గాజా: చనిపోయాక యూట్యూబర్‌గా ఫేమస్ అవుతున్న చిన్నారి, నెటిజన్లు ఎలా భుజాలకెత్తుకున్నారంటే.....

ఫొటో సోర్స్, YT
- రచయిత, ఎలిస్ కడీ
- హోదా, బీబీసీ న్యూస్, జెరూసలెం
ఇజ్రాయెల్-గాజాల మధ్య మొదలైన సంఘర్షణ వేలమంది ఆశలను, కలలను చిదిమేసింది. వారిలో 12 ఏళ్ల అవ్ని ఎల్డూస్ ఒకరు.
యూట్యూబర్ కావాలన్న కలను నెరవేర్చుకోకుండానే ప్రాణాలు కోల్పోయాడు.
అయితే, అవ్ని కలను నెటిజెన్లు గుర్తించి, అతడు లేకపోయినా కలను నెరవేర్చారు.
అవ్ని ట్యూబ్ చానెల్‌కు ఇప్పుడు 15 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆ చానెల్‌లో ఉన్నవి పది వీడియోలే అయినా, ఒక్కో వీడియోకు వేలకొద్దీ కామెంట్లు ఉన్నాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి.
ఇంతకీ అవ్ని ఎలా మరణించారు? అతడి కల ఎలా చెదిరింది?

ఫొటో సోర్స్, FAMILY HANDOUT
బాంబుల దాడిలో కుటుంబమంతా..
ఆగస్టు 2022లో పోస్ట్ చేసిన వీడియోలో అవ్ని మైక్రోఫోన్ పట్టుకుని చక్కగా నవ్వుతూ తన యూట్యూబ్ గేమింగ్ చానెల్ గురించి, తన లక్ష్యం గురించి చెప్పాడు.
“హలో ఫోక్స్, నేను అవ్ని ఎల్డూస్, నేను గాజాలో ఉంటే పాలస్తీనియన్‌ను. నా వయసు 12 సంవత్సరాలు. నా చానెల్‌కు సబ్‌స్క్రైబర్లు మొదట లక్ష, ఆ తరువాత ఐదు లక్షలు, ఆ తరువాత ఒక మిలియన్‌కు చేరాలి. అదే నా చానెల్ లక్ష్యం” అంటూ చెప్పాడు.
వీడియో ముగింపులో తన ఛానెల్‌కు ఉన్న వేయి మంది సబ్‌స్క్రైబర్లకు “గుడ్ బై” చెప్పాడు.
ఆ వీడియోకు 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ వీడియో మాత్రమే కాదు, మిగిలిన వీడియోలన్ని లక్షల్లో వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు అతడి చానెల్ 1.5 మిలియన్లకు చేరువలో ఉంది.
ఆ వీడియో చేసిన ఏడాది కాలం తరువాత, యుద్ధంలో చనిపోయిన పాలస్తీనా తొలి చిన్నారుల్లో అవ్ని కూడా ఒకరు.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్ దాడుల్లో అవ్ని కుటుంబం మృతిచెందినట్లు అవ్ని బంధువులు చెప్పారు.
అక్టోబర్ 7వ తేదీన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడులు చేశారు.
ఈ దాడుల్లో పన్నెండు వందల మంది మరణించగా, 240 మందిని బందీలుగా తీసుకునివెళ్లారు.
ఈ దాడులు జరిగిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్ సైన్యం ప్రతిదాడులు మొదలుపెట్టింది.
అవ్ని ఎల్డూస్ అత్తయ్య ఆలా చెప్పినదాని ప్రకారం ‘అవ్ని మంచి హుషారుతోపాటు ఆత్మవిశ్వాసం ఉన్న పిల్లాడు.’
మరొక బంధువు అవ్ని గురించి చెప్తూ, అతడికి కంప్యూటర్ అంటే ఇష్టమని, తాను ‘ఇంజినీర్ అవ్ని’ అని పిలిచేవాడినని చెప్పాడు.
మిగిలిన వారికి అవ్ని పదమూడేళ్ల గేమర్‌గా, గాజా ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన పిల్లాడిగా గుర్తుండిపోతాడు.
“మమ్మల్ని క్షమించు. నువ్వు మరణించకముందే, మేం నిన్ను గుర్తించి ఉండాల్సింది” అని
అతడి చానెల్‌లోని ఒక వీడియోకు ఒక యూజర్ కామెంట్ పెట్టారు.

ఫొటో సోర్స్, Facebook
హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ మొదలుపెట్టిన దాడుల్లో ఇప్పటివరకు 20 వేల మంది చనిపోయారు. వీరిలో మూడొంతులకు పైగా చిన్నారులే ఉన్నారు.
“ఈ ప్రపంచంలోనే చిన్నారులకు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం గాజాస్ట్రిప్” అని పరిస్థితి తీవ్రతను తెలిపింది యూనిసెఫ్.
ఆ రోజున హమాస్ దాడి జరిగిన కొద్ది గంటలకు ఇజ్రాయెల్ బాంబు దాడులు మొదలయ్యాయని ఆలా చెప్పారు.
రాత్రి సుమారు 8.20 గంటల సమయంలో తన స్నేహితుల నుంచి అవ్ని ఇంటిపై బాంబుదాడి జరిగిందని సందేశం వచ్చినట్లు తెలిపారు.
అవ్ని కుటుంబం జైటూన్ టౌన్‌లోని మూడంతస్తుల భవనంలో నివసిస్తోంది. అవ్నికి ఇద్దరు అక్కలు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు.
ఈ దాడిని రికార్డుల్లో నమోదుచేసింది మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్.
అవ్ని బంధువు మహమ్మద్ మాట్లాడుతూ, “అకస్మాత్తుగా రెండు బాంబులు భవనంపై పడి, మొత్తం బిల్డింగ్ నేలమట్టమైంది. నేనూ, నా భార్య అదృష్టవశాత్తు భయటపడ్డాం. అప్పుడు మేం వేరే చోట ఉన్నాం. ఆ దాడి నుంచి తప్పించుకున్నాం” అని చెప్పారు.
మహమ్మద్, ఆయన పొరుగున ఉండే వ్యక్తి ఆ దాడికి ముందు తమకు ముందస్తు హెచ్చరిక రాలేదని, అకస్మాత్తుగా జరిగిన దాడిగా చెప్పారు. “ఉన్నట్టుండి భారీ శబ్దంతో విస్ఫోటనం జరిగింది” అని చెప్పారు.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ఈ దాడిపై స్పందించలేదు.
అయితే, దాడులు హమాస్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని చేశామని, హమాస్ భూగర్భంలో, జనసాంద్రత ఎక్కువ ఉండే ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తోందని పేర్కొంది.
“ఐడీఎఫ్ మిలటరీ లక్ష్యాలపై జరిపే దాడులు అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉంటాయి. వీలైనంతమేర జాగ్రత్తలు పాటిస్తూ, పౌరులు, పౌరుల ఆస్తుల నష్టాన్ని అంచనా వేసి, ఆ దాడుల వలన కలిగే మిలటరీ ప్రయోజనాలను బేరీజు వేసుకుని నిర్వహిస్తాయి” అని పేర్కొంది.
“ఆపరేషన్ ఫలితంగా పౌరులు లేదా పౌరుల ఆస్తులకు కలిగే హాని జరిగితే, అందుకు చింతిస్తున్నాం. చట్టాలకు లోబడి, మిలటరీ ఆపరేషన్లను మరింత మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తాం” అని వెల్లడించింది.

ఫొటో సోర్స్, Facebook
'యూట్యూబర్ కావాలనుకున్నాడు'
తనకు వచ్చిన మెసేజ్‌ను నమ్మలేకపోయానని ఆలా చెప్పారు. తన ఫోన్‌ను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేశాక, తన కుటుంబానికి దగ్గరి స్నేహితుడొకరు తన సోదరుడి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, ‘రెస్ట్ ఇన్ పీస్’ అని పోస్ట్ చేయడంతో ఆసుపత్రికి పరుగులు తీసినట్లు తెలిపారు.
ఆ రోజు జరిగిన దాడిలో తన కుటుంబంలోని 15 మందిని కోల్పోయినట్లు ఆలా చెప్పారు. వారిలో అవ్ని ఒకరు.
అవ్ని ఎల్డూస్‌కు ఫేస్‌బుక్ పేజీ కూడా ఉంది.
అందులో అప్‌లోడ్ చేసిన ఒక ఫోటోలో కంప్యూటర్ మదర్ బోర్డును తన తోటి స్నేహితులకు చూపిస్తూ, టెక్నాలజీ పాఠాలను బోధిస్తున్నట్లుగా ఉంది.
ఆ ఫోటోను అవ్ని స్కూల్ యాజమాన్యం షేర్ చేసింది.
అతడి స్కూల్ టీచర్లలో ఒకరు అవ్ని ఫోటోను షేర్ చేస్తూ ‘ఎన్నిటికీ మర్చిపోలేని చిరునవ్వు’ అని కామెంట్ చేశారు.
అవ్ని మరణించే మూడు వారాల ముందు కుటుంబమంతా కలిసి అల్పాహారం చేస్తున్న సమయంలో అతడిని చివరిసారి చూశానని గుర్తుచేసుకున్నారు.
అవ్ని కంప్యూటర్లు, గేమింగ్స్‌ను ఎంతో ప్రేమించేవాడని, అలాంటి అలవాట్లతోనే యూట్యూబర్లుగా మారిర వారిని ఎంతో ఇష్టపడేవాడని ఆలా చెప్పారు.
జూన్ 2020లో అవ్ని తన యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించాడు. ప్రో ఎవల్యూషన్ సాకర్, కార్ రేసింగ్ గేమ్ బ్లర్, కౌంటర్ స్ట్రైక్ వంటి గేమ్స్ ఆడిన వీడియోలను అందులో పోస్ట్ చేశాడు.
మరో వీడియోలో తన అంకుల్‌తో కలిసి తన చానెల్‌లో ప్రత్యేకమైన కంటెంట్‌ను అప్‌డేట్ చేస్తానని ప్రామిస్ చేశాడు.
“అందులో ఇకపై గేమ్స్ మాత్రమే కాకుండా వ్లాగ్స్, ఇంటర్వ్యూలు కూడా చేస్తాం”అని చెప్పారు.

ఫొటో సోర్స్, Facebook
కన్నీరు పెట్టుకున్న యూట్యూబర్...
అక్టోబర్‌లో అవ్ని మరణించాక అవ్ని ప్రారంభించిన యూట్యూబ్ చానెల్ అందరినీ ఆకర్షించింది. దీనికి ఆదరణ వెల్లువలా వచ్చింది. చాలామంది యూట్యూబర్ల దృష్టిని కూడా ఆకర్షించింది. వారిలో కువైట్ గేమర్ అబోఫ్లాహ్ ఒకరు.
అబోఫ్లాహ్‌కు గతంలో అవ్ని మెసేజ్ కూడా పంపాడు.
అబోఫ్లాహ్ దాని గురించి ప్రస్తావిస్తూ తన చానెల్‌లో పోస్ట్ చేసిన వీడియోకు తొంభై లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
అందులో అబోఫ్లాహ్ మాట్లాడుతూ, “అవ్ని లాంటి పిల్లవాడు చనిపోయినందుకు సిగ్గు అనిపిస్తోంది. పెద్దవారికంటే ముందుగానే అవ్ని వెళ్లిపోయాడు. దేవుడు కరుణిస్తే, వీరంతా స్వర్గంలో పక్షులు అవుతారు” అంటూ భావోద్వేగంతో అన్నారు. ఆ వీడియోలో అబోఫ్లాహ్ ఏడ్చారు.
అబోఫ్లాహ్‌కు పంపిన సందేశాల్లో ఒకదానిలో,.
“గాజాలో శీతకాలానికి ఏదీ సాటిరాదు. ఈ వాతావరణం అద్భుతమైనది. మేం రుచికరమైన సహ్లాబ్(పాలతో చేసి తియ్యని ద్రావణం)ను సేవిస్తున్నాం. వేయించిన పప్పులు తింటున్నాం. తప్పకుండా మీరు పాలస్తీనాకు రావాలి. మీకు నా ప్రేమ” అన్న సందేశం ఉంది.
మరో సందేశంలో “మీరు లెజెండ్, రోల్ మోడల్” అని రాశాడు అవ్ని.
అవ్ని గురించి అబోఫ్లాహ్ “అతడి ప్రేమను చూస్తుంటే మనసు కరిగిపోతుంది. కన్నీళ్లు ఆగట్లేదు” అని బీబీసీకి చెప్పారు.
“నన్ను రోల్ మోడల్‌గా భావిస్తున్నానని అతడు రాయడం నా మనసుని తాకింది” అన్నారు.
“అతడి అభిమానులంతా తమలో అవ్నిని చూసుకుంటున్నారు. మేమంతా అవ్నిలమే” అన్నారు.
ఇవి కూడా చదవండి..
- సైన్యం కస్టడీలో ముగ్గురు పౌరుల మృతి తర్వాత కశ్మీర్లో ఏం జరుగుతోంది?
- ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టు తీర్పును ఈ న్యాయ కోవిదులు ఎందుకు తప్పుబడుతున్నారు?
- ‘సన్‌బర్న్’ ఫెస్టివల్లో ఏం చేస్తారు? దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణమేంటి?
- చెన్నై: మగవాళ్లతో మాట్లాడుతోందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ట్రాన్స్‌సెక్సువల్ బాయ్‌ఫ్రెండ్, అసలేం జరిగింది?
- 'నా ఆరోగ్యం ఏమవుతుందో' అని ఆందోళన చెందేవారే త్వరగా చనిపోతున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















