ఏపీలో శ్మశానం అభివృద్ధికి తెలంగాణ ఎంపీ నిధులపై వివాదం ఎందుకు రేగింది?

ఆంధ్రప్రదేశ్
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఉత్తరాంధ్రలో ఓ శ్మశానం అభివృద్ధి పనులకు ఒక తెలంగాణ రాజ్యసభ సభ్యుడి నిధులను ఉపయోగించాల్సి రావడం చర్చనీయమమయ్యింది.

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని శ్మశానంలో రంగులు వేయడం, గోడలు, కొత్త దహనవాటికల నిర్మాణం, మొక్కల పెంపకం వంటి పనులు జరుగుతున్నాయి.

ఈ ప్రాంతం నుంచే పీడిక రాజన్నదొర ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.

దేశంలోనే లారీ పరిశ్రమకు పేరు పొందిన సాలూరు, ఇప్పుడు ఈ శ్మశానం విషయంలో వార్తల్లో నిలిచింది. ఏమిటీ వివాదం? ఇది ఎందుకు తలెత్తింది? అసలు ఎంపీల్యాడ్స్ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఆంధ్రప్రదేశ్

నిధులు ఇచ్చిన తెలంగాణ ఎంపీ ఏమన్నారు?

సాలూరు పట్టణంలోకి వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన కనిపించే ముత్యాలమ్మ గుడి వెనుక ఈ శ్మశానం ఉంది. దీనిని సాలూరు స్వర్గధామం అని పిలుస్తారు. దీనిని 2012 నుంచి దహన సంస్కారాలకు ఉపయోగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. దీని అభివృద్ధి పనుల కోసం ఈ శ్మశానం కమిటీ నిధులను సేకరిస్తుంటుందని కమిటీ సభ్యులు బీబీసీతో చెప్పారు.

నిధుల సేకరణలో భాగంగా తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బడుగుల లింగయ్య యాదవ్‌ను ఈ కమిటీ సూర్యాపేట కలెక్టర్ ద్వారా సంప్రదించింది.

ఎంపీ లింగయ్య యాదవ్ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.10 లక్షలు సాలూరు స్వర్గధామం అభివృద్ధి పనులకు ఇచ్చారు. ఆ నిధులు 2023 డిసెంబర్‌లో సాలూరు పురపాలక సంఘానికి చేరడంతో గత వారం నుంచి శ్మశానంలో అభివృద్ధి పనులు చేపట్టారు.

ఇంతవరకూ బాగానే ఉన్నా, ఆంధ్రప్రదేశ్‌లో శ్మశానం అభివృద్ధికి తెలంగాణ రాజ్యసభ సభ్యుడు నిధులు ఇవ్వడమేంటి? ఇక్కడున్న ఎంపీలు, ఇతర నాయకులు, ప్రభుత్వం ఏం చేస్తోందంటూ విమర్శలు మొదలయ్యాయి. తెలంగాణ ఎంపీ, ఏపీలో అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వొచ్చా అనే చర్చ కూడా జరుగుతోంది.

“రాజ్యసభ ఎంపీలు దేశంలో ఎక్కడైనా తమ నిధులతో అభివృద్ధి పనులకు సిఫార్సు చేయొచ్చు. సాలూరు శ్మశానం అభివృద్ధి పనులకు నేను ఆ నిధులిచ్చాను. ఇది చాలా చిన్న పని, మంచి పని. అందుకే ఇచ్చాను. ఇందులో రాజకీయం ఏమీ లేదు. అడిగారు, అవకాశం ఉంది, ఇచ్చాను. అంతే” అని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ బీబీసీతో చెప్పారు.

ఆంధ్రప్రదేశ్

ఎన్నికల వేళ ప్రచారాంశం?

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో ఏదైనా అధికార, ప్రతిపక్షాలకు ప్రచారాంశంగా మారే అవకాశం కనిపిస్తోంది. సాలూరు శ్మశానం అభివృద్ధికి తెలంగాణ ఎంపీ నిధులు ఇవ్వడమనేది కూడా ఇదే కోవలోకి వస్తుందని సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు ఎం.యుగంధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, రాజ్యసభ ఎంపీలు దేశంలో ఎక్కడైనా తమ నిధులను ఉపయోగించి అభివృద్ధి పనులకు సహకరించవచ్చన్నారు.

ఉన్నత విద్యను ప్రోత్సహించే విషయంలో గతంలో విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో కొన్ని విభాగాల అభివృద్ధికి ఈశాన్య భారత(నార్త్ ఈస్ట్) ఎంపీలు నిధులు ఇచ్చారని తెలిపారు.

కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు తెలంగాణలోని ఆదివాసీల కోసం అంబులెన్సులు తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి సమకూర్చారని ఆయన చెప్పారు.

‘‘సాలూరు శ్మశానానికి తెలంగాణ ఎంపీ నిధులు ఇవ్వడంలో తప్పులేదు, కానీ ఏపీలో ఎంపీలు లేరా? వారికి నిధులు ఉండవా? వారికి ఇటువంటి విషయాలు పట్టవా? అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. అసలే ఎన్నికల సమయం. దీంతో ఈ విషయంలో కాస్త ఎక్కువే హంగామా జరుగుతోంది” అని యుగంధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

శ్మశానాలు బాగు చేసుకోవడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద, లేదా స్థానిక నాయకులు, మంత్రుల వద్ద నిధులు లేవా, పక్క రాష్ట్రాల సాయం తీసుకోవాల్సి వస్తోందా, అనేది ఇప్పుడు ముఖ్యమైన అంశం అయ్యిందని ఆయన తెలిపారు.

ఈ శ్మశానం అభివృద్ధికి గతంలో తాను నిధులు ఇచ్చానని రాజన్నదొర చెప్పారు.

ఆంధ్రప్రదేశ్

ఇప్పుడు ఎవరూ అడగలేదు: రాజన్నదొర

శ్మశానం అభివృద్ధికి నిధులు కావాలని తనను ఎవరూ సంప్రదించలేదని సాలూరులోనే నివాసముంటున్న స్థానిక ఎమ్మెల్యే, ఏపీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర బీబీసీతో చెప్పారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ శ్మశానం అభివృద్ధికి నిధులు ఇచ్చానన్నారు.

“నన్ను నిధుల కోసం సంప్రదించలేదు. తెలంగాణ ఎంపీ ద్వారా నిధులు సేకరించడంపై నాకు ఎలాంటి సమాచారం లేదు. విషయం తెలిసి నేను ఎంక్వైరీ చేస్తే, మా సాలూరుకు చెందిన వెంకటరావు అనే ఆయన తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. ఆయనది మా ప్రాంతం కావడంతో ఆయన దృష్టికి నిధుల విషయం తీసుకెళ్లారు. ఆ కలెక్టర్ ఎంపీ లింగయ్య యాదవ్‌తో మాట్లాడి నిధులు ఇప్పించారు” అని రాజన్నదొర చెప్పారు.

తన దగ్గరకు వచ్చి శ్మశానం ఆధునీకరణ పనుల కోసం నిధులు కావాలని అడిగితే బాగుండేదని ఆయన తెలిపారు. లేదా ఎంపీతో ఇప్పించాలని కోరినా సరిపోయేదన్నారు.

‘‘నన్ను కానీ, మా ఎంపీని కానీ ఎవరూ నిధులు అడగలేదు. తెలంగాణ ఎంపీ నిధులు ఇచ్చారని తెలియగానే, ఉప ముఖ్యమంత్రిని అడిగాం, పట్టించుకోలేదు, ఎంపీని అడిగాం, నిర్లక్ష్యం చేశారు. అందుకే తెలంగాణకు వెళ్లి నిధులు తెచ్చుకున్నారు అనే విధంగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇది బాధాకరం“ అని రాజన్నదొర చెప్పారు.

ఆంధ్రప్రదేశ్

ఎవరిచ్చినా తీసుకుంటాం: కమిటీ

రాజన్నదొర ఎమ్మెల్యేగా గతంలో శ్మశానం అభివృద్ధికి నిధులు ఇచ్చారని, అయితే ఇది ఒకసారితో అయిపోయే పని కాదని, ఎందరో నాయకులు, దాతలు, స్థానికులు నిధులు సమకూరుస్తుంటే దీనిని నిరంతరం అభివృద్ధి చేస్తున్నామని శ్మశానవాటిక కమిటీ సభ్యుడు నరసింగరావు బీబీసీతో చెప్పారు.

తాము నిధులు అడిగిన వారందరూ వారి వెసులుబాటును బట్టి సమకూరుస్తుంటారని ఆయన తెలిపారు.

“సాలూరు పట్టణంలో మొత్తం మూడు శ్మశానాలు ఉన్నాయి. దహన సంస్కారాలు చేసేది ఇది ఒక్కటే. ఇందులో దహనం చేసే స్టాండ్ ఖరీదే లక్షన్నర, దాని కోసం స్టాండ్ నిర్మించడం, దానికి పై కప్పు, ఈ ఖర్చులన్నీ కలిపి రెండున్నర లక్షల రూపాయలు అవుతాయి. ఇటువంటివి నాలుగు ఏర్పాటు చేసుకున్నాం. అలాగే, ఈ శ్మశానాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దాం. దాతల సహకారంతోనే ఇదంతా జరుగుతుంది” అని ఆయన వివరించారు.

“మేం ఫలానా పని కోసం నిధులు కావాలని అడగం, అభివృద్ధి కోసం నిరంతరం నిధులు సేకరిస్తూ ఉంటాం. ఎవరిస్తే వారు ఇచ్చిన దానికి తగిన పనులు చేయిస్తాం. డిప్యూటీ సీఎంను మేం నిధులు అడగలేదు. మళ్లీ అవసరమైతే తప్పకుండా అడుగుతాం. 2022లో డిప్యూటీ సీఎం రాజన్నదొర ఇచ్చిన నిధులతో శ్మశానానికి ఒక వైపు రోడ్డును నిర్మించాం. ఇప్పడు తెలంగాణ ఎంపీ నిధులతో మరో దహనవాటిక, కొన్ని విగ్రహాల నిర్మాణం, సుందరీకరణ పనులు చేస్తున్నాం’’ అని నరసింగరావు తెలిపారు.

‘‘సాలూరు వాసి తెలంగాణలో కలెక్టర్‌గా ఉంటే ఆయన సహకారంతో ఒక ఎంపీ నిధులు ఇచ్చారు. పార్టీలకు అతీతంగా గతంలో టీడీపీ వాళ్లు డబ్బులు ఇచ్చారు. శ్మశానం అభివృద్ధి కోసం ఫలానా వ్యక్తులు, ప్రాంతాల వారే ఇస్తేనే నిధులు తీసుకుంటామని మాకేమీ లేదు. ఎన్నారైలు కూడా కొందరు నిధులు ఇచ్చారు” అని చెప్పారు.

సాలూరు శ్మశానానికి తెలంగాణ ఎంపీ నిధులు ఇవ్వడంతో రేగిన వివాదంపై అభివృద్ధి కమిటీగా తాము మాట్లాడలేమని నరసింగరావు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

ఎంపీల్యాడ్స్: నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఏటా ఎంపీల్యాడ్స్ కింద ఒక్కో ఎంపీకి రూ. 5 కోట్లను ఇస్తారు. వీటిని రెండు దఫాలుగా ఒక్కో దఫా రూ. 2.5 కోట్ల చొప్పున విడుదల చేస్తారు.

ఎంపీల నిధులను ఆయా ఎంపీలు తాము ఎన్నికైన ప్రాంతం లేదా రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఖర్చు చేయవచ్చా అనేదానిపై బీఆర్‌ఎస్‌కు చెందిన తెలంగాణ రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్‌తో బీబీసీ మాట్లాడింది.

ఎంపీల్యాడ్స్ (మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ స్కీమ్) నిధులను లోక్‌‌సభ సభ్యులైతే తమ నియోజకవర్గాల పరిధిలోని పనులకు కేటాయించాల్సి ఉంటుంది.

రాజ్యసభ సభ్యులైతే తాము ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల పరిధిలోనే కాకుండా దేశంలో ఎక్కడైనా అభివృద్ధి పనుల కోసం నిధులను కేటాయించవచ్చని లింగయ్య యాదవ్ చెప్పారు.

జాతీయ ఐక్యత, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించడానికి వారి నియోజకవర్గం లేదా తాము ప్రాతినిధ్య వహిస్తున్న రాష్ట్రం కాకుండా మరో రాష్ట్రంలో కూడా ఏటా రూ. 25 లక్షల వరకు ఖర్చు చేయవచ్చని ఆయన తెలిపారు.

నామినేటెడ్ సభ్యులైతే దేశంలో ఎక్కడైనా అభివృద్ధి పనులకు ఈ నిధులను సిఫార్సు చేయొచ్చు.

అయితే, ఒక ఏడాదిలో కనీసం 15 శాతం నిధులను ఎస్సీ జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, 7.5 శాతం నిధులను ఎస్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. ఎంపీలు తమ నియోజకవర్గం అవతలి ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలి అనుకుంటే ఇక్కడ ఒక నిబంధన ఉంది. దీని కోసం ఒక ఏడాదిలో రూ. 25 లక్షలకు మించి వెచ్చించకూడదు.

ఆంధ్రప్రదేశ్

ఎన్నికల్లో లబ్ధి కోసమే రాద్ధాంతం: రాజన్నదొర

''ఇలాంటి విషయాల్లోనే స్థానిక సమస్యలపై, స్థానిక నాయకులు ఎంత చిత్తశుద్ధి చూపిస్తున్నారో తెలుస్తుంది, స్థానిక నాయకత్వం నుంచి సరైన స్పందన లేనప్పుడో, రాదని భావించినప్పుడో సమస్య మరొకరి దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తుంది. సాలూరు శ్మశానం విషయంలో అదే జరిగి ఉంటుందని నా అభిప్రాయం'' అని రాజకీయ విశ్లేషకుడు యుగంధర్ రెడ్డి అన్నారు.

శ్మశానం పనులకు రూ. 5 లక్షలు లేదా రూ. 10 లక్షలు కూడా ఇక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు, లేదా ప్రభుత్వ నిధులను కేటాయించలేరా అని టీడీపీ సీనియర్ నేత పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు.

‘‘పక్క రాష్ట్రం ఎమ్మెల్యేలు, ఎంపీల నిధులతో మనం పనులు చేసుకుని చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు? వైసీపీ ప్రభుత్వానికి, అందులోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇలాంటి విషయాలు పట్టవా’’ అని ఆయన అడిగారు.

ఈ విమర్శలను రాజన్నదొర తోసిపుచ్చారు.

“నిధులు కావాలంటే మా దగ్గర ఎంపీలు ఉన్నారు. అడిగితే వాళ్లు ఇస్తారు. కానీ, రాజకీయం చేయడం, దాని ద్వారా రాబోతున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలనే శ్మశానం నిధుల విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. ఇది అవసరమని నా దృష్టికి తెస్తే ఏ సమస్యకైనా పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తాను. కాకపోతే శ్మశానం విషయంలో అనవసర రాద్ధాంతం'' అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)