నితీశ్‌ను చేర్చుకోవడంలో ఎన్డీయే తెర వెనక వ్యూహమేంటి, ‘ఇండియా’ కూటమిపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నళిన్ వర్మ
- హోదా, ప్రముఖ పాత్రికేయుడు
నితీశ్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిని వదిలేసి భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌లో చేరారు.
ఆయన నిర్ణయంతో ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ అలయన్స్( INDIA) కూటమికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
ఇండియా కూటమి రూపకర్త నితీశ్ కుమారేనని ఆయనతో పాటు ఆయన పార్టీ నేతలు కూడా గతంలో చెప్పారు.
అప్పట్లో ఆయన దిల్లీలో కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ, యూపీలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను కలిశారు. మోదీకి వ్యతిరేకంగా పోరాటంలో అందరూ కాంగ్రెస్‌తో కలిసి రావాలని కోరారు.

ఫొటో సోర్స్, JPNADD/X
సమయానుకూలంగా కూటమి మారుతున్నారా?
రాహుల్ గాంధీ యాత్ర బిహార్‌లో అడుగు పెట్టే సమయంలోనే నితీశ్ బీజేపీతో చేతులు కలిపితే మరింత మైలేజ్ దక్కుతుందనే ఆలోచనతోనే బీజేపీ వ్యూహకర్తలు బహుశా ఈ మహూర్తాన్ని నిర్ణయించి ఉండవచ్చు.
సీట్ల పంపకంలో వివిధ రాష్ట్రాల్లో భాగస్వామ్య పక్షాలతో ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్‌కు తాజా పరిణామం మరి కొంత ఇబ్బందికరంగా మారింది. ఇది సైకలాజికల్‌గా బీజేపీకి కొంత పై చేయి సాధించే అవకాశాన్ని అందించింది.
అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన తర్వాత నరేంద్రమోదీ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఉత్తరాది రాష్ట్రాలలో సానుకూల వాతావరణం ఏర్పడిందని బీజేపీ అంచనా వేస్తోంది.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కీలక రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌లలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో హిందీ బెల్ట్‌లో బీజేపీ బలంగా ఉందని తేలింది.
2022లో నితీశ్ కుమార్ మహా కూటమిలో చేరడంతో బీజేపీ ఆత్మరక్షణలో పడింది.
బిహార్ అసెంబ్లీలో 79 సీట్లతో రాష్ట్రీయ జనతాదళ్ అది పెద్ద పార్టీగా ఉంది. హిందూత్వ వ్యతిరేక రాజకీయాలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం పోరాడిన నేతగా ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు గుర్తింపు ఉంది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని కూటమి రాష్ట్రంలోని 40 లోక్‌సభ సీట్లలో 39 సీట్లు గెలుచుకుంది.
నితీశ్ కుమార్ మహా కూటమిలో ఉంటే 2019లో మాదిరిగా మెజార్టీ లోక్‌సభ సీట్లు గెలుచుకోవడం సాధ్యం కాకపోవచ్చని బీజేపీ వ్యూహాకర్తలు భావించారు.

ఫొటో సోర్స్, BJP4BIHAR/X
బిహార్‌లో బీజేపీ బలం ఎలా ఉండవచ్చు?
బిహార్‌లో బీజేపీ 2019 నాటి ఫలితాలను పునరావృతం చేయగలుగుతుందా?. నితీశ్ కుమార్ చేరికతో తమ అవకాశాలు మెరుగు పడతాయని బీజేపీ వ్యూహాకర్తలు ఆశతో ఉన్నారు.
దీనికి సమాధానం తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ వేచి చూడాలి. 2014లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ ఒంటరిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో 15 శాతం ఓట్లు రెండు సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత ఆ పార్టీ మహా కూటమితో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. అసెంబ్లీలో మహా కూటమి 178 సీట్లు, బీజేపీ 53 సీట్లు గెలుచుకున్నాయి.
నితీశ్ కుమార్ 2017లో మహా కూటమిని వదిలేసి ఎన్డీయేలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ కలిసి పోటీ చేశాయి. జేడీయూ 17 సీట్లలో పోటీ చేసి 16 గెలిస్తే, బీజేపీ మొత్తం 17 స్థానాల్లో విజయం సాధించింది.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ సీట్ల సంఖ్య భారీగా పడిపోయింది. ఆ పార్టీకి 42 సీట్లు మాత్రమే దక్కాయి. బీజేపీ 76 స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికలకు ముందు ఫలితాలు వచ్చిన తర్వాత నితీశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.
అయితే ఎన్నికల్లో నితీశ్ ప్రతిష్ట మసకబారుతోందని గుర్తించింది. లోక్ జనశక్తి పార్టీని కూటమి తరపున కాకుండా వేరుగా పోటీ చేయించడం ద్వారా తమ పార్టీ విజయావకాశాలను బీజేపీ దెబ్బ తీసిందని జేడీయూ నేతలు ఆరోపించారు.
లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థులు 36 స్థానాల్లో జేడీయూ అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బ తీశారని ఆ పార్టీ నేతలు గణాంకాలను బయట పెట్టారు.
బీజేపీతో జత కట్టినప్పటికీ హిందూత్వ రాజకీయాలకు దూరంగా ఉండటం, ఆయనపై అవినీతి ఆరోపణలు లేకపోవడం, అభివృద్ధికి పెద్ద పీట వేయడం లాంటి అంశాలు నితీశ్ కుమార్‌కు పాలకుడిగా మంచి గుర్తింపు తెచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
నితీశ్ నిర్ణయం 2024 లోక్‌సభ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?
ఎన్నికలకు ముందు, తర్వాత కూటముల్ని మారుస్తూ నితీశ్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల సిద్ధాంతాల పట్ల ఆయనకున్న నిబద్ధత ప్రశ్నార్థకంగా మారింది. ఇండియా కూటమి నుంచి దాని పైలట్‌ను తమ వైపు తిప్పుకోవడం ద్వారా ప్రత్యర్థి కూటమిని గట్టి దెబ్బ కొట్టామని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు.
నితీశ్ బీజేపీలో చేతులు కలపడం బిహార్ బయట పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.
ఆరుసార్లు, ఎంపీగా గెలిచినా, దీర్ఘకాలం కేంద్రమంత్రిగా పని చేసినా, నితీశ్ కుమార్ జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగలేకపోయారు. బిహార్ బయట ఆయన ప్రభావం అంతగా లేదు.
ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్‌కు నితీశ్ కుమార్ అవసరం ఉంది. అయితే పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీకి, మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ పార్టీకి నితీశ్ కుమార్‌తో అవసరం లేదు.
బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో ఏర్పడిన మహా కూటమి ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టింది. దీని ఆధారంగా వెనుకబడిన వర్గాలు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్‌ను 65 శాతానికి పెంచారు. లక్ష ఉద్యోగాల కల్పనకు హామీ ఇచ్చారు.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ పది లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు.
మహా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో కులగణన చేపట్టాలని, వెనుకబడిన వర్గాలకు వారి సంఖ్యను బట్టి ఉపాధికల్పనలో వాటా పెంచాలని ఆర్జేడీ ఒత్తిడి తెస్తోంది.
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ శాతాన్ని పెంచడం, లక్ష ఉద్యోగాల కల్పన నిర్ణయాల వల్ల వచ్చే లాభం ఆర్జేడీ ఖాతాలో పడనుంది.
ఆర్దికంగా వెనుకబడిన వర్గాలు, ఇతర వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీల విషయాన్ని పక్కన పెడితే మైనార్టీలకు రిజర్వేషన్ పెంచాలన్న నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది.
నితీశ్ బీజేపీతో చేతులు కలిపినా సీపీఐ- ఎంఎల్ ఇప్పటికీ ఆర్జేడీతోనే ఉంది. ఈ పార్టీకి రాష్ట్రంలోని పేదల్లో పట్టుంది. నితీశ్ కుమార్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ పనితీరుపై సానుకూల స్పందన ఉంది. యువతలోనూ ఆయన పలుకుబడి పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
నితీశ్ కుమార్ తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు?
మాజీ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ తరపున పని చేశారు.
“2022లో నితీశ్ కుమార్ మహా కూటమిలో ఎందుకు చేరుతున్నారంటే 45 మంది ఎమ్మెల్యేలున్న ఆయన పార్టీని బీజేపీ చీలుస్తుందేమోనని, తనను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేస్తుందేమోనని ఆయన ఆందోళన చెందారు. అందుకే మహా కూటమితో జట్టు కట్టారు” అని నితీశ్ కుమార్ కూటమి మారడంపై ప్రశాంత్ కిషోర్ వివరణ ఇచ్చారు.
“ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునేందుకే నితీశ్ కుమార్ మహా కూటమిలో చేరారు. ముఖ్యమంత్రిగా కొనసాగేందుకే ఆయన ఇప్పుడు బీజేపీతో జత కలిశారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆయన ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. బహుశా నితీశ్ కుమార్‌కు కూడా తెలియదు. సమయాన్ని బట్టి ఆయనకు ఏది సరైనది అనిపిస్తే అదే ఆయన చేస్తారు”.
నితీశ్ కుమార్ బీజేపీతో జట్టు కట్టడానికి కాంగ్రెస్ పార్టీనే కారణం అని జేడీయూ విమర్శిస్తోంది.
“ఇండియా కూటమిని ఏర్పాటు చేసేందుకు మా నాయకుడు చాలా శ్రమించారు. మమతాబెనర్జీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన కూటమిలోకి తీసుకొచ్చారు. అయితే కాంగ్రెస్ మాత్రం అహంకారంతో వ్యవహరించింది.” అని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి చెప్పారు.
“పార్టీ ప్రాంతీయ పార్టీలకు గట్టి పట్టున్న చోట కాంగ్రెస్ పార్టీ వాటిని ఎదగనివ్వదు. తనకు బలం లేని చోట ఎదగాలని ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్ మంకు పట్టు వల్లనే నితీశ్ కుమార్ ఇండియా కూటమిని వదిలేశారు.” అని ఆయన అన్నారు.
ఇండియా కూటమి సమన్వయకర్త, ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారా అన్న ప్రశ్నను నితీశ్ కుమార్ మొదటి నుంచి తిరస్కరిస్తూ వస్తున్నారు. ఆయనను కూటమి సమన్వయ కర్త లేదాప్రధానమంత్రి అభ్యర్థిగా కూటమిలోని ప్రకటిస్తే బావుండేది అని జేడీయూ నేతలు చెబుతున్నారు.
ముంబయిలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను ప్రధానమంత్రి అభ్యర్థిగా, నితీశ్ కుమార్‌ను కన్వీనర్‌గా ప్రకటించాలని అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ ప్రతిపాదించారనే చర్చ జరిగింది.
తాజాగా ఆన్‌లైన్‌లో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నితీశ్ కుమార్‌ను సమన్వయకర్తగా ప్రతిపాదించారు.
ఈ ప్రతిపాదనను కాంగ్రెస్, ఆర్జేడీతో పాటు ఇతర పార్టీలు కూడా బలపరిచాయి. అయితే ఈ బాధ్యతలు స్వీకరించేందుకు నితీశ్ కుమార్ తిరస్కరించారు. మమతా బెనర్జీ ఈ సమావేశానికి హాజరు కాలేదు.
ఇండియా కూటమిలోకి అనేక పార్టీలను తీసుకొచ్చిన తర్వాత కూడా కూటమి సమన్వయ కర్తగా మిగతా పార్టీల నమ్మకాన్ని చూరగొనడంలో నితీశ్ కుమార్ విఫలమయ్యారు. బహుశా తరచూ కూటములను మార్చడం వల్ల ఆయనపై కూటమిలోని పార్టీలకు నమ్మకం కోల్పోయి ఉండవచ్చు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు పొత్తుధర్మం పాటించలేదన్న పవన్ కల్యాణ్... టీడీపీ, జనసేనల మధ్య ఏం జరుగుతోంది?
- రిపబ్లిక్ డే - ఫోటో ఫీచర్: పరేడ్‌ను తొలిసారిగా ముందుండి నడిపించిన మహిళలు
- హరిద్వార్: క్యాన్సర్ బాధిత చిన్నారిని తల్లి గంగా నదిలో ముంచి చంపేశారంటూ వీడియో వైరల్, అసలేం జరిగింది?
- క్యాష్‌లెస్ ఎవ్రీవేర్: హెల్త్ ఇన్సూరెన్స్‌తో ఇకపై నెట్వర్క్ హాస్పిటల్స్‌లోనే కాదు, దేశంలో ఎక్కడైనా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్... 48 గంటల నిబంధన గుర్తుంచుకోండి
- భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీలో ఎవరెవరు ఉన్నారు? తొలి డ్రాఫ్ట్ రాసింది ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














