అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఇజ్రాయెల్ పాటిస్తుందా?

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
- రచయిత, పాల్ ఆడమ్స్
- హోదా, బీబీసీ డిప్లొమాటిక్ అఫైర్స్ కరస్పాండెంట్
1984 జీనోసైడ్ కన్వెన్షన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ జాతి హననానికి పాల్పడిందని ఆరోపిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో దక్షిణాఫ్రికా కేసు నమోదు చేసింది.
ఈ కేసుపై విచారణ జరిపిన అంతర్జాతీయ న్యాయస్థానం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇజ్రాయెల్‌కు కొన్ని అంశాలపై ఆదేశాలు జారీ చేసింది.
గాజాలోని పాలస్తీనియన్లకు హాని కలిగించే ఎలాంటి చర్యలనైనా సరే, వెంటనే నిలిపివేయాలని కోరింది.
ఈ ఆదేశాలు దక్షిణాఫ్రికా లేదా పాలస్తీనియన్లకు పూర్తి విజయాన్ని అందించినట్లుగా భావించలేం. ఎందుకంటే, ఐసీజే ఇజ్రాయెల్‌ను కాల్పుల విరమణను గానీ, మిలటరీ ఆపరేషన్లను గానీ నిలిపివేయాలని ఆదేశాలివ్వలేదు.
దీనర్థం, 2023 అక్టోబర్ 7న హమాస్ దాడులకు గురైన ఇజ్రాయెల్‌కు స్వీయరక్షణ కోసం ప్రతిస్పందించే హక్కు ఉంటుందని న్యాయస్థానం పరోక్షంగా అంగీకరించింది.
అదే సమయంలో, గాజాలోని పరిస్థితి 'విపత్తు'ను తలపిస్తోందని, అది మరింత దిగజారే అవకాశం ఉందన్న విషయాన్ని ఐక్యరాజ్య సమితి అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయమేంటంటే, ఈ కేసులో తుది తీర్పు ఇవ్వలేదు. విచారణ జరిపి, ఆ తీర్పు వెల్లడి చేయడానికి చాలా ఏళ్లు పట్టొచ్చు.
ఆ కారణంగానే, అంతర్జాతీయ న్యాయస్థానం ఇజ్రాయెల్ కొన్ని తక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చింది.
వాటిలో ఎక్కువ శాతం దక్షిణాఫ్రికా దేశం అంతర్జాతీయ న్యాయస్థానం ముందుంచిన తొమ్మిది డిమాండ్లకు సంబంధించినవే.

ఫొటో సోర్స్, Getty Images
న్యాయస్థానం ఆదేశాలతో ఏం మారతాయి?
17 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఇజ్రాయెల్‌కు జారీ చేసిన ఆదేశాల్లో పాలస్తీనియన్ల ప్రాణాలకు ఏ విధమైన హాని కలగకుండా, వారు మానసిక వేదనకు గురవకుండా సంరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
అంతేకాకుండా, ఇజ్రాయెల్ అధ్యక్షుడు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ మారణకాండను ప్రేరేపించేలా చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించింది.
గాజాలో కొనసాగుతున్న విషాదానికి ముగింపు పలికేలా తక్షణ, సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇజ్రాయెల్‌కు ఆదేశాలు ఇచ్చింది.
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్‌కు ఆదేశాలు ఇవ్వనప్పటికీ, అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఇజ్రాయెల్ అమలు చేస్తే, గాజాలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న మిలటరీ ఆపరేషన్లలో పెద్ద మార్పులే జరుగుతాయి.
అయితే, జాతిహననం ఆరోపణల్ని ఇజ్రాయెల్ ఖండించింది.
పాలస్తీనియన్లకు జరుగుతున్న హానికి పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ కారణమని వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, Reuters
ఇజ్రాయెల్ ఏమంది?
గాజాలో జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాలు, శరణార్థుల శిబిరాల కింద సొరంగ మార్గాల నుంచి హమాస్ కార్యకలాపాలు కొనసాగిస్తోందని, ఆ కారణంగా పౌరుల మరణాలను నివారించడం ఇజ్రాయెల్‌కు అసాధ్యంగా మారిందని ఇజ్రాయెల్ తెలిపింది.
దానితోపాటు గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యల నేపథ్యంలో పౌరులను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, ముందస్తు హెచ్చరికలతో వారిని అప్రమత్తం చేశామని ఇజ్రాయెల్ తెలిపింది.
అంతేగాకుండా, దాదాపు ఇజ్రాయెల్ పౌరులందరూ ఇజ్రాయెల్ సైన్యం ప్రపంచంలోనే 'అత్యంత నైతిక విలువలు' కలిగినదని విశ్వసిస్తారని పేర్కొంది.
అయితే, అక్టోబర్ 7 పరిణామాలను మొదలుకొని ఇప్పటివరకు గాజాలోని 2.3 మిలియన్ల మంది జనాభాలో 85 శాతం మంది నిరాశ్రయులయ్యారు. యుద్ధం కారణంగా, తమ ప్రాంతాలను వదిలి శిబిరాల్లో తలదాచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అవి కూడా సామర్థ్యాన్ని మించిపోయాయి.
అన్నిటికీ మించి, గాజాలో వైద్యం, నిత్యావసరాలకు తీవ్ర కొరత ఏర్పడింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్ దేనిపై దృష్టి పెట్టింది?
అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షులు జోన్ డోనోంగ్‌హ్యూ మాటల్లో గాజాలోని ప్రజల దుస్థితి పట్ల అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కువగా ఆందోళన చెందుతోందని అర్థమైంది. అదే సమయంలో కేసును కొట్టివేయాలని వాదనలు వినిపించిన ఇజ్రాయెల్‌కు ఆ ఆదేశాలు అనుకూలంగా ఉండబోవన్న విషయం అర్థమైంది.
గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనియన్లు అనుభవిస్తున్న దుర్భర పరిస్థితులపై న్యాయమూర్తి స్పందించారు. ముఖ్యంగా అక్కడి పిల్లల పరిస్థితి 'గుండెల్ని పిండేసే'లా ఉందని అన్నారు.
జాతిహననం కేసులో న్యాయస్థానం తుది తీర్పును ఇవ్వలేదు. అందుకు చాలా సంవత్సరాలు పట్టొచ్చు.
అయితే, గాజాలోని పాలస్తీనియన్ల భద్రత పట్ల చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చింది న్యాయస్థానం.
ఇజ్రాయెల్‌పై దక్షిణాఫ్రికా చేసిన ప్రాథమిక ఆరోపణలను అంతర్జాతీయ న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందించాలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఐసీజే తీర్పుల అమలుకు యంత్రాంగం లేదు. అంతేకాకుండా ఇజ్రాయెల్ ఐసీజే ఆదేశాలను విస్మరించనూ వచ్చు.
దౌత్యపరమైన ప్రయత్నాల ఫలితంగా ప్రస్తుతం రెండు నెలల కాల్పుల విరమణ అవకాశాలపై ఇజ్రాయెల్ దృష్టి సారించింది. దానితోపాటు గాజా స్ట్రిప్‌లో మానవతా సాయం మరింత విస్తృతంగా అందించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాల్లోనూ దాదాపుగా వీటికి సంబంధించినవే ఉండటంతో, ఆ డిమాండ్లను నెరవేర్చేందుకు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్ అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదించేందుకు అవకాశం ఉంది.
ప్రస్తుతానికైతే పరిస్థితిలో ఎలాంటి మార్పు వచ్చినట్లుగా కనిపించలేదు. వాస్తవానికి ఇజ్రాయెల్‌పై జాతిహననం ఆరోపణలు వీగిపోలేదు.
అంతర్జాతీయ న్యాయస్థానం ఆ కేసును పరిగణలోకి తీసుకుంది. మరిన్ని వివరాలు సమర్పించాలని దక్షిణాఫ్రికాను ఆదేశించింది.
అంతర్జాతీయ న్యాయస్థానం తన తుది తీర్పును వెల్లడించేవరకు చట్టం నీడలోనే ఇజ్రాయెల్ పనిచేయాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- మరణ శిక్షను ఏయే పద్ధతుల్లో అమలు చేస్తున్నారు?
- ఏపీలో శ్మశానం అభివృద్ధికి తెలంగాణ ఎంపీ నిధులపై వివాదం ఎందుకు రేగింది?
- యూదుల ఊచకోత నుంచి బతికి బయటపడ్డ చిన్నారి జార్జ్ ఇప్పుడు ఎలా ఉన్నారు? నాటి మహా విషాదంపై ఆయన ఏమన్నారు?
- ధోర్డో: ఎడారి మధ్యలోని ఈ గుజరాత్ గ్రామానికి లక్షల మంది టూరిస్టులు ఎందుకు వస్తున్నారు?
- అయోధ్య రామాలయం: ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది ఆలయాల ఆర్కిటెక్చర్ భిన్నంగా ఎందుకు ఉంటుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














