జపాన్: మోస్ట్ వాంటెడ్ నేరస్తుడి ఆచూకి 49 ఏళ్ల తర్వాత ఎలా దొరికిందంటే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ గ్రెగోరీ
- హోదా, బీబీసీ న్యూస్
జపాన్ అంతటా పోలీస్ స్టేషన్ల బయట అంటించిన వాంటెడ్ పోస్టర్లలో నవ్వుతోన్న సటోషి కిరిషిమా ఫోటో దశాబ్దాల పాటు కనిపించింది.
దాదాపు 49 ఏళ్ల తర్వాత, ఇప్పుడు అతన్ని పట్టుకున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు.
టోక్యో దగ్గర్లోని ఒక ఆసుపత్రిలో ఒక రోగి తన పేరును కిరిషిమా అని పేర్కొన్నారు. 1970లలో అనేక ఘోరమైన బాంబుదాడులకు పాల్పడిన ఒక మిలిటెంట్ గ్రూపు సభ్యుడు కిరిషిమా.
టర్మినల్ క్యాన్సర్‌తో బాధపడుతూ మారుపేరుతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆ వ్యక్తి డీఎన్‌ఏ పరీక్షల ఫలితాల కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. అవి వస్తేగానీ, అతను కిరిషిమా అని ధ్రువీకరించలేమని పోలీసులు చెప్పారు.
కిరిషిమా, ఈస్ట్ ఏషియా యాంటీ జపాన్ ఆర్మ్‌డ్ ఫ్రంట్‌కు చెందినవారు. జపాన్ రాజధానిలో 1972 నుంచి 1975 మధ్య జరిగిన అనేక బాంబుదాడుల వెనుక ఈ రాడికల్, లెఫ్ట్ వింగ్ ఆర్గనైజేషన్ ఉన్నట్లుగా భావిస్తారు.
1974లో మిత్సుబిషీ హెవీ ఇండస్ట్రీస్ హెడ్‌క్వార్టర్స్ వద్ద ఈ గ్రూపు జరిపిన ఒక దాడిలో ఎనిమిది మంది చనిపోయారు.

ఫొటో సోర్స్, National Police Agency
పేలుడు పదార్థాల విషయంలో కిరిషిమా క్రిమినల్ నిబంధనలను ఉల్లంఘించారని, కంపెనీలపై సీరియల్ బాంబుదాడుల్లో అతను వాంటెడ్‌గా ఉన్నారని తన వెబ్‌సైట్‌లో జపాన్ నేషనల్ పోలీస్ ఏజెన్సీ పేర్కొంది.
ఒక నాటు బాంబును అమర్చడం, పేల్చడంలో కిరిషిమా సహాయం చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ బాంబు పేలుడు వల్ల 1975 ఏప్రిల్ 18న గింజా జిల్లాలోని ఒక భవనం కొంత భాగం ధ్వంసమైనట్లుగా స్థానిక మీడియా పేర్కొంది.
ఇది జరిగిన 49 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు కిరిషిమా ఆచూకీని సంపాదించినట్లుగా భావిస్తున్నారు. ఇప్పుడు కిరిషిమా వయస్సు 70 ఏళ్లు.
కమకుర నగరంలోని ఒక ఆసుపత్రిలో చికిత్స కోసం ఆయన మారుపేరుతో చేరారు.
అయితే, తానే కిరిషిమానని గురువారం ఆయన ఆసుపత్రి వర్గాలకు వెల్లడించారు. ఇంకా కొన్ని నెలల జీవించి ఉండే అవకాశం ఉన్నందున చివరి రోజుల్లో తన అసలు పేరుతో బతకాలనుకుంటున్నట్లుగా ఆయన చెప్పారని నివేదికలు వచ్చాయి.
ఆయన గుర్తింపును ధ్రువీకరించడం కోసం పోలీసులు ఇప్పుడు డీఎన్‌ఏ పరీక్షా ఫలితాల కోసం చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- మరణ శిక్షను ఏయే పద్ధతుల్లో అమలు చేస్తున్నారు?
- ఏపీలో శ్మశానం అభివృద్ధికి తెలంగాణ ఎంపీ నిధులపై వివాదం ఎందుకు రేగింది?
- యూదుల ఊచకోత నుంచి బతికి బయటపడ్డ చిన్నారి జార్జ్ ఇప్పుడు ఎలా ఉన్నారు? నాటి మహా విషాదంపై ఆయన ఏమన్నారు?
- ధోర్డో: ఎడారి మధ్యలోని ఈ గుజరాత్ గ్రామానికి లక్షల మంది టూరిస్టులు ఎందుకు వస్తున్నారు?
- అయోధ్య రామాలయం: ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది ఆలయాల ఆర్కిటెక్చర్ భిన్నంగా ఎందుకు ఉంటుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















