బిహార్ ఎన్నికలు: తేజస్వి యాదవ్ హఠాత్తుగా నితీశ్‌కుమార్‌ని ఎలా మించిపోయారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజనీష్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
లాక్‌డౌన్ ముందు ప్రతి రోజూ ఏడు కిలోల ఆలూ సమోసాలు అమ్ముతూ వచ్చిన రమేష్ యాదవ్ బాగానే సంపాదించేవారు. ఇప్పుడు లాక్‌డౌన్ ఎత్తేసి నెలలు గడుస్తున్నా.. అతడి షాపులో ఇంతకు ముదులా అమ్మకాలు జరగడం లేదు.
ఇప్పుడు కష్టంగా రెండు కిలోల సమోసాలు అమ్మగలుగుతున్నాడు. అయినా మిగిలిపోతున్నాయి. జనం దగ్గర డబ్బే లేకపోతే సమోసాలు ఎక్కడ అమ్ముడవుతాయని రమేష్ అంటున్నాడు.
లాలూ రాజకీయాల్లో పీక్స్ లో ఉన్నప్పుడు, "జబ్ తక్ రహేగా సమోసేమే ఆలూ, తబ్ తక్ రహేగా బిహార్‌మే లాలూ" (సమోసాలో ఆలూ ఉన్నంతవరకూ, బిహార్‌లో లాలూ ఉంటాడు) అనే ఒక మాట చెప్పుకునేవారు.
ఇప్పుడు లాలూ జైల్లో ఉంటే, సమోసాలు అమ్మేవారు దీనస్థితిలో ఉన్నారు.
లాక్‌డౌన్ వల్ల తన షాపు మూతపడిందని, నితీష్ కుమార్ ప్రభుత్వం ఏ సాయం చేయలేదని రమేష్ చెబుతున్నాడు. ఈసారీ బిహార్‌లో కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుటున్నాడు.
రాఘోపూర్‌ల యాదవ ఓటర్లు ఎక్కువ. బీజేపీ కూడా ఇక్కడ తేజస్వి యాదవ్‌కు పోటీగా సతీశ్ రాయ్‌ను బరిలో దింపింది. ఆయన 2010లో రబడీ దేవిని ఓడించారు. కానీ 2015లో తేజస్వి చేతిలో ఓడిపోయారు.
రాఘోపూర్‌లో యాదవ ఓటర్లు దాదాపు లక్షా 25 వేల మంది ఉంటారు. ఆ తర్వాత స్థానంలో రాజపుత్ ఓటర్ల 40 వేల మంది వరకూ ఉన్నారు.
తేజస్వి యాదవ్‌కు ఈసారీ సతీశ్ రాయ్ నుంచి గట్టి పోటీ ఉండేదని, కానీ చిరాగ్ పాశ్వాన్ తన అభ్యర్థిని రంగంలోకి దింపి ఆయనకు విజయ సులభం చేశారని హాజీపూర్ ప్రభాత్ ఖబర్ బ్యూరో చీఫ్ సునీల్ కుమార్ సింగ్ చెప్పారు.
అయితే ఎల్జేపీ ప్రతినిధి అష్రఫ్ అన్సారీ దానికి అంగీకరించడం లేదు.ఎల్జేపీ అభ్యర్థి రాకేష్ రోషన్ తమ పార్టీ ఐటీ టీమ్ హెడ్ అని, ఆయన తప్పకుండా ఈ ఎన్నికల్లో గెలుస్తారని చెబుతున్నారు.
ఇక్కడ తేజస్వి యాదవ్ గెలిస్తే, అది ఆయన రెండో విజయం అవుతుంది. ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ 1995. 2000లో, తేజస్వి తల్లి రబడీ దేవి 2005లో ఇక్కడ నుంచి గెలిచారు. విజయం సాధించారు.

ఫొటో సోర్స్, Getty Images
లాలూ వర్సెస్ తేజస్వి రాజకీయాలు
లాలూ యాదవ్ 1977లో 29 ఏళ్ల వయసులో చఫ్రా నుంచి ఎంపీగా ఎన్నికైతే, ఆయన చిన్న కొడుకు తేజస్వి యాదవ్ 2015లో రాఘోపూర్ నుంచి 26 ఏళ్లేకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తర్వాత ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యాడు.
లాలూ యాదవ్ కాలేజీ రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చారు. 1973లో పట్నా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు అయ్యాడు. ఆ తర్వాత ఆయన బిహార్ రాజకీయలకు దూరం కాలేదు.
కానీ, క్రికెట్ మోజుతో తొమ్మిదో తరగతిలోనే చదువు అటకెక్కించిన తేజస్వి యాదవ్.. విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు.
ఇప్పుడు తేజస్వి వయసు 31 ఏళ్లు. ఈసారి ఆయన ఏకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నారు. కానీ ఫలితాలలో పెద్ద పార్టీ హోదాతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
1997లో లాలూ దాణా కుంభకోణంలో చిక్కుకుని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినపుడు ఆయన తన సీఎం సీట్లో భార్య రబడీ దేవిని కూర్చోపెట్టారు.
2013లో మరోసారి లాలూకు అదే పరిస్థితి వచ్చింది. ఈసారీ ఆయన తన కొడుకు తేజస్వి యాదవ్‌ను ముందుకు తీసుకొచ్చారు. తేజస్వి రాజకీయాలకు కొత్తయినా, లాలూ దగ్గరుండి తన కుటుంబం అధికారంలో ఉండేలా చేశారు.
పార్టీలో అనుభవజ్ఞులైన ఎంతోమంది నేతలు ఉన్నప్పటికీ ఆయన వారిని ముందుకు తీసుకురాలేదు.
2014లో సార్వత్రిక ఎన్నికలు జరిగినపుడు ఆర్జేడీ కేవలం 4 స్థానాలకే పరిమితమైంది. రబడీ దేవి, లాలూ పెద్ద కూతురు మీసా భారతి కూడా ఓటమి పాలయ్యారు.
తర్వాత 2015 అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ తన ఇద్దరు కుమారులనూ బరిలో దించారు.
తేజస్వి లాలూ యాదవ్ పోటీ చేసే రాఘోపూర్ నుంచి పోటీ చేస్తే, పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ మహువా స్థానం నుంచి బరిలోకి దిగారు.
ఆ ఎన్నికల్లో లాలూ కుమారులు ఇద్దరూ గెలిచారు. 2015లో లాలూ, నితీశ్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. ఘన విజయం అందుకున్నారు.
అయితే, 2015 ఎన్నికల్లో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. తేజస్వికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. 16 నెలల తర్వాత నితీశ్ మళ్లీ బీజేపీతో జట్టు కట్టారు.

ఫొటో సోర్స్, BIHARPICTURES.COM
తేజస్వి రాజకీయాలు మారాయి
తేజస్వి అసలు సిసలు రాజకీయాలు 2017లో మొదలయ్యాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ప్రజాతీర్పును నితీశ్ అవమానించారని ఆయన ఆరోపించారు.
కానీ, తన తండ్రి రాజకీయ నీడ నుంచి బయటపడడానికి తేజస్వి యాదవ్‌కు అవకాశం దొరికింది. అదే సమయంలో 2019 సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. దాంతో తేజస్వి మొత్తం ప్రచార భారాన్ని మోశారు. తన పార్టీ స్టార్ కాంపెయినర్ అయ్యారు.
2019లో ఎన్నో ర్యాలీలు చేశారు. ప్రధాన మంత్రి మోదీపై, ఉపాధి, నోట్లరద్దు గురించి జోరుగా విమర్శలు చేశారు.
కానీ 2019లో బెగుసరాయ్‌లో తేజస్వి పాల్గొన్న ఒక బహిరంగ సభకు జనం ఎక్కువగా హెలికాప్టర్ చూడ్డానికే వచ్చారు.
ఆ సభకు వచ్చినవారి కంటే, తేజస్వి వచ్చిన హెలికాప్టర్ చుట్టూ జనాలు ఎక్కువ గుమిగూడారు. ఆ ఎన్నికల్లో ఆర్జేడీకి ఒక్క సీటు కూడా లభించలేదు.
ఇప్పుడు. 2020లో తేజస్వి యాదవ్ రాజకీయాలను, తన ప్రచారం, ప్రసంగించే శైలిని పూర్తిగా మార్చుకున్నారు. ఆయన సభలకు జనాలు కూడా భారీగా తరలివచ్చారు.
ఇప్పుడు జనం ఆయన్ను జోరుగా స్వాగతిస్తున్నారు. తేజస్వి ఇప్పుడు ఉపాధి, విద్య, రహదారులు, ఆరోగ్యం గురించి విమర్శలు సంధిస్తున్నారు.
లాక్‌డౌన్ సమయంలో బిహారీలకు జరిగిన భారీ నష్టాన్ని తేజస్వి ఈ ఎన్నికల్లో తన ప్రచారాంశంగా మార్చుకున్నారు. తమ ప్రభుత్వం ఏర్పడితే బిహార్‌లో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. ఏడాదిలోనే తేజస్విలో ఇంత మార్పు ఎలా వచ్చింది?
సమాధానంగా కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌తో బిహార్ రాజకీయాలు మారిపోయాయని పట్నాలోని సిన్హా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ డీఎం దివాకర్ చెప్పారు.
"ఆ సమయంలోబిహారీలు చాలా సమస్యలు ఎదుర్కున్నారు. బిహార్ ప్రభుత్వం వారికి ఏ విధమైన సాయం చేయలేకపోయింది. లక్షల మంది వలస కార్మికులు తిరిగి తమ స్వగ్రామాలకు వచ్చారు. అప్పుడు జాతి, మతాల కంటే కడుపు నిండా తిండి ముఖ్యం అనిపించింది. దాంతో తేజస్వి టీమ్ దానినే తమ ఎన్నికల ఎజెండాగా మార్చుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామనే హామీ కూడా బిహారీలను ఆకట్టుకుంది" అన్నారు.
కరోనా ఈసారీ నితీశ్ ప్రభుత్వాన్ని కూల్చవచ్చని దివాకర్ చెప్పారు.

ఫొటో సోర్స్, FB @TEJASHWIYADAV
లాలూ యాదవ్ ఫొటో ఉపయోగించలేదు
తేజస్వి యాదవ్ చాలా ర్యాలీలకు వెళ్లానని, ఆయన సభలకు జనం భారీగా వస్తున్నారని, ఆయన ప్రసంగం ఇంతకు ముందుతో పోలిస్తే పూర్తిగా బిన్నంగా ఉందని గత ఒక నెలగా బిహార్‌లో ఎన్నికల కవరేజీలో ఉన్న ఏబీపీ న్యూస్ రిపోర్టర్ జైనేంద్ర కుమార్ చెప్పారు.
తేజస్వి యాదవ్ సభలకు నితీశ్ కుమార్ సభలకంటే ఎక్కువగా జనం వస్తున్నారని, కానీ ఆ సభల్లో మహిళల సంఖ్య మాత్రం దాదాపు లేనట్టే ఉందని చెప్పారు.
తాజా ఎన్నికల ప్రచారంలో తేజస్వి యాదవ్ ఎక్కడా తన తండ్రి లాలూ యాదవ్ ఫొటోను ఉపయోగించలేదు. దానిపై ప్రశ్నించిన వారికి మహా కూటమి అభ్యర్థి తానేనని, అందుకే ప్రచారంలో తన ఫొటోనే ఉంటుందని తేజస్వి చెప్పారు.
దీని గురించి ఒక ఆర్జేడీ నేతను అడిగినప్పుడు పేరు బయటపెట్టదని కోరిన ఆయన "రాష్ట్రంలో చాలా మందిలో లాలూ ఇమేజ్ సరిగా లేదు. తేజస్వి లాలూ యాదవ్ కొడుకు అయినా ఈ ఎన్నికల్లో ఆయనను కేవలం బిహార్ యువ నేతగా ముందుకు తీసుకొచ్చారు" అన్నారు.
బిహార్ దావూద్ నగర్‌కు చెందిన పీహెచ్‌డీ విద్యార్థి అనీష్ ఉత్పల్ లాంటి వారు బిహార్ ఎన్నికల సమయంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలను కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
"యాదవ ఓటర్లు అందరూ తేజస్వి విషయంలో ఒక్కటయ్యారు. కానీ యాదవేతరులు, ఓబీసీలు నితీష్ మీద కోపంగా ఉన్నా తేజస్వి వైపు నిలవలేక గందరగోళ స్థితిలో ఉన్నారు. కొన్ని సమాజాలు యాదవులను తమ ప్రత్యర్థులుగా భావిస్తాయి. ఉద్యోగాలు, ఉపాధి అంశం కచ్చితంగా హిట్ అయ్యింది. కానీ అగ్రవర్ణాలు, యాదవేతరులు, ఓబీసీలు లాలూ పాలనను మర్చిపోలేకపోతున్నారు" అన్నారు.
నితీశ్ కుమార్‌కు ఈ ఎన్నికలు కరోనాను ఎదుర్కోవడ కంటే కష్టంగా మారిందని అనీష్ చెబుతున్నారు. కానీ తేజస్వికి కూడా ఈ ఎన్నికలు ఏకపక్షంగా లేవంటున్నారు.
ఎన్నికల ఫలితాల్లో ఆర్‌జేడీ 75 సీట్లతో అతి పెద్ద పార్టీగా నిలిచింది. అధికార ఎన్‌డీఏ కూటమి గెలిచినా.. నితీశ్ సారథ్యంలోని జేడీయూ కేవలం 43 సీట్లకే పరిమితమైంది.
ఇవి కూడా చదవండి:
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- 'విమానం ల్యాండయ్యాక మళ్లీ గాల్లోకి లేచినట్లనిపించింది... అందరూ వణికిపోయారు'
- 'కరోనావైరస్ తొలి వ్యాక్సీన్ మేం తయారు చేశాం... నా బిడ్డకు కూడా టీకా ఇచ్చాం' - రష్యా అధ్యక్షుడు పుతిన్
- ‘‘దేశ ప్రజలకు ప్రత్యక్ష నగదు సహాయం చేయాలి’’: మన్మోహన్ మూడు సలహాలు
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- శ్రీరాముడిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు అసోం ప్రొఫెసర్‌పై కేసు
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- ’గాంధీ కళ్లద్దాల విలువ చెప్పినప్పుడు.. వాటి యజమానికి గుండె ఆగినంత పనైంది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








