పారిస్: మోనాలిసా పెయింటింగ్‌పై సూప్ చల్లిన ఆందోళన కారులు, అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
పారిస్‌లో ప్రపంచ ప్రఖ్యాత మోనాలిసా పెయింటింగ్‌పై ఇద్దరు ఆందోళనకారులు సూప్ చల్లారు.
ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డా విన్సీ 16వ శతాబ్దంలో వేసిన ఈ పెయింటింగ్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కళాఖండాలలో ఒకటిగా పేరు తెచ్చుకుంది.
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలో ఈ పెయింటింగ్ ఉంది.
అయితే, ఈ పెయింటింగ్ మీద బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉండటంతో ఇది పాడైపోయే అవకాశం లేదు.
ఫ్రెంచ్ భాషలో "రిపోస్ట్ అలిమెంటైర్"( ఇంగ్లీష్‌లో ఫుడ్ కౌంటర్ అటాక్) అని అర్ధం వచ్చే నినాదాలున్న టీ షర్టులు వేసుకున్న ఇద్దరు యువతులు ఈ దాడికి పాల్పడ్డారు.
ఈ యువతులు ఇద్దరూ మోనాలిసా చిత్రం ముందు నిలబడి నినాదాలు చేశారు. ‘‘మన వ్యవసాయం దారుణంగా తయారైంది. మన రైతులు చనిపోతున్నారు. మనకు కళలు కావాలా, రైతులు కావాలా’’ అంటూ నినాదాలు చేశారు.
ఆందోళనకారులు పెయింటింగ్‌పై సూప్ పోయగానే సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని, పెయింటింగ్ ముందు నల్లని స్క్రీన్‌లు అడ్డంగా పెట్టారు. తర్వాత అక్కడున్న వారందరినీ బయటకు పంపించారు.
ఈ ఘటనకు తమదే బాధ్యతని రిపోస్ట్ అలిమెంటైర్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించుకుంది.
‘ఆహార భద్రతను సాధించే దిశగా మేం చేసిన ప్రయత్నం’ అని ఆ సంస్థ తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ షేర్ చేసింది.
ఫ్రాన్స్ రాజధానిలో గత కొద్ది రోజులుగా రైతులు నిరసనలు జరుపుతున్నారు.
పెరుగుతున్న ఇంధన ధరలకు కళ్లెం వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మార్కెట్ నిబంధనలను సరళీకృతం చేయాలని కూడా వారు కోరుతున్నారు.
శుక్రవారం వారు పారిస్‌లోపల, వెలుపలా భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగి నగరాన్ని దిగ్బంధించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మోనాలిసా పెయింటింగ్‌కు బుల్లెట్ ప్రూఫ్ ఎందుకు?
మోనాలిసా పెయింటింగ్‌పై 1950ల నుంచి సేఫ్టీ గ్లాస్ అమర్చి ఉంచారు. అప్పట్లో ఓ వ్యక్తి ఆ పెయింటింగ్‌పై యాసిడ్ చల్లాడు. దీంతో పెయింటింగ్ కొంత దెబ్బతింది.
2019లో మ్యూజియం నిర్వాహకులు దానికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అమర్చారు. 2022లో ఒక ఆందోళనకారుడు పెయింటింగ్‌పై కేక్ విసిరాడు.
1911లో ఈ పెయింటింగ్ లౌవ్రే మ్యూజియం నుంచి చోరీకి గురైంది. మ్యూజియం ఉద్యోగి ఒకరు ఈ పెయింటింగ్‌ను దొంగిలించడానికి రాత్రి పూట మ్యూజియంలో దాక్కున్నారు.
దొంగిలించిన రెండేళ్ల తర్వాత దీనిని ఇటలీలోని ఫ్లారెన్స్‌లో ఓ పురాతన వస్తువుల వ్యాపారికి అమ్ముతుండగా పట్టుకున్నారు.








