మనిషి మెదడులో అమర్చిన వైర్‌లెస్ చిప్‌ ఎలా పనిచేస్తుంది?

ఎలన్ మస్క్

ఫొటో సోర్స్, REUTERS

    • రచయిత, పాట్రిక్ జాక్సన్ , టామ్ గెర్కెన్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

న్యూరాలింక్ కంపెనీ మొదటిసారిగా మనిషిలో వైర్‌లెస్ బ్రెయిన్ చిప్‌ను విజయవంతంగా అమర్చినట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎలన్ మస్క్‌ ప్రకటించారు.

ప్రయోగం అనంతరం మెదడు కార్యకలాపాలు గుర్తించామని, పేషెంట్ కోలుకుంటున్నారని మస్క్ ట్విటర్‌లో తెలిపారు.

మనిషి మెదడును కంప్యూటర్‌లకు కనెక్ట్ చేసి, సంక్లిష్టమైన నరాల సంబంధిత సమస్యల పరిష్కరించాలన్నది తమ లక్ష్యమని న్యూరాలింక్ చెబుతోంది.

అయితే, ఇప్పటికే చాలాకంపెనీలు ఇలాంటి పరికరాలపై పరిశోధనలు చేస్తున్నాయి.

వీడియో క్యాప్షన్, ఎలాన్ మస్క్ కంపెనీ మెదడులో అమర్చిన చిప్‌‌తో చూపుతోనే చెస్ ఆడారు పక్షవాతం రోగి.

టెలిపతి: ఎలా పని చేస్తుంది?

ప్రయోగంపై పూర్తి సమాచారం కోసం న్యూరాలింక్, అమెరికా మెడికల్ రెగ్యులేటరీ అయిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)లను బీబీసీ సంప్రదించింది.

వైర్‌లెస్ బ్రెయిన్ చిప్‌‌లను మానవులకు అమర్చే బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (బీసీఐ) ప్రయోగాలకు మస్క్ కంపెనీకి ఎఫ్‌డీఏ మే నెలలో అనుమతి ఇచ్చినట్లు తెలిపింది.

మనిషి వెంట్రుక కంటే సన్నగా ఉండే 64 ఫ్లెక్సిబుల్ థ్రెడ్‌లను శస్త్రచికిత్స ద్వారా మెదడులో అమర్చడానికి రోబోట్‌ను ఉపయోగించింది న్యూరాలింక్.

ఈ సాంకేతికతలో మెదడులో ఉత్పన్నమయ్యే సంకేతాలను వైర్‌లెస్‌గా రికార్డ్ చేసి, వాటిని డీకోడ్ చేసే కంప్యూటర్ సిస్టమ్‌కు పంపుతారు.

న్యూరాలింక్ మొదటి ప్రోడక్ట్‌ను మస్క్'టెలిపతి'గా ప్రకటించారు.

ఎలన్ మస్క్

ఫొటో సోర్స్, Getty Images

న్యూరాలింక్ లక్ష్యం ఏమిటి?

"మీ ఆలోచనతో మీ ఫోన్, కంప్యూటర్ లేదా మరేదైనా పరికరాన్ని నియంత్రించడానికి టెలిపతి అవకాశం కల్పిస్తుంది. దీనిని మొదటగా చేతులు, కాళ్లు ఉపయోగించలేని వ్యక్తుల కోసం వాడుతాం" అని మస్క్ చెప్పారు.

"స్టీఫెన్ హాకింగ్ స్పీడ్ టైపిస్ట్ కంటే వేగంగా తన ఆలోచనలను ఇతరులతో పంచుకుంటే ఎలా ఉంటుంది. అదే న్యూరాలింక్ లక్ష్యం" అని అన్నారు.

స్టీఫెన్ హాకింగ్ మోటార్ న్యూరాన్ వ్యాధితో బాధపడిన బ్రిటీష్ శాస్త్రవేత్త.

కోతి

ఫొటో సోర్స్, Getty Images

కోతిలో చిప్ అమర్చితే ఏమైంది?

చాలా కంపెనీలు రెండు దశాబ్దాల క్రితమే ఇలాంటి ప్రయోగాలు మొదలుపెట్టాయి.

అమెరికాలో ఉటాలోని బ్లాక్‌రాక్ న్యూరోటెక్ సంస్థ 2004లో బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (బీసీఐ) ఇంప్లాంటేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది.

న్యూరాలింక్ సహ వ్యవస్థాపకుడు స్థాపించిన 'ప్రెసిషన్ న్యూరోసైన్స్' కంపెనీ కూడా పక్షవాతం బాధితులకు సహాయం చేయడమే లక్ష్యంగా ప్రయోగాలు చేస్తోంది.

మెదడు ఉపరితలంపై సన్నని టేప్‌ మాదిరి కంపెనీ చిప్ ఉంటుంది. దీనిని కపాలంలో సూక్ష్మ చీలిక (క్రానియల్ మైక్రో-స్లిట్) ద్వారా ప్రవేశపెడతారు. ఇది చాలా సులభమైన ప్రక్రియ అని ప్రెసిషన్ న్యూరోసైన్స్ అంటోంది.

ఇప్పటికే అమర్చిన పరికరాలు కూడా మంచి ఫలితాలను అందించాయి.

అమెరికాలో ఇటీవల రెండు శాస్త్రీయ అధ్యయనాలు జరిగాయి. ఒక వ్యక్తి మాట్లాడుతుండగా మెదడు పనితీరు పరిశీలించడానికి ఇటువంటి అమరికల (ఇంప్లాంట్‌)ను ఉపయోగించారు. ఇలా సేకరించిన డేటాను విశ్లేషించారు.

2021 ఫిబ్రవరిలో న్యూరాలింక్ ప్రాజెక్ట్‌లో భాగంగా కోతి పుర్రెలో చిప్ అమర్చారు. అనంతరం ఆ కోతితో వీడియో గేమ్‌లు ఆడించారు.

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో న్యూరాలింక్ ప్రధాన కార్యాలయం ఉంది. మానవ, జంతువుల మెదడులను యంత్రాలకు అనుసంధానించే సాంకేతికతను ఈ కంపెనీ అభివృద్ధి చేస్తోంది.

న్యూరాలింక్ ప్రయోగాల కారణంగా 2022 డిసెంబర్లో గొర్రెలు, కోతులు, పందులతో సహా సుమారు 1,500 జంతువులు మరణించాయనే ఆరోపణలు వచ్చాయని రాయిటర్స్ తెలిపింది.

2023 జూలైలో అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అధిపతి ఆరోపణలపై విచారణ జరిపారు. విచారణ అనంతరం కంపెనీలో జంతు పరిశోధన నియమాల ఉల్లంఘనలు ఏవీ కనుగొనలేదని తెలిపారు.

అయితే, దీనిపై ప్రత్యేక విచారణ కొనసాగుతోంది.

వీడియో క్యాప్షన్, న్యూరాలింక్ కంపెనీ తొలిసారిగా మనిషిలో వైర్‌లెస్ బ్రెయిన్ చిప్‌ను అమర్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)