నితీశ్ కుమార్: కూటములు మారుస్తూ ముఖ్యమంత్రి సీటు చేజారకుండా కాపాడుకుంటున్న నేత

ఫొటో సోర్స్, ANI
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
బిహార్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి. ఆదివారం సాయంత్రం నితీశ్ కుమార్ తొమ్మిదోసారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
చిత్రంగా ఆయన ఆదివారం ఉదయమే బిహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆదివారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్ చేరుకున్న నితీశ్, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి తన రాజీనామాను సమర్పించారు. కూటమి నుంచి తప్పుకుంటున్నట్లుగా కూడా ఆయన ప్రకటించారు.
తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ‘‘నేను రాజీనామా చేశాను. ఇప్పుడు ప్రభుత్వం రద్దు అయింది. పార్టీ, ప్రజల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని నితీశ్ అన్నారు.
తర్వాత ఏం చేస్తారన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ, మేం మా మిత్రపక్షాల నుంచి విడిపోయి కొత్త కూటమిలో చేరాం. ఏదైనా జరిగితే మీకు తెలియజేస్తామని చెప్పారు.
నితీశ్ కుమార్ ఆర్జేడీతో పొత్తును తెంచుకుని మళ్లీ బీజేపీతో జత కట్టవచ్చని గత వారం రోజులుగా ఊహాగానాలు వచ్చాయి.
చివరి క్షణం వరకు నితీశ్ దీని గురించి అధికారికంగా ఏమీ చెప్పలేదు. కానీ బిహార్ రాజకీయాల్లో ఆయన ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే ఆయనపై వచ్చే ప్రతీ ఊహాగానాలు చివరకు నిజమైనవిగా తేలాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది.

ఫొటో సోర్స్, ANI
గవర్నర్‌తో భేటీ తర్వాత నితీశ్ ఏం చెప్పారు?
రాజీనామాకు కారణం ఏంటని నితీశ్ కుమార్‌ను అడగగా ఆయన ఇలా బదులిచ్చారు.
‘‘ఏదీ సరిగ్గా జరగకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఏదో సమస్య వచ్చింది. మేం చూస్తూనే ఉన్నాం. పార్టీతో పాటు అన్నివైపుల నుంచి అభిప్రాయాలు వస్తున్నాయి. అందరి మాట విన్న తర్వాతే రాజీనామా చేశాను. ప్రభుత్వాన్ని రద్దు చేశాం.
మేం గత కూటమిని వదిలేసి ఏడాదిన్నరగా కొత్త కూటమిని ఏర్పాటు చేశాం. కొత్త కూటమిలోకి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి సరిగ్గా అనిపించలేదు. అక్కడివారు పని గురించి చేస్తోన్న వాదనలు మా వారికి నచ్చలేదు’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నితీశ్ రాజకీయ ప్రయాణం
నితీశ్ కుమార్ 2022 ఆగస్టులో బీజేపీతో పొత్తు తెంచుకుని ఆర్జేడీలో చేరారు.
రాజకీయాల్లో నితీశ్ కుమార్ ఇలా యూటర్న్ తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. అందుకే ఆయన బీజేపీతో పొత్తు తెంచుకున్నా, ఆర్జేడీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
‘ఇండియా’ కూటమిని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోన్న నితీశ్ కుమార్ ఇప్పుడు స్వయంగా ఆ కూటమిని వీడి వేరే కూటమిలో చేరే అవకాశం ఉన్నట్లుగా గత కొన్ని రోజులగా పట్నా నుంచి సంకేతాలు వచ్చాయి.
‘ఇండియా’ కూటమిలో సీట్ల పంపకం విషయంలో జరుగుతోన్న జాప్యంపై నితీశ్ కోపంగా ఉన్నారని, ఇదే కారణంతో ఆయన తదుపరి రాజకీయ అడుగు ఉంటుందని జేడీయూ సూచించింది.
ఆర్జేడీ, జేడీయూల మధ్య వాతావరణం సరిగ్గా లేదని, ఆర్జేడీ నుంచి నితీశ్ తప్పుకుంటారనే విషయాలపై శనివారం మధ్యాహ్నం నాటికి ఒక స్పష్టత వచ్చింది. ఆదివారం నాడు నితీశ్ చేసిన ప్రకటనతో ఇది పూర్తిగా తేటతెల్లం అయింది.
నితీశ్ కుమార్ 'యు-టర్న్‌లు' తీసుకోవడం, సొంత రాజకీయాలు చేస్తారనడానికి ఇప్పటివరకు ఆయన రాజకీయ జీవితం సాక్షిగా నిలిచింది.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
పట్నా పక్కనే ఉన్న భక్తియార్‌పూర్‌లో ఒక స్వతంత్ర సమరయోధుని కుటుంబంలో 1951 మార్చి 1న నితీశ్ కుమార్ జన్మించారు. బిహార్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పట్టాను పొందారు. నితీశ్ కుమార్ ఎప్పుడూ రాజకీయాల వైపు మొగ్గు చూపేవారు.
లాలూ ప్రసాద్ యాదవ్, జార్జ్ ఫెర్నాండెజ్‌ల ఆధ్వర్యంలో నితీశ్ రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నారు. రాజకీయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకోవడానికి అందరికంటే భిన్నంగా ఉండాలని ఆయన అనుకున్నారు.
దాదాపు అయిదు దశాబ్దాలపాటు రాజకీయాల్లో ఉన్న ఆయన తన సౌలభ్యం మేరకు పార్టీలు, పొత్తులు మారుస్తూనే ఉన్నారు.
1974-1977 మధ్య జై ప్రకాష్ నారాయణ్ చేసిన ఉద్యమంలో నితీశ్ పాల్గొన్నారు. సత్యేంద్ర నారాయణ్ సిన్హా నేతృత్వంలోని జనతా పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
1985లో తొలిసారిగా హర్నాట్ స్థానం నుంచి నితీశ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ సమయంలో బిహార్‌లో ప్రతిపక్షంలో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఆయన మిత్రుడు.
ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిలిచిన జనతాదళ్‌లో అనేక చీలికలు ఏర్పడ్డాయి. సమతా పార్టీని 1994లో జార్జ్ ఫెర్నాండెజ్ స్థాపించారు. ఆయనతో నితీశ్ జతకట్టారు. మరుసటి ఏడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సమతా పార్టీకి 7 సీట్లు మాత్రమే వచ్చాయి.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
మొదట సమతా పార్టీ, తర్వాత బీజేపీ
బిహార్‌లో సమతా పార్టీ ఒంటరిగా పోరాడలేదనే విషయం నితీశ్‌కు అర్థమైంది. 1996లో ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.
1989లో నితీశ్ తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 1998- 2001 మధ్యకాలంలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
వాజ్‌పేయి హయాంలో 2001-2004 మధ్య నితీశ్ రైల్వే మంత్రిగా ఉన్నారు.
ఆసక్తికర విషయం ఏంటంటే 2000 సంవత్సరంలో ఆయన బిహార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఏడాది మార్చి 3 నుంచి మార్చి 10 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏడు రోజులే ఆయనకు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం లభించినప్పటికీ, లాలూ ప్రసాద్ యాదవ్‌కు బలమైన ప్రత్యామ్నాయం తానేనని ఆయన చాటుకున్నారు.
2004 వరకు కేంద్రంలో మంత్రిగా ఉన్న నితీశ్, 2005లో మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు.
గత 19 ఏళ్లలో, 2014-15లో జీతన్‌రామ్ మాంఝీ చేపట్టిన పది నెలల పదవీకాలాన్ని మినహాయిస్తే, బిహార్‌కు నితీశ్ కుమారే ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఈ కాలంలో నితీశ్ కుమార్ తన సౌలభ్యం మేరకు కూటమి భాగస్వాములను మారుస్తూనే ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
శనివారం పట్నాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జనతాదళ్ యునైటెడ్, రాష్ట్రీయ జనతాదళ్, హిందుస్థానీ అవామ్ మోర్చా, బీజేపీ నేతలు సమావేశాల్లో మునిగిపోయారు.
అదే సమయంలో నితీశ్ మళ్లీ బీజేపీలో కలుస్తారని, త్వరలో బీజేపీ-జేడీయూలతో కూడిన కొత్త కూటమిపై స్పష్టత వస్తుందంటూ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆదివారం రాజీనామా చేయడం ద్వారా ఈ వాదనలన్నింటినీ నితీశ్ నిజం చేశారు.
గత 20 ఏళ్లుగా బిహార్ రాజకీయాలకు నితీశ్ కుమార్ ఇరుసుగా ఉన్నారు. ఆయన గత పదేళ్ల కాలంలో అయిదుసార్లు పొత్తులు మార్చారు.
నితీశ్ 1996లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2013 వరకు బీజేపీతో ఈ పొత్తు కొనసాగింది. బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి బిహార్‌లో అధికారాన్ని నిలబెట్టుకున్నారు నితీశ్.
బిహార్ రాజకీయాల్లో 17 ఏళ్ల పాటు బీజేపీ, నితీశ్ కలిసి ఉన్నారు.
2014లో లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ పేరును ప్రకటించడంతో ఆయన బీజేపీ నుంచి దూరం వెళ్లారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
మళ్లీ బీజేపీ చెంతకు
మోదీని వ్యతిరేకిస్తూ బీజేపీ నుంచి విడిపోయిన నితీశ్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశారు.
అంతకుముందు లోక్‌సభలో ఇరవై మంది ఎంపీలు ఉన్న జేడీయూ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాల తర్వాత రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ పార్టీలతో నితీశ్ పొత్తు పెట్టుకున్నారు.
2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి నితీశ్ మహాకూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మహాకూటమికి భారీ మెజార్టీ వచ్చింది. నితీశ్ మరోసారి ముఖ్యమంత్రి కాగా, తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎం అయ్యారు.
ఈ మహాకూటమి రెండేళ్లు మాత్రమే కొనసాగింది. 2017లో మహాకూటమితో నితీశ్ తెగతెంపులు చేసుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని నితీశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, బీజేపీ నేత సుశీల్ మోదీ మళ్లీ డిప్యూటీ సీఎం అయ్యారు.
2020లో బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ అధికారంలోకి వచ్చారు. అయితే, బీజేపీ కంటే జేడీయూకు తక్కువ సీట్లు వచ్చాయి. బీజేపీకి 74 సీట్లు, జేడీయూకి 43 సీట్లు వచ్చాయి. అయినప్పటికీ నితీశ్ ముఖ్యమంత్రి కుర్చీలో కొనసాగారు.

ఫొటో సోర్స్, Getty Images
నితీశ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన పార్టీకి తక్కువ సీట్లు ఉండటంతో ఆయనపై బీజేపీ నుంచి ఒత్తిడి పెరిగింది. రెండేళ్లపాటు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడిపిన నితీశ్ మళ్లీ యూ టర్న్ తీసుకొని ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
2022 ఆగస్టులో నితీష్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్‌ను నియమించారు.
ఈసారి బీజేపీ పట్ల నితీశ్ కఠిన వైఖరి అవలంబించారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటమిని ఏర్పాటు చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేశారు.
"చావడానికైనా సరే గానీ, వారితో కలవడాన్ని ఎప్పటికీ మేం ఒప్పుకోం’’ అని నితీశ్ అన్నారు.
2023 జనవరి 30న మీడియాతో మాట్లాడుతూ నితీశ్ ఈ మాటలు అన్నారు. ఇలా అని ఏడాది కూడా తిరగలేదు. నితీశ్ మళ్లీ ఇప్పుడు బీజేపీ జత కట్టారు.

ఫొటో సోర్స్, ANI
ఇదే సమయంలో బీజేపీ కూడా నితీశ్ పట్ల కఠినంగానే వ్యవహరించింది.
బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2023 ఏప్రిల్‌లో మాట్లాడుతూ, ‘‘ఎన్నికల ఫలితాల తర్వాత నితీశ్ బాబును మళ్లీ బీజేపీ, ఎన్డీయేలో చేర్చుకుంటామనే సందేహం ఎవరికైనా ఉంటే వారికి నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదల్చుకున్నా. బిహార్ ప్రజలకు, లల్లన్ బాబుకు స్పష్టంగా చెప్పేదేంటంటే, మీ కోసం బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరుచుకోవు. అవి శాశ్వతంగా మూసుకున్నాయి’’ అని అన్నారు.
కానీ, ఇప్పుడు బీజేపీ, నితీశ్ ఇద్దరి వైఖరి మారింది. బీజేపీతో కలిసి నడించేందుకు నితీశ్‌కు ఎలాంటి సంకోచం లేదు. నితీశ్‌ను చేర్చుకోవడంలో బీజేపీ కూడా సంకోచించట్లేదు.
నితీశ్ తిరిగి బీజేపీలోకి రావడంపై మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీని జర్నలిస్టులు అడిగితే, ‘‘రాజకీయాల్లో తలుపుల్ని మూసేయరు. అవసరాన్ని బట్టి తలుపులు మూస్తారు, తెరుస్తారు’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఐకాన్ ఆఫ్ ద సీస్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌక తొలి ప్రయాణం షురూ.. దీనిపై విమర్శలు ఎందుకు?
- గురక ఎందుకు వస్తుంది? రాత్రిపూట పదేపదే నిద్ర చెడిపోతే మెదడు పనితీరు దెబ్బతింటుందా?
- పీతలకు ‘రక్షణ కవచం’గా బాటిల్ మూతలు.. హృదయం ముక్కలైందన్న శాస్త్రవేత్తలు
- అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఇజ్రాయెల్ పాటిస్తుందా?
- ఐఎన్ఎస్ విశాఖపట్నం: 22 మంది భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై హుతీల క్షిపణి దాడి, స్పందించిన భారత నౌకాదళం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










