బిహార్ ఎన్నికలు: అయిదు భ్రమలు... అసలు సిసలు వాస్తవాలు

బిహార్ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సంజయ్ కుమార్
    • హోదా, సీఎస్‌డీఎస్ డైరెక్టర్

బిహార్‌లో ఎన్నికలు జరిగే సమయంలో కొన్ని అంచనాలపై ప్రజలు చర్చించుకుంటారు.

ఇవి నిజమో కాదో తెలియకపోయినా.. ప్రజలు మాత్రం వీటిని నిజమనే నమ్ముతారు. అలాంటి ఐదు భ్రమలను ఇప్పుడు చూద్దాం.

భ్రమ 1: నీతీశ్ కుమార్‌కు మహిళలు భారీగా ఓట్లు వేస్తారా?

ఈ విషయాన్ని చాలా మంది నమ్ముతారు. నీతీశ్ కుమార్‌కు భారీ స్థాయిలో మహిళలు ఓట్లు వేస్తారని అంటుంటారు. కానీ ఇది వట్టి భ్రమ అంటూ లోక్‌నీతీ-సీఎస్‌డీఎస్ చేపట్టిన సర్వేలో తేలింది. మహిళలు కూడా ఇక్కడి పురుష ఓటర్లలానే ఒక్కో పార్టీకి కొందరు చొప్పున ఓటు వేస్తారని వెల్లడైంది. ఇది ఏదో ఒక ఎన్నిక ఆధారంగా చెప్పిన అంచనాలు కాదు. గత రెండు దశాబ్దాల్లో బిహార్‌లో జరిగిన అన్ని ఎన్నికలను పరిగణలోకి తీసుకుని ఈ అంచనాలు వేశారు. నీతీశ్ కుమార్ ఎన్‌డీఏలో ఉన్నా లేదా ఆర్జేడీతో చేతులు కలిపినా ఇలానే జరుగుతోంది. 2010 ఎన్నికల్లో నీతీశ్ పార్టీ జేడీయూ, బీజేపీ ఘన విజయం సాధించాయి. 39.1 శాతం ఓట్లు వీరికే దక్కాయి. భారీ స్థాయిలో మహిళలు ఓట్లు వేయడం వల్లే ఆయనకు ఇంత శాతం ఓట్లు పడ్డాయని వార్తలు వచ్చాయి. అయితే లోక్‌నీతీ-సీఎస్‌డీఎస్ సర్వేలో భిన్నమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2010లో ఎన్‌డీఏకు కేవలం 39 శాతం మహిళా ఓట్లు మాత్రమే పడినట్లు తేలింది. అంటే ఇది వారికి మొత్తంగా వచ్చిన ఓట్ల శాతంతో సమానం.

మరోవైపు 2015 అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీతో నీతీశ్ చేతులు కలిపారు. వీరికి 41.8 శాతం ఓట్లు వచ్చాయి. అప్పుడు కూడా నీతీశ్, లాలూకు కలిపి 42 శాతం మహిళల ఓట్లే వచ్చాయి. అయినప్పటికీ మహిళా ఓటర్లు ఎక్కువగా నీతీశ్‌కే మొగ్గు చూపుతారనే వార్తలు వస్తూనే ఉంటాయి.

బిహార్‌లో నీతీశ్ కుమార్ చాలా ప్రజాప్రయోజన పథకాలను ప్రవేశపెట్టారని, అందుకే ఆయనకు ఎక్కువ మంది మహిళలు ఓటు వేస్తారని అంటుంటారు. ఇది కొంతవరకు నిజమే. నీతీశ్ ప్రవేశపెట్టిన పథకాలపై మహిళలు ప్రశంసలు కురిపిస్తారు. కానీ వారి ఓట్లు మాత్రం నీతీశ్ వైపు రావు. ప్రజల ఓట్లను ప్రభావితం చేయడంలో పథకాల పాత్ర చాలా తక్కువ.

మరోవైపు మహిళల ఓట్లలో ఎలాంటి మార్పూ ఉండదనీ చెప్పలేం. క్రమంగా మహిళా ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. నిజానికి ఓటింగ్‌లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది పాలుపంచుకుంటున్నారు. 2015లో పురుషులతో పోలిస్తే మహిళల ఓటింగ్ 7 శాతం ఎక్కువగా ఉంది. 2010లో తొలిసారిగా పురుషుల శాతాన్ని(3 శాతంతో) మహిళలు అధిగమించారు. అప్పటికి ఏ రాష్ట్రంలోనూ ఓటింగ్‌లో ఇలా పురుషులపై మహిళలు పైచేయి సాధించలేదు.

మరోవైపు ఆర్థిక, సామాజిక, విద్యాపరమైన ముందడుగుతో ఎన్నికల్లో భాగస్వామ్యం పెరుగుతుందని వాదన ఉంది. ఇది కూడా భ్రమే. ఎందుకంటే కేరళతో పోలిస్తే.. ఈ అన్ని సూచీల్లోనూ బిహార్ వెనుకనే ఉంటుంది. కానీ కేరళ కంటే బిహార్‌లోనే ఎక్కువ శాతం మంది ఓట్లు వేస్తున్నారు.

బిహార్ ఎన్నికలు

ఫొటో సోర్స్, AFP

భ్రమ 2: ముస్లింలు, యాదవులు.. లాలూ వైపు ఉంటారా?

ముస్లిం, యాదవుల ఓట్ల వల్లే ఎన్నికల్లో ఆర్జేడీ విజయం సాధిస్తూ వస్తోందనే వాదన కూడా ప్రాచుర్యంలో ఉంది. దీన్నే ఎంవై ఫ్యాక్టర్‌గానూ చెబుతుంటారు. గత మూడు దశాబ్దాల్లో (1990-2010) ముస్లింలు, యాదవులు ప్రతిసారీ లాలూ వెన్నంటే నిలబడ్డారనీ చెబుతారు. ప్రస్తుత పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే ఇది కేవలం భ్రమ మాత్రమేనని స్పష్టమవుతుంది. ఆర్జేడీ కూటమిలో ఎంవై మద్దతు క్రమంగా చీలిపోవడాన్ని చూస్తునే ఉన్నాం. యాదవులలో కొన్ని వర్గాల ఓట్లు ఆర్జేడీ నుంచి ఎప్పుడో దూరం అయ్యాయి. ముస్లింల ఓట్లలోనూ అదే జరిగింది.

యాదవుల ఓట్లు చీలిపోవడానికి కొన్ని కారణాలున్నాయి. 1990ల్లో భారీగా యాదవులు, ముస్లింలు ఆర్జేడీకి ఓటు వేసినట్లు లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సర్వేలు చెబుతున్నాయి. ఈ ఓట్ల వల్ల ఆర్జేడీ కూటమికి ఒక సమయంలో 75 శాతం వరకూ ఓట్లు వచ్చాయి. కానీ క్రమంగా యాదవుల మద్దతు తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా లాలూ జైలుకి వెళ్లినప్పుడు ఇలా జరిగింది. ఆర్జేడీ కూటమికి ఇప్పుడు 60 శాతం యాదవుల ఓట్లు రావడం కూడా కష్టమే.

లాలూ ప్రసాద్

ఫొటో సోర్స్, Das Sipra/The The India Today Group via Getty Imag

ఎన్నికల నిర్వహణ విధానం కూడా ఓట్ల చీలికకు కారణం. 1990ల్లో లోక్‌సభ అయినా, శాసన సభ అయినా.. అన్ని ఎన్నికల్లోనూ లాలూకు యాదవులు మద్దతు పలికేవారు. కానీ, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే యాదవులు ఆర్జేడీకి ఓటు వేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కాదు. నరేంద్ర మోదీ ప్రభావం యాదవుల ఓట్లపై చాలావరకు పడింది. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో 69 శాతం మంది యాదవులు ఆర్జేడీ కూటమికి ఓటు వేశారు. కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ శాతం 45కు పడిపోయింది. దీనిబట్టి ఎన్నికలకు అనుగుణంగా ప్రజలు మారుతున్నట్లు స్పష్టమవుతోంది.

మరోవైపు యాదవుల్లో యువత ఓట్లు కూడా బీజేపీ వైపు మళ్లుతున్నాయి. ముఖ్యంగా యాదవులలో ఎగువ, మధ్య ఎగువ తరగతి ప్రజలు బీజేపీకి దగ్గర అవుతున్నారు. బిహార్ ఎన్నికల్లో ఏఐఎంఐఎం అడుగుపెట్టడంతో ముస్లిం ఓట్లలోనూ చీలిక వస్తోంది. కానీ లోక్‌సభ ఎన్నికల్లో మోదీ, బీజేపీ భయంతో ముస్లిం ఓట్లన్నీ గంపగుత్తంగా ఆర్జేడీ వైపు వెళ్తుంటాయి. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కూటమికి 69 శాతం ఓట్లు పడ్డాయి. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం 89 శాతం ముస్లిం ఓట్లు ఆర్జేడీ కూటమికి పడ్డాయి.

బీజేపీ

ఫొటో సోర్స్, Hindustan Times

భ్రమ 3: బీజేపీ కేవలం అగ్ర కులాల పార్టీనా?

1990ల మధ్య వరకు బిహార్‌లో బీజేపీ కేవలం అగ్ర కులాల పార్టీనే. కానీ ఈ పరిస్థితి క్రమంగా మారుతూ వస్తోంది. ఇప్పుడు ఇది కేవలం భ్రమ మాత్రమే. ఎందుకంటే ఓబీసీలపై బీజేపీ పట్టు సంపాదిస్తోంది. ముఖ్యంగా అణగారిన ఓబీసీలు పార్టీవైపు వస్తున్నారు. మరోవైపు ఉన్నత కులాల ఓట్లను చేజార్చుకోకుండానే దళితుల్లోనూ పార్టీకి ఆదరణ పెరుగుతోంది. గత ఎన్నికల్లో వరుసగా 75 శాతం ఉన్నత కులాల ఓట్లు బీజేపీ కూటమికి పడ్డాయి. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ జత కట్టలేదు. అప్పుడు బీజేపీకి 84 శాతం ఉన్నత కులాల ఓట్లు పడ్డాయి. మరోవైపు 2019 లోక్‌సభ ఎన్నికల్లో 79 శాతం ఉన్నత కులాల ఓట్లు ఎన్‌డీఏ కూటమికి దక్కాయి.

అదే సమయంలో అణగారిన ఓబీసీల్లోనూ పార్టీకి ఆదరణ క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 53 శాతం దిగువ స్థాయి ఓబీసీలు ఎన్‌డీఏకు ఓటువేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇది 88 శాతానికి పెరిగింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో దళితుల్లోని దుశద్ వర్గం ఓట్లలో 68 శాతం బీజేపీ కూటమికి పడ్డాయి. 2019 ఎన్నికల్లో ఇది 88 శాతం వరకు పెరిగింది. ముఖ్యంగా దళితులకు ప్రాతినిధ్యం వహించే రామ్ విలాస్ పాసవాన్.. బీజేపీ కూటమిలో చేరడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అయితే మరిన్ని దళిత వర్గాల మద్దతునూ బీజేబీ కూడగడుతోంది. ఇతర దళితుల్లో 33 శాతం మంది 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏకు ఓటు వేశారు. 2019 ఎన్నికల్లో ఇది 85 శాతం వరకు పెరిగింది.

మోదీ, నీతీశ్ కుమార్

ఫొటో సోర్స్, Hindustan Times

వ్యూహాలను రచించడంలో బీజేపీ దిట్ట. సొంతంగా విజయం సాధించలేని ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీలతో చేతులు కలుపుతూ క్రమంగా అక్కడ పార్టీ పట్టు సంపాదిస్తుంది. తమ ఓటు బ్యాంకునూ పెంచుకుంటుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీట్లను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. జేడీయూతో సంకీర్ణంలో భాగంగా తాము పోటీచేసే స్థానాలను బీజేపీ క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. మరోవైపు జేడీయూ స్థానాలు తగ్గుతూ వస్తున్నాయి. 2005, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా 102, 103 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ప్రస్తుతం మాత్రం 121 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. మరోవైపు 138, 141గా ఉన్న జేడీయూ స్థానాలు ఇప్పుడు 122కు తగ్గాయి.

నీతీశ్ కుమార్

ఫొటో సోర్స్, Getty Images

భ్రమ 4: బీహార్‌లో నీతీశ్ కుమార్‌కు ప్రజాదరణ తగ్గింది

నీతీశ్ కుమార్ ప్రజాదరణ తగ్గిందని, ఆయన ఓటు బ్యాంకు బాగా బలహీనపడిందని కొందరు అంటున్నారు. కానీ, ఇది భ్రమ మాత్రమే.

ఇప్పటికీ ఆయనకు ప్రజల్లో ఆదరణ గణనీయంగా ఉంది. జేడీయూకు ఆయన వల్లే ఓట్లు వస్తున్నాయని కూడా చెప్పవచ్చు. నీతీశ్ కుమార్ లేకుండా జేడీయూకు ఓట్లు పడవని కూడా చాలా మంది చెబుతున్నారు. ఆయన జేడీయూకే కాదు.. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా ఎన్‌డీఏకే పెద్దదిక్కు లాంటివారనీ వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.

మరోవైపు రాష్ట్రంలో ఎన్‌డీఏకు నీతీశ్ నేతృత్వం వహిస్తారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన లోక్ జన శక్తి పార్టీ దీన్ని వ్యతిరేకించి కూటమి నుంచి బయటకు వెళ్లిపోయింది కూడా. ఇది భ్రమ కాదు. నీతీశ్‌కు విశేషమైన ప్రజాదరణ ఉందని లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సర్వేలోనూ తేలింది.

లాలూ ప్రసాద్, నీతీశ్ కుమార్

ఫొటో సోర్స్, Getty Images

ఫిబ్రవరి 2005లో నీతీశ్ కుమారే తమ ముఖ్యమంత్రి కావాలని కొరుకునే వారు 43 శాతం మంది ఉండేవారు. 2010నాటికి ఇది 53 శాతానికి పెరిగింది. 2015లో మహాకూటమి కూడా నీతీశ్ కుమార్‌నే ముందుపెట్టి ఎన్నికలకు వెళ్లింది. లాలూ ఉన్నప్పటికీ వారు నీతీశ్‌నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ముందుకువెళ్లారు.

అక్టోబరు 2005 ఎన్నికల్లో ఎన్‌డీఏకు వచ్చింది 37 శాతం ఓట్లే. 2010లోనూ 39 శాతం ఓట్లే వచ్చాయి. అయితే ఈ కూటమి సంపాదించిన ఓట్ల కంటే నీతీశ్ తమ ముఖ్యమంత్రి కావాలనే ఎక్కువ మంది ఆకాంక్షించారు.

నీతీశ్ కుమార్

ఫొటో సోర్స్, Hindustan Times

భ్రమ 5: మహా దళితులంతా నీతీశ్ వైపేనా?

నిజమే మహా దళితులు భారీగా నీతీశ్‌కు ఓటు వేస్తుంటారు. అయితే, అన్నిసార్లూ వారు నీతీశ్ వైపే నిలుస్తారని చెప్పడంలో మాత్రం నిజంలేదు.

గత ఎన్నికల్లో లాలూతో నీతీశ్ చేతులు కలిపినప్పుడు ఆయన వెంట మహాదళితులు లేరు. మరోవైపు అంతకుముందు ఎన్నికల్లోనూ మహాదళితులు భారీగా ఆయనకు ఓటు వేయలేదు. కేవలం 2010లోనే మహాదళితులు భారీగా ఆయనకు ఓటువేశారు. అప్పుడు భారీ ఆధిక్యంతో ఎన్‌డీఏ విజయం సాధించింది.

బిహార్ ఎన్నికలు

ఫొటో సోర్స్, SEETU TIWARI

లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సర్వే ప్రకారం.. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో 38 శాతం మంది మహాదళితులు ఎన్‌డీఏకు ఓటు వేశారు. ఎందుకంటే ఆనాడు ఎన్‌డీఏకు నీతీశ్ కుమార్ అండగా నిలబడ్డారు. కానీ 2015 ఎన్నికల్లో అదే స్థాయిలో మహా దళితుల ఓట్లు కూడగట్టడంలో నీతీశ్ విఫలమయ్యారు. కేవలం 24 శాతం మంది మహాదళితులే ఆనాడు జేడీయ-ఆర్జేడీ కూటమికి మద్దతు పలికారు.

మహాదళితులను తనవైపు పూర్తిగా తిప్పుకొనే సామర్థ్యం నీతీశ్ కుమార్‌కు ఉండుంటే 2015లో మహాకూటమికి కొంచెం ఎక్కువ ఓట్లే వచ్చుండాలి. కానీ 24 శాతం మంది మాత్రమే మహాకూటమికి ఓటు వేశారని, చాలా మంది ఎన్‌డీఏ వైపే నిలబడ్డారని సర్వే చెబుతోంది.

(సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ సంజయ్ కుమార్ పనిచేస్తున్నారు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)