సముద్రపు దొంగల నుంచి పాకిస్తాన్ నావికులను భారత నౌకాదళం ఎలా కాపాడింది?

ఫొటో సోర్స్, INDIAN NAVY
- రచయిత, మెరిల్ సెబాస్టియన్
- హోదా, బీబీసీ న్యూస్, కోచి
సొమాలియా తీర ప్రాంతంలో సముద్రపు దొంగలు హైజాక్ చేసిన మత్స్యకార ఓడను, దానిలోని 19 మంది పాకిస్తానీ నావికులను భారత నౌకాదళం రక్షించింది.
భారతీయ యుద్దనౌక ఐఎన్ఎస్ సుమిత్ర ద్వారా 36 గంటల్లో చేపట్టిన రెండో రెస్క్యూ ఆపరేషన్ ఇది. దీనికి కొన్ని గంటల ముందు, సముద్రపు దొంగలు హైజాక్ చేసిన 17 మంది ఇరాన్ సిబ్బంది ఉన్న నౌకను కూడా రక్షించినట్లు భారత నౌకాదళం తెలిపింది.
వారం రోజులుగా సాయం కోరుతూ నౌకల నుంచి వచ్చిన పలు ఫోన్ కాల్స్‌కు భారత నౌకాదళం స్పందించి, ఈ రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సొమాలియా తీర ప్రాంతంలో చురుగ్గా పైరేట్లు
సొమాలియా తీర ప్రాంతంలో మత్స్యకార నౌకపై ఇటీవల జరుగుతున్న దాడులతో మరోసారి ఈ ప్రాంతంలో సముద్రపు దొంగలు చురుకుగా మారారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సొమాలియా తూర్పు తీరంతో పాటు గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో సముద్రపు భద్రతా చర్యల కోసం యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్రను వాడుతున్నారు.
‘‘ఆపదలో ఉన్నామంటూ జనవరి 28న వచ్చిన సందేశానికి యుద్ధనౌక స్పందించింది. ఎఫ్‌వీ ఇమాన్ పేరుతో ఇరాన్‌కు చెందిన ఈ ఓడను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. ఆ తర్వాత నౌకాదళ అధికారులు సముద్రపు దొంగలను నిర్బంధించి, ఓడతోపాటు అందులోని సిబ్బందిని కాపాడారు’’ అని ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఇండియన్ నేవీ ట్వీట్ చేసింది.
17 మంది నావికులను సముద్రపు దొంగల నుంచి రక్షించాక, ఓడను పూర్తిగా తనిఖీ చేసి, ప్రయాణానికి అనుమతిచ్చినట్లు తెలిపింది. అయితే, ఈ ప్రకటనలో సముద్రపు దొంగల గురించి ప్రస్తావించలేదు.
శ్రీలంక మత్స్యకారులను కూడా...
ఆ ఆపరేషన్ తర్వాత మంగళవారం కూడా ఏఐ నయీమీ మత్స్యకార ఓడను 11 మంది సొమాలియా సముద్రపు దొంగల నుంచి రక్షించి, దానిలోని 19 మంది పాకిస్తానీ సిబ్బందిని కాపాడినట్లు భారతీయ నౌకాదళం ట్వీట్ చేసింది.
ఆ మత్స్యకార ఓడను కూడా పూర్తిగా శానిటైజ్ చేసి, సిబ్బందంతా బాగున్నారో లేదో పరిశీలించామని చెప్పింది. ఈ ట్వీట్‌లో- మోకాళ్లపై కూర్చుని, చేతులు వెనక్కి కట్టి ఉంచిన దొంగలు, వారి వెనుక ఆయుధాలతో ఉన్న నౌకాదళ సిబ్బంది కనిపిస్తున్నారు.
శనివారం కూడా హైజాక్‌కు గురైన నౌక నుంచి ఆరుగురు శ్రీలంక మత్స్యకారులను సీషెల్స్‌కు చెందిన రక్షణ దళాలు కాపాడాయి.

ఫొటో సోర్స్, INDIAN NAVY
బ్రిటన్ నౌకను కాపాడిన ఐఎన్‌ఎస్ విశాఖపట్నం
సముద్ర భద్రతలో తీవ్ర అంతరాయాలు చోటు చేసుకుంటుండటంతో సొమాలియా తీర ప్రాంతంలో కూడా దాడులు పెరుగుతున్నాయని బ్లూమ్‌బర్గ్ నివేదించింది.
ఎర్ర సముద్రంలో నౌకలపై ఇరాన్ అండదండలున్న తిరుగుబాటుదారుల గ్రూప్ హూతీ చేస్తున్న దాడులతో సముద్ర భద్రతకు భంగం కలిగిన విషయాన్ని బ్లూమ్‌బర్గ్ తన కథనంలో ప్రస్తావించింది.
బ్రిటన్‌కు చెందిన ట్యాంకర్ మార్లిన్ లువాండా నుంచి కాపాడాలంటూ కాల్ రావడంతో గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌కు తమ యుద్ధనౌక ఐఎన్ఎస్ విశాఖపట్నాన్ని పంపినట్లు జనవరి 26న భారత నౌకాదళం తెలిపింది.
హూతీలు జరిపిన క్షిపణి దాడిలో మార్లిన్ లువాండా కొన్ని గంటల పాటు మంటల్లో చిక్కుకుపోయింది. ఈ నౌకకు అమెరికా, ఫ్రాన్స్‌కు చెందిన నౌకలు సాయం అందించాయి.
సొమాలియా తీరంలో సముద్రపు దొంగలు లైబీరియా నౌకపై దాడి చేయగా, ఆ దాడి నుంచి 21 మంది సిబ్బందిని జనవరి ప్రారంభంలో కూడా భారత నౌకాదళ కమాండోలు రక్షించారు.
ఇవి కూడా చదవండి:
- పీతలకు ‘రక్షణ కవచం’గా బాటిల్ మూతలు.. హృదయం ముక్కలైందన్న శాస్త్రవేత్తలు
- గురక ఎందుకు వస్తుంది? రాత్రిపూట పదేపదే నిద్ర చెడిపోతే మెదడు పనితీరు దెబ్బతింటుందా?
- 4 లక్షల ఏళ్ల కిందటి ఈ రాతి గుంటలు చెప్పే కథలేంటి ?
- కశ్మీర్లో మంచు కురవని శీతాకాలం ఎప్పుడైనా చూశారా... ఈ ఏడాదే ఎందుకిలా?
- హాజి మలాంగ్: ‘ఈ దర్గాకు విముక్తి కల్పించి హిందువుల పరం చేయాలి’ అన్న వాదన ఎందుకు వినిపించింది, వివాదం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














