లగ్జరీ వాటర్: ప్రపంచంలో దీన్ని మించిన నీరే లేదా?
- రచయిత, సునేత్ పెరీరా
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

ఫొటో సోర్స్, Milin Patel
వైన్‌కు బదులు విలాసవంతమైన నీటిని అందించే ఖరీదైన రెస్టారెంట్ గురించి ఎప్పుడైనా విన్నారా?
ఖరీదైన పానీయాలు, ఫ్రూట్ జ్యూస్‌కు బదులు ఫ్యాన్సీ హెచ్2ఓ (నీరు) అందించే వివాహ వేడుకకు ఎప్పుడైనా వెళ్లారా?
కుళాయి నీరు, మినరల్ వాటర్ కంటే ఇలాంటి నీరు శ్రేష్టమైనదని ఆ రంగానికి చెందిన నిపుణులు చెప్తున్నారు. దీన్ని ఫైన్ వాటర్ అంటున్నారు.
చేపలు, మాంసం వంటి ఆహారాలు తినేటప్పుడు వాటితో వైన్ వంటి పానీయాలు కాకుండా ఈ ఫైన్ వాటర్ తాగొచ్చని చెప్తున్నారు.
చాలా ఎక్కువ ధరకు విక్రయిస్తున్న ఈ నీటిని వివిధ సహజ వనరుల నుంచి సేకరిస్తున్నారు.
అగ్నిపర్వత శిలలు, హిమనీనదాలలో కరిగిన మంచు, మంచు బిందువుల నుంచి సేకరిస్తున్నారు.
నేరుగా మేఘాల నుంచి కూడా సేకరించొచ్చు.
ఏ వనరుల నుంచి దీన్ని సేకరిస్తారో ఆ వనరుల సహజ లక్షణాలు ఈ నీటిలో ఉంటాయి. పైగా ఇది ప్రాసెస్ చేయని నీరు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఫైన్ వాటర్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి.
దీనికి సంబంధించిన నిపుణులూ ఉన్నారు.

ఫొటో సోర్స్, Milin Patel
నీటికి రుచి ఉంటుందా?
వైన్ రుచి చూసేవారు ఉన్నట్టే ఈ ఫైన్ వాటర్‌ను రుచిచూసే వారు కూడా ఉన్నారు.
ఈ నీటిలోని ఖనిజాలు, రుచి, తాగినప్పుడు కలిగే అనుభూతిని చెప్పడమే వీరి ఉద్యోగం.
‘‘ఈ ప్రపంచంలో ప్రతి నీటి బిందువు దేనికదే ప్రత్యేకం. దానికో ప్రత్యేకమైన రుచి ఉంటుంది’’ అని లండన్‌లోని నీటిని రుచిచూసే నిపుణుడు, వాటర్ కన్సల్టెంట్ మిలిన్ పటేల్ చెప్పారు.
ఈయన కుళాయి, బాటిల్ నీరు సహా ఫైన్ వాటర్‌ను టేస్ట్ చేయాలనుకునేవారి కోసం ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తుంటారు.
వివిధ రకాలైన తాగునీరు, వాటి రుచులపై ప్రజలకు.. ప్రత్యేకించి యువతరానికి అవగాహన కలిగించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు పటేల్ బీబీసీకి చెప్పారు.
‘‘స్కూల్లో సహజ నీటి చక్రం గురించి చదువుకుంటాం. నీరు ఆవిరి కావడం, ఘనీభవించడం, వర్షించడం వంటివి ఎలా జరుగుతాయో నేర్చుకుని ఉంటాం. కానీ ఓ ముఖ్యమైన విషయాన్ని మరిచిపోయాం. అదే రీమినరలైజేషన్’’ అని చెప్పారు.
‘‘నేలపైన వర్షం పడగానే. అది భూమిలోకి ఇంకిపోతుంది. తరువాత వివిధ శిలలు, నేలలలోంచి ప్రవహించి, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, సిలికా లాంటి ఖనిజాలను నిక్షిప్తం చేసుకుంటుంది. దీనివల్ల నీటిని రుచిచూసినప్పుడు మనకు ఖనిజాల రుచి తెలుస్తుంది’’ అని పటేల్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
మట్టి మీదుగా ప్రవహించే నీరు కాకుండా.. మంచు ఫలకాలు, వర్షం లాంటి వనరుల నుంచి వచ్చే నీటిలో, బావులు, బుగ్గల నుంచి వచ్చే నీటితో పోల్చినప్పుడు మొత్తంగా కరిగిపోయే ఘనపదార్థాలు (టోటల్ డిజాల్వ్‌డ్ సోలిడ్స్- టీడీఎస్) తక్కువ స్థాయిలో ఉంటాయి.
పటేల్ దగ్గర అనేక రకాల నీటి కలెక్షన్ ఉంది. అందులో కుళాయి నీటి నుంచి.. 318 అమెరికన్ డాలర్లు (సుమారు 27వేల రూపాయలు) ఖరీదు చేసే నీటి సీసా వరకు ఉన్నాయి.
వీటిని ప్రజలు రుచిచూసిన తరువాత, ఆయా నీళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన రుచిని కలిగి ఉన్నాయో కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంటారు.
‘‘నీరు కేవలం రుచిలేనిది కాదనే విషయాన్ని తెలుసుకునే అవకాశాన్ని మేం ప్రజలకు కల్పిస్తాం. మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మంచినీరు తాగుతారో ఆ తరువాత మీ నోటి నుంచి వచ్చే మాటలకు మీరే ఆశ్చర్యపోతారు’’ అని పటేల్ వివరించారు.
‘‘ఇక్కడ ప్రజలు నీటిని రుచి చూశాకా వారి నుంచి వెలువడే అందమైన భాషను ఎన్నోసార్లు విన్నాం. ‘‘మృదువుగా ఉంది, క్రీమీగా అనిపించింది, జలదరింపు కలిగింది, హాయిగా ఉంది, చేదుగా, కొన్నిసార్లు పుల్లగానూ అనిపించింది’’ అనే మాటలు వింటుంటాం. అందుకే దీనిని నేను ‘జలరుచిశాస్త్రం’ అంటాను.
‘‘ ఈ రుచి నా పాత రోజులను గుర్తుకు తెచ్చింది. ‘‘ ఇది నాకు సెలవు రోజును గుర్తుకు తెస్తోంది.. ఇది మా తాతగారి ఇల్లు గుర్తు చేస్తోంది’’ అని చెప్పేవారు కూడా ఉంటారని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
నీటిని రుచిచూసే పోటీలు
ప్రతి ఏటా ప్రపంచం నలుమూలాల నుంచి అంటే భూటాన్ నుంచి ఈక్వెడార్ వరకు ఉన్న ఫైన్ వాటర్ ఉత్పత్తిదారులను ఒక చోట చేర్చి, ఇంటర్నేషనల్ టేస్టింగ్ కాంపిటీషన్‌ను ది ఫైన్ వాటర్ సొసైటీ నిర్వహిస్తుంటుంది.
ఈ వార్షిక సమావేశాలకు మారుమూల ప్రాంతాలలో మంచినీటి వ్యాపారం చేసే కుటుంబాల నుంచి ఎక్కువమంది హాజరవుతుంటారు.
‘‘ మొదట్లో నీటిని రుచి చూడటమనే ఆలోచన నవ్వులాటగా అనిపించింది’’ అని ఫైన్ వాటర్ సొసైటీ, ఫైన్ వాటర్ అకాడమీ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ మైకేల్ మాస్చా తెలిపారు.
‘‘ఇరవై ఏళ్ళ కిందట నేను మద్యం సేవించడం మానేసినప్పటి నుంచి ఈ మొత్తం ప్రక్రియ మొదలుపెట్టాను’’ అని ఆయన బీబీసీకి చెప్పారు.
‘‘టేబుల్ పైన హఠాత్తుగా వైన్‌ను తొలగించడంతో, నేను చుట్టూ చూశాను. నాకక్కడ నేనంతకుముందు ఎప్పుడూ చూడని ఓ బాటిల్ కనిపించింది. కానీ అది మంచినీరు. వైన్ తాగే నా ఖరీదైన అలవాటును ఈ మంచినీటికి మార్చుకుందామని భావించాను’’ అని తెలిపారు.
ఈఫైన్ వాటర్ కేవలం దాహం తీర్చడమే కాకుండా చాలా పనులు చేస్తుందని ఆయన నమ్ముతున్నారు. ప్రజలకు ఇదో అవకాశం. ఈ నీరు మీకో విలక్షణమైన అనుభూతిని ఇస్తుంది, దీనిని వైన్‌లా కాకుండా మీరు పిల్లలతో కలిసి కూడా ఆస్వాదించవచ్చు.
ఇప్పుడు ఫైన్ వాటర్ కోసం డిమాండ్ పెరుగుతోందని డాక్టర్ మైకేల్ మాస్చా చెప్పారు.
ఇది ఆరోగ్యపరమైన జీవనశైలి కలిగిన యువతరంలో ట్రెండ్‌గా మారుతుందని ఆయన నమ్ముతున్నారు.
దీంతోపాటు ఈ అరుదైన, శుద్ధిచేయని మంచినీటిని పాత వైన్‌లాంటి కథతో మరింత తేలికగా మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
నీరు, ఆహారం
స్పెయిన్, అమెరికాలాంటి దేశాలలోని కొన్ని రెస్టారెంట్లు మెనూలో ఆహారపదార్థాలతోపాటు వివిధరకాలైన ఫైన్ వాటర్ ను కూడా చేర్చుతున్నాయి.
‘‘అమెరికాలోని త్రీస్టార్ రెస్టారెంట్ కోసం ప్రస్తుతం వాటర్ మెనూ తయారుచేస్తున్నాం. జాగ్రత్తగా ఎంపిక చేసిన 12 నుంచి 15 రకాల మంచినీటిని, ఆహారంతోపాటు రెస్టారెంట్‌లోని మూడ్‌ని ప్రతిబింబించేలా అందించే ప్రయత్నిస్తున్నాం’’ అని డాక్టర్ మాస్చా తెలిపారు.
‘‘ మీరు చేపలు ఆహారంగా తీసుకుంటుంటే మీకు తక్కువ ఖనిజాలు ఉండే నీటిని సరఫరా చేస్తాం’’ అని చెప్పారు.
డాక్టర్ మాస్చా సూపర్ లగ్జరీ ఇళ్లు, అపార్ట్‌మెంట్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు.
వీటిల్లో వైన్ సెల్లార్లకు బదులు ‘వాటర్ ఎక్స్‌పీరియన్స్ గదులు’ ఉంటాయి.
మతమపరమైన కారణావల్ల మద్యాన్ని స్వీకరించని సంస్కృతులలో ఈ ఫైన్ వాటర్ చాలా ప్రసిద్ధి పొందింది. ప్రత్యేకించి పెళ్ళిళ్లలో ఖరీదైన షాంపైన్‌కు బదులుగా ఈ మంచినీటిని ఇవ్వడం ఓ ఉత్తమమైన ప్రత్యామ్నాయం అవుతుంది’’ అంటారు డాక్టర్ మాస్చా.
కానీ దీనిపై విమర్శలు చేసేవారు కూడా లేకపోలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఇది అనైతికం
ప్రపంచంలో సరైన మంచినీరు దొరకక కొన్ని లక్షల మంది ప్రజలు అల్లాడుతుంటే, అత్యంత అవసరమైన మౌలిక వస్తువును చాలామంది సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని విమర్శకులు అంటున్నారు.
ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం 2022లో 202 కోట్లమంది ప్రజలకు రక్షిత మంచినీటి కొరత ఉంది.
70.3 కోట్లమందికి కనీస మంచినీటి సౌకర్యం లేదు.
తాగునీరులో ఎటువంటి తేడాలుండవని, నీరు నీరేనని, అది కుళాయి నీరా, సీసాలో నీరా, లేదంటే ఇప్పుడు పిలుస్తున్న ఈ ఫైన్ వాటరా అనేదాంట్లో తేడా ఏమీ ఉండదని, కేవలం ధరలోనే తేడా అని కొంతమంది విమర్శకులు చెబుతున్నమాట.
అయితే ఏ తరహా బాటిల్ నీరైనా భూమికి నష్టం కలిగించేవేనని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
అవి కేవలం భూమిని నింపేయడానికి తప్ప ఎందుకు పనికిరావని చెబుతున్నారు.
లక్షలాదిమంది ప్రజలు సరైన మంచినీరు అందక అల్లాడుతుంటే ఓ బాటిల్ వాటర్ కోసం వందలాది డాలర్లు ఖర్చు చేయడం అనైతికమని లండన్‌లోని గ్రీషమ్ కళాశాల ప్రొఫెసర్ కరోలిన్ రాబర్ట్స్ చెప్పారు.
‘‘ ఇది మీరు ఎవరితోనైనా కలిసి డిన్నర్‌కు వెళ్ళినప్పుడు మీ జేబు ఖాళీచేయించడానికి తప్ప దేనికి పనికిరాదు. మీరు అంటార్కిటానో, లేదంటే హవాయిలోని ఎక్కడినుంచో వచ్చిన ఈ ఖరీదైన మంచినీటి సీసాకు డబ్బులు చెల్లిస్తానని చెపితే, మీతోపాటు వచ్చినవారు దానిని గొప్పగా చూడొచ్చు. కానీ వాస్తవంలో దీనివల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనం కలగదు. ఇది కేవలం డబ్బకు సంబంధించిన విషయం అంతే’’ అని ఆమె బీబీసీకి చెప్పారు.
అలాగే ఈ నీటిని నిల్వ చేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్ బాటిళ్ళు, లేదంటే గాజుగ్లాసుల వలన కూడా పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆమె తెలిపారు.
‘‘ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయమే కాదు. దీనివల్ల పర్యావరణానికి కూడా నష్టం కలుగుతోంది’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే డాక్టర్ మాస్చా వాదన మరోలా ఉంది. ఈ లగ్జరీవాటర్ కేవలం సంపన్నుల కోసమే కాదని, రెండు డాలర్లకు లభించే ఇతర రకాలైన నీరు కూడా లభిస్తుందని చెప్పారు.
సహజమైన ఫైన్ వాటర్ , శుద్ధి చేసిన నీటి మధ్య వ్యత్యాసాల గురించి కూడా ఆయన మాట్లాడారు. పర్యావరణానికి ఏది ఎక్కువ నష్టం కలిగిస్తోందని ప్రశ్నించారు.
‘‘మన్నిక కోణంలోంచి మాట్లాడినప్పుడు శుద్ధిచేసిన కుళాయి నీరు ప్లాస్టిక్ బాటిల్‌లో పోయడంలో అర్థం లేదు. మీరు మీ ఎస్‌యువీని వేసుకుని సూపర్ మార్కెట్‌కు వెళతారు.ప్లాస్టిక్ బాటిళ్ళు ఇంటికి తెస్తారు. వాటిని తాగుతారు. తరువాత అవి దండగని బయటపడేస్తారు’’
దాహం తీరేందుకు శుద్ధి చేసిన నీరు తాగడం కంటే కుళాయి నీరు తాగడమే ఉత్తమమంటారు ఆయన.
‘‘కుళాయినీరు తాగొచ్చనే విషయం మనం తరచూ మరిచిపోతుంటాం. నిజానికి ఈ అవకాశం ప్రపంచంలో చాలామందికి లేదు’’ అని ఆయన ముగించారు.
ఇవి కూడా చదవండి :
- చోళులు: ఆ రాజు చనిపోయినప్పుడు అతనితో పాటు ముగ్గురు మహిళలను సజీవ సమాధి చేశారు..
- లక్షద్వీప్ భారీగా పర్యాటకులొస్తే తట్టుకోగలదా?
- ఆత్మవిశ్వాసంతో మానసిక బలంతోపాటు శారీరక సామర్థ్యం, ఎలాగంటే..
- అయోధ్యలో మసీదుకు కేటాయించిన స్థలంలో నిర్మాణం ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














