ప్లాస్టిక్ బాటిల్ నీళ్లలో లక్షల నానోప్లాస్టిక్స్.. ఇవెంత ప్రమాదకరం?

ఫొటో సోర్స్, Getty Images
మనుషుల కనీస అవసరాల్లో స్వచ్ఛమైన తాగునీరు ఒకటి.
ప్రయాణాలు చేసే సమయంలో, లేదా ఏదైనా ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ ప్లాస్టిక్ బాటిల్ నీళ్లపై ఆధారపడతాం.
అవి మంచినీరని నమ్ముతున్నాం. కానీ వాటిలో మైక్రోప్లాస్టిక్ సూక్ష్మపదార్థాలు ఎన్నో ఉంటున్నాయి. అంటే, నీళ్లలో ప్లాస్టిక్ ఉంటుందన్నమాట.
బాటిల్ నీటిలో గతంలో అంచనా వేసిన దానికంటే వంద రెట్ల మైక్రోప్లాస్టిక్ పదార్థాలు ఉన్నట్లు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ, రట్జర్స్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ వివరాలు బీబీసీ ఫ్యూచర్‌లో వెలువడ్డాయి.
ఒక లీటర్ బాటిల్ నీళ్లలో 2.5 లక్షల నానో ప్లాస్టిక్ పదార్థాలు ఉన్నట్లు ఆ అధ్యయనంలో వారు గుర్తించారు.
పరిశోధకులు మూడు బ్రాండ్ల బాటిళ్లలో నీటిని పరీక్షించినప్పుడు, వాటిలో లీటర్‌కు లక్షా పది వేల నుంచి నాలుగు లక్షల వరకు నానోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు తేలింది.
నీటిలోకి చేరిన ఆ ప్లాస్టిక్ కణాల్లో ఎక్కువ శాతం అదే బాటిల్ నుంచి వచ్చినట్లు సైంటిస్టులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లోనూ మైక్రోప్లాస్టిక్ కాలుష్యం
ఒకసారి మీరు మీ చుట్టూ చూసుకుంటే ఎన్నో ప్లాస్టిక్ వస్తువులు కనిపిస్తాయి. వాటిని చిన్నచిన్న ముక్కలుగా చేసినప్పుడు వచ్చే అతిచిన్న ప్లాస్టిక్ ముక్కలను మైక్రోప్లాస్టిక్స్‌గా వ్యవహరిస్తారు.
సాధారణంగా ఐదు మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్నవాటిని మైక్రోప్లాస్టిక్‌గా వ్యవహరిస్తారు. కొన్ని వాటికంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి, అలాంటి వాటిని కేవలం నానో స్కేల్‌పై మాత్రమే కొలవగలం. అలాంటి వాటిని నానోప్లాస్టిక్‌గా వ్యవహరిస్తారు.
అతి తక్కువ పరిమాణంలో ఉండే ఈ రెండు రకాల ప్లాస్టిక్ కణాలు సాధారణంగా కంటికి కనిపించవు. కానీ, అవి ఈ ప్రపంచంలో ప్రతి చోటా వ్యాపించి ఉంటాయి. నదిలో ప్రవహించే నీళ్లలో, సముద్ర గర్భంలో, గడ్డకట్టిన అంటార్కిటికా మంచులోనూ ఇవి ఉంటాయి.
వాన నీటిలోనూ మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు ఐఐటీ పట్నా పరిశోధనలో తేలింది.
అలాగే, భారత్‌లోని నదులు, సరస్సుల్లో కూడా మైక్రోప్లాస్టిక్‌లు ఉంటున్నట్లు మరో పరిశోధనలో తేలింది. ఫైబర్స్, ప్లాస్టిక్ శకలాలు, నురుగు రూపంలో ఉంటున్నాయి.
ఈ పరిశోధన ప్రకారం, ఫ్యాక్టరీల నుంచి వచ్చే మురికినీరు, పట్టణ ప్రాంతాల నుంచి వెలువడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల వంటి అనేక కారణాలతో ఈ పరిస్థితి తలెత్తుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
మైక్రోప్లాస్టిక్స్ వల్ల ప్రమాదమేంటి?
తాగునీటిలోనూ ఈ మైక్రోప్లాస్టిక్స్ ఉండటం వాటి సమస్యల్లో ఒకటైతే, అలాంటి మైక్రోప్లాస్టిక్స్ మానవ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పటివరకు కచ్చితంగా తెలియకపోవడం రెండో సమస్య.
మైక్రోప్లాస్టిక్‌లు మానవ శరీరంలోకి ప్రవేశిస్తే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో తెలుసుకొనేందుకు 2019లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సమీక్ష నిర్వహించింది.
అయితే, వీటిపై పరిమిత పరిశోధనల కారణంగా డబ్ల్యూహెచ్‌వో ఎలాంటి నిర్ధరణకు రాలేకపోయింది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించాలని అది విజ్ఞప్తి చేస్తోంది.
''మైక్రోప్లాస్టిక్ వల్ల కలిగే ప్రమాదం గురించి ఇప్పటివరకు కచ్చితమైన సమాచారం పెద్దగా అందుబాటులో లేదు. కానీ, ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది'' అని దిల్లీలోని పుష్పాంజలి మెడికల్ సెంటర్‌కు చెందిన సీనియర్ డాక్టర్ మనీష్ సింగ్, బీబీసీ జర్నలిస్టు ఆదర్శ్ రాథోడ్‌తో చెప్పారు.
''మైక్రోప్లాస్టిక్స్ ప్రమాదాలపై చాలా తక్కువ స్థాయిలో పరిశోధనలు జరిగాయి. ఇవి ఎండోక్రైన్ గ్రంథుల (హార్మోన్లు ఉత్పత్తి చేసే గ్రంథులు) పనితీరులో సమస్యలు కలిగిస్తాయని కొన్ని పరిశోధనలు కూడా ఉన్నాయి. మైక్రోప్లాస్టిక్‌ల వల్ల తీవ్రమైన హాని కలుగుతుందని పరిశోధనల ద్వారా భవిష్యత్తులో తెలియొచ్చు. అందువల్ల ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ కూరగాయల్లో ఎక్కువ మైక్రోప్లాస్టిక్‌లు
నీటితోపాటు వ్యవసాయం చేసే నేలలోనూ మైక్రోప్లాస్టిక్స్ కనిపిస్తాయి.
2022లో అమెరికాలో జరిగిన ఒక అధ్యయనంలో పంటలకు ఎరువుగా వాడే మురుగులో మైక్రోప్లాస్టిక్‌ల కారణంగా 80 వేల చదరపు కిలోమీటర్ల సాగు భూమి కలుషితమైనట్లు తేలింది.
ఈ మురుగులో మైక్రోప్లాస్టిక్‌లతో పాటు ఎప్పటికీ భూమిలో కలిసిపోని కొన్ని రసాయనాలు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అదే సమయంలో, యూరప్‌లోని వ్యవసాయ భూముల్లో ఏటా లక్షల కోట్ల మైక్రోప్లాస్టిక్ కణాలు కనిపిస్తున్నాయని, అవి ఆహారం ద్వారా మనుషుల శరీరంలోకి వెళ్తున్నట్లు బ్రిటన్‌లోని కార్డిఫ్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో తేలింది.
కొన్ని మొక్కల్లో మిగిలిన వాటితో పోలిస్తే అధిక మోతాదులో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నట్లు ఇసబెల్లె గెర్రెట్‌సెన్ బీబీసీ ఫ్యూచర్ కోసం రాసిన నివేదికలో పేర్కొన్నారు.
భూమి లోపల నుంచి పెరిగే కూరగాయల్లో ఈ మైక్రోప్లాస్టిక్‌లు ఎక్కువగా ఉన్నట్లు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అంటే, ఆకుకూరల్లో మైక్రోప్లాస్టిక్‌లు తక్కువగా ఉండగా, భూమి లోపల పెరిగే ముల్లంగి, క్యారెట్ వంటి వాటిలో ఎక్కువగా ఉంటున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
మైక్రోప్లాస్టిక్‌ను ఎలా నివారించాలి?
''భారత దేశంలో చాలా ప్రాంతాల్లో వ్యర్థాలను పడేసేందుకు సరైన వ్యవస్థ లేదు. అందువల్ల నదుల్లోకి, సాగు భూముల్లోకి మైక్రోప్లాస్టిక్స్ చేరుతున్నాయి'' అని డాక్టర్ మనీష్ సింగ్ చెప్పారు.
''చాలా ఆహార పదార్థాలను ప్లాస్టిక్ కవర్స్‌లో ప్యాక్ చేస్తున్నారు. ఇళ్లలో కూడా ప్లాస్టిక్ ప్లేట్లు, కూరగాయలు తరిగేందుకు ప్లాస్టిక్ బోర్డులు వాడుతున్నారు. అలాంటి వాటిని నివారించాలి. ప్రభుత్వం కూడా ఈ అంశంపై దృష్టి పెట్టాలి'' అన్నారు.
ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించేందుకు వాడి పడేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువులను కేంద్ర ప్రభుత్వం 2022 జులై ఒకటి నుంచి నిషేధించింది.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారు చేయడం, దిగుమతి చేసుకోవడం, స్టోర్ చేయడం, విక్రయాలు జరపడంపై నిషేధం విధించింది. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పటికే ఇవే తరహా చర్యలు చేపట్టాయి.
అయితే, బయోడీగ్రేడబుల్ ప్రత్యామ్నాయాలు సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. బయోడీగ్రేడబుల్ సంచులు భూమిలో కలిసిపోయేందుకు కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని బ్రిటన్‌కు చెందిన ప్లైమౌత్ యూనివర్సిటీ సైంటిస్టులు గుర్తించారు.
అంతేకాకుండా, అవి చిన్నచిన్న ముక్కలుగా విడిపోయి కాలుష్యాన్ని మరింత వ్యాప్తి చేస్తున్నాయి.
ఆహారం నుంచి మైక్రోప్లాస్టిక్స్‌ను నివారించేందుకు గాజుసీసాలను వినియోగించాలని సూచిస్తున్నారు.
గాజు సీసాలను రీసైకిల్ చేయడం సాధ్యమైనప్పటికీ, గాజు తయారీలో సిలికాను ఉపయోగిస్తారు. అందువల్ల అది పర్యావరణానికి హానికరమని ఇసాబెల్ పేర్కొన్నారు.
మైక్రోప్లాస్టిక్‌తోపాటు మైక్రోఫైబర్ కూడా సమస్యగా మారుతోంది. నీరు, సముద్రపు ఉప్పు, బీర్ వంటి వాటితో పాటు వస్త్రాల నుంచి భారీగా మైక్రోఫైబర్‌లు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడమే పరిష్కారం
బీబీసీ ఫ్యూచర్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం, మైక్రోప్లాస్టిక్ ప్రమాదాలను తగ్గించేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి.
ప్లాస్టిక్‌ను విచ్ఛిన్నం చేసి భూమిలో కలిసిపోయేలా చేయడంలో బ్యాక్టీరియా, ఫంగస్ సాయపడతాయని పరిశోధకులు గుర్తించారు. అలాగే, బీటిల్ లార్వా కూడా ఒక రకం ప్లాస్టిక్ పాలిస్టైరీన్‌ను డీకంపోజ్ చేస్తుంది.
ప్రత్యేక ఫిల్టర్లు, రసాయన పద్ధతుల ద్వారా కూడా నీటిని శుద్ధి చేయొచ్చు.
''ఈ విధానాల కంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే విధంగా ప్రభుత్వం విధానాలను రూపొందించడం, ప్రజలు కూడా తమ స్థాయిలో ప్లాస్టిక్‌పై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం మంచిది'' అని డాక్టర్ మనీష్ సింగ్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- అయోధ్య: ‘దివ్యాంగ మందిరంలో సకలాంగుడైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ధర్మవిరుద్ధం’ -శంకరాచార్య అవిముక్తేశ్వరానంద
- ఎన్టీఆర్ వర్ధంతి: రామారావు గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
- హర్దిత్ సింగ్ మాలిక్: యుద్ధ విమానానికి 400 బుల్లెట్లు తగిలినా బతికి బయటపడ్డ పైలట్ కథ
- Fastag: ఫాస్టాగ్ కేవైసీని జనవరి 31లోగా అప్డేట్ చేసుకోండిలా...
- ప్రపంచంలోని పేదరికాన్ని నిర్మూలించడానికి 230 ఏళ్ళు పడుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














