కిమ్ సోదరుడిని ‘ప్రాంక్’ పేరుతో విమానాశ్రయంలో ఎలా చంపేశారు?

ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్ ఉన్ వారసత్వాన్ని ఆయన చిన్న కుమార్తె కిమ్ జు యే చేపట్టనున్నారని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
కిమ్ తరువాత ఆయన చిన్న కుమార్తె కిమ్ జు యే వారసురాలు కానున్నట్లు దక్షిణ కొరియా జాతీయ ఇంటెలిజెన్స్ సర్వీస్ కూడా చెప్పింది. అయితే, ఇంకా దీనిపై స్పష్టత రావాల్సి ఉందని, దాదాపుగా ఆమె పేరే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపింది.
గతంలో ఉత్తర కొరియా పీఠాన్ని అధిరోహించే విషయంలో వారసుల మధ్య కొన్నిసార్లు నెలకొన్న తీవ్రమైన పోటీ, యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అలాంటి ఒక ఘటన గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
అది 2017 ఫిబ్రవరి 12. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోని ఒక రెస్టారెంట్‌లో కొందరు స్నేహితులు సమావేశమయ్యారు. వారు ఇండోనేషియాకు చెందిన సితి ఐశ్యా అనే అమ్మాయి 25వ పుట్టిన రోజు వేడుకను నిర్వహిస్తున్నారు.
ఆమె స్నేహితులలో ఒకరి ఫోన్‌లో తీసిన వీడియోలో ఆమె నవ్వుతూ, క్యాండిల్స్‌ను ఊదుతూ, కేక్ కట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆడుతూ పాడుతూ కనిపించారు.
ఒక శుభవార్త ఉందని, తనకు టీవీ రియాల్టీ షోలో ఉద్యోగం దొరికిందని ఎంతో సంతోషంగా ఐశ్యా తన స్నేహితులతో చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది.
ఇక కౌలాలంపూర్‌లో ప్రాచుర్యం లేని పబ్లిక్ బాత్‌హౌస్‌లో(మసాజ్ పార్లర్ లాంటి సేవలందించే హోటల్‌లో) పనిచేయాల్సినవసరం లేదని ఆమె చెబుతుంది.
ఆమె స్నేహితులు ఐశ్యాకు మద్యం తాపిస్తూ అభినందనలు చెబుతున్నారు. ‘‘ఇప్పుడిక నువ్వు స్టార్ కాబోతున్నావు!’’ అంటూ ఆమెను పొగుడుతున్నారు.
ఆ తర్వాత రోజు సితి ఐశ్యా కౌలాలంపూర్ విమానాశ్రయంలో తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించేందుకు వచ్చారు.
బొద్దుగా, నీలం రంగు టీషర్ట్, స్పోర్ట్స్ జాకెట్ ధరించిన వ్యక్తి వద్దకు ఆమె సమీపించారు. ఆయన చెకిన్ దగ్గరకు వెళ్లే సమయంలో, ఆయన వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి, ముఖంపై ఒక ద్రవం(లిక్విడ్) చల్లారు ఐశ్యా.
ఏం చేస్తున్నావు అంటూ ఆ వ్యక్తి వచ్చీరానీ ఇంగ్లిష్‌లోనే ఆమెను గట్టిగా తిట్టారు.

ఆయన ముఖంపై పడిన లిక్విడ్ ఏమిటి?
‘‘సారీ’’ అని చెబుతూ ఆమె అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లారు.
ఇది టీవీ షోకు నిర్వహించిన ‘ప్రాంక్’ (సరదాగా కావాలని చేసిన పని) అని ఐశ్యా తెలిపారు. కానీ, మలేషియా అధికార యంత్రాంగం ఆమెపై హత్యానేరం అభియోగాలు నమోదు చేసింది.
ఇదంతా జరుగుతున్న ప్రాంతానికి కొద్ది దూరంలో, ఉత్తర కొరియా ఏజెంట్ ఒకరు కేఫ్‌లో కూర్చుని ఉన్నారు. ఆయన మిషన్ విజయవంతమైందని చాలా సంబరపడిపోయారు.
ఆ వ్యక్తి డిపార్చర్(విమానాల పోకలు) గేట్ వద్దకు వెళ్లి దుబాయ్ విమానం ఎక్కినట్లు సీసీటీవీ కెమెరాలో కనిపించింది.
లిక్విడ్ ముఖంపై పడ్డ బొద్దుగా ఉన్న ఆ వ్యక్తికి ఏదో తెలియని అసౌకర్యం కలిగింది. ముఖమంతా దురద, శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా అనిపించింది. ఆ తర్వాత కొన్ని నిమిషాలకు తాను కూర్చున్న కుర్చీలోనే స్పృహ తప్పిపడిపోయారు.
విమానాశ్రయ సిబ్బంది అంబులెన్స్‌ను పిలిచారు. కానీ, ఆ కొద్దిసేపటికే ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో ఆయన చనిపోయారు.
పాస్‌పోర్టులో ఉన్న సమాచారం మేరకు, ఆయనొక ఉత్తర కొరియా దౌత్య అధికారి కిమ్ ఛుల్ అని ఉంది. కానీ, వాస్తవానికి ఆ వ్యక్తి కిమ్ జాంగ్-నామ్. ఆయన ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్-ఉన్ సవతి సోదరుడు. కిమ్ జాంగ్-ఉన్‌కు వరుసకు అన్న అవుతారు.
కిమ్ జాంగ్-నామ్, వీఎక్స్ అనే విషపదార్థంతో హత్యకు గురయ్యారు.
వీఎక్స్ అనేది ఒక రసాయన పదార్థం. నరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇసుక రేణువంత పరిణామంలో ఉన్న ఈ లిక్విడ్ చుక్కను పీల్చినా,మరణం తప్పదు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కిమ్ జాంగ్-నామ్ హత్య విషయంలో చాలా ఆధారాలు ఉత్తర కొరియా ప్రభుత్వం వైపే వేలెత్తి చూపాయి. అయితే తమ ప్రమేయాన్ని ఉత్తర కొరియా ఇప్పటికీ ఖండిస్తూనే వస్తోంది.
అసలు, కిమ్ జాంగ్-నామ్‌ను చంపాల్సిన అవసరం ఏముంది?
కిమ్ జాంగ్-నామ్ తండ్రి కిమ్ జాంగ్-ఇల్‌కు అధికారికంగా ఇద్దరు భార్యలు. కిమ్ జాంగ్-ఇల్‌కు మరో ముగ్గురు మహిళలతో సంబంధాలుండేవి. మొత్తంగా వీరికి ఐదుగురు పిల్లలున్నట్లు కథనాలున్నాయి.
కిమ్ జాంగ్ ఇల్ మొదటి ప్రేయసి సాంగ్ హై-రిమ్‌కు పుట్టిన కొడుకునే కిమ్ జాంగ్-నామ్.
ప్రస్తుతం ఉత్తర కొరియా అధ్యక్షుడిగా ఉన్న కిమ్ జాంగ్ ఉన్ మరో ప్రేయసి కో యాంగ్-హుయ్ కొడుకు.
ఈ పెద్దాయన తన ప్రేమ వ్యవహారాలను, వారికి పుట్టిన పిల్లల్ని ఎప్పుడూ రహస్యంగా ఉంచేవారు. వారు వేరువేరు బంగ్లాలలో నివసించే వారు. ఒకరికొకరు చాలా దూరం ఉండేవారు. కిమ్ జాంగ్ ఉన్, కింగ్ జాంగ్-నామ్‌లకు తండ్రి ఒకరే అయినా.. వారెప్పుడూ కలుసుకోలేదు.
తండ్రి కిమ్ జాంగ్-ఇల్‌కు కాబోయే వారసుడు పెద్ద కొడుకైన కిమ్ జాంగ్-నామ్ అనే ఉత్తర కొరియాలో అత్యధికులు అనుకునేవారు. కానీ, 2001లో నకిలీ పాస్‌పోర్టుతో జపాన్‌లోకి ప్రవేశించేటప్పుడు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. టోక్యోలో డిస్నీల్యాండ్‌ను ఆయన చూడాలనుకున్నారు.
ఉత్తర కొరియాకు కాబోయే పాలకుడిని పట్టుకుని, తిరిగి విమానం ఎక్కించారని వార్తలు వచ్చాయి. ఆయన తండ్రి ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయారు. ఈ సంఘటన తర్వాత కిమ్ జాంగ్-నామ్‌ని పక్కనపెట్టారు.
అయితే, కిమ్ జాంగ్-నామ్ ఎక్కువ కాలం విదేశాల్లోనే జీవించారు. ఉత్తర కొరియాలో కిమ్ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలున్నాయి. తన సవతి సోదరుడికి నాయకత్వ లక్షణాలు తక్కువగా ఉన్నాయని ఆయన అన్నట్లు 2012లో ఒక పుస్తకంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- అయోధ్యకు, థాయ్‌లాండ్‌లోని అయుతయ నగరానికి సంబంధం ఏంటి?
- కశ్మీర్లో మంచు కురవని శీతాకాలం ఎప్పుడైనా చూశారా... ఈ ఏడాదే ఎందుకిలా?
- అయోధ్య: ‘దివ్యాంగ మందిరంలో సకలాంగుడైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ధర్మవిరుద్ధం’ -శంకరాచార్య అవిముక్తేశ్వరానంద
- సచిన్ తెందూల్కర్: డీప్‌ఫేక్ బారిన పడిన భారత క్రికెట్ దిగ్గజం, కూతురుతో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నట్లుగా వీడియో వైరల్...
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








