండాలా’’ అని ఆమె అడిగారు.

‘ది వే హోమ్’
సామాజిక మాధ్యమాలలో తనలాంటి మహిళలందరినీ మరియా ఆంటోనినా ఓ గ్రూపుగా తయారుచేశారు. ఈ గ్రూపుకు ‘ది వే హోమ్’ అనే పేరు పెట్టారు.
యుద్దం గురించి వీరందరికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఆమెను సమర్థిస్తున్నారు. మరికొందరేమో పుతిన్ ప్రత్యేక సైనిక చర్యపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ మహిళలందరినీ ఏకం చేసిన విషయం ఏమిటంటే- పుతిన్ సేకరించిన రిజర్వ్ సైన్యం యుద్దంలో తన వంతు పాత్ర పోషించిందని, ఇప్పుడు వారి కుటుంబాలకు చేరుకునే సమయం వచ్చిందని వీరంతా నమ్ముతున్నారు.
కానీ ఇలాంటి విషయాలను అధికారులు బహిరంగంగా చెప్పరు. రష్యాలో యుద్ధానికి సంబంధించి బహిరంగంగా విమర్శలు చేయడం ప్రమాదకరం.
అందుకే చాలా మంది ఆచితూచి మాట్లాడతారు. అసమ్మతిని శిక్షించడానికి రష్యాలో చాలా చట్టాలు ఉన్నాయని వారికి తెలుసు. కానీ వీరంతా తమ నిరాశను అణచుకోలేకపోతున్నారు.
‘‘ముందు మన ప్రభుత్వాన్ని నమ్మితీరాలి’’ అని మరియా ఆంటోనినా చెప్పారు. ‘‘కానీ ఇప్పుడు మనం వారిని నమ్మగలమా? నేను ఎవరినీ నమ్మలేను’’ అంటారామె.
తొలి నుంచి ప్రత్యేక సైనిక చర్య పట్ల విమర్శనాత్మకంగా ఉన్న స్థానిక కౌన్సిలర్ బోరిస్ నదేజ్డిన్‌ను కలవడానికి వారందరూ కలిసి వచ్చారు.
ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టే బోరిస్ నదేజ్డిన్ యుక్రెయన్‌పై రష్యా దండయాత్ర మొదలుపెట్టినప్పనుంచి జాతీయ టెలివిజన్ ఛానళ్లలో దర్శనమిస్తున్నారు.
టెలివిజన్ చర్చావేదికలలో ఆయన అప్పుడప్పుడు కనిపించే అతిథి.
ప్రస్తుతం ఆయన రష్యా అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్‌పై కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. యుక్రెయిన్‌తో యుద్దం కారణంగా రష్యాలో పుతిన్ ప్రతిష్ఠ బాగా దెబ్బతిందంటారాయన.
‘‘రష్యాలో పుతిన్ ఎంతో ప్రసిద్ధి పొందారు. ఎందుకంటే 1990 తరువాత ఆయన దేశంలో స్థిరత్వాన్ని, భద్రతను తీసుకువచ్చారు’’ అని చెప్పారు నాజిర్దిన్.
‘‘స్థిరత్వం, భద్రత అనే అంశాలే పుతిన్‌కు మద్దతు ఇవ్వడానికి కీలకమైన అంశాలు. కానీ ఇప్పుడు చాలా మంది ప్రజలు ఈ రెండు అంశాల కాలపరిమితి ముగిసిపోయిందని అర్థం చేసుకుంటున్నారు’’ అని తెలిపారు.
తమ భర్తలను వెనక్కి పంపాలని మహిళలు పోరాడుతుంటే, వారి సోదరులు, కుమారులు ఇతరుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఈ మహిళందరినీ పశ్చిమ దేశాల తోలుబొమ్మలన్నట్టుగా పుతిన్ మద్దతుదారులు చిత్రీకరిస్తున్నారు.

తమను నిర్వీర్యం చేయడానికి రష్యన్ శత్రువులు ఇలా మహిళల పేరుతో పన్నాగం పన్నారని రష్యా పార్లమెంట్ సభ్యుడు, రష్యన్ పార్లమెంట్ ‘డ్యూమా’ రక్షణ కమిటీకి నేతృత్వం వహించే అండేరి కర్తాపోలోవ్ ఫాంటాకా న్యూస్ సైట్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
దీని వెనుక యుక్రెయిన్ సైన్యం కానీ, అమెరికా నిఘా సంస్థ సీఐఏ కానీ ఉన్నట్టు కనిపిస్తోందని ఆయన అన్నారు.
దీంతోపాటు రెండో ప్రపంచ యుద్ధాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.
‘‘1942లో కూడా కొంత మంది సైనికుల భార్యలు ఓ బృందంగా ఏర్పడి క్రెమ్లిన్‌కు వచ్చారు. వారు స్టాలిన్‌కు ఏం చెప్పారో తెలుసా? 1941లో సైన్యంలోకి వచ్చిన తమ భర్తలు, అప్పటికే ఏడాదిపాటు యుద్ధం చేశారని, వారి డ్యూటీ అయిపోయిందని, వారిని ఇంటికి పంపమని వారు అడిగారు’’ అని చెప్పారు.
అయితే కర్తాపోలోవ్ వ్యాఖ్యలు తమను అవమానించేలా ఉన్నాయని మరియా ఆండ్రీవా భావిస్తున్నారు. ఆమె భర్త, సోదరుడు సైన్యంలో పనిచేస్తున్నారు.
‘‘ఆయన ప్రత్యేక సైనిక చర్యను రెండో ప్రపంచ యుద్ధంతో పోల్చి చూపే సాహసం చేస్తున్నారు’’ అని ఆమె చెప్పారు.
‘‘అప్పటి విషయానికి వస్తే మనుగడ సాగించడమే రష్యా లక్ష్యంగా ఉండేది. మాపైన దాడి జరిగింది. అప్పట్లో అంతటా సైనిక చట్టం ఉండేది. కానీ ఇప్పుడంతా అప్పటి వాతావరణానికి విరుద్ధంగా జరుగుతోంది’’ అని ఆమె చెప్పారు.
కేవలం తన కుటుంబ సభ్యులను వెనక్కి తీసుకురావడానికి మాత్రమే ఈ పోరాటం చేయడం లేదని, మరింత మంది రష్యన్లను ఈ కూపంలోకి లాగకుండా చూసేందుకు కూడా అని మరియా ఆండ్రీవా చెప్పారు.
‘‘మరోసారి సైనిక సమీకరణ జరగాలని మేం కోరుకోవడం లేదు. సైనిక ఘర్షణలో పౌరులను వినియోగించడానికి మేం వ్యతిరేకం. రష్యన్లందరూ ఇది తమపై కూడా ప్రభావం చూపుతుందని అర్థం చేసుకోవాలి’’ అని ఆమె తెలిపారు.
‘‘కొంత మంది ఆస్ట్రిచ్‌లా నటిస్తుంటారు. తలను ఇసుకలో పెట్టి బయట ఏం జరుగుతోందో ఆలోచించడానికి కూడా ఇష్టపడరు. అలాంటివారిని అర్థం చేసుకోగలను. నిన్ను ఆనందంగా ఉంచడానికి ఇష్టపడని రాజ్యంలో ఇలాంటివి అంగీకరించడం కష్టమే. రాజ్యం కేవలం మిమ్మల్ని ఓ వస్తువులా చూస్తుంది. కానీ ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రజలు తమ మనుగడ సాగించాలనుకుంటే వారంతా నిజాన్నిఅంగీకరించాలి. ఈ సైనిక సమీకరణకు నో చెప్పాలి’’ అంటారు మరియా ఆంటోనినా.

మరోసారి సైనిక సమీకరణ ఉంటుందా?
రష్యాలో రెండోసారి సైనిక సమీకరణకు ఉన్న అవకాశాలేంటి? 2023 డిసెంబర్‌లో పుతిన్ దీనిపై వివరణ ఇచ్చారు.
రష్యన్ టెలివిజన్‌లో లైవ్‌లో మాట్లాడిన ఆయన 2023 నాటికల్లా రష్యన్ అధికారులు దాదాపు 5 లక్షలమంది స్వచ్ఛంద సేవకులను యుక్రెయిన్‌పై యుద్ధానికి నియమించుకోగలిగారని చెప్పారు.
పరిస్థితి ఇలాగే ఉంటే, సైనిక సమీకరణ అవసరం ఉండదని ఆయన తెలిపారు. కానీ పరిస్థితులు ఇలానే ఎప్పుడూ ఉండవనేది నిజం. అవి మారుతాయి.
ఉదాహరణకు మార్చి 2022లో పుతిన్ మాట్లాడుతూ- ‘‘నిర్బంధ సైనికులు యుద్ధంలో పాల్గొనరు. రిజర్వు సైనికుల సమీకరణ కోసం కూడా పిలుపునివ్వడం లేదు. కేవలం సైన్యంలోనివారే యుద్ధంలో పాల్గొంటారు’’ అని చెప్పారు. కానీ ఆరు నెలల తరువాత ‘‘పాక్షిక సమీకరణ’ కోసం ప్రకటన వెలువడింది.
దీనిపై చైతన్యం తీసుకువచ్చేందుకు మరియా, ఇతర మహిళలు ఓ కొత్త సంప్రదాయానికి తెరతీశారు.
ఇందులో భాగంగా ప్రతి శనివారం వారు తలపై తెల్లని వస్త్రం ధరించి మాస్కోకు వెళతారు.
క్రెమ్లిన్ గోడల వద్ద ఉన్న అనామక సైనికుల సమాధుల వద్ద పుష్పాంజలి ఘటిస్తారు. అక్కడే అమరజ్యోతిని కూడా వెలిగిస్తారు. ఇలా శాంతియుత పద్ధతిలో వీరు తమ నిరసన తెలియజేస్తున్నారు.
వీరి టెలిగ్రామ్ చానల్ ‘ది వే హోమ్’లో ఇలా పుష్పాంజలి ఘటించడం, అమరజ్యోతిని వెలిగించడం గురించి వివరించారు.
‘‘ఇదంతా యుద్ధంలో మరణించినవారి జ్ఞాపకాలను గౌరవించేందుకు, మన పిల్లల జ్ఞాపకాలను గౌరవించేందుకు...’’ అని చెప్పుకొచ్చారు.
పుష్పాంజలి ఘటించడమనేది ‘మరోసారి ఇలా చేయకండి’’ అనే సందేశాన్ని ఇచ్చినట్టవుతుందని ఈ గ్రూపు నమ్ముతోంది.

‘యుద్ధం చేయాలనే ఆసక్తి ఉన్నవారినే తీసుకోవాలి’
రష్యన్ సమాజంలో ఇలాంటి బలవంతపు సైనిక నియామకాలపై ఎంత చైతన్యం ఉంది? సైనిక సమీకరణలో భాగంగా సైన్యంలోకి వెళ్ళిన కుటుంబాల వారి ఆవేదనపై ప్రజల్లో ఎంత మందికి ఆసక్తి ఉంది?
దీనిపై మరియా ఆంటోనినా స్పందిస్తూ- తన జీవితభాగస్వామిని సైన్యంలోకి తీసుకున్నప్పుడు చుట్టుపక్కల నుంచి అంతగా మద్దతు లభించలేదని చెప్పారు.
2022 అక్టోబరులో సైన్యంలో చేరమంటూ లెటర్ వచ్చినప్పుడు ఆయన మరియా ఆంటోనియాను జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె స్నేహితులకు చెప్పారు.
‘‘నా స్నేహితులు కొత్త సంవత్సరం జరుపుకోడానికి నన్ను పిలిచారు. కానీ ఆ రోజు రాత్రంతా నా భర్త యుక్రెయన్ యుద్ధంలో పాల్గొనడానికి వెళ్ళడం పిచ్చి అన్నట్టుగా మాట్లాడారు’’ అని మరియా ఆంటోనినా చెప్పారు.
తన భర్తకు కడుపులో పుండు ఉన్నప్పటికీ ఆయనను యుక్రెయిన్‌పై దాడికి పంపారని చెప్పారు. డిసెంబర్ 4న తన భర్త ఫోన్‌లో మాట్లాడినట్టు ఆమె తెలిపారు.
‘‘నేను ఏడుస్తున్నాను. నేను భయపడిపోయాను. నేనేదో గుడ్‌బై చెప్పినట్టు అనిపించింది’’ అన్నారు.
డిసెంబర్ 13న మరోసారి కాల్ చేశానని, అదే చివరి ఫోన్ కాల్ అని చెప్పారు. ఆ తరువాత ఆయన యుద్ధంలో గాయపడినట్టు తెలిసిందన్నారు.
‘‘యుద్ధం చేయాలనే కాంక్ష ఉన్నవారు కొంత మంది ఉన్నారు. వారు స్వచ్ఛందంగా కాంట్రాక్ట్‌పై సంతకం చేశారు’’ అని మరియా ఆంటోనినా చెప్పారు.
‘‘వారిని పోరాడనీయండి. కానీ అక్కడ ఉండటానికి ఇష్టపడని నా భర్తలాంటివారిని వెనక్కు పంపండి. ఇప్పటికే వారు దేశం కోసం చేయాల్సినదంతా చేశారు. వారిని ఇళ్ళకు పంపండి’’ అని తెలిపారు.
‘‘నాకు వ్లాదిమిర్ పుతిన్ అంటే అపరిమితమైన గౌరవం ఉండేది. కానీ నేనిప్పుడు తటస్థంగా ఉంటున్నాను. ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని ఆయనకు తెలిసినా మౌనంగానే ఉంటున్నారు. ఈ నిజాన్ని నేను కష్టంగా అర్థం చేసుకుంటున్నాను. కానీ వారు మమ్మల్ని మోసం చేసేవాళ్లుగా భావిస్తున్నారనే విషయాన్నే అర్థం చేసుకోలేకపోతున్నాను. ఒకనాడు తనకు ఓటు వేసిన ప్రజల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది’’ అంటూ ఆమె ముగించారు.
ఇవి కూడా చదవండి:
- గురక ఎందుకు వస్తుంది? రాత్రిపూట పదేపదే నిద్ర చెడిపోతే మెదడు పనితీరు దెబ్బతింటుందా?
- ఐకాన్ ఆఫ్ ద సీస్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌక తొలి ప్రయాణం షురూ.. దీనిపై విమర్శలు ఎందుకు?
- మూడుసార్లు ఉరికంబం వరకు వెళ్లాడు.. రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు.. అయినా బతికి బయటపడ్డాడు
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- నితీశ్‌ను చేర్చుకోవడంలో ఎన్డీయే తెర వెనక వ్యూహమేంటి, ‘ఇండియా’ కూటమిపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














